Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యం

-వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం -రెండున్నర ఏండ్లలో 7 లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తాం -సంచార పశువైద్యశాలల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ -రెండున్నరేండ్లలో ఏడు లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తాం -దేశంలోనే తొలిసారి 100 సంచార వైద్యశాలలు ప్రారంభించాం -ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది -ఈ ఏడాది రూ.45వేల కోట్లు ఖర్చు.. దేశంలోనే ఆల్‌టైం రికార్డు -రైతులు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా సమన్వయ సమితులు -ప్రతిపక్షాలు ప్రగతి నిరోధకులుగా మారొద్దు.. -పెట్టుబడి పథకంపై మాజీ ప్రధాని దేవెగౌడ హర్షించారు -దేశ రైతుల తరఫున స్వయంగా వచ్చి అభినందిస్తానన్నారు -సంచార పశువైద్యశాలల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ -పాడి పంట అభివృద్ధి చేసుకోవాలి.. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధికి ప్రాధాన్యం

రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతు సంక్షేమంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులోభాగంగా గొర్రెల పంపిణీ, చేపల పెంపకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు రూపొందించామన్నారు. వచ్చే నాలుగేండ్లలో దేశంలోనే అత్యంత ధనవంతులైన యాదవులు తెలంగాణలో ఉండబోతున్నారన్నారు. అదేవిధంగా వెయ్యికోట్లతో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిజమైన మానవ వనరులంటే కంప్యూటర్ల ముందు కూర్చునేవారు కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేవారేనని కేసీఆర్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు రెండు పంటలకు ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి ఇవ్వబోతున్నామన్నారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితంచేసి, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చూసేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇవి రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటాయని కేసీఆర్ స్పష్టంచేశారు. 60 ఏండ్ల పాలనలో రైతుల గురించి ఏనాడూ పట్టించుకోని పార్టీల నేతలు ఇప్పుడు రైతు సమితుల ఏర్పాటును అడ్డుకునేందుకు కోర్టులకు వెళుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి పోటీగా తాము రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామనడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. శుక్రవారం పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన సంచార పశువైద్యశాలల వాహనాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సంచార పశువైద్యశాలల వాహనాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆరునెలల్లోనే కరెంటు కష్టాలు పోయాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో మొట్టమొదటి వ్యక్తి రైతు. రైతు బాగుంటే చుట్టూ ఉండే అందరూ బాగుంటారు. రైతులకు ప్రధానంగా కావాల్సినవి సాగునీరు, కరెంటు, పెట్టుబడి, మార్కెట్ వసతి. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. నన్ను గెలిపించి సీఎం చేసినా కరెంటు తొందరగా ఇవ్వలేను.. రెండు మూడేండ్లు పడుతది అని నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 100 సభల్లో చెప్పిన. కానీ భగవంతుడి దయ, అధికారుల కృషితో ఆరు నెలల్లోనే కరెంటు బాధలు పోయాయి. గతంలో ఉన్న జనరేటర్లు, కన్వర్టర్ల దుకాణాలు ఎత్తిపోయినయి. ఇప్పుడు తెలంగాణలో కరెంటు వస్తే కాదు.. కరెంటు పోతే వార్త. పాత నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌లో మాకు 24 గంటల కరెంటు వద్దంటూ రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది.

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగునీటి ప్రాజెక్టులు శరవేగంతో కడుతున్నాం. కొన్ని పార్టీలు రాజకీయ దుగ్ధతో కోర్టుల్లో కేసులు వేస్తున్నా విజయవంతంగా వాటిని అధిగమిస్తూ పనులను వేగంగా పరుగెత్తిస్తున్నాం. రాబోయే ఏడాదిలోనే కాళేశ్వరం నీళ్లు ఏడు జిల్లాలకు వచ్చే ఆస్కారముంది. పాలమూరు ప్రాజెక్టు, ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తికాబోతున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులను ఒకటిన్నరేండ్లలో పూర్తిచేసి, కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసుకోవచ్చు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టనివిధంగా బడ్జెట్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.25వేల కోట్లు కేటాయించాం. బ్యాంకుల సహకారంతో మరో రూ.20వేల కోట్లు అప్పు తీసుకున్నాం. మొత్తంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.45వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఇది కేంద్రం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించే దానికంటే ఎక్కువ. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలోనే రూ.45వేల కోట్లు ఖర్చు చేయడమనేది దేశ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు.

రైతులకు, ప్రభుత్వానికి వారధిలా రైతు సమితులు రైతులకు రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేల చొప్పున వచ్చే మే నెల నుంచి రైతు బ్యాంకు ఖాతాల్లో వేయబోతున్నాం. రైతులకు పెట్టుబడి సమస్యకూడా పోయింది. ఈ రోజుల్లో చెత్తకుప్పల్లో ఇనుపముక్కలు ఏరుకునేవాళ్లకూ సంఘాలున్నాయి. సంఘం లేనిది ఒక్క రైతులే. రైతులను సంఘటితంచేసేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల హెలికాప్టర్‌లో రోజుకు ఏడెనిమిది జిల్లాలు తిరుగుతూ సమన్వయ సమితుల ఏర్పాటుపై వివరించి వచ్చారు. నేను చెప్పేది ఒక్కటే. రైతు సంఘాలకు ఏమీ అధికారాలు లేవు. వారు ఇతరుల హక్కులేవీ హరించడం లేదు. ప్రభుత్వానికి రైతులకు మధ్య వారు వారధిగా ఉంటారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర తెచ్చేందుకు, రైతులను సంఘటితం చేసేందుకు ఈ సంఘాలు కృషి చేస్తాయి.

జనం నవ్వుకుంటున్నారు రైతు సమితుల ఏర్పాటును ఆపాలని కొన్ని పార్టీలవాళ్లు కోర్టుకెళ్లారు. ఇది విపరీత ధోరణి. ప్రభుత్వం కమిటీలు వేస్తే.. మేం కూడా ప్రత్యామ్నాయ కమిటీలు వేస్తామని కొన్ని పార్టీలవాళ్లు అంటున్నారు. వాళ్లకు దేవుడు ఏం తెలివి ఇచ్చిండో వాళ్లకే తెల్వాలి. ఎక్కడైనా ప్రభుత్వం కమిటీలు వేస్తుంది. కానీ ప్రతిపక్షాలు కమిటీలు వేస్తామంటే జనం నవ్వుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీలువేశారు. మరి మా కమిటీలు తప్పు అయితే మీరు వేసిన కమిటీలు ఎట్లా రైట్ అని నేను అడుగుతున్నా. ఆదర్శ రైతులంటూ మోటర్ మెకానిక్‌లను, ఆటో డ్రైవర్లను వేశారు. కాబట్టి.. అనవసరంగా ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతానికి పోయి, ప్రగతి నిరోధకులుగా మారకండి.

మాజీ ప్రధాని దేవెగౌడ స్వయంగా వచ్చి అభినందిస్తానన్నారు అరువై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రైతులను రైతులుగా ఏనాడూ చూడలేదు. రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన కలలో కూడా చెయ్యలేదు. పెట్టుబడి పథకం ప్రకటించిన తర్వాత మాజీ ప్రధాని దేవెగౌడ నన్ను వారం రోజులపాటు అడిగారు. నేను సీఎంగా చేశా. ప్రధానిగా చేశా. కానీ పెట్టుబడి పథకం ఆలోచన నాకు రాలేదు. దేశ రైతుల తరఫున మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చంద్రశేఖర్‌రావుగారూ.. నేను హైదరాబాద్ వస్తా. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అభినందిస్తా అంటే. వద్దు సార్.. మీరు పెద్దలు, మాజీ ప్రధాని. మిమ్మల్ని రప్పించుకుంటే నాకు గర్వం ఉన్నట్లవుతుంది. నేనే బెంగళూరు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పిన.

భారత్‌లోనే తొలిసారిగా సంచార పశువైద్యశాలలు దేశంలో ఎక్కడా లేనివిధంగా వంద సంచార పశువైద్యశాలలు ఒక్కోటి రూ.14.65 లక్షల ఖర్చుతో ఏర్పాటుచేశాం. పాడిపశువులకు జబ్బుచేస్తే రైతులు ఒక్క ఫోన్‌కొడితే డాక్టర్లే అధునాతన వసతులతో ఉన్న సంచార పశువైద్యశాలలతో వస్తారు. అత్యవసర సమయంలో మందులుసైతం అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు ఫోన్‌చేస్తేనే వెళ్లి వైద్యం చేయడమే కాకుండా నియోజకవర్గంలో ఇన్ని ట్రిప్పులు తిరుగాలనేలా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్‌చందా ప్రణాళిక తయారుచేసుకోవాలి. దీనివల్ల ఎక్కువ సేవలు అందుతాయి. పశువుల పెంపకం వృత్తిగా ఉన్న రైతులను, యాదవులను అభినందిస్తున్నా. పశుగణాభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడాలని. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా.

ఏడు లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తాం తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రకాలుగా అభివృద్ధిచెందాలని కన్న కలలు నిజం చేసుకునే దిశగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న కొత్త పంథాలో ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. ఇండియా టుడే మ్యాగజైన్ ఎడిటర్ అరుణ్‌పురి నాతో మాట్లాడుతూ, మానవ వనరులు గుర్తించడంలో, వాటి అభివృద్ధి పర్చడంలో కొత్త ట్రెండ్‌ను మీరు సృష్టించారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షలమంది యాదవ సోదరులున్నా.. రోజుకు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు. పాడి పశువులు పెంచే రైతులు దండిగా ఉన్నా రోజుకు 8 లక్షల లీటర్ల పాలను కర్ణాటక, గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది కూడా ఒక రకంగా సిగ్గుచేటు. తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసుకునే శక్తి ఉండి కూడా సమైక్య పాలనలో మనకు ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పుడు మనల్ని మనం పాలించుకుంటున్నాం కాబట్టి తెలంగాణలో పాడి, పంట అభివృద్ధి చేసుకోవాలి. హ్యూమన్ రిసోర్స్ అని ఇంగ్లిష్‌లో చెప్తే అంతా అదేదో కంప్యూటర్ల ముందు కూర్చునేవాళ్లు అనుకుంటరు. కానీ నిజానికి సంపద సృష్టించే వారు గ్రామీణ ప్రాంతాల్లో లక్షలమంది ఉన్నారు. వీరే మానవ వనరులు. అందుకే ప్రభుత్వం రూ.5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకానికి ప్రాధాన్యం ఇస్తున్నది. కొందరు మూర్ఖంగా ఆలోచించే వాళ్లు అవహేళన చేసి మాట్లాడారు.

కానీ పథకం ప్రారంభించిననాటినుంచి శుక్రవారానికి రాష్ట్రవ్యాప్తంగా 18.74 లక్షల గొర్రెలు పంపిణీచేశాం. ఇది దేశంలోనే ఆల్‌టైం రికార్డని మా అధికారులు చెప్తున్నారు. దసరావరకు 20 లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేసే దిశగా ముందుకు వెళుతున్నాం. 84 లక్షల గొర్రెలు తెచ్చి పంచుతామంటే కొందరు కండ్లు బైర్లు కమ్మి పడిపోయారు. చాలామంది నమ్మలేదు. కానీ నిజమైన చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటే నిజం చేయవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నాయకత్వంలో కలెక్టర్లు, పశుసంవర్ధకశాఖ అధికారులు చేసి చూపుతున్నారు. అదేవిధంగా మిగిలినవి పంచుతాం. మొదట ఈ పథకం ప్రకటించినప్పుడు నాలుగు లక్షల యూనిట్లు పంపిణీ చేస్తామన్నాం. కానీ దరఖాస్తులు ఏడు లక్షలు వచ్చాయి. మొత్తం ఏడు లక్షల మందికీ యూనిట్లు పంపిణీ చేస్తాం. దేశానికి అవసరమైన మాంసాన్నే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతిచేసే స్థాయికి తెలంగాణ రావాలి. నాలుగేండ్ల తర్వాత దేశంలో ధనవంతులైన యాదవులు తెలంగాణలో ఉండాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులకు చెప్పా. గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా అమలుచేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్, పశుసంవర్ధకశాఖ అధికారులను అభినందిస్తున్నా. అదేవిధంగా చేపల పెంపకాన్ని రూ.వెయ్యి కోట్లతో పెద్ద ఎత్తున చేపడుతాం. దానికి ఈ ఏడాది 70కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం. గతంలో హుస్సేన్‌సాగర్ కింద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసంచేశారు. అటువంటి ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించడంతోపాటు ప్రతి రిజర్వాయర్ కింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.

1962 నంబర్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ సంచార పశువైద్యశాలలు ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 1962 నంబర్‌కు ఫోన్ చేసి సంచార పశువైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సన్నివేశం నవ్వులు పూయించింది. 1962కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. మీరు ఎంతసేపట్లో ఇక్కడకు రాగలరు? అని అడుగగా.. అందుకు సంచార పశువైద్య సిబ్బంది.. సర్, మేం 30 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం. చెప్పండి మీ పశువుకు ఏమయ్యింది? అని అడిగారు. ఇందుకు సీఎం కేసీఆర్ సరదాగా స్పందిస్తూ.. ఇక్కడ పశువులు ఏమీ లేవు.. అనడంతో అంతా పెద్దగా నవ్వుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సంచార పశువైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.