Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీదే విజయం

-మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు
-మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకోబోతున్నాం
-ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్నాం
-ఎంఐఎంతో గతంలో పొత్తులేదు.. ఇప్పుడూ లేదు
-మున్సిపోల్స్‌ ఫలితాలు నా పనితీరుపై తీర్పు
-తాగునీరు, కరంటుసహా అనేక సమస్యలు పరిష్కరించాం
-ఒక్కో డబుల్‌బెడ్రూం ఇల్లు 12 ఇందిరమ్మ ఇండ్లతో సమానం
-టీఎస్‌ బీపాస్‌ ద్వారా 21 రోజుల్లో ఇంటి నిర్మాణాలకు అనుమతి
-ఇక పురపాలన.. పరిపాలనపైనే దృష్టి
-‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మంత్రి కే తారకరామారావు

రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి పురప్రజలు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అన్నివార్డులు, డివిజన్లలో పోటీచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలకు దాదాపు 1200 వార్డుల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని తెలిపారు. ఎంఐఎంతో ఏ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టంచేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి అనేకచర్యలు చేపట్టారని.. మున్సిపాలిటీల్లో గుణాత్మక మార్పుకోసమే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, మున్సిపల్‌శాఖమంత్రిగా మున్సిపల్‌ ఎన్నికలు తన పనితీరుకు నిదర్శనంగానే భావిస్తున్నానని చెప్పారు. మున్సిపోల్స్‌ ముగిశాక ఇక పురపాలన, పరిపాలనపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కేటీఆర్‌ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ అంశాలపై కేటీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కుమ్మక్కు
టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఒకరితో ఒకరం పోటీపడుతున్నామంటూ ప్రకటనలు ఇస్తారు.. ఆరోపణలు చేసుకుంటారు.. ప్రజలను గందరగోళపరుస్తారు. వాస్తవంగా కిందిస్థాయిలో రెండుపార్టీలూ అవగాహనలో ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా దీనిని పూర్తిస్థాయిలో గమనించలేకపోయాం. నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో అంతర్గతంగా అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నారు. జగిత్యాలలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50వేల ఓట్లు వచ్చాయి.. కానీ మూడునెలల్లోనే జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి 10 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన ఓట్లన్నింటినీ బీజేపీకే వేయించారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదేరకమైన అవగాహనతో ఉన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లతోపాటు, నిర్మల్‌, గద్వాల, నారాయణపేట, వేములవాడ తదితరచోట్ల అపవిత్రపొత్తుకు తెరలేపుతున్నారు. విజ్ఞులైన ప్రజలు వారి అపవిత్రమైన కలయికను తిరస్కరిస్తారనే విశ్వాసం మాకున్నది.

టీఆర్‌ఎస్‌దే ఏకపక్ష విజయం
తెలంగాణ స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలి మున్సిపల్‌ ఎన్నికలు ఇవి. షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే ఎన్నికలు జరుగాల్సి ఉన్నా.. ఓటమి భయంతో కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లడంతో ఆలస్యమయ్యాయి. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీతోసహా 68 మున్సిపాలిటీలు ఉండగా.. అధికార వికేంద్రీకరణలో భాగంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వాటిని 141కు పెంచుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, పంచాయతీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలను ఏర్పాటుచేసుకున్నాం. తండాలను పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేసుకున్నాం. మున్సిపల్‌ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని, టీఆర్‌ఎస్‌ను ఏకపక్షంగా గెలిపించాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 3,112 వార్డులకు ఎన్నికలు జరుగుతుంటే టీఆర్‌ఎస్‌ తరఫున లెక్కకు మించి అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రత్యర్థి పార్టీలు, మాకు ప్రత్యామ్నాయమని చెప్పుకొనే కాంగ్రెస్‌, బీజేపీలకు 1200 స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకోబోతున్నామనే విశ్వాసం ఉన్నది. సర్వేలు.. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం.. అభ్యర్థులతో మాట్లాడినప్పుడు వెల్లడైన విషయాలు అన్నింటినీ చూసినప్పుడు ప్రచారంలో, ప్రజల ఆదరణలో టీఆర్‌ఎస్‌.. ప్రత్యర్థులు అందుకోలేనంత ముందున్నది.

ప్రజల మౌలిక సమస్యలు తీర్చాం
ప్రజలు ప్రతినిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరించింది. మంచినీటి కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకు రావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ మిషన్‌భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. దీనిద్వారా గ్రామాల్లో 95%, పట్టణాల్లో 90% తాగునీటి సమస్య పరిష్కారమయింది. కాంగ్రెస్‌ పాలనలో మహబూబ్‌నగర్‌లో 14 రోజులకోసారి తాగునీళ్లు వచ్చేవి. నిజాంపేటలోనూ అదేరకమైన పరిస్థితి ఉండే ది. హైదరాబాద్‌సహా అనేక మున్సిపాలిటీల్లో ఎండాకాలం వచ్చిందంటేచాలు వాటర్‌ వర్క్స్‌, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ఖాళీబిందెలతో ధర్నాలు, ఆందోళనలు నిత్యం సాగేవి. ఒక్కోకుటుంబం వాటర్‌ ట్యాంకర్ల కోసం వేల రూపాయలు ఖర్చుచేసేది. కానీ, అవి ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఆడబిడ్డలకు కష్టాలు తప్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. పట్టణాల్లో ప్రజలపై, వ్యాపారాలపై కరంటు కోతలు తీవ్ర ప్రభావం చూపేవి. ఉపాధి అవకాశాలు దెబ్బతినేవి. ప్రస్తుతం అన్నిరంగాలకు

24 గంటలు నిరంతరం విద్యుత్‌ సరఫరాచేస్తున్నాం. మున్సిపాలిటీలకు కరంటు చార్జీల భారం కూడా తగ్గించాం. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎల్‌ఈడీ బల్బులు మార్చాం. దీంతో 35%-40% కరంటు చార్జీలు తగ్గాయి. గతంలో హూస్సేస్‌సాగర్‌ మీద మాత్రమే ట్యాంక్‌బండ్‌ ఉండేది. కానీ ఇప్పుడు 90 పట్టణాల్లో మినీట్యాంక్‌బండ్‌లు ఏర్పాటుచేశాం. జీవో 58, 59 ద్వారా హైదరాబాద్‌తోసహా రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పేదల ఇండ్లను రెగ్యులరైజ్‌ చేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక అంశాలున్నాయి. ప్రతిపట్టణంలోనూ స్పష్టమైన అభివృద్ధి కనపడుతున్నది. ఇది ప్రతిపక్షాలకు కన్పించకపోవచ్చు కానీ.. ప్రజలు గమనిస్తున్నారు.

శ్వేతపత్రం ప్రకటించండి
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీలకు విడుదలచేసిన నిధులపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయాలి. కాంగ్రెస్‌ పదేండ్లలో ఇచ్చిన నిధులకు గత ఐదేండ్లలో పదిరెట్లు ఎక్కువగా విడుదలచేశామని, దానిని చూపిస్తానని సవాల్‌చేసి పక్షంరోజులయినా ఇంతవరకు వారినుంచి స్పందనలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌యూఎఫ్‌ఐడీసీ)ఏర్పాటుచేసి మున్సిపాలిటీలకు రూ.2,500 కోట్లు మంజూరుచేశాం. కాంగ్రెస్‌ పార్టీ విజన్‌ డాక్యుమెంట్‌లో చెప్పిన అంశాలను ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఐదురూపాయలకు అన్నపూర్ణ భోజనం పథకం హైదరాబాద్‌తోసహా 20 మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమలుచేస్తున్నాం. సాక్షాత్తూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత జానారెడ్డి రూ.5 భోజనం తెప్పించుకొని తిని మెచ్చుకున్నారు.

ఇప్పటికే 90కిపైగా మినీట్యాంక్‌బండ్‌ల పనులు జరుగుతున్నాయి. కొన్ని పూర్తయ్యాయి కూడా. కాంగ్రెస్‌ డాక్యుమెంట్‌ చూస్తుంటే.. అధ్యయనం చేసి తయారుచేసినట్టు లేదు.. హైదరాబాద్‌లో కూర్చుని ప్రజలను మభ్యపెట్టడానికి రూపొందించినట్టుగా ఉన్నది. ‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే..’ అంటూ కాంగ్రెస్‌ చెప్పడం హస్యాస్పదంగా ఉన్నది. ఇంకా నాలుగేండ్ల వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికల్లేవు. ఆ తర్వాత వారు అనుకున్నట్టు అధికారంలోకి వచ్చినా.. అప్పటికే మున్సిపాలిటీ పాలకవర్గాలకాలం నాలుగేండ్లు ముగిసిపోతుంది. మరి డాక్యుమెంట్‌లో పేర్కొన్న అంశాలను ఏవిధంగా అమలుచేస్తారు? మమ్ముల్ని శాసించేది, దిశానిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు మాత్రమే. నరేంద్రమోదీనో, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీనో మా బాస్‌లు కాదు. మా బాస్‌లు ఢిల్లీలో కాదు గల్లీలో ఉన్నారు.

నా పనితీరుపై ఫలితాలు తీర్పే
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మున్సిపల్‌శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. పట్టణాల్లో ఉన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో జరుగబోయే మార్పులు, చేర్పులకు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నా పనితీరుకు తీర్పుగానే భావిస్తాను. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూడా ఎన్నికలను సమన్వయపరుస్తున్నాను.. కాబట్టి పార్టీపరంగా పనితీరుకు, నామీద ప్రజలు ఇవ్వబోయే ఆలోచనలకు తీర్పుగానే ఈ ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత వహిస్తాను.

వారికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ
బీజేపీ నాయకులకు మాటలు ఎక్కువ.. పనితక్కువ. కేంద్రప్రభుత్వం అమృత్‌ పథకం కింద తెలంగాణలోని పన్నెండు మున్సిపాలిటీలు, స్మార్ట్‌ సిటీల కింద రెండుపట్టణాలను ఎంపికచేసింది. రాజ్యాంగబద్ధంగా కేంద్రంనుంచి వచ్చే నిధులు తప్ప వీటికి ఒక్కపైసా ఎక్కువ ఇవ్వలేదు. కొత్తరాష్ట్రమైన తెలంగాణకు అదనంగా నిధులు మంజూరుచేయలేదు. బీజేపీని చూసి కేటీఆర్‌ భయపడుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అంటున్నారు.. అభ్యర్థుల్లేనివారిని చూసికూడా ఎవరైనా భయపడుతారా? 104 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయినందుకు భయపడాలా? హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో కారుగుర్తును పోలిన అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా రానందుకు భయపడలా? దేన్ని చూసి భయపడాలి? ఐదేండ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ చార్జిషీట్‌ వేస్తే.. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దేశాన్ని నడిపిన కాంగ్రెస్‌, బీజేపీలపై దేశ ప్రజలు ఎన్ని చార్జిషీట్లు వేయాలి? ఎన్నిరకాల విమర్శలు చేయాలి? లక్ష్మణ్‌ నాకంటే వయస్సులో, అనుభవంలో పెద్దవారు కాబట్టి ఆ విమర్శలు, వ్యక్తిగత దూషణలను నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను.

వారికి అభ్యర్థుల్లేరు.. ఆదరణాలేదు
కాంగ్రెస్‌, బీజేపీ బీ ఫాం ఇస్తామంటే కూడా తీసుకునేవారులేరు. 1200 చోట్ల ఆపార్టీలకు అభ్యర్థుల్లేరు. వారు పోటీచేయడానికి అభ్యర్థులు లేరు. నినాదం లేదు. ప్రజల ఆదరణ అంతకంటే లేదు. టీఆర్‌ఎస్‌కు రెబల్స్‌ పెద్దసమస్య కాదు. గెలుస్తామనే విశ్వాసం ఉన్నది కాబట్టే పోటీకూడా ఎక్కువగా ఉన్నది. కార్పొ రేషన్‌లో కార్పొరేటర్లు ఏకగ్రీవమయ్యేవరకు పరిస్థితి వచ్చింది. పరకాల మున్సిపాలిటీ ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వచ్చింది. అలాగే, చెన్నూరు కూడా వచ్చినట్టే. పోలింగ్‌ కాకముందే టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి రెండు మున్సిపాలిటీలు రావడంతో ప్రత్యర్థిపార్టీలు బేజారవుతున్నాయి.

పరిషత్‌ విజయం అసాధారణం
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఏ ఎన్నికయినా ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారు. దేశంలో ఏపార్టీ కూడా సాధించని విజయాన్ని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో సాధించాం. ఎవరి మద్దతు లేకుండానే అన్ని జెడ్పీలను కైవసం చేసుకోవడం అసాధారణం. ఎంపీటీసీ సభ్యులనూ 90 శాతానికిపైగా గెలుచుకున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు అనుకుంటే 9 స్థానాల్లో గెలిచాం. అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టుగా బీజేపీకి నాలుగు, కాంగ్రెస్‌కు మూడుసీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ గెలిచిన మూడింట్లో రెండుస్థానాల్లో వెంట్రుకవాసి తేడాతో ఓడిపోయాం. మల్కాజిగిరిలో 30 లక్షల ఓట్లలో 5వేల ఓట్ల తేడాతో, 15 లక్షల ఓట్లు ఉన్న భువనగిరిలో మూడువేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. వీటిని నేనైతే ఓటమిగా భావించను. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచాం. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ ప్రచారం చేయకపోయినా, ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా 43 వేల మెజార్టీతో గెలిచాం.

మంత్రిగా సంతృప్తినిచ్చినవి
మున్సిపాలిటీల్లో యూనిఫైడ్‌ సర్వీసురూల్స్‌ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఎక్కడి మున్సిపల్‌ ఉద్యోగి అయినా ఎక్కడికైనా బదిలీచేసే విధానాన్ని తీసుకువచ్చాం. జవాబుదారీతనం రావాలనే ఉద్దేశంతో ఈ సర్వీసు రూల్స్‌ తీసుకువచ్చాం. ఇది నాకు ఎక్కువ సంతృప్తి ఇచ్చిన అంశం. హైదరాబాద్‌ శివారులో 25 అర్బన్‌ లంగ్‌స్పేస్‌పార్కులను ప్రారంభిస్తున్నాం. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 250 ఎకరాల్లో మయూరి పార్క్‌ ఏర్పాటుచేశాం. భవిష్యత్‌లో పిల్లలు ఆక్సిజన్‌ కొనుక్కొనే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ప్రతి మున్సిపాలిటీలో పౌరసేవాకేంద్రాలను ఏర్పాటుచేశాం.

ఒక్కో ఇల్లు 12 ఇందిరమ్మ ఇండ్లతో సమానం
దేశంలో 560 చదరపు అడుగులతో రెండు బెడ్రూంలతో బ్రహ్మాండంగా నిర్మిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. పట్టణప్రాంతాల్లో 1.50 లక్షల ఇండ్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. వీటిపై రూ.18 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. పేదవారు ఒక్కపైసా కట్టాల్సిన అవసరం లేకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. దేశంలో ఇతర రాష్ర్టాల గృహనిర్మాణ బడ్జెట్‌ చూడండి.. తెలంగాణ బడ్జెట్‌ కంటే తక్కువనే. డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం దాదాపుగా చివరిదశలో ఉన్నాయి. ఆర్థికమాంద్యం వల్ల కొంత ఆలస్యమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు యూనిట్‌ ఖర్చు రూ.70 వేలు, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడుతున్న ఇండ్లకు గ్రామీణప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణప్రాంతాల్లో రూ.5.40 లక్షలు, జీహెచ్‌ఎంసీలో రూ.8 లక్షలకు పైగా అవుతున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడుతున్న ఒక ఇల్లు గ్రామాల్లో ఏడు ఇందిరమ్మ ఇండ్లతో, జీహెచ్‌ఎంసీలో 12 ఇందిరమ్మ ఇండ్లతో సమానం.

ఎంఐఎంతో పొత్తు లేదు
ఎంఐఎం మాకు మిత్రపక్షమే. వారు రాష్ట్రప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. కానీ ఏ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి మేము పోటీచేయలేదు, పొత్తు పెట్టుకోలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీపై పోటీచేసి కొన్నిస్థానాల్లో ఓడించాం. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నివార్డుల్లో టీఆర్‌ఎస్‌ పోటీచేస్తున్నది. ఇక వారితో పొత్తు ఎక్కడున్నది? మాకు ఎంఐఎంతో ఎలాంటి అవగాహన లేదు. ఈ విషయంలో మమ్ములను నిందించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

పౌరులను మతకోణంలో చూడలేం
భారతదేశం సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం. మతప్రాతిపదికగా ప్రజలను విభజించడం సరికాదు. ఎన్నార్సీ అమలుపై దేశప్రజలకు ఉన్న అనుమానాలను, అపోహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. రాష్ట్రంలో వీటి అమలుపై తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారు. సీఏఏపై టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పార్లమెంట్‌లో స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. మేం సీఏఏను వ్యతిరేకించాం. టీఆర్‌ఎస్‌ విజన్‌ ఉన్నపార్టీ – బీజేపీ డివిజన్‌ పార్టీ. 2020-2030 దశాబ్దం తెలంగాణదే. భారతదేశంలోనే ఒక ఆదర్శ, అగ్రశేణి రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకోవాలి. కేసీఆర్‌ నాయకత్వంలోనే ఈ దశాబ్దంలో పురోగమించాలని కోరుకుంటున్నా.

కేసీఆర్‌ను మించిన హిందువు ఉన్నారా?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించిన హిందువు ఉన్నారా? ఆయన చేసినన్ని యాగాలు ఎవరైనా చేశారా? కేసీఆర్‌ సీఏఏను వ్యతిరేకించారు. మాకు రాజకీయంగా ఎవరూ శత్రువులు లేరు. రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే. కేసీఆర్‌ అసెంబ్లీలో ఇందిరాగాంధీ, రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన సందర్భం ఉన్నది. కాంగ్రెస్‌ ఏదైనా మంచి పనిచేస్తే అది చెప్పాం. చేయని దానిని చేయలేదని చెప్పాం.

గుణాత్మక మార్పు కోసమే మున్సిపల్‌చట్టం
ప్రజలకు సేవచేయడమంటే.. వేలు, వందల కోట్లు విడుదలచేయడం, ఖర్చుపెట్టడమే కాదు.. మంచివిధానాలు రూపకల్పన చేయాలనేది ఉద్దేశం. ఒక మంచిచట్టం ద్వారా గుణాత్మకమార్పు తీసుకరావాలనేది లక్ష్యం. తెలంగాణ ఏర్పాటయ్యాక మూడుముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చారు. ఇందులో ఒకటి టీఎస్‌ఐపాస్‌ ద్వారా నూతన పారిశ్రామికవిధానం. రెండోది పంచాయతీరాజ్‌ చట్టం. ఈ రెండు చట్టాలు విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రజలే కేంద్రీకృతంగా చట్టాన్ని రూపొందించారు. టీఎస్‌ఐపాస్‌లో తీసుకువచ్చిన సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ స్ఫూర్తితో ఇంటి నిర్మాణ అనుమతుల్లో ఇక్కడ టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని తీసుకువచ్చాం. 75 గజాల స్థలంలో ఇల్లు నిర్మించాలనుకుంటే మున్సిపాలిటీ వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. చట్టంలో పాలకవర్గాలు, అధికారులమీద అపారమైన బాధ్యతలు ఉన్నాయి.

పంచాయతీలకు నెలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నాం.. అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.216 కోట్లు విడుదలచేస్తాం. ఒక మున్సిపల్‌ కౌన్సిలర్‌గా మంచినీటి సరఫరా, పారిశుద్ద్యం, పచ్చదనం పరిశుభ్రం, వీధిదీపాలు, పౌరసేవలు అందుతున్నాయా లేదా చూసుకోవాలి. మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు బాధ్యతలను విస్మరిస్తే తొలగించే అధికారం కలెక్టర్‌ ధృవీకరణతో కొత్తచట్టం ద్వారా ప్రభుత్వానికి ఉంటుంది. దీనిని రాజకీయంగా దుర్వినియోగం చేయబోమని ప్రజలకు మాట ఇస్తున్నాం. వారు టీఆర్‌ఎస్‌కు చెందిన చైర్మన్‌ అయినా చర్యలు తీసుకుంటాం. దశాబ్దాలుగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటానికి కారణం జవాబుదారీతనంలేకపోవడమే. ఒకసారి పదవిలోకి వచ్చాక ఐదేండ్లపాటు ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఉండటమే కారణం.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పార్టీ
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పార్టీ వారధిగా ఉండాలి. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ప్రజలకు చేరవేసేది కార్యకర్తలే. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలు బాగా జరుగాలనేది ఆలోచన. ఇందులోభాగంగానే కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు మొదలుపెడుతాం. టీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది.

ఇక పురపాలన, పరిపాలనపైనే దృష్టి
రాబోయే నాలుగేండ్లు పురపాలన, పరిపాలన మీద దృష్టిపెడుతాం. మున్సిపల్‌చట్టాన్ని సమర్థంగా అమలుచేసి చూపించడమే ఈ ఏడాది అతిపెద్ద లక్ష్యం. కొత్త మున్సిపల్‌ చట్టం వల్ల భవననిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి అలసత్వం, అవినీతి లేకుండా పారదర్శకంగా 21 రోజుల్లో అనుమతులు ఇచ్చే విప్లవాత్మకమైన సంస్కరణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్రణాళికాబద్ధమైన పురోగతి, కొత్తచట్టం సమర్థంగా అమలుచేయడానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించండి.

మరో నాలుగేండ్ల వరకు ఎన్నికల్లేవు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా.. అప్పటికే మున్సిపాలిటీ పాలకవర్గాలకాలం నాలుగేండ్లు ముగిసిపోతుంది. మరి కాంగ్రెస్‌ ఎన్నికల డాక్యుమెంట్‌లో పేర్కొన్న అంశాలను ఏవిధంగా అమలుచేస్తుంది?
బీజేపీ నాయకులకు మాటలు ఎక్కువ.. పనితక్కువ. కొత్తరాష్ట్రమైన తెలంగాణకు కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేయలేదు. బీజేపీని చూసి కేటీఆర్‌ భయపడుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అంటున్నారు.. అభ్యర్థుల్లేనివారిని చూసికూడా ఎవరైనా భయపడుతారా?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.