Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీ సంరంభం

-ప్రగతి ప్రాంగణంలో నేడే టీఆర్‌ఎస్ ప్లీనరీ -నాలుగేండ్ల పాలన ప్రగతిపై నివేదన.. -కేసీఆర్ ప్రసంగంపైనే యావత్ దేశం దృష్టి -దేశ రాజకీయాలకు మార్గదర్శనం చేయనున్న ప్లీనరీ -ప్లీనరీకి ముస్తాబైన ప్రగతి ప్రాంగణం -హాజరుకానున్న 15 వేల మంది ప్రతినిధులు -9 ఎకరాల్లో సెంట్రల్ ఏసీ హాల్ -ఎనభై ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు -రుచికరమైన వంటకాల కోసం ఎనిమిది భోజనశాలలు -సేవలందించేందుకు 1500 మంది వలంటీర్లు సిద్ధం

తెలంగాణ.. నాలుగక్షరాలు నాలుగు వేదాలుగా దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న సందర్భమిది. ఆసేతు హిమాచలం ప్రణవనాదంలా పల్లవిస్తున్న పదమిది. నాలుగేండ్ల క్రితం వరకూ అస్తిత్వమే ఎరుగని నేల.. అనూహ్యం.. అనితరసాధ్యం.. అసాధారణమైన ప్రగతి బావుటా ఎగురవేసింది. ఇదెలా సాధ్యమైంది? అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.. జవాబు కోసం ప్రతి రాష్ట్రం నుంచి తండోపతండాలుగా తరలి వస్తున్న అధికారులు.. కేంద్రం నుంచి పరుగులు పెడుతున్న అధికారులు.. ఈ అభివృద్ధిని చూడటానికి రెండు కండ్లు చాలని పరిస్థితి. అందరికీ ఆశ్చర్యమే. కులాలు లేవు.. మతాలు లేవు.. వర్ణాలు లేవు.. పట్నం లేదు.. పల్లె లేదు.. అన్ని రంగాలు.. అన్ని జిల్లాల్ల్లో అదే వేగం.. అదే దూకుడు.. గడ్డమీదకు నీళ్లు రావన్నోళ్లు ఇప్పుడెట్లొస్తున్నయో చూసి ముక్కున వేలేసుకొంటున్నరు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం మాటా.. తెలంగాణ బాటగా మారింది. ప్రతి ఒక్క పథకం.. ప్రతి ఒక్క కార్యక్రమం.. ప్రతి ఒక్క నిర్ణయం.. ఏదైనా సరే.. తెలంగాణయే ప్రతి రాష్ట్రానికి రోల్ మోడల్ అయింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు కేసీఆర్. అన్నీ తానే అయి.. అందరిలో ఆవరించి.. తెలంగాణను ఆవాహనం చేసుకొని ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపాడు. పదమూడేండ్లపాటు పల్లేరుకాయల మీద నడిచినవాడు.. తన ప్రజల పాదాలకింద మల్లెపూలు పరిచాడు. ఇప్పుడు యావత్ దేశం ఆయన అడుగులో అడుగు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నది. ఆయన మార్గంలో నడిచేందుకు సంసిద్ధమైంది. ఇవాళ జరుగుతున్న టీఆర్‌ఎస్ గులాబీ సంరంభంలో ఆయన మాటల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది.

గులాబీ సంరంభానికి అంతా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వ హణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల నుంచి ఎన్నారై ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నారు. ప్లీనరీ వేదిక ప్రగతి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని తొమ్మిదెకరాల ప్రాంగణాన్ని పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ హాల్‌గా మార్చారు. ప్లీనరీకి వచ్చే వాహనాల కోసం 80 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటుచేశారు.

వేదికపై డిజిటల్ స్క్రీన్.. ప్లీనరీ వేదిక, ప్రాంగణం పూర్తి డిజిటల్‌గా మారింది. వేదిక వెనుకవైపు ఫ్లెక్సీకాకుండా డిజిటల్ స్క్రీన్‌ను అమర్చారు. ప్రాంగణానికి ఇరువైపులా పదికిపైగా ఎల్‌ఈడీ స్క్రీన్లు అమర్చారు. ప్రాంగణంలో 9 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలకు వేర్వేరుగా సీట్లు కేటాయించారు. శుక్రవారం రోజున ప్లీనరీ నిర్వహిస్తుండటంతో సభ ప్రాంగణంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి పార్టీ నాయకులకు వాకీటాకీలను కూడా అందించారు. వేదిక నిర్వహణను కమిటీ సభ్యులు టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శంభీపూర్ రాజు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, కర్నె ప్రభాకర్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీని సామాజిక మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

రుచిమైన వంటకాలు.. ప్రతినిధులకు రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డించనున్నారు. 8 చోట్ల ప్రత్యేకంగా భోజనశాలలు ఏర్పాటుచేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో వంటశాల వద్ద ఏర్పాట్లు జరిగాయి. 18 వేల మందికి సరిపడా భోజనాలు సిద్ధం చేయనున్నారు. 500 మందిని వంటల కోసం వినియోగిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ హాళ్లు ఉన్నాయి. మీడియా ప్రతినిధులు, పోలీసులకు కూడా పత్యేకంగా డైనింగ్ హాల్స్ ఏర్పాటుచేశారు. వేసవిదృష్ట్యా లక్ష మజ్జిగ ప్యాకెట్లు, అంబలి, చల్లటి మంచినీటిని అందుబాటులో ఉంచారు. ఎండవేడిమి వల్ల ప్రతినిధులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముందు జాగ్రత్తగా మల్లారెడ్డి నారాయణ హృదయాలయ దవాఖాన ఆధ్వర్యంలో ప్లీనరీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు.

వలంటీర్ల సేవలు ప్లీనరీలో పార్టీ ప్రతినిధులకు దాదాపు 1500 మంది వలంటర్లు సేవలందించనున్నారు. టీఆర్‌ఎస్ విద్యార్ధి, యువజన విభాగాల నుంచి వీరిని ఎంపికచేశారు. వలంటీర్లు ప్రాంగణంతోపాటు ప్రతినిధుల నమోదు, భోజనశాల వద్ద సేవలందిస్తారు. వలంటీర్లకు రెండురోజులపాటు శిక్షణ ఇచ్చారు.

రాష్ట్ర అర్చక సమాఖ్య సుదర్శన, మహారుద్ర హోమం టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ విజయవంతం కావాలని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ సారథ్యంలో సుదర్శనహోమం, మహారుద్ర హోమం నిర్వహించారు. కూకట్‌పల్లిలోని రామలింగేశ్వర ఆలయంలో గురువారం ఈ హోమాలు సీఎం కేసీఆర్ గోత్రనామాలతో వందలసంఖ్యలో రుత్విక్కులు జరిపారు. 14 ఏండ్లపాటు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగేండ్లుగా తన పాలనతో దేశంలోనే పేరుప్రతిష్టలు సంపాదించిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లా లని భగవంతుడిని ప్రార్థిస్తూ హోమాలు, జపాలు నిర్వహించామని వెల్లడించారు.

నగరం గులాబీవర్ణ శోభితం ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలతో హైదరాబాద్ నగరం గులాబీ వర్ణ శోభితంగా మారింది. నాగోల్ నుంచి హైటెక్‌సిటీ, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న మెట్రో పిల్లర్లు గులాబీ శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతోపాటు, ప్రభుత్వ పథకాలతో నినాదాలతో మెట్రో పిల్లర్లకు అమర్చిన హోర్డింగ్‌లు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వపథకాలను వివరిస్తూ, వాటికి నినాదాలను జోడిస్తూ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హోర్డింగ్‌లను ఏర్పాటుచేశారు. అలంకరణ కమిటీ బాధ్యులు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ సహాయకార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ను గులాబీమయంగా తీర్చిదిద్దారు. ప్లీనరీ ప్రాంగణం, పరిసరప్రాంతాల్లో కేసీఆర్ నిలువెత్తు కటౌట్లను ఏర్పాటుచేశారు. ప్రగతి ప్రాంగణానికి వచ్చే మార్గాల్లో స్వాగత తోరణాలను, ప్రత్యేకమైన అలంకరణలు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.