Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీ ప్రభంజనం

-రికార్డుస్థాయిలో టీఆర్‌ఎస్ మద్దతుదారుల విజయం
-పలు జిల్లాల్లో గులాబీ శ్రేణుల క్లీన్‌స్వీప్.. గ్రామాల్లో అంబరాన్నంటిన సంబురాలు
-తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ.. కాంగ్రెస్ పరిస్థితి అంతంతే
-పలుచోట్ల స్వతంత్రుల గెలుపు.. వారిలోనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులే అధికం
-తొలివిడుత పంచాయతీపోరు ప్రశాంతం

పల్లెలు గులాబీ పరిమళాలతో గుభాళించాయి. ఎన్నికలు ఏవైనా తాము గులాబీ జెండా నీడనే కోరుకుంటున్నామని ఓటు గుద్ది మరీ తేల్చిచెప్పాయి. బ్యాలెట్ పత్రంలో టీఆర్‌ఎస్ గుర్తు లేనప్పటికీ.. ఆ పార్టీ మద్దతుదారులకు ఘన విజయం కట్టబెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దూకుడు కొనసాగించింది. అనేక జిల్లాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌చేశారు. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏకపక్షంగానే వచ్చింది. తొలి విడుతలో భాగంగా 3701 పంచాయతీలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. మరో 769 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 4470 గ్రామపంచాయతీలకుగాను కడపటి సమాచారం అందేసరికి టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలు కలుపుకొని 2973 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేశారు. 861 స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా.. మరే ఇతర పార్టీలు రెండంకెల స్థానాలు దాటలేకపోయాయి. 412 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. వీరిలోనూ స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వతంత్రంగా బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తున్నది.

భారీగా పోలింగ్ నమోదు
కొద్దిరోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటింగ్‌కు తరలి వచ్చిన గ్రామీణ ఓటర్లు.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని చాటారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఓటేసేందుకు బారులు తీరారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అనేకమంది తమ సొంతూరికి వెళ్లి మరీ ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఉదయం 9 గంటల వరకు 27%, 11 గంటల వరకు 60% నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటవరకు 85.76 శాతంగా నమోదైంది. పలు గ్రామాల్లో 90 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, తొలుత వార్డు స్థానాలకు ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సర్పంచ్ స్థానాల లెక్కింపు ప్రారంభించారు. సర్పంచ్ అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు ముందు నుంచీ మెజార్టీతో ఉన్నారు.

చిన్న గ్రామ పంచాయతీల లెక్కింపు సాయంత్రం ఏడు గంటల వరకే పూర్తిచేశారు. మొదటి పంచాయతీ ఫలితం జగిత్యాల జిల్లా బీర్పూరు మండలం చినన కొల్వాయి గ్రామంలో వెలువడగా.. ఇక్కడ టీఆర్‌ఎస్ మద్దతుదారు చిక్కం రవీందర్ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయా గ్రామాల్లో పండుగవాతావరణం నెలకొన్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట్ల గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. విజేతలను ఊరేగిస్తూ డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీలు తీశారు. జై తెలంగాణ నినాదాలతో పల్లెలు మారుమోగాయి. సర్పంచ్ స్థానాలకు ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే కొన్ని గ్రామాల్లో వార్డు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.

603 పంచాయతీల్లో టీఆర్‌ఎస్ ఏకగ్రీవం
తొలివిడుత ఎన్నికల్లో భాగంగా నామినేషన్లపర్వం ఈ నెల 13తో ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా అదేరోజు విడుదలచేశారు. సింగిల్ నామినేషన్లు దాఖలైన గ్రామాలను ఏకగ్రీవంగా ప్రకటించారు. తొలివిడుతలో 4,479 పంచాయతీలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, తొమ్మిది గ్రామాల్లో రిజర్వేషన్లకు అనుకూలమైన సామాజికవర్గాలు లేకపోవడంతో వాటికి ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 4,470 పంచాయతీల్లో 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అవిపోను 3,701 గ్రామాలకు సోమవారం పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలైన 769 గ్రామాల్లో 603 టీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ఏకగ్రీవాల్లో స్వతంత్రులు 131 మంది ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన 35 మంది ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవమైన వారు, బరిలో నిలిచిన వారు పార్టీ నేతలతో ప్రచారం చేయించుకుకోకపోవటం విశేషం. రాష్ట్రస్థాయి నేతలు వచ్చి ప్రచారం చేస్తే తమకు నష్టం జరుగుతుందనే భావనతో పార్టీ పేరు లేకుండానే ప్రచారం చేసుకున్నారు.

మహిళలే టాప్
పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవటం విశేషం. ఏకగ్రీవాలు పోను సోమవారం ఎన్నికలు జరిగిన 3,701 గ్రామాల్లో మొత్తం 48,46,443 ఓటర్లున్నారు. అందులో 23,96,965 మంది పురుష ఓటర్లు, 24,49,361 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 41,56,414 ఓట్లు పోలవ్వగా.. 20,36,782 మంది పురుషులు, 21,19,624 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్‌లో మహిళల ఓట్లు 86.54%, పురుషుల ఓట్లు 84.97% ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

అత్యధిక జిల్లాల్లో 80%పైనే పోలింగ్
అత్యధికంగా ఓటింగ్ నమోదైన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి (95.32%), ఖమ్మం (93.92%), మెదక్ (91.28%), సూర్యాపేట (92.35%), సిద్దిపేట (90.02%), రంగారెడ్డి (92.67%), జనగామ (90.51%), వరంగల్ రూరల్ (91.23%) ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కనీసం 80 శాతం ఓటింగ్ నమోదైంది. తక్కువ ఓటింగ్ నమోదైన జిల్లాల్లో వికారాబాద్ (68.25%), నిజామాబాద్ (78.56%), రాజన్న సిరిసిల్ల (78.47%) జిల్లాలున్నాయి.

తుడుచుకుపోయిన టీడీపీ
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు తుడుచుపెట్టుకుపోయింది. ఆయా ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేసినప్పటికీ… డిపాజిట్లు దక్కలేదు. సీపీఎం తర్వాతి స్థానంలో టీడీపీ నిలిచింది. బీజేపీ రెండంకెల ఫలితాలనే సాధించినా.. ఇతరపార్టీలతో పోల్చితే మెరుగ్గా ఉన్నది.

మూడు చోట్ల రీ పోలింగ్
మొదటి విడుతలో వివిధ కారణాలతో మూడుచోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామపంచాయతీ మూడోవార్డుకు ఈ నెల 30న, వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ముంజాలకుంట రెండోవార్డుకు, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమన్‌పల్లి ఎనిమిదో వార్డుకు ఈ నెల 25న రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.