-నేటినుంచే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పనులు మొదలు -యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష -మెదక్‌పై వరాల జల్లు కురిపించిన సీఎం -ఘణపురం రిజర్వాయర్‌పై ఏరియల్ సర్వే.. అభివృద్ధికి 50 కోట్లు -మెదక్‌ను మూడు జిల్లాలు చేస్తామని ప్రకటన -భూముల సేకరణ, పనుల ప్రారంభం ఇక వేగిరం -గర్భగుడి విస్తరణ, పాత నిర్మాణాల కూల్చివేత.. -కొండపై భారీ ఆంజనేయ, గరుడ విగ్రహాలు -గుట్ట అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు

నల్లగొండ జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులను గురువారం నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు. బుధవారం గుట్ట గుడికి వచ్చిన కేసీఆర్.. దైవ దర్శనం అనంతరం దేవాలయ అతిథి గృహంలో యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి కావాల్సిన రెండు వేల ఎకరాల భూముల సేకరణ అంశంతోపాటు ధర్మశాలల నిర్మాణం, అభయారణ్యం, జింకల పార్కు, ఉద్యాన వనాలు, కల్యాణ మండపాలు, రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు రోప్‌వే, రాయగిరి చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడం తదితరాలపై అధికారులతో చర్చించారు. గుట్ట అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు.
గాలి గోపురం ఎత్తు ప్రస్తుతం 20 అడుగులు ఉన్నదని, మరో 19 అడుగులు పెంచి స్వర్ణతాపడం చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న గర్భగుడిని విస్తరించాలని సీఎం నిర్ణయించారు. మరోవైపు మెదక్ జిల్లాలోనూ పర్యటించిన ముఖ్యమంత్రి.. జిల్లాలోని ఘణపురం రిజర్వాయర్ ఆయకట్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిని సందర్శించారు. అనంతరం మెదక్ పట్టణంలో నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
ఘణపురం రిజర్వాయర్ ఆయకట్టును 25వేల ఎకరాలకు పెంచుతామని చెప్పారు. ప్రాజెక్ట్‌ను ఆధునీకరించేందుకు ఇప్పటికే ఉన్న రూ.19 కోట్లకు అదనంగా రూ.50 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ప్రాంతాలను వేరు చేసి మొత్తం మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. మెదక్ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించారు.

నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకు సంబంధించిన పనులను గురువారం నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సీఎం బుధవారం దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ అతిథి గృహంలో యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశ వివరాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి కావాల్సిన రెండు వేల ఎకరాల భూములతోపాటు ధర్మశాలల నిర్మాణం, అభయారణ్యం, జింకలపార్కు, ఉద్యానవనాలు, కల్యాణ మండపాలు, రాయగిరి నుం చి యాదగిరిగుట్ట వరకు రోప్‌వే, రాయగిరి చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడం అంశాలపై అధికారులతో చర్చించినట్లు ప్రభుత్వ విప్ సునీత చెప్పారు.
రాయగిరిలో ప్రభుత్వ అటవీ శాఖ భూమి 110 ఎకరాలు ఉందని, రిజర్వు ఫారెస్టుకు సంబంధించి బ్లాక్-1, బ్లాక్-2లో 380 ఎకరాలు, వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన 72 ఎకరాలు.. దీనికితోడు రైతుల వద్ద నుంచి 50 ఎకరాలు సేకరించి నృసింహ అభయారణ్యం అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నట్లు తెలిపారు. దీంతోపాటు గతం లో వైఎస్ ప్రభుత్వం దిల్ కంపెనీకి కట్టబెట్టిన 92 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటామని, రాయగిరి కట్టను మినీ ట్యాక్‌బండ్‌గా మారుస్తామన్నారని చెప్పారు.
గుట్ట ఆలయానికున్న 121 ఎకరాలు, ఇటీవల రైతుల నుంచి సేకరించిన 380 ఎకరాలను మొత్తాన్ని దేవస్థానానికి బదలాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిరంజీవులును సీఎం ఆదేశించినట్లు వివరించారు. 1210 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవస్థానానికి బదలాయింపు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాయగిరి నుంచి రోప్‌వే, గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు 8 వరుసల రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. గాలి గోపురం ఎత్తు ప్రస్తుతం 20 అడుగులు ఉన్నదని, మరో 19 అడుగులు పెంచి స్వర్ణతాపడం చేస్తామని చెప్పారు.
గర్భగుడి విస్తరణ: ప్రస్తుతమున్న గర్భగుడి విస్తరించాలని సీఎం నిర్ణయించినట్లు సునీత తెలిపారు. పండితులు, పీఠాధిపతులు నిర్ణయించిన మేరకే ఈ పనులు జరుగుతాయన్నారు. అవసరం లేని పాత నిర్మాణాలను కూల్చివేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.
కొండపై ఆంజనేయ, గరుడ విగ్రహాలు : కొండపై భారీ ఆంజనేయస్వామి, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు గొంగిడి సునీత తెలిపారు. వాయవ్య, ఈశాన్య ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం అవసరంగా భావిస్తున్నట్లు చెప్పారు. గుట్ట ఆలయంలో, గుడి బయట చేపట్టాల్సిన వాటి గురించి సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేశారు. యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ కిషన్‌రావు, దేవాలయ ఈఓ గీతారెడ్డి, ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులుతో పలు విషయాలు చర్చించారు. సమావేశంలో యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ కిషన్‌రావు, సీఎం సలహాదారు భూపాల్‌రెడ్డి, యాదగిరిగుట ్టఆలయ ఈఓ గీతారెడ్డి, స్తపతి సుందరరాజన్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం: యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో బుధవారం ప్రత్యేక సమావేశంలో పాల్గొనడానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఘనస్వాగతం లభించింది. వడాయిగూడెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టర్ చిరంజీవులు, భువనగిరి ఆర్డీఓ ఎన్ మధుసూదన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు.
గుట్టలో సీఎం ప్రత్యేక పూజలు: గుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. సీఎంకు ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి, దేవాలయ ఈఓ గీతారెడ్డి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.