-50 వేల మందితో నేడు బహిరంగ సభ -హయగ్రీవాచారిగ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు -అభ్యర్థి దయాకర్‌తో కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ -సభకు హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు -ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం కడియం

శ్రేణులు సిద్ధమయ్యాయి. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బుధవారంనాడు నగరంలో మహార్యాలీ, భారీ బహిరంగసభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో 50వేలమందితో సభ నిర్వహించడం ద్వారా బలమైన సంకేతాలిచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరుకానున్న ఈ సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పరిశీలించారు. ప్రతీ నియోజకవర్గం నుంచి జనసమీకరణ చేసే పనిలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు నిమగ్నమయ్యారు. బహిరంగసభ అనంతరం అభ్యర్థితో కలిసి కార్యకర్తలు కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన చేపట్టనున్నారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన దయాకర్ లాంఛనంగా మరోమారు నామినేషన్ సమర్పించనున్నారు.
వరంగల్ లోక్‌సభ స్థానానికి బుధవారం తమ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ, మహా ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. బహిరంగ సభ కోసం హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారిగ్రౌండ్‌లో వేదిక నిర్మించింది. సభకు తరలివచ్చే జనం కోసం గ్రౌండ్‌లో వేదిక ముందు షామియానలు ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, అభ్యర్థి పసునూరి దయాకర్‌తో కలిసి సభా స్థలిని సందర్శించారు. సభ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 21వ తేదీన జరిగే ఉప ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ అధిష్ఠానం తమ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే.
అధికార పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో దిగిన దయాకర్ వరంగల్ లోక్‌సభ స్థానానికి మంచి రోజు కావటం వల్ల సోమవారం తన నామినేషన్ తొలి సెట్ దాఖలు చేశారు. బుధవారం తమ పార్టీ శ్రేణులతో ఆయన ర్యాలీగా వెళ్లి మరో నామినేషన్ సెట్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ బుధవారం హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించింది. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్ నిర్వహించే తొలి సభ కానుంది ఇది. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. యాభై వేల మందితో సభ నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ఏడు వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేసే పనిలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు నిమగ్నమయ్యారు.
గ్రామాల నుంచి జనం సభకు చేరుకోవటానికి ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల నేతృత్వంలో వాహనాలు సమకూర్చటం జరిగింది. సభ నిర్వహణ కోసం హయగ్రీవాచారిగ్రౌండ్‌లో వేదిక, షామియాన, కుర్చీలను టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హయగ్రీవాచారిగ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ ప్రారంభం కాగలదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు వెల్లడించారు.
సభా స్థలి పరిశీలన బహిరంగ సభ జరిగే స్థలిని మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, అభ్యర్థి పసునూరి దయాకర్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. వీరి వెంట పార్టీ ముఖ్య నేతలు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, నన్నపునేని నరేందర్, భరత్‌కుమార్‌రెడ్డి, జన్ను జకార్య, రాజభద్రయ్య, వాసుదేవరెడ్డి, జోరిక రమేశ్, యాకూబ్‌రెడ్డి, సారంగపాణి, సీహెచ్ సదానందం, రాజేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి, పసునూరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ యాభై వేల మందితో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభ అనంతరం ఇక్కడి నుంచి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్ భారీ మెజారిటీతో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమించిన ఏడుగురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు బహిరంగ సభ, ర్యాలీలో పాల్గొంటారని డిప్యూటీ సీఎం వెల్లడించారు.