Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీ వికాసం

-తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా..
-అత్యధిక స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులదే విజయం
-ఉత్సాహంగా తరలివచ్చి ఓటేసిన యువత, మహిళలు, వృద్ధులు ..
-అనేక జిల్లాల్లో 85 శాతానికిపైగా పోలింగ్

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన తొలివిడుతలో టీఆర్‌ఎస్ పార్టీ హవా వీచింది. అత్యధిక స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని 88 స్థానాల్లో గెలిపించి అఖండ విజయం కట్టబెట్టిన ఓటర్లు.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఓటు చైతన్యం ప్రదర్శించారు. టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులపైనే నమ్మకం ఉంచారు. ఘన విజయం కట్టబెట్టారు. ప్రతి జిల్లాలోనూ గులాబీ వికాసం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష పార్టీలు తమ కంచుకోటలుగా చెప్పుకొనే ప్రాంతాల్లోనూ టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రజాతీర్పును చాటిచెప్పారు. ఏకగ్రీవాల్లోనూ టీఆర్‌ఎస్ హవా స్పష్టంగా కనిపిచింది. అన్ని జిల్లాల్లో ఏకగ్రీవ పంచాయతీల్లో 95 శాతానికిపైగా గులాబీ ఖాతాలో పడ్డాయి. – నమస్తే తెలంగాణ నెట్‌వర్క్

నిజామాబాద్ జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడుత పోలింగ్ 78.56 శాతం పోలింగ్ నమోదైంది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 141 సర్పంచ్ స్థానాలకు, 1,004 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ బరిలో 545 మంది ఉండగా వార్డుసభ్యుల స్థానాల కోసం 2,386 మంది బరిలో నిలిచారు. తొలివిడత 78.56 పోలింగ్ శాతం నమోదైంది. ఏర్గట్ల మండలంలో అత్యధికంగా 81.39 శాతం, ఆర్మూర్ మండలంలో అత్యల్పంగా 76.44శాతం పోలింగ్ నమోదైంది.

కామారెడ్డి జిల్లాలో 81.29 శాతం పోలింగ్
కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 81.29 శాతం పోలింగ్ నమోదైంది. 2,12,377 మంది ఓటర్లకు గానూ 1,72,635 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 9 మండలాల్లో పోలింగ్ నిర్వహించగా.. 164 పంచాయతీలకు, 1,508 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 134 గ్రామాల్లో 133 సర్పంచ్ స్థానాలకు, 1022 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. భిక్కనూరు మండల కేంద్రంలో తోపులాటకు దారి తీసింది. బీబీపేట మండల కేంద్రంలో విధుల్లో ఉన్న ఏఎస్సై, ఓ కానిస్టేబుల్ మహిళా ఓటర్లపై అసభ్యకరంగా ప్రవర్తించడం, పలువురిపై అమర్యాదగా వ్యవహరించడంతో గ్రామస్థులు తీవ్రంగా మండిపడ్డారు. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు.

టీఆర్‌ఎస్ దూకుడు..
గ్రామ పోరులో టీఆర్‌ఎస్ దూకుడును కనబర్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పల్లెలన్నీ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే జైకొట్టాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 177 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ మద్దతుదారులు 139 స్థానాల్లో, కాంగ్రెస్ మద్దతు దారులు 22 స్థానాల్లో ఇతరులు మిగతా స్థానాల్లోనూ గెలుపొందారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 164 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 120 స్థానాల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 27 స్థానాల్లో ఇతరులు మిగతా స్థానాల్లో విజయం సాధించారు. -సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో టీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థి తిరుమల వాసు 13 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ బలపరచిన జయశంకర్‌గౌడ్ రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లోనూ అదే ఫలితం వచ్చింది. -సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థికి ఓటువేసిన బ్యాలెట్‌పై ఇంకు మరక పడటంతో ఆ ఓటును అధికారులు లెక్కించలేదు.

-నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అనంతరం టీఆర్‌ఎస్ బలపరచిన నిర్మల నాలుగు ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతమానేపల్లి, కోయపల్లి గ్రామాల్లో ఒక్క ఓటుతో టీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు.
-మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం లింగాపూర్‌తండాలో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి గోపి స్వతంత్ర అభ్యర్థి సర్వన్‌పై ఒక్క ఓటుతో గెలుపొందారు.
-రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో టీఆర్‌ఎస్, టీడీపీ బలపర్చిన అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో డ్రాతీశారు. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి భీష్వ మాధవీని అదృష్టం వరించింది. మొత్తం 1342 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ మద్దతుదారుకు 386 ఓట్లు, టీఆర్‌ఎస్, టీడీపీ బలపర్చిన అభ్యర్థులిద్దరికీ 478 ఓట్లు వచ్చాయి.

చెల్లాపూర్‌లో స్వల్ప ఉద్రిక్తత
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్‌లో ఓట్ల లెక్కింపులో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. సోమవారం పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొన్నదంటూ కొందరు ఆరోపించడంతో.. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేశారు. టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. దీంతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టించారు. అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు స్వల్ప గాయలైనట్టు పోలీసులు తెలిపారు. పరిగి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కొడంగల్ సీఐ నాగేశ్వర్‌రావు, దౌల్తాబాద్ ఎస్సై సతీశ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి అదుపుకాకపోవడంతో స్వల్ప లాఠీచార్జీ చేశారు.

మెతుకుసీమపై టీఆర్‌ఎస్ జెండా
మెదక్ జిల్లాలో జరిగిన మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చా టింది. మొత్తం 597 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా 480 స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఇందులో 75 గ్రామాలు ఏకగ్రీవం కావడం విశేషం. ప్రస్తుత మెదక్ జిల్లాలో మొత్తం 154 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కాగా 32 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరా యి. సోమవారం 122 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా గులాబీ పార్టీ మద్దతు దారులు 81చోట్ల గెలుపొందారు. మొత్తంగా జిల్లాలో 113 పంచాయతీలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి చేరాయి. కాం గ్రెస్ 31, ఇతరులు 8 పంచాయతీల్లో గెలుపొందారు. ఆరు మండలాల్లో మొత్తంగా 1,19,917 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 61,413 మందికాగా, పురుషులు 58,504 మంది. జిల్లాలో 90.7 శాతం పోలింగ్ నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 186 పంచాయతీలకు గాను టీఆర్‌ఎస్ మద్దతుదారులు 170 స్థానాల్లో గెలుపొందారు.

ఇందు లో 21 గ్రామాలు ఏకగ్రీవం కావడం, అవన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకే చేరడం విశేషం. సోమవారం 165 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా 149 చోట్ల టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు. మొత్తంగా కాంగ్రెస్ 7, సీపీఎం 3, బీజేపీ 2, స్వతంత్రులు 4చోట్ల గెలుపొందారు. గెలుపొందిన నూతన సర్పంచులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటలో తన నివాసంలో అభినందించారు. సంగారెడ్డి జిల్లాలో 258 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 176 చోట్ల టీఆర్‌ఎస్ మద్దతుదారులు విజ యం సాధించారు. జిల్లాలో మొత్తం 23 ఏకగ్రీవాలు కాగా.. అందులో 22 టీఆర్‌ఎస్ ఖాతాలోకి, ఒకటి కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. సోమవారం 235 పంచాయతీలకు పోలింగ్ జరుగగా.. 154 స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు.

మహబూబ్‌నగర్‌లో కారుజోరు
మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. జిల్లాలో 249 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటికే 44 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 205 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 205 పంచాయతీ స్థానాలకుగానూ 156 టీఆర్‌ఎస్, కాంగ్రెస్ 02, బీజేపీ 16, టీడీపీ 7, సీపీఐ 2, సీపీఎం 1, ఇతరులు 65 స్థానాల్లో విజయం సాధించారు.

వనపర్తిలో టీఆర్‌ఎస్ హవా..
వనపర్తి జిల్లాలో 65 స్థానాలు టీఆర్‌ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకోగా, 11 స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు, ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకున్నారు. రేవల్లి మండలం కొంకలపల్లిలో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి, అదే పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. చివరకు టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జగదీష్ ఒక్క ఓటు తేడాతో సమీప ప్రత్యర్థి నాగరాజుపై విజయం సాధించారు.

గద్వాలలో గులాబీ జోరు
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 106 జీపీలకుగానూ 29 ఏకగ్రీవం కాగా.. 77 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్ మద్దతుదారులు 52, కాంగ్రెస్ 20, ఇతరులు 5 మంది విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో 82.49శాతం పోలింగ్
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని 160 జీపీలకుగాను 37పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఐదు జీపీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. 118పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 82.49శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,51,242మంది ఓటర్లకుగాను 1,24,759 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఖమ్మంలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ వికసించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలిపి మొత్తం 364 పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా 177 స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇందులో 43 స్థానాలు ఏకగ్రీవమైనవే. ఖమ్మం జిల్లాలో మొత్తం 188 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా 101 స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో 21 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాం గ్రెస్, కమ్యూనిస్టుల పార్టీల కంచుకోటలుగా ఉన్న మండలాల్లోనూ టీఆర్‌ఎస్ సత్తాచాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 174 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 76 స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు. మొత్తం ఏడు మండలాల్లో 83.40 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో 22 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. పాల్వంచ మండలంలోని సంగెం, నారాయణరావుపేట పంచాయతీలు ఎస్టీలకు రిజర్వ్ కాగా ఆయా పంచాయతీల్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నిక నిలిచిపోయింది.

గిరిజన జిల్లాలో ఓటు చైతన్యం
గిరిజనుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటుచైతన్యాన్ని ప్రదర్శించింది. నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 509 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా.. 355 స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో 153 పంచాయతీలకు షెడ్యూల్ ప్రకటించగా 50 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం 103 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించగా.. 88.27 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా జిల్లాలో 111 స్థానాల్లో గులాబీ వికసించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 113 పంచాయతీలకుగానూ 78 స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇందులో 18 ఏకగ్రీవం కావడం విశేషం. జిల్లాలో మొత్తం 86.71 శాతం పోలింగ్ నమోదైంది.

మంచిర్యాల జిల్లాలో 87.16 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 109 పంచాయతీలకుగానూ 8 ఏకగ్రీవమయ్యయాయి. సోమవారం 101 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా టీఆర్‌ఎస్ మద్దతుదారులు 62 స్థానాల్లో గెలుపొందారు. మిగతా వాటిల్లో 33 మంది స్వతంత్రులు గెలుపొందడం విశేషం. కన్నెపల్లిలో అభ్యర్థికి కేటాయించిన గుర్తు బ్యాలెట్ పేపర్‌లో లేకపోవడంతో గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత సరిచేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 134 పంచాతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 57 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా జిల్లాలో 104 చోట్ల టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు.

కరీంనగర్‌లో పోలింగ్ ప్రశాంతం
కరీంనగర్ జిల్లాలో 84.22 శాతం, జగిత్యాల జిల్లాలో 82.80 శాతం, పెద్దపల్లి జిల్లాలో 84.85 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 82.60 శాతం నమోదైంది. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లోని 93 సర్పంచు, 728 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,60,162 మంది ఓటర్లు ఉండగా 1,34,893 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్‌లో మొత్తం 97 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ మద్దతుదారులు 59 స్థానాల్లో, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 12 స్థానాల్లో ఇతరులు మిగతా స్థానాల్లో గెలుపొందారు.

జగిత్యాల జిల్లాలో 131 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ మద్దతుదారులు 85 మంది, కాంగ్రెస్ బలపర్చిన వారు 29 మంది మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. సిరిసిల్ల జిల్లాలో 80 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ మద్దతుదారులు 42 చోట్లు, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 14 స్థానాల్లో ఇతరులు మిగిలిన స్థానాల్లో గెలుపొందారు. పెద్దపల్లి జిల్లాలో 106 స్థానాలకు గాను టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 67 స్థానాల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 26 స్థానాల్లో ఇతరులు మిగిలిన స్థానాల్లో విజయం సాధించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.