Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీ దళం పునర్నిర్మాణం

-3 నుంచి 20 వరకు సభ్యత్వ నమోదు -30 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం -పాత కమిటీలన్నింటినీ రద్దు చేసిన ప్లీనరీ -ప్రతి సభ్యుడికీ రెండు లక్షల ప్రమాద బీమా -పన్నెండు మందితో స్టీరింగ్ కమిటీ నియామకం -ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ

KCR-in-Party-Pleenary-Meeting

తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక ఘట్టం మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మంగళవారం నిర్వహించిన ప్లీనరీలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గులాబీ దళం పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న కమిటీలన్నింటినీ పార్టీ శ్రేణుల ఆమోదంతో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్‌లో జరిగిన ప్లీనరీలో పార్టీ సభ్యత్వ నమోదు మొదలు.. పార్టీ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, చైర్‌పర్సన్లు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జడ్పీటీసీ, ఎంపీపీలు, మండలపార్టీ అధ్యక్షులు, తదితరులు ప్లీనరీకి హాజరయ్యారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదికపై పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, తెలంగాణ భవన్ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. ప్లీనరీలో గంటకుపైగా సాగిన కేసీఆర్ ప్రసంగంలో ముందుగా పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు అంశాలపై మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో 25వేల ప్రాథమిక సభ్యత్వాలతో పాటు ఐదువేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదుచేయాలని స్పష్టం చేశారు. 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా జరగనున్న ఈ ప్రక్రియకు 16 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత గంట కూడా పొడగింపు ఉండదని స్పష్టం చేశారు.

స్టీరింగ్ కమిటీని ప్రకటించిన సీఎం కేసీఆర్..: పార్టీ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలు, ఇతర జిల్లాలకు సంబంధించి రెండు వేర్వేరు స్టీరింగ్ కమిటీలను నియమించారు. రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని కూడా ప్రకటించారు. నల్లగొండ పార్లమెంటు ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సీనియర్ నాయకులు రాజయ్యయాదవ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మందుల సామేలు, సయ్యద్ అక్బర్ హుస్సేన్, బాలమల్లు, బొంతు రామ్మోహన్, సత్యవతి రాథోడ్, ఆర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జెల్లా మార్కండేయులు, పురాణం సతీశ్, రూప్‌సింగ్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. మహిళా కార్యకర్తలకు సంబంధించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పర్యవేక్షిస్తారని కేసీఆర్ తెలిపారు. జంట నగరాల్లో పార్టీ సభ్యత్వ నమోదును పర్యవేక్షించేందుకు మరో స్టీరింగ్ కమిటీని నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే జాబితా చాలా పెద్దగా ఉన్నందున తరువాత ప్రకటిస్తామని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మైనంపల్లి హన్మంతరావును ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రకటించే అవకాశముందని తెలిసింది.

పనితీరుకు ఇదో గీటురాయి..: సభ్యత్వ నమోదుకు తక్కువ సమయాన్ని ఇచ్చినా నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది పార్టీ నాయకులు, కార్యకర్తల పనితీరుకు గీటురాయి అని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఈ ప్రక్రియను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌డేట్..: పార్టీ సభ్యత్వ నమోదును కచ్చితంగా ఈనెల 20లోపు మాత్రమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత వ్యవధి పొడిగించాలని కోరినా కనీసం గంట కూడా పొడిగించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని ఏరోజుకారోజు వివరాలను అప్‌డేట్ చేసి, తెలంగాణ భవన్‌కు పంపాలని సూచించారు. రూ.రెండు లక్షల ఇన్సూరెన్స్..: పార్టీలో తనతోసహా 30 లక్షల సభ్యత్వాలకు సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఆర్థికంగా ఆయా కుటుంబాలకు చేయూతనందించేందుకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి గుర్తింపు కార్డులిస్తామని, అది ప్లాస్టిక్ కార్డు రూపంలో ఉంటుందన్నారు.

షెడ్యూలు వివరాలు.. పార్టీ నిర్మాణ కార్యక్రమం.. -సభ్యత్వ నమోదు – ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు -గ్రామ/వార్డు పార్టీ కమిటీల ఎన్నిక, అనుబంధ సంఘాల ఎన్నిక – మార్చి 1 నుంచి 10 వరకు -మండల/డివిజన్ పార్టీ కమిటీల ఎన్నిక, అనుబంధ సంఘాల ఎన్నిక – మార్చి 11 నుంచి 20వరకు -జిల్లా పార్టీ కమిటీ ఎన్నిక, అనుబంధ సంఘాల ఎన్నిక – ఏప్రిల్‌లో.. (తేదీలను తర్వాత ఖరారు చేస్తారు) -అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికలు (రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం) – ఏప్రిల్ 24న ఆర్డీ కన్వెన్షన్ హాల్‌లో -బహిరంగ సభ – పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.