Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గురుకులాల్లో వెయిట్ లిస్ట్

-సీఎం మనుమడు తినే బియ్యమే విద్యార్థులకూ -మౌలిక సదుపాయాల కల్పనలో రాజీలేదు -తెలంగాణ చర్యలతో సర్కారు బడులకు పూర్వవైభవం -దేశవ్యాప్తంగా పిల్లలకుమౌలిక సదుపాయాలు కల్పించాలి -అప్పుడే చదువులపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది -5, 8వ తరగతుల్లో డిటెన్షన్ విధానం సరికాదు -లోక్‌సభలో చర్చలో ఎంపీ జితేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కును పకడ్బందీగా అమలుచేస్తున్నామని ఎంపీ, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మనుమడు ఎలాంటి బియ్యంతో అన్నం తింటున్నాడో.. ఆలాంటి బియ్యాన్నే గురుకులాల విద్యార్థులకు కూడా ఇస్తున్నామని తెలిపారు. తాము అనుసరిస్తున్న విధానాలతో ప్రస్తుతం తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాలకు వెయిటింగ్ లిస్ట్ ఉంటున్నదని చెప్పారు. లోక్‌సభలో బుధవారం కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్ విద్యాహక్కు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 5, 8వ తరగతుల్లో డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో విద్యకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ సర్కారు ముందడుగు వేసిందన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా 570 గురుకులాలను ప్రారంభించారని తెలిపారు.

మైనార్టీలకు కూడా పాఠశాలలను ప్రారంభించామన్నారు. ఉచితంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్న సర్కారు తమదేనని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉచిత నిర్బంధవిద్యను పక్కా ప్రణాళికతో అమలుచేస్తున్నామని వివరించారు. గురుకులాల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడా రాజీపడేదిలేదని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థులకు స్లీప్‌వెల్ మ్యాట్రెసెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. తమ రాష్ట్రంలో ఇప్పుడు వెయ్యి గురుకులాలు ఉన్నాయని, ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు పెట్టి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యావ్యవస్థపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని, ఫలితంగా విద్యారంగంలో తెలంగాణ ముందడుగు వేసిందని ఎంపీ ప్రకటించారు. ప్రభుత్వ గురుకులాలు, విద్యాసంస్థల్లో చదువుకునేందుకు విద్యార్థులు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఇప్పుడు ఆ స్కూళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండటాన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో అవగతమవుతుందన్నారు. తమ సంస్కరణల కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడుతున్నాయని, గత ప్రభుత్వాల హయాంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు అధిక సంఖ్యలో తెరుచుకుంటున్నాయని చెప్పారు.

మౌలిక సదుపాయాలతోనే మెరుగైన విద్య దేశవ్యాప్తంగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులు బాగా చదువుకుంటారని, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదవకుంటే అప్పుడు వాళ్లను డిటెయిన్ చేయాలని సూచించారు. 40 మంది పిల్లలుంటే వాళ్లకు ఓ గదిని, ప్రత్యేకంగా టీచర్‌ను ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. 5, 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, ఒకవేళ పరీక్ష తప్పితే డిటెయిన్ చేయడం (పై తరగతులకు అనుమతించకపోవడం) తగదన్నారు. ఈ కారణంగా విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడరని చెప్పారు. దేశంలో చాలా రాష్ర్టాలు, ప్రాంతాల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమవుతున్న పరిస్థితి 70 ఏండ్ల నుంచి కొనసాగుతూనే ఉందని జితేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగా కేంద్రం మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా పరీక్షలు పెట్టి డిటెయిన్ చేయడం, డ్రాపౌట్‌గా నిర్ధారించడం సరైనది కాదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల బాట పడుతారని చెప్పారు.

భువనగిరి, ఆలేరులో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపండి: ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భువనగిరి నియోజకవర్గంలోని వివిధ స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బుధవారం లోక్‌సభలో జీరోఅవర్‌లో రైల్వేమంత్రికి విజ్ఞప్తిచేశారు. ప్రసిద్ధ యాదాద్రి క్షేత్రంతోపాటు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఈ ప్రాంతంలో ఉన్నాయని, వేలమంది యాత్రికులు వచ్చి పోతుంటారని తెలిపారు. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి, ఆలేరులో, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జనగామలో నిలుపాలని కోరారు. నాలుగేండ్లుగా రైల్వేమంత్రికి ఎన్నో వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు.

వాతావరణ సమాచారం ఇవ్వాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వాతావరణ సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉంటున్నదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. 40 వేల వాతావరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ సూచించగా 4వేలే పనిచేస్తున్నాయని లోక్‌సభ జీరోఅవర్‌లో చెప్పారు. పిడుగులతోపాటు, పంటలను నష్టపరిచే సంకేతాలను ముం దే ఇవ్వాలని, ఆ విధంగా వాతావరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరారు. క్రాప్ ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌పై వ్యవసాయశాఖ పరిశోధన విభాగంలోని ఐఎస్‌ఐ సర్టిఫై చేస్తుందని, ఇది గుట్టల ప్రాంతాల్లో నివసించేవారికి పనికిరాకుండా ఉంటుందని చెప్పారు. వ్యవసాయ శాఖ ఐఎస్‌ఐ-15243ను మాడిఫై చేస్తుందా? అని ఎంపీ ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.