Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గులాంగిరీ వద్దు

గెలువాల్సింది తెలంగాణవాదులే.. -తెలంగాణను దొంగల చేతిలో పెట్టొద్దనే ఎన్నికల్లో పోటీ.. ఆంధ్రోళ్ళతో పంచాయితీ తెగిపోలేదు.. -ఆలోచించి ఓటెయ్యాలి.. మన తలరాతను మనమే మార్చుకోవాలి -చంద్రబాబు, పవన్‌తో కలిసి మోడీ పంగనామాలు పెట్టాలని చూస్తున్నాడు – చిటికేస్తే పవన్ వెయ్యి తునుకలవుతడు.. కొన్ని రోజులాగితే తాట ఎవరు తీస్తారో తెలుస్తుంది – పరిగి, తాండూరు, సంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

KCR in Hyderabad Meetings 28-04-14

ఆయన ఎవరో సినిమా యాక్టరంట.. చిరంజీవి తమ్ముడంట.. ఆయన సినిమాలు నేను చూడలేదు. తెలంగాణలో వరంగల్ గడ్డ మీద నిలబడి నా తాట తీస్తానంటడా? తొందరలోనే తెలుస్తుంది. ఎవరి తాట ఎవరు తీసేది. నేను ఒక్క చిటికె కొడితే వెయ్యి తునుకలవుతడు. కేసీఆర్‌లాంటి నాపైనే చెలరేగి మాట్లాడితే.. మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. చిటికెన వేలంత లేని సినిమావాడు అలా మాట్లాడటం ఆంధ్రావాళ్ల అహంకారానికి నిదర్శనం. ఇలాంటి సొల్లుగాళ్ల మాటలు పడే కర్మ మనకెందుకు? – కేసీఆర్

పరిగి/తాండూరు/సంగారెడ్డి: ఇప్పుడు జరుగుతున్నవి ఆషామాషీ ఎన్నికలు కావు. మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశమిచ్చేవి. ఇంకా సీమాంధ్ర పాలకులకు గులాంగిరి చేద్దామా? వారికి సామంతులుగా ఉందామా? లేక స్వతంత్రులుగా ఉందామా? అన్నది ఆలోచించుకొని ఓటువేయాలి అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలువాల్సింది తెలంగాణవాదులా? లేక ద్రోహులా? మీరే తేల్చాలని అన్నారు. సన్నాసుల చేతిలో తెలంగాణను పెడితే ప్రయోజనం ఉండదన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలోని మినీ స్టేడియం, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, మెదక్ జిల్లా సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పక్కా సెక్యులర్ పార్టీ.. టీఆర్‌ఎస్ ద్వారానే ముస్లింల ప్రగతి సాధ్యమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సంస్కతిని గంగాజమున తెహజీబ్‌గా ఆనాడే మహాత్మాగాంధీ కొనియాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు వక్ఫ్ భూములను బడా నాయకులకు ధారాదత్తం చేశారని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను వాపస్ తీసుకుంటుందని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను నాలుగు నెలల్లోగా అమలు జరిగేలా చుస్తామన్నారు. ముస్లింల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణలో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి సహజీవనం సాగిస్తారని, తాను బతికి ఉన్నంతకాలం అలాగే కొనసాగేలా చూస్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరులో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ వారు ఆంధ్రోళ్ల తొత్తులుగా వ్యవహరించడం వల్లే పాలమూరు ఎత్తిపోతలకు నిధులు కేటాయించలేదన్నారు. ప్రాజెక్టుకు ఎవరు అడ్డం వస్తారో చూస్తానని ప్రకటించారు. పరిగి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి చేపడుతారని ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పరిగి అసెంబ్లీ అభ్యర్థి కొప్పుల హరీశ్వర్‌రెడ్డిలను గెలిపించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని ప్రజలకు సూచించారు.

తెలంగాణ తెచ్చిన కీర్తి వెయ్యి జన్మలకు చాలు! తెలంగాణ తెచ్చిన కీర్తి వెయ్యి జన్మలకు చాలనుకున్నా. అయితే కాంగ్రెస్‌లో కలువొద్దని తెలంగాణ సమాజం, ప్రతీ తెలంగాణవాది నుంచి ఒత్తిళ్లు రావడంతోపాటు.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఎన్నికల బరిలోకి దిగామని తెలిపారు. హక్కులు, వాటాలు అడిగితే సీమాంధ్రులు పరిహాసం చేస్తున్నారని చెప్పారు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆంధ్రాలో, తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తెలంగాణలో పనిచేయాలని అనడంలో తప్పేమైనా ఉందా అని ప్రశ్నించారు.

90 స్థానాల్లో గెలుస్తాం తెలంగాణలో 90 సీట్లలో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగరవేస్తుందని పలు సర్వేలు చాటుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారం టీఆర్‌ఎస్‌దేనని ఖాయమైనట్లేనని చెప్పారు. తెలంగాణలో తనను ఓడించేందుకు ఎందరో గాంధీలు తెలంగాణలో తిరుగుతున్నారని, వారెన్నీ సభల్లో పాల్గొన్నా చివరకు టీఆర్‌ఎస్సే అధికారం చేపడుతుందన్నారు. జూన్ 2 తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న రుణాలను రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతుందని హామీనిచ్చారు. బలహీనవర్గాలకు మంచి గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. రైతులకు వంద శాతం రుణ మాఫీ చేసి రైతన్నల కుటుంబాలకు అదుకుంటామన్నారు. లంబాడీ తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి ఆయా గ్రామాలకు నిధులు కేటాయిస్తామన్నారు. బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. తాండూరు, పరిగి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీచేస్తున్న పీ మహేందర్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సభలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, పీ మహేందర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నేతలు బైండ్ల విజయ్‌కుమార్, కరుణం పురుషోత్తంరావు, వీ రంగారావు, విజయాదేవి,సిద్రాల శ్రీనివాస్, అనసూయ, జేఏసీ చైర్మన్ సోమశేఖర్, బంజారా సంఘం నాయకులు వాసుపవార్, విఠల్‌నాయక్, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, పుల్ల బిచ్చిరెడ్డి, సీపీఎం నాయకులు గోపాల్ పాల్గొన్నారు. ఇక టీఆర్‌ఎస్ అందోల్, సంగారెడ్డి అసెంబ్లీ అభ్యర్థులు బాబుమోహన్, చింతప్రభాకర్ పాల్గొన్న సంగారెడ్డి సభలో కేసీఆర్ సమక్షంలో సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శివంగుల సువర్ణ, కాంగ్రెస్ నాయకుడు శివంగుల ఆంజనేయులుతోపాటు సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.