Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీ ప్రభంజనం

-పంచాయతీ తుదివిడుత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ జోరు
-మూడు విడుతల్లోనూ తిరుగులేని శక్తి
-ఓటింగ్‌లో మరోసారి చైతన్యాన్ని చాటిన గ్రామసీమలు
-రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో ఓటింగ్ నమోదు
-అత్యధికం యాదాద్రి-భువనగిరి 94.99%
-అత్యల్పం జగిత్యాల జిల్లా 77.70%

ముచ్చటగా మూడోవిడుత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సింహభాగం పల్లెలు గులాబీవర్ణాన్ని పులుముకొన్నాయి. మూడో విడుతలో బుధవారం 3506 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించగా, టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2742 పంచాయతీల్లో విజయబావుటా ఎగురవేశారు. వార్డుల్లోనూ గులాబీ జోరు కొనసాగింది. మొత్తం మూడు విడుతల్లో చూస్తే టీఆర్‌ఎస్ మద్దతుదారులు 8606 స్థానాల్లో విజయం సాధించారు. మూడో విడుతలో 4,116 పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించగా.. 576 సర్పంచ్ స్థానాలు, 8956 వార్డులు ఏకగీవ్రమయ్యాయి. బుధవారం 3,506 పంచాయతీలకు, 36,729 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి రెండు విడుతల స్థాయిలోనే మూడో విడుతలోనూ భారీ పోలింగ్ నమోదైంది. మొదటి విడుతలో 85.76%, రెండో విడుతలో 88.26% పోలింగ్ నమోదు కాగా, తుది విడుత ఎన్నికల్లో 88.03% పోలింగ్ నమోదైంది.

జిల్లాలవారీగా చూస్తే ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా, 17 జిల్లాల్లో 80 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. మిగిలిన రెండు జిల్లాల్లో కూడా 79.81%, 77.70% ఓటింగ్ నమోదుకావడం గ్రామసీమల్లో ఓటర్ల చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నది. మూడు విడుతల్లో కలిపి 86.67 శాతం పోలింగ్ నమోదు అయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తుది విడుత మేడ్చల్ మినహా 29 జిల్లాల్లో 45,23,669 మంది ఓటర్లకుగాను 39,82,043 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 87.38% ఉండగా, మహిళలు 88.67% ఉన్నారు. 196 మంది థర్డ్‌జెండర్ ఓటర్లకుగాను 18 మంది (9.18%) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో 94.99% ఓటింగ్ నమోదు కాగా, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 77.70% నమోదైంది.

వికారాబాద్‌లో ఏడో వార్డుకు రీపోలింగ్
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడో వార్డుకు రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. బుధవారం జరిగిన మూడో విడుత ఎన్నికల్లో ఇక్కడ కమ్లిబాయి అనే మహిళ ఓటు హక్కును వేరొక మహిళ వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఫిబ్రవరి 1వ తేదీన వార్డు మెంబర్ ఎన్నికతోపాటు ఆ వార్డులో సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
-సత్ఫలితాలిచ్చిన పోలీసు వ్యూహాలు
-రూ.2కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం

పోలీసుల ముందస్తు ప్రణాళికలు, పకడ్బందీ వ్యూహాలతో పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లోనూ ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను కూడా పోలీసు శాఖ సవాల్‌గా తీసుకుంది. గ్రామా ల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగానే బందోబస్తు ప్రణాళికలు రూపొందించారు. డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ నిరంతరం పర్యవేక్షించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించడంతోపాటు మూడు విడు తలకు జిల్లాల పరిధిలోనే సిబ్బందిని సమన్వయం చేసుకునేలా ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రలతోపాటు అన్ని జిల్లాల ఎస్పీలు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ పూర్తి ప్రక్రియను సమన్వయం చేశారు. చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలావుంటే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 1 నుంచి బుధవారం వరకు జరిపిన తనిఖీల్లో మొత్తం రూ.2కోట్ల మేర నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రూ.1.18 కోట్లను సీజ్‌చేశారు. రూ.63,91,222 విలువైన మద్యా న్ని పట్టుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన 572 మందిపై కేసులు నమో దు చేయగా, 260 మందిని అరెస్ట్‌చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.