Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాబీకి జనహారతి

టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వాల నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వాడవాడలా సభ్యత్వ నమోదుకు జనం భారీగా తరలివస్తుండటంతో జాతరను తలపిస్తున్నది. పలు జిల్లాల్లో ఇప్పటికే నిర్ణయించుకున్న లక్ష్యంలో 65 శాతానికి మించి పూర్తయ్యాయి. 20వ తేదీ వరకు గడువు ఉండటంతో ప్రజల నుంచి వస్తున్న స్పందనతో లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేయిస్తామని నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

-వాడవాడలా టీఆర్‌ఎస్ సభ్యత్వాల జోరు -పలు జిల్లాల్లో ఇప్పటికే 65శాతానికిపైగా పూర్తి -లక్ష్యం కంటే ఎక్కువే చేయిస్తామని నేతలు ధీమా -టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్న శ్రేణులు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న జనం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకున్నారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అందుకే సభ్యత్వ నమోదుకు ఏ పార్టీకి రానంత స్పందన టీఆర్‌ఎస్‌కు వస్తున్నదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని జనం నమ్ముతున్నారని చెబుతున్నారు.

Vinay Bhaskar

ఓరుగల్లులో 2.60 లక్షల సభ్యత్వాలు వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వాలు బుధవారం సాయంత్రం వరకు 2.6 లక్షలు నమోదయ్యాయి. ఇందులో 60 వేలు క్రియాశీల సభ్యత్వం కాగా సాధారణ సభ్యత్వం రెండు లక్షలకు చేరిందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. జిల్లాలో ఐదు లక్షలకు పైగా సభ్యత్వ నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నదన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కొనసాగుతున్నది.

మెదక్ జిల్లాలో65 శాతం పూర్తి మెదక్ జిల్లా పటాన్‌చెరులో బుధవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. సభ్యత్వ నమోదును జిల్లా ఇన్‌చార్జి శ్యామ్, ఆర్ సత్యనారాయణలు పర్యవేక్షిస్తున్నారు. సభ్యత్వ నమోదుపై మంత్రి హరీశ్‌రావు వారినుంచి సభ్యత్వ నమోదు వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 65 శాతం సభ్యత్వ నమోదు పూర్తయినట్లు జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పాలనకు ఆంధ్ర ప్రజలు కూడా ఫిదా అవుతున్నారని చెప్పారు. మురికి వాడలను తొలగించి క్లీన్ సిటీగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఉద్ఘాటించారు. గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సోమిరెడ్డి, ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్‌లో 3.6 లక్షల సభ్యత్వం పూర్తి గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వాలకు భారీ స్పందన లభిస్తున్నది. మూడు రోజుల వ్యవధిలో 3లక్షల సాధారణ, 60వేల క్రియాశీల సభ్యత్వం పూర్తి చేశారు. గురువారం నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత వేగవంతం కానున్నది. గత మూడు రోజుల్లో మంత్రులు మహమూద్‌అలీ, నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీ పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డిలతోపాటు గ్రేటర్ పార్టీ ఇన్‌చార్జిలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పురాణం సతీశ్‌కుమార్, గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు విస్తృతంగా పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలను పూర్తిచేశారు.

గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం పార్టీ సభ్యత్వం కోసం ప్రజలే స్వచ్ఛందంగా అడిగి తీసుకుంటున్నారు. అధిష్ఠానం గ్రేటర్‌లో 5లక్షల సాధారణ సభ్యత్వం, లక్షా 20వేల క్రియాశీల సభ్యత్వం టార్గెట్ విధించింది. కానీ ముందుగా స్థానిక నాయకత్వాలు పది లక్షల సభ్యత్వం పూర్తవుతుందనే ధీమాను వ్యక్తం చేసి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో సాధారణం 15లక్షలు, క్రియాశీల 4లక్షలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో జోరుగా సభ్యత్వాలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, దీంతో పార్టీ సభ్యత్వానికి భారీ స్పందన వస్తుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసే సభ్యత్వాలు పొందుతున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఇంధిరానగర్ కాలనీతోపాటు యాచారం మండల పరిధిలోని తక్కళ్లపల్లి, తక్కళ్లపల్లితండా, చింతపట్ల, తమ్మలోనిగూడ, గ్రామాల్లో టీఆర్‌ఎస్‌పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నేతలు ప్రారంభించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు బీ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నల్లగొండలో భారీ స్పందన నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి తొలి సభ్యత్వాన్ని రాష్ట్ర అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అందజేశారు. 60ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిది నెలల్లో చేసి చూపినందునే టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో లక్ష్యంకంటే నాలుగింతలు అదనంగా సభ్యత్వాలు నమోదు చేస్తామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. చిట్యాల మండలం పేరేపల్లిలో ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే వీరేశం, కేతేపల్లి, నకిరేకల్ మండలాల్లో ఎమ్మెల్యే వీరేశం, అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్ పాల్గొన్నారు. మిర్యాలగూడ, నల్లగొండ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడల్లోనూ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు పలుచోట్ల పార్టీ సభ్యత్వాలు అందజేశారు.

కరీంనగర్ జిల్లాలో 2లక్షలు దాటిన సభ్యత్వాలు కరీంనగర్ జిల్లాలో వారం రోజుల్లోనే సభ్యత్వం 2 లక్షలు దాటింది. బుధవారం నాటికి జిల్లాలో 2.50 లక్షల సభ్యత్వాలు పూర్తి అయ్యాయి. ఇందులో 65 వేల క్రియాశీలక సభ్యత్వాలు కూడా ఉన్నాయి. క్రీయాశీలక సభ్యత్వ పుస్తకాలు పూర్తిగా అయిపోవడంతో మరో 20వేలకు సరిపడేలా పంపాలని జిల్లా పార్టీ విజ్ఞప్తిచేసింది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ధర్మారంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి సిరిసిల్ల మండలంలో, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలంలో, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సెంటినరికాలనీలో, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందూరులో 80 శాతం పూర్తి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 80 శాతం మేర సభ్యత్వ నమోదు పూర్తికావచ్చింది. వీటిని ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో అప్‌లోడ్ చేసే పనికి శ్రీకారంచుట్టారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం మద్నూర్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జిల్లా సభ్యత్వ నమోదు పరిశీలకుడు రూప్‌సింగ్ సభ్యత్వాలు అందజేశారు. నిజామాబాద్ నగరంలో పలు డివిజన్లలో సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా పాల్గొన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 80 శాతం సభ్యత్వ నమోదు పూర్తికాగా.. నియోజకవర్గ ఇన్‌చార్జిలకు 50 శాతం మేర రశీదులు, సభ్యత్వ రుసుము మొత్తం అందిందని రూప్ సింగ్ తెలిపారు.

ఖమ్మంలో 50 శాతం పూర్తి ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరందుకుంది. బుధవారం సాయంత్రానికి జిల్లాలో దాదాపు 50శాతం సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ్యత్వ నమోదు రుసుం కింద దాదాపు రూ.15లక్షలు వచ్చాయని టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. సత్తుపల్లి, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న సభ్యత్వ నమోదును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, వైరాలో ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్, మధిరలో ఇన్‌చార్జి బొమ్మెర రామ్మూర్తి, అశ్వరావుపేటలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాకలో డాక్టర్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరుగుతున్నది. అన్ని నియోజకవర్గాల పరిధిలోని టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమాన్ని ఇన్‌చార్జిగా వచ్చిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యావతి రాథోడ్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

గులాబీ మయమవుతున్న పాలమూరు మహబూబ్‌నగర్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం వివిధ పార్టీల కార్యకర్తలు, యువకులు, మహిళలు, వివిధ రకాల పింఛన్‌దారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలో మొత్తం 4.20లక్షల మందిని పార్టీలో చేర్చుకోవడమే ధ్యేయంగా గులాబీపార్టీ నేతలు రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ నాయకులు ఆశించినదానికంటే అధిక స్పందన లభిస్తున్నది. సభ్యత్వ నమోదు జిల్లా ఇంచార్జి మార్కండేయ, టీఆర్‌ఎస్ జిల్లా మాజీ కన్వీనర్ విఠల్‌రావు ఆర్యా ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులను ప్రోత్సహిస్తూ గ్రామాల వారీగా సభ్యత్వ నమోదును సమీక్షిస్తున్నారు. బుధవారం నాటికి అన్ని నియోజకవర్గాల్లో కలిపి టార్గెట్‌లో 70శాతం మేరకు సభ్యత్వ నమోదు పూర్తయింది. ప్రతి నియోజకవర్గానికి 30 వేల సభ్యత్వాలు చేయించాలన్న టార్గెట్‌ను జడ్చర్ల టీఆర్‌ఎస్ పూర్తి చేసుకున్నప్పటికీ అదనంగా సభ్యత్వ నమోదు ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆదిలాబాద్‌లో 40 శాతం పూర్తి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 40 శాతం సభ్యత్వం పూర్తయింది. ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు తమ అనుచరులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో కలియదిరుగుతూ సభ్యత్వం చేయిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణులు సైతం ఉత్సాహంగా కదులుతున్నాయి. జిల్లా లక్ష్యం 3లక్షలు కాగా, ఇప్పటికే 40శాతం పూర్తయినట్లు నేతలు ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోనే 40 శాతం పూర్తయ్యిందని, తాము అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువే చేయిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆదిలాబాద్, మంచిర్యాల, కోటపల్లి, చెన్నూరు తదితర ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు నిర్వహించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.