– ప్లీనరీ, బహిరంగ సభలకు భారీ ఏర్పాట్లు – ఏడు కమిటీల నియామకం – ప్లీనరీలో పార్టీ శ్రేణులతో అధినేత ముఖాముఖి చర్చ – బహిరంగ సభ వేదికపై నూతన పథకాల ప్రకటన – 36 వేల మందికి ఆహ్వానం – 24న పార్టీ అధ్యక్ష ఎన్నిక.. – రిట్నరింగ్ అధికారిగా నాయిని – వెల్లడించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి

పార్టీ ప్లీనరీ, బహిరంగ సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. గతంలో ఏ పార్టీ కూడా నిర్వహించని రీతిలో ఈ కార్యక్రమాలు ఉంటాయని పార్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఎమ్మె ల్సీ పూల రవీందర్, పుట్టం పురుషోత్తం తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న 36వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామని, అలాగే 27న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుపుతామని చెప్పారు. బహిరంగ సభ వేదికగా భవిష్యత్ కార్యక్రమాన్ని పార్టీ అధినేత సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తారని వివరించారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటాలు చేసి స్వరాష్ర్టాన్ని సాధించిన టీఆర్‌ఎస్.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ ఇదేనని ఆయన చెప్పారు. భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడా ఏ విషయంలో లోటుపాట్లు రాకుండా చూస్తామన్నారు. ఇందుకుగాను పార్టీ ఏడు కమిటీలను నియమించిందని వెల్లడించారు.
ప్లీనరీలో 45వేల మందికి ఏర్పాట్లు..: 24న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీకి ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 36వేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎవరెవరు హాజరుకావాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, వారికి మాత్రమే ఆహ్వానం పంపుతామని చెప్పారు. ఆ రోజున 45వేల మందికి నిజాం కళాశాల మైదానంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్లీనరీలోనే పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని, రిటర్నింగ్ అధికారిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అద్భుత రీతిలో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేసుకున్నామని, తర్వాత ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఈనెల 2 నాటికి గ్రామ, వార్డు కమిటీలను హైదరాబాద్, వరంగల్‌లో వార్డు ఏరియా కమిటీలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. ఇక మండల, అనుబంధ కమిటీల ఎన్నికలు, జిల్లా, అనుబంధ కమిటీల ఎన్నికలను కూడా 24 లోపల పూర్తి చేసుకుంటామని చెప్పారు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా అమలుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.
బహిరంగ సభలో ప్రజలకు కేసీఆర్ సందేశం.. పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక తర్వాత 27న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని జిల్లాకు లక్ష చొప్పున పది లక్షల మంది తరలి వస్తారని పేర్కొన్నారు. ఈ సభ వేదిక మీదినుంచి పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ గత అనుభవాలు, రాష్ట్ర ఏర్పాటు ప్రస్థానం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏయే కార్యక్రమాలు చేపట్టింది, భవిష్యత్తులో ఏఏ కార్యక్రమాలు చేపట్టనున్నది వివరిస్తారని తెలిపారు.
హైదరాబాద్‌కు గులాబీ శోభ… ప్లీనరీ, బహిరంగ సభకు సంబంధించి హైదరాబాద్ నగరాన్ని గులాబీమయం చేయాలని నిర్ణయించినట్లు పల్లా తెలిపారు. కార్యకర్తల ఉత్సాహానికి ఏమాత్రం అడ్డుపడొద్దనే ఉద్దేశంతో భారీగా అలంకరణ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. నగరాన్ని గులాబీ శోభతో నింపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. నగరంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో భారీ ఎత్తున స్వాగత ద్వారాలు, తోరణాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభలో బాణాసంచా కాల్చే ప్రక్రియ ప్రత్యేక ఆకర్షణ అవుతుందన్నారు. కమిటీల చైర్మన్లు, సభ్యులు.
తీర్మానాల కమిటీ: చైర్మన్-ఎంపీ కే కేశవరావు సభ్యులు: ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్, ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రణాళిక కమిషన్ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పరియాడ కృష్ణమూర్తి, కేఎం ఫరీదుద్దీన్, న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీ భీంసేన్. నగర అలంకరణ కమిటీ: చైర్మన్- మంత్రి కే తారక రామారావు, కో చైర్మన్- మంత్రి పీ మహేందర్‌రెడ్డి. సభ్యులు: ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్, హైదరాబాద్ నగర కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావు, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దిన్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొంతు రామ్మోహన్, ఆజంఅలీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మురళియాదవ్, శంబీపూర్ రాజు, దండె విఠల్, బేతి సుభాష్‌రెడ్డి, ఈ సుధాకర్‌రెడ్డి, నందు కుమార్,
మన్నె గోవర్దన్‌రెడ్డి, నగేష్, ముఠా గోపాల్ ఆహార కమిటీ: చైర్మన్- ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కో-ఛైర్మన్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభ్యులు: ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, మహ్మద్ సలీం, భూపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, పార్టీ నేతలు దేవర మల్లప్ప, అర్షద్ అలీఖాన్, కాలేరు వెంకటేశ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఖన్నాస్టేజ్, గ్రౌండ్ ఏర్పాట్ల కమిటీ: చైర్మన్- మంత్రి టీ పద్మారావు. సభ్యులు: ఎమ్మెల్సీలు కే యాదవరెడ్డి, పూల రవీందర్, పట్నం నరేందర్‌రెడ్డి, గాయత్రి బాలమల్లు, మందుల సామేలు, బాబా ఫసియుద్దీన్, నరేంద్రనాథ్, దోనెపూడి రమేష్‌బాబు, సతీష్‌రెడ్డి, జే ప్రతాప్, టీఆర్‌ఎస్వీ నాయకులు సీహెచ్ రాకేశ్, పీ ప్రవీణ్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు కమిటీ సభ్యులు
చైర్మన్- మంత్రి నాయిని సభ్యులు: ఎంపీ నగేష్, శ్రీహరిరావు, మోతె శోభన్‌రెడ్డి, సామ వెంకట్‌రెడ్డి, అలి బాక్రి, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, పన్యాల భూపతిరెడ్డి, మురళీగౌడ్. మహిళా ప్రతినిధుల ఏర్పాట్ల కమిటీ: చైర్మన్- డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సభ్యులు: జడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, పట్నం సునీతా రెడ్డి, పద్మ , మేయర్ ఆకుల సుజాత (నిజామాబాద్), నాయకురాలు విజయారెడ్డి మీడియా ఏర్పాట్ల కమిటీ: చైర్మన్-ఎంపీ సుమన్ సభ్యులు: ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజేశంగౌడ్, మనోహర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి ప్లీనరీకి ఆహ్వానితులు వీరే: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు. అన్ని కా ర్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్/డీసీసీబీ ఛైర్‌పర్సన్లు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు. సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు. టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ, మున్సిపల్ వార్డులు, సిటీ ఏరియా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు. టీఆర్‌ఎస్ అనుబంధ విభాగాల గ్రామ, మున్సిపల్ వార్డులు, సిటీ ఏరియా కమిటీల అధ్యక్షులు మాత్ర మే.
టీఆర్‌ఎస్ జిల్లా, మండల కార్యవర్గ కమిటీలు. టీఆర్‌ఎస్ విభాగాలు జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు మాత్రమే శ్రేణులతో పార్టీ అధినేత ముఖాముఖి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్లీనరీలో పార్టీ శ్రేణులతో అధినేత ముఖాముఖి కార్యక్రమం ప్రధాన ఆకర్షణ కానుంది. దీన్ని ఒక అర్థవంతమైన చర్చకు వేదికగా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం-ప్రజల మధ్య ఒక వారథిలా పార్టీ శ్రేణులు ఉంటాయనేందుకు ఈ చర్చ ద్వారా సంకేతం పంపాలని అనుకుంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే ఈ ప్లీనరీలో ప్రభుత్వ, ఇటు పార్టీ ముఖ్యలతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే గ్రామ, అనుబంధ కమిటీలైన వ్యవసాయ, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, దళిత, గిరిజన వర్గాలనుంచి ప్రతినిధులు వస్తున్నారు. వీరంతా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యమైన అట్టడుగు లబ్ధిదారుడికి అతి సమీపంలో ఉండే కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు వారితో ముఖాముఖి నిర్వహించడం ప్లీనరీలో కీలక ప్రక్రియగా మారనుంది.
ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరుతెన్నులు, వాటి అమలు, కిందిస్థాయి లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమైనా లోపాలున్నాయా, అధికార యంత్రాంగం వాటిని ఎలా అమలు చేస్తుంది వంటి వివరాలను అధినేత వారితో చర్చించనున్నట్లు తెలిసింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు చేపట్టని విధంగా సంక్షేమానికి రూ.29,700 కోట్లు వెచ్చిస్తున్న దరిమిలా ఈ ఫీడ్‌బ్యాక్‌పై పార్టీ అధినేత ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది.