గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. -మెజారిటీ స్థానాలతో జీహెచ్‌ఎంసీ పీఠం కైవసం ఖాయం -హోంమంత్రి నాయిని ధీమా -టీఆర్‌ఎస్‌లో చేరిన అంబర్‌పేట కాంగ్రెస్ నేతలు

టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుని గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి, ఆమె భర్త – పీసీసీ రాష్ట్ర కార్యదర్శి గరిగంటి రమేశ్‌లతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం భారీగా తరలి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు మైనంపాటి హన్మంతరావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయిని మాట్లాడుతూ విపక్షాలు కారుకూతలు కూసినా వరంగల్ ఓటర్లు సీఎం కే చంద్రశేఖర్‌రావుపై నమ్మకంతో టీఆర్‌ఎస్‌కు అఖండ మెజారిటీని ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ అసహనానికి ప్రతిఫలంగా బీహార్‌లో బీజేపీ ఓటమి పాలైతే.. రాష్ట్రంలో అసహనం ప్రదర్శించిన విపక్షాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్, టీడీపీల నిర్వాకం వల్లే గ్రేటర్ హైదరాబాద్‌కు పూర్తిస్థాయిలో తాగునీటి జలాశయాలు లేకుండా పోయాయని నాయిని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం కేసీఆర్ నగర పరిధిలో రెండు భారీ రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారని చెప్పారు. టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు మైనంపాటి హన్మంతరావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేయడానికి కంకణం కట్టుకొని సీఎం కేసీఆర్ చేపట్టిన క్రతువులో ప్రజలంతా రాజకీయాలకతీతంగా భాగస్వాములు కావాలన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ శ్రీదేవి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావడానికే గులాబీ కండువాలు కప్పుకున్నట్లు చెప్పారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీహెచ్ భగవాన్, ఓబీసీ విభాగం కన్వీనర్ నాగరాజుగౌడ్, టీపీసీసీ ఎస్సీ సెల్ సంయుక్త కన్వీనర్ కే శ్యాం తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత పుట్టం పురోషోత్తం తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి అందోల్ కాంగ్రెస్ నేతలు మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నేతలు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు సమక్షంలో వారు గులాబీ కండువాలు కప్పుకున్నారు. రేగోడ్ ఎంపీపీ మమతా శ్రీశైలం, ఎంపీటీసీ సుజాతా శ్రీనివాస్‌లతోపాటు కాంగ్రెస్ నేతలు చందర్‌నాయక్, జెన్నిబాయ్, విఠల్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాబూమోహన్, మహీపాల్‌రెడ్డి పాల్గొన్నారు.