-సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రమంతటా జెండా పండుగ
-ప్రతి ఇల్లూ, ఊరూవాడల్లో గులాబీ రెపరెపలు
-జలదృశ్యంలో ఎగిరిన నాటి జెండా
-జన హృదయాల్లోకి అభివృద్ధి ఎజెండా

రెండు దశాబ్దాల నాడు జలదృశ్యంలో ఆవిష్కారమైన గులాబీ జెండా.. నేడు జన హృదయాల్లో కొలువుదీరింది. తెలంగాణ మాగాణంలో పచ్చని పైరుగా రెపరెపలాడుతున్నది. ప్రగతి పరిమళాల్లో గుభాళిస్తున్నది. రాజకీయాల్లోకి రావాలనుకొనేవారికి.. ఉన్నవారికి.. ఇవాళ గులాబీ పార్టీ సభ్యత్వమే ఒక గౌరవం. టీఆర్‌ఎస్‌లోకి వస్తే తల్లి ఒడిలో సేదతీరిన అనుభూతి. తమ ఆత్మగౌరవాన్ని వినువీధుల రెపరెపలాడించిన గులాబీ జెండాకు 60 లక్షలకు పైగా టీఆర్‌ఎస్ సైన్యం పండుగ చేస్తున్నది.
సెప్టెంబర్ 2 నుంచి..
టీఆర్‌ఎస్ జెండా పండుగ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై నెలరోజుల పాటు కొనసాగనున్నది. గ్రామ, మండల, జిల్లా, బస్తీ, డివిజన్ కమిటీల ఏర్పాటుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపడానికి రంగం సిద్ధమైంది. జెండాపండుగతోపాటే సంస్థాగత నిర్మాణానికి కూడా అదేరోజు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ సాహసించని, కనీవినీ ఎరగనిరీతిలో పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకొన్న టీఆర్‌ఎస్.. చరిత్రలో నిలువబోతున్నది. మొదట 12,769 గ్రామాల్లో గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు సెప్టెంబర్ 2 నుంచి 10 రోజులపాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 12 నుంచి వారంపాటు మండల కమిటీలు, 20 నుంచి జిల్లా కమిటీల నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత నగరాల్లో బస్తీ, డివిజన్ కమిటీలో ఏర్పాటుతో సెప్టెంబర్ నెలాఖరుకు జెండా పండుగ ముగుస్తుంది. జిల్లా కమిటీలను కూడా పునరుద్ధరిస్తారు.
జిల్లాల్లో సన్నాహక సమావేశాలు
సొంత పార్టీలో ఉన్న వారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేక దిగుమతి నాయకుడికి కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటజిల్లా హుజూర్‌నగర్‌లో సెప్టెంబర్ 2న నిర్వహించే టీఆర్‌ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని హుజూర్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్‌లో ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు 2న టీఆర్‌ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో మధిర నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ, బూత్, మండల స్థాయిల్లో నూతన కమిటీలను ఏర్పాటుచేసి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోజకవర్గంలోని 118 గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలన్నారు.