Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీ గుమ్మం..ఖమ్మం!

టీఆర్‌ఎస్ 15వ జన్మదిన వేడుకను ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం ఖమ్మం నగర సమీపంలో చెరుకూరి గార్డెన్స్‌లో ప్లీనరీని, నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మూడు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు సభకు వస్తారని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నారు. ప్లీనరీ ఏర్పాట్లలో పార్టీ యంత్రాంగం నిమగ్నమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ప్లీనరీ బాధ్యతలను అప్పగించారు. -రేపే ప్లీనరీ.. నాలుగు వేలమంది ప్రతినిధులకు ఆహ్వానం -టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుక తొలిసారి ఖమ్మంలో.. -హాజరుకానున్న సీఎం కేసీఆర్, -భారీగా ఏర్పాట్లు చేసిన మంత్రి తుమ్మల -చెరుకూరి గార్డెన్స్‌లో ప్లీనరీ, డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ

Khamma-TRS-Party-Plenary

ఒకవైపు పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీచేస్తున్నప్పటికీ, అటు ప్రచారంతోపాటు, ఇటు ప్లీనరీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. పార్టీశ్రేణులకు ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పజెప్పి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ పుట్టిన 15 ఏండ్లకు ఖమ్మం జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీని పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఖమ్మం నగరమంతా భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. అడుగడుగునా సీఎం, మంత్రుల ఫ్లెక్సీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల పెయింటింగ్స్‌ను గోడలపై వేయించి నగరాన్ని గులాబీమయంగా మార్చారు.

నాలుగువేల మందికే అనుమతి ఖమ్మం నగరం శివారు చెరుకూరి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించే ప్లీనరీ కోసం రెండువేల చదరపు మీటర్ల ప్రాంగణాన్ని నిర్మించారు. లోపల సీఎం కేసీఆర్, మంత్రివర్గం, ఇతర అతిథులంతా కూర్చునేలా విశాలమైన వేదిక తయారుచేశారు. మధ్యమధ్యలో టీ, కాఫీ, మజ్జిగ, శీతల పానీయాలు, స్నాక్స్, జావ, పకోడి, గారెలు వంటి అల్పాహారాన్ని అందించే నిమిత్తం వలంటీర్లను నియమించారు. ప్రతినిధులతోపాటు, వలంటీర్స్, మీడియా ఎవరైనా సరే పాస్‌లు ఉన్నవారినే లోపలికి పంపించనున్నారు. ప్లీనరీ ప్రతినిధుల వివరాల ఎన్‌రోల్ నిమిత్తం జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం పది జిల్లాలకు పది కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీకి కార్యకర్తలంతా రావొచ్చనే భావనలో ఉన్నారని, కేవలం నాలుగు వేల మంది ప్రతినిధులకే ప్లీనరీకి అనుమతి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. అతిథులకు కూల్ సమ్మర్! ప్రస్తుతం రాష్ట్రం అగ్నిగుండలా మారి పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైనే నమోదవుతున్న నేపథ్యంలో ప్లీనరీ ప్రాంగణాన్ని చల్లగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 150 టన్నుల ఏసీలు, 60 జంబోకూలర్స్‌తోపాటు జైన్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ కంపెనీ సహకారంతో ఎయిర్ మిక్స్‌తో వాటర్ స్ప్రే యంత్రాలను అమర్చుతున్నారు. అవి నిరంతరం పనిచేస్తూ అతిథులపై మంచు తుంపరల మాదిరిగా నీటిని కురిపిస్తూ ఎండవేడి నుంచి కాపాడనున్నాయి. ప్లీనరీలో 15 తీర్మానాలు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ అధికారం దక్కించుకుని ఉద్యమనేత సీఎం కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్లీనరీలో చర్చజరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 15 అంశాలను ఎజెండాలో చేర్చినట్లు సమాచారం. 1) సంక్షేమం 2) మేజర్ ఇరిగేషన్ 3) మిషన్ కాకతీయ 4) మిషన్ భగీరథ, 5) డబుల్‌బెడ్‌రూం పథకం 6)వ్యవసాయం, 7) విశ్వనగరం హైదరాబాద్, పట్టణాభివృద్ధి 8)విద్యుత్, 9) కేజీ టు పీజీ విద్య, 10) కృష్ణా పుష్కరాలు 11) శాంతిభద్రతల పరిరక్షణ, పేకాట, గుడుంబా నిర్మూలన, 12) విభజనచట్టం హామీలు, కేంద్రప్రభుత్వ వైఖరి, 13) రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి, నీటి ఎద్దడి నివారణ, 14) తెలంగాణకు హరితహారం, 15) పారిశ్రామిక విధానం- ఐటీ పాలసీ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.