
-ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం గెలుపు -ఓటింగ్‌కు రాని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ -ఓటుహక్కు వినియోగించుకున్న 98 మంది ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకుగాను నాలుగింటిని టీఆర్ఎస్, మరో స్థానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కైవసం చేసుకున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్-1లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం ఓట్లు లెక్కించి, టీఆర్ఎస్ అభ్యర్థులు.. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజుల్ హసన్ ఇఫెండి ఎన్నికైనట్టు ప్రకటించారు. మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, ఎగ్గె మల్లేశంకు 20 చొప్పున, శేరి సుభాష్‌రెడ్డి, ఇఫెండిలకు 19 చొప్పున ఓట్లు వచ్చాయి. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు ధ్రువపత్రాలను అందజేశారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో మొత్తం 98 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. టీఆర్ఎస్కు చెందిన 91 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
తొలి ఓటు స్పీకర్ పోచారం.. చివరగా సీఎం కేసీఆర్ శాసనమండలి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. ఎన్నికల కోసం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మొదటి ఓటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వేశారు. చివరగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణభవన్ నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నంకల్లా ఓటింగ్ పూర్తయింది. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో మరో విడుత మాక్‌పోలింగ్‌కు హాజరయ్యారు. ఆయా ఎమ్మెల్సీలకు కేటాయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాక్ పోలింగ్‌కు హాజరయ్యేలా చూశారు.
అమరవీరుల స్తూపం వద్ద కొత్త ఎమ్మెల్సీల నివాళి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు తమ ఎన్నిక ధ్రువపత్రాలు అందుకున్న అనంతరం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనవారిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు అభినందించి, పుష్పగుచ్ఛాలందించారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్సీలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తామని చెప్పా రు. వారిని సీఎం కేసీఆర్ అభినందించారు.