– సమగ్ర సమాచార సమర్థ వినియోగంతో.. – పారదర్శక, అవినీతిరహితపాలన అందిస్తాం – ఓపెన్ డాటా సొల్యూషన్ వర్క్‌షాపులో పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రభుత్వం పారదర్శక, అవినీతిరహిత పాలనకు కట్టుబడి ఉందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని పర్యాటక ప్లాజాలో ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, సెర్ప్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఓపెన్ డేటా సొల్యూషన్ వర్క్‌షాపును మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు, ప్రవేట్ సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే విషయంపై ఈ వర్క్‌షాప్‌లో చర్చించనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఓపెన్ డేటా సొల్యూషన్స్‌కు అత్యంత అదరణ లభిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను సమర్థంగా ఉపయోగిస్తామని చెప్పారు. స్పష్టమైన సమాచారముంటేనే సమగ్రమైన ప్రణాళికలు రూపొందించడం సాధ్యపడుతుందని, అప్పుడే వాటి అమలు కూడా లోపరహితంగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. డేటా సక్రమంగా లేనందువల్లే రాష్ట్రంలో రేషన్‌కార్డులు, ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయన్నారు.
తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించడంలో భాగంగానే మన ఊరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో 4 లక్షల మంది ఉద్యోగులతో సర్వే పూర్తిచేశామని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంకు ప్రణాళిక సమన్వయం కోసం ముందుకు రావడం శుభపరిణామమని, ఇందులో రాష్ట్రప్రభుత్వం భాగస్వామ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో పాటు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో ఏ మురళి, శశిభూషణ్‌రావు, సత్యనారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.