Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామీణ వైద్యులకే అధిక ప్రయోజనాలు

– పట్టణాల్లో కంటే మారుమూలకెళ్తేనే ఆర్థికంగా లబ్ధి
– ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలపై భారం తగ్గించేలా కార్యాచరణ
– ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సేవల వికేంద్రీకరణ
– ప్రైవేటు బోధనాసుపత్రుల సేవలూ చురుగ్గా వినియోగంలోకి..
– శాశ్వత నియామకాలు జరిగే లోపు ఒప్పంద భర్తీ .
– ‘ఈనాడు’తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌..

గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. పట్టణాలు, నగరాల్లో పనిచేసే వైద్యుల కంటే గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకే అధిక మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగజేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యంలో సరైన సేవలందకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందనీ, తిరిగి ప్రభుత్వ వైద్యంపై గురి కుదిరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా వైద్యసేవల వికేంద్రీకరణను పటిష్ఠంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేటు వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల సేవలనూ పేద రోగుల కోసం మరింత విస్తృతంగా వినియోగించుకుంటామన్నారు. సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రిత్వ కార్యాలయంలోకి గురువారం అధికారికంగా ప్రవేశించిన అనంతరం ఈటల రాజేందర్‌ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రాథమిక, మాధ్యమిక వైద్యంలో సరైన సేవలు అందకపోవడం వల్ల ఆ భారం బోధనాసుపత్రులపై పడుతోందా?
సాధారణ జ్వరమొచ్చినా, ఇంకేదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇప్పుడు నేరుగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడంపై దృష్టి పెట్టాం. కేవలం తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్య.. స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అవసరమైతేనే ఈ ఆసుపత్రులకు వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందుకే కింద స్థాయి నుంచి ఆసుపత్రుల బలోపేతంపై దృష్టి పెట్టాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కచ్చితంగా వైద్యుడుండాలి. అలా స్థాయుల వారీగా 30 పడకలు, 50 పడకలు, 100 పడకలు, 250 పడకలు.. ఇలా అన్నింటిలోనూ అవసరమైన రీతిలో వైద్యులు సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాô. పైవేటు వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులను సమర్థంగా వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఇది అమలైతే నాలుగైదు వేల పడకలు పేద ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంపై ఇప్పటికే ప్రైవేటు వైద్యకళాశాల యాజమాన్యాలతో మాట్లాడాం.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖలో మీరు గుర్తించిన సమస్యలేమిటి?
మేం చేపట్టే ప్రతి పనిలోనూ ఫలితాలు సాధించాలనే దిశగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు అవలంబించాం. 1. సమయోచిత ఆలోచనల ద్వారా ఉన్న వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా తీర్చిదిద్దడం 2. తక్కువ డబ్బు ఖర్చు చేసి ఎక్కువ ఫలితాలు రాబట్టడం 3. పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టి శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పన. ఇప్పుడు మేం మొదటి, రెండు ప్రాధాన్యాలపై దృష్టి పెట్టాం. ఆరోగ్య ఉప కేంద్రం స్థాయి నుంచి బోధనాసుపత్రుల దాకా కొన్ని ముఖ్య సమస్యలను గుర్తించాం. నీటి కొరతను అధిగమించేందుకు మిషన్‌ భగీరథను ఆసుపత్రులకు అనుసంధానం చేస్తున్నాం. మొత్తం దవాఖానాల్లో విద్యుత్‌ వ్యవస్థను ఆధునీకరిస్తాం. ప్రభుత్వాసుపత్రికొస్తే ఉచితంగా నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, టీకాలు అందించే విధానాన్ని పక్కాగా అమలు చేస్తాం. ఆసుపత్రుల్లో కుర్చీలు, బల్లలు సహా అన్ని రకాల ఉపకరణాలను సమకూర్చుతాం. ఆసుపత్రులకు సున్నాలు, రంగులేసి కొత్త సొబగులు అద్దుతాం. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్ర వాతావరణాన్ని రూపుమాపుతాం.

వైద్యులు సమయ పాలన పాటించకపోవడం ప్రాథమిక స్థాయి నుంచి బోధనాసుపత్రుల దాకా ఉంది. దీన్ని ఎలా నివారిస్తారు?
వైద్యుల సమయ పాలనపై దృష్టి పెడతాం. కచ్చితంగా సమయానికి వచ్చి పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైన మేరకు వైద్యుల సంఖ్యను పెంచుతాం. ఆసుపత్రికి పోతే వైద్యుడుంటాడని, మందులు ఉంటాయని, ఉచితంగా పరీక్షలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో పెంపొందించేలా చర్యలు చేపడతాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కేవలం రూ.100-150 కోట్ల దగ్గర వెనుకంజ వేస్తే.. అంత పెద్ద నిధులు ఖర్చు చేసి కూడా తృప్తి లేకుండా పోతోంది.

నిధులు కేటాయిస్తున్నారు కానీ, విడుదల మాత్రం ఆశించిన రీతిలో జరగడం లేదు.. కారణమేంటి?
దీన్ని కూడా చక్కదిద్దడంపై దృష్టి పెట్టాం. ఏ విభాగంలో అధిక శాతం నిధులు ఖర్చవుతున్నాయో.. ఆ విభాగానికే నిధులు కేటాయింపులు, విడుదలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చిన వాటిని, రాష్ట్ర వాటాను కూడా వెంటనే విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.

ఆసుపత్రుల్లో అధునాతన పరికరాలున్నా కూడా చిన్నపాటి మరమ్మతులకు గురై వినియోగానికి నోచుకోవడం లేదు.. మీరేమంటారు?
కొనుగోలు సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాం. అత్యుత్తమ పరికరాన్ని, ఉత్పత్తి చేసే సంస్థకున్న అంతర్జాతీయ గుర్తింపు.. వీటిని పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇలా తేగానే అలా పాడయ్యే వాటిని కొనే ప్రసక్తే లేదు. అత్యుత్తమ ఉత్పత్తి సంస్థ నుంచి అధునాతన పరికరాన్ని కొనుగోలు చేయడంలో కేవలం 10-15 శాతం అధికంగా నిధులు వెచ్చించాల్సి రావచ్చు. కానీ అదే రీతిలో పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ఔషధాల విషయంలోనూ ఇదే విధానాన్ని అవలంబించడంపై దృష్టి పెట్టాం. అతి తక్కువ ధరకు అందిస్తామని ముందుకు వచ్చినవారికే ఇవ్వాలనే నిబంధనను మార్చాలని యోచిస్తున్నాం. ధరతో సంబంధం లేకుండా నాణ్యతే ప్రామాణికంగా కొనుగోలు చేస్తాం. ఇందుకు మీడియా కూడా సహకరించాలి.

వైద్యుల, నర్సుల నియామకాల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది?
రాష్ట్రప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలోనే దాదాపు 10 వేల కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీటి భర్తీ ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. కొన్ని విభాగాల్లో నియామకాలు జరిగాయి. కొన్నింటిలో కొంత మేరకు జరిగాయి. న్యాయస్థానాల్లో కేసులు ఉండటం వల్ల కొన్ని నియామకాలకు ఆటంకం కలుగుతోంది. అయితే శాశ్వతంగా నియమించేలోపు ఒప్పంద ప్రాతిపదికన ఆయా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించాం. ఈ విధానంలో సేవలందించిన వారికి శాశ్వత నియామకాల్లో కొంత ప్రాధాన్యమిస్తాం. హైదరాబాద్‌లో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారు ఇక దూరప్రాంతాలకే అంకితమవుతున్నారు. వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా తక్కువే. అందుకే ఈ విధానాన్ని మార్చుతున్నాం. చట్టపరంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో వారికి ఇంటి అద్దె పెంచడం వంటివి కుదరకపోవచ్చు గానీ.. వారికి మరో రూపంలో లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టుతాం. గ్రామీణంలో వారందించే సేవలకు వేర్వేరు రూపాల్లో పారితోషికాలు అందించి ఆర్థిక ప్రయోజనాలు కలుగజేస్తాం.

Source : https://bit.ly/2SA9OQy

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.