Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గుడుంబాకు పాతర

గుడుంబాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పేదల బతుకులను ఛిద్రం చేస్తున్న గుడుంబా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పీడీ యాక్ట్ లేదా అంతకు మించిన అత్యంత కఠిన చట్టాలు రూపొందించాలని నిర్దేశించారు. నూతన ఎక్సైజ్ విధానంలో గుడుంబా, కల్తీ మద్యం నివారణపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నూతన ఆబ్కారీ విధానంపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఎదురైన అనుభవాలను అధికారులతో పంచుకున్నారు.

KCR-review-on-Excise-department

-రాష్ట్రం నుంచి ఈ దరిద్రాన్ని పారదోలాలి.. -ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి: సీఎం -పీడీ కన్నా కఠిన చట్టాలు తీసుకురావాలి -ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండి -రాజధాని ప్రతిష్ఠ కాపాడండి -అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -నూతన మద్యం విధానంపై సీఎం సమీక్ష వరంగల్‌తో పాటు ప్రతి చోటా గుడుంబా వల్ల జరుగుతున్న అనర్థాలను ప్రజలు ఆవేదనతో తెలిపారని, మహిళలైతే గుడుంబాను అరికట్టి తమ కాపురాలు నిలబెట్టాలని అర్థించారని వివరించారు. గుడుంబా కారణంగా గ్రామాలు, గిరిజనతండాల్లో 20నుంచి 25 ఏండ్ల లోపే యువకులు మృత్యువాత పడుతున్నారని, పారాణి ఆరకముందే యువతులు వితంతువులుగా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

పేద ప్రజల సంక్షేమం కోసం ఆసరా, సబ్సిడీ బియ్యం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా గుడుంబా మహమ్మారి వల్ల వారి బతుకుల్లో విషాదం పోవడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఆడబిడ్డల ముఖంలో చిరునవ్వులు చూడాలంటే గుడుంబా దరిద్రాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని అన్నారు. గుడుంబా నిర్మూలనకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

పీడీ కన్నా కఠిన చట్టం తేవాలి.. గుడుంబా తయారీదార్లపై పీడీ యాక్ట్‌ను అమలు చేయాలా? లేక అంతకంటే కఠినమైన చర్యలు తీసుకోవాలా? అనే అంశాలపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. నూతన ఎక్సైజ్ విధానంలో గుడుంబా, కల్తీ మద్యం నివారణ పై పకడ్బందీ నిబంధనలు ఉండాలని ఆదేశించారు. కల్తీ కల్లుపై పెద్దగా ఫిర్యాదులు లేవన్నారు. కల్లు పోసేవారు, తాగేవారు పరిచయస్తులే ఉంటారు కాబట్టి కల్తీకి పెద్దగా ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు.

షాపుల్లో మద్యం అమ్మడం, తాగి గొడవలు పడడం వంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయని, వీటిని వెంటనే అరికట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలకు సంబంధించి ఈ నగరానికి ఉన్న ప్రతిష్టను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో అవసరాలకు అనుగుణంగా నూతన విధానం రూపుదిద్దాలని సూచించారు. విదేశాలనుంచి పర్యాటకులు, పెట్టుబడిదారులు, ఇతరులు నగరానికి వస్తారని ఇలాంటి చోట నకిలీ మద్యం వంటివి చోటు చేసుకుంటే నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. నగరంలో ప్రస్తుత జనాభా, ఫ్లోటింగ్ జనాభాను దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం విధానంలో వైన్‌షాప్‌లు, బార్‌ల కేటాయింపులుండాలని అన్నారు.

కాగా రాష్ర్టానికి అవసరమైన మద్యాన్ని స్థానికంగానే తయారు చేయడానికి అవసరమైతే కొత్త డిస్టిలరీలు, బ్రేవరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆబ్కారీశాఖ మంత్రి పద్మారావు, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎక్త్సెజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ తదితరులు పాల్గొన్నారు.

విమర్శలు రాకుండా మద్యం విధానం: పద్మారావు ప్రజల నుంచి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అందరికీ ఆమోదయోగ్యంగా నూతన మద్యం విధానం రూపొందిస్తామని ఎక్త్సెజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ముఖ్యమంత్రితో సమీక్ష తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడుంబాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో మూడు నాలుగు రోజుల్లో నూతన మద్యం విధానంపై ప్రతిపాదనలతో తిరిగి సమావేశమవుతామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.