Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గుట్టకు 100 కోట్లు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి విషయంలో ఢిల్లీలోని అక్షరధామ్, అమృతసర్‌లోని స్వర్ణదేవాలయం వంటి ప్రఖ్యాత ఆలయాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

KCR review on Yadagirigutta Temple development01

-రానున్న బడ్జెట్లో కేటాయింపు -యాదగిరిగుట్ట అభివృద్ధికి ట్రస్ట్ -ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన -సీఎంకు డిజైన్లు చూపిన స్థపతి, ఆర్కిటెక్టులు -భక్తులకు వసతి, సౌకర్యాలపై సీఎం సలహాలు -ఆగమశాస్త్రం ప్రకారమే డిజైన్లుండాలని ఆదేశం -నేడు యాదగిరిగుట్టకు సీఎం.. గుడి వద్దే సమీక్ష గుట్ట గుడి అభివృద్ధికి కంకణం కట్టుకున్న సీఎం.. జరిగే అభివృద్ధి, డిజైన్లు మొత్తం (మొదటి పేజీ తరువాయి) ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేశారు. ఆలయం స్పెషల్ ఆఫీసర్ జీ కిషన్‌రావు, గుట్ట దేవాలయం అభివృద్ధికి డిజైన్లు తయారు చేసిన స్థపతి సౌందరరాజన్, ఆర్కిటెక్టులు రాజ్ ఎక్స్‌పెడిత్, ఆనందసాయి, జగన్ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.

సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు కూడా అక్కడే ఉన్నారు. తాము తయారు చేసిన డిజైన్లను స్థపతి, ఆర్కిటెక్టులు సీఎంకు చూపించారు. తాము రూపొందించిన డిజైన్ చాలా పురాతన ఆలయంలా ఉంటుందని, వందల ఏండ్ల చరిత్ర కలిగిన స్మారక కట్టడంలా కనిపిస్తుందని సీఎంకు వివరించారు. ఇందులో ఏర్పాటుచేయనున్న శిల్పాలతో దేవాలయంలోకి వెళ్ళేప్పుడు గుహలోంచి వెళుతున్నామనే భావన ఏర్పడుతుందని తెలిపారు.

డిజైన్లను పరిశీలించిన సీఎం కేసీఆర్.. దేవాలయం అభివృద్ధి మొత్తం ఆగమశాస్త్రం ప్రకారం జరగాలని స్పష్టంచేశారు. ఇందుకోసం అక్షరధామ్, అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలాంటి ప్రసిద్ధ ఆలయాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు. యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే భక్తుల కోసం సెంట్రలైజ్డ్ పార్కింగ్ సదుపాయం ఉండాలని చెప్పారు. గుట్టపైకి వెళ్ళడానికి, రావడానికి రెండు లేన్ల రోడ్డు ఉండాలని, తిరుమల మాదిరిగా భక్తులకోసం షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలని సూచనలు చేశారు.

యాదగిరిగుట్ట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన సీఎం.. దీనికి గుట్ట ప్రత్యేకాధికారి జీ కిషన్‌రావు చీఫ్‌గా ఉంటారని పేర్కొన్నారు. ఈ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో గుట్ట, భూమి అభివృద్ధి, పరిపాలనలో ఒక భాగంగా ఉంటుందని సీఎం తెలిపారు. గుట్టకు వచ్చే యాత్రికులు, భక్తులకు సరిపోయేంత విశ్రాంతి స్థలం ఉండాలని, కావల్సినన్ని అతిథిగృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. సంప్రదాయం ప్రకారం గుట్టలో ఒకరోజు రాత్రి బస చేసేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. సంప్రదాయబద్ధంగా సామూహిక వ్రతం నిర్వహించుకోవడానికి సరిపోయినంత స్థలం ఉండేలా చూడాలని సూచించారు.

యాగశాల, కళ్యాణమండపం, ఆధ్యాత్మిక బోధనల వేదికను ఏర్పాటుచేసేలా డిజైన్ ఉండాలని సీఎం సూచించారు. గుట్టపై ఉన్న 10 ఎకరాలకుపైగా స్థలంలో దేవాలయ ప్రాంగణం 5 ఎకరాల్లో ఉండాలని, మిగతా 5 ఎకరాల్లో కళ్యాణమండపం, యాగశాల, ఆధ్యాత్మిక బోధనల కేంద్రం ఉండేలా చూడాలని సీఎం సూచించారు. ఈ డిజైన్లతో నేరుగా గుట్ట వద్దే చర్చిద్దామంటూ బుధవారమే యాదగిరిగుట్టకు వెళదామని చెప్పారు. టెంపుల్ ప్లానింగ్ పూర్తయిన క్రమంలో గుట్టపై చేపట్టాల్సిన భారీ నిర్మాణాలు ఆగమశాస్త్రానుసారంగా ఉండాలంటే క్షేత్రస్థాయి పరిశీలన జరగాలని, స్థపతుల ఆలోచనల మేరకు ఖరారవ్వాలని భావించిన సీఎం.. సమీక్ష సమావేశం గుట్టలోనే పెట్టుకుందామని పేర్కొనడంతో ఆయన ఆకస్మిక పర్యటన ఖరారైంది.

ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుట్ట అభివృద్ధి కోసం సమీక్ష జరిపేందుకు ముచ్చటగా మూడోసారి రానున్నారు. ఆగమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు, శ్రీవారి రాజగోపురం స్వర్ణమయం చేయడం, షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణం తదితర విషయాలపై సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్టోబర్ 17న మొదటిసారి గుట్టకు వచ్చిన కేసీఆర్ గుట్ట అభివృద్ధికి అనేక వరాలు ప్రకటించారు. గుట్ట చుట్టూ 2 వేల ఎకరాలలో అభివృద్ధి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. నృసింహ అభయారణ్యం, జింకలపార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.

రెండోసారి డిసెంబర్ 17న గుట్టకు వచ్చి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్కిటెక్టులతో సర్వే చేయిస్తామని, ఆగమశాస్ర్తానుసారం సర్వే పనులు కొనసాగుతాయని, దీనికోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్టులను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయాలు వెలువరించారు. బుధవారం సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను భువనగిరి ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఇదిలాఉంటే.. యాదగిరి నరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 27న స్వామివారికి ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.