-అన్ని కార్పొరేషన్లలోనూ హవా.. మూడింటికి మూడూ కైవసం -మున్సిపాలిటీల పదవుల్లోనూ తిరుగులేని ఆధిక్యం.. పట్టణ పాలక మండళ్ల ఎన్నికల్లో కారు జోరు -టీఆర్‌ఎస్ జెండా రెపరెపలు.. సంబురాల్లో పార్టీ శ్రేణులు.. -నేడు ఎంపీపీ, జప్పీపీ పాలక మండళ్ల ఎన్నికలు కార్పొరేషన్, మున్సిపల్ పాలక మండళ్ల మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగిరేసింది. అంతటా కారు జోరు సాగింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లను టీఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలకు దక్కించుకొని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది.

అంతటా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలలో మునిగితేలారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా ముందు జరుగడంతో కాంగ్రెస్, టీడీపీలకు కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లు, 52 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలక మండళ్లకు గురువారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించిన అధికారులు సాయంత్రం మూడు కార్పొరేషన్లు, 50 మున్సిపాలిటీల ఫలితాలను వెల్లడించారు.
కోరం లేకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీల ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్ – 22, కాంగ్రెస్ – 20, టీడీపీ – 4, బీజేపీ – 3, ఎంఐఎం – 1 స్థానాలను దక్కించుకున్నాయి. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను నిర్వహించిన అధికారులు ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు.
కార్పొరేషన్లతోపాటు పురపాలక సంఘాల్లో కారు జోరు సాగింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ అత్యధిక చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక పదవులను దక్కించుకొంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ ఐదింటిని సొంతం చేసుకుంది. ఎంఐఎం ఒకచోట గెలుపొందింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 5 పురపాలక సంఘాల్లో టీడీపీ-2, కాంగ్రెస్-2, టీఆర్‌ఎస్-1 చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
మెదక్ జిల్లాలో 6 పురపాలక సంఘాలకుగాను టీఆర్‌ఎస్ నాలుగుచోట్ల, కాంగ్రెస్ రెండుచోట్ల గెలుపొందాయి. నిజామాబాద్‌లోని మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్-2, కాంగ్రెస్ -1 కైవసం చేసుకున్నాయి. వరంగల్‌లోని 6 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ 4చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ రెండింటిని దక్కించుకుంది. ఖమ్మం జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ మూడు, టీడీపీ ఒకచోట చైర్మన్ స్థానాలను దక్కించుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లతోపాటు టీఆర్‌ఎస్ మొత్తం 8 మున్సిపాలిటీలలో ఆరింటిపై విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కోచోట గెలుపొందాయి. నేడు మండల పరిషత్, రేపు జెడ్పీలకు.. రాష్ట్రంలోని 396 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. మొత్తం 443 ఎంపీపీ స్థానాలు ఉండగా 441 మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఖమ్మం జిల్లాలోని 46 మండలాలతోపాటు వరంగల్ జిల్లాలోని మరో మండల పరిషత్‌కు కోర్టు వివాదంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. దీంతో 396 మండల పరిషత్‌లకు మాత్రమే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కో-ఆప్షన్ మెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా శనివారం రాష్ట్రంలోని 8 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగనుంది. ఖమ్మం జిల్లా పరిషత్ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదాపడింది.