-మునుపెన్నడూ ఇంతటి వేవ్ చూడనే లేదు.. -ప్రజలు మా పట్ల స్థిరమైన విశ్వాసం చూపారు.. -ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది -ప్రజలందరికీ కృతజ్ఞతాభివందనాలు.. -గెలుపుకోసం అహోరాత్రులు కష్టపడ్డ టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు.. -వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావుకు ఆశీస్సులు -కొత్త మున్సిపల్ చట్టం కఠినంగా అమలు -త్వరలోనే పట్టణ ప్రగతి.. ఎన్నారై పాలసీ -పట్టణాలకు నెలకు రూ.2 వేల కోట్లు -అసెంబ్లీ సమావేశాల తర్వాత గల్ఫ్ పర్యటన -ఏడాదిలో నిరక్షరాస్యత రూపుమాపుతాం -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ -రెవెన్యూ అవినీతికి సర్జరీ తప్పనిసరి -వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం -రెవెన్యూ ఉద్యోగులు దాండికాలు మానుకోవాలి.

రాష్ట్రంలో ఆరేండ్లుగా టీఆర్ఎస్ అమలుచేస్తున్న పథకాలు, విధానాలను ప్రజలు ఆదరించారని, వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ద్వారా తెలియజేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా, లక్ష్యం వైపు నిర్దిష్టంగా కొనసాగాలనే సందేశాన్ని తమకు ఇచ్చినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇది అద్భుతమైన విజయమని, స్థానిక సంస్థల్లో ఇలాంటి ఘన విజయం ఎవరికీ దొరకదన్నారు. గత డిసెంబర్లో శాసనసభ రద్దు చేసి ముందుకు వెళ్లినప్పుడు ఎన్నికల ముందు చెప్పినట్లుగానే 88 సీట్లు గెలిచామని, ఇటీవల హుజూర్నగర్ ఎన్నిక విజయంతో కలిసి టీఆర్ఎస్ సొంతంగా 89 స్థానాలు గెలుచుకున్నదని గుర్తుచేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొన్నామని, అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 32 జిల్లాపరిషత్‌లు సొంతం చేసుకొని దేశంలోనే రికార్డు నెలకొల్పినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేస్తామని స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన నేపథ్యంలో శనివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘మేము అనుసరిస్తున్న సెక్యులర్ విధానం, అన్ని కులాలకు సమాదరణ, అందర్నీ కలుపుకొని పోయే పద్ధతి ప్రజలకు బాగా నచ్చిందని ఈ తీర్పు ద్వారా మాకు అర్థమవుతున్నది.
ప్రబలమైన తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా నా పక్షాన, పార్టీ పక్షాన శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. గెలిచినవారికి హృదయపూర్వక అభినందనలు. గెలుపుకోసం అహోరాత్రులు కష్టపడ్డ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. మీ కష్టం ఫలించింది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావుకు ఆశీస్సులు. అందరూ సమన్వయంతో పనిచేసి చక్కటి ఫలితాలు సాధించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని చెప్పారు.
ఎన్నికలు ఆపేందుకు విపక్షం యత్నాలు ఎన్నికలు ముగిస్తే అభివృద్ధిమీద దృష్టి సారించవచ్చని తామనుకొంటే.. విపక్షాలు మాత్రం మున్సిపల్ ఎన్నికలను ఆపాలని విశ్వప్రయత్నాలు చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఇలాంటి అవాంతరాల మధ్య ఎన్నికలు జరిగినప్పటికీ.. ప్రజలు ముక్తకంఠంతో అద్భుతమైన తీర్పు చెప్పారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మిక్చర్ ఆఫ్ ఓటర్స్ ఉంటారని.. అయినప్పటికీ ఇలాంటి గొప్ప ఫలితాలు రావటం అసాధారణమని పేర్కొన్నారు. తన 40 ఏండ్ల అనుభవంలో ఎన్నో ఎన్నికలు చూశానన్న సీఎం.. ఇలాంటి ఫలితాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పారు.
సంక్లిష్టమైన ఎన్నికలు ఇవి ‘1994లో అన్నగారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయాంలో నేను టీడీపీలో ఉన్నాను. మద్యనిషేధం ప్రకటించడం వల్ల ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారు. మద్యనిషేధం వల్ల ప్రభుత్వ ఖజానా మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారం పడింది. విధిలేక సేల్స్ ట్యాక్స్ పెంచాం. అది చిన్నా చితక అన్నింటి మీద పెరిగింది. వెంటనే మున్సిపల్ ఎన్నికలు పెడితే ప్రజలు మద్యపాన నిషేధాన్ని అభినందించకుండా ట్యాక్స్ పెంచామన్న కోపంతో ఓడగొట్టారు. రాజీవ్‌గాంధీ మరణించినప్పుడు కూడా నా నియోజకవర్గంలో మెజార్టీ సంపాదించుకున్నాను. కానీ ఆ సమయంలో మాత్రం మున్సిపాలిటీలో 5 వేల ఓట్లతో ఓడిపోయాం’ అని సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లోని సంక్లిష్టతను వివరించారు.

విపక్షాలకు చెంపదెబ్బ ‘ప్రతిపక్షాల నోటికి మొక్కాలె. అన్ని ఎన్నికల్లో వలే ఈ ఎన్నికల్లో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాళ్ల మాటలకు అర్థం ఉండదు. అడ్డు అదుపు ఉండదు. కనీసవిలువల్లేవు. ఒకరైతే ముఖ్యమంత్రికి ముక్కు కోస్తా అంటడు. అసదుద్దీన్ గడ్డం తీసి నాకు పెడతారంట.. వాళ్లింక జాతీయపార్టీకి చెందినవాళ్లు. ఒక ఎంపీ మాట్లాడే మాటలివేనా? ప్రజలే బుద్ధి చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టినట్లు, చెంప ఛెళ్లుమనిపించినట్లు దెబ్బ కొట్టారు. ఇది మామూలు దెబ్బకాదు. కుసంస్కారంగా, ముఖ్యమంత్రి, మంత్రి, పార్టీ నాయకులు అనే ఎలాంటి తేడాలు లేకుండా దూషించారు.
అనేక నిందారోపణలు చేశారు. ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదని స్పష్టంగా తేలింది’ అని సీఎం చెప్పారు. ‘మా క్యాడరే 60 లక్షలు. మాకు 52 శాతం ఓట్లు పడ్డాయి. మీకు పడ్డ పర్సెంట్ ఎంత? మీ బతుకెంత? మీ కథెంత? గిదేనా మాట్లాడే తీరు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఎట్ల? మొన్న జార్ఖండ్‌లో ఆకాశమంత రామమందిరం కడతామంటే ఏమైంది? ఉన్న గవర్నమెంటే ఊడిపోయింది. ఒక్కొక్కటిగా వరుసపెట్టి పోతున్నయ్.. రేపు ఢిల్లీలో కూడా గదే కథ అని చెప్తున్నరు. ఎవ్వర్ని అడిగినా అరవింద్ కేజ్రీవాల్‌కే ఓటేస్తమని అంటున్నరు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రజాతీర్పును అవమానిస్తారా? ఎన్నికల్లో వేల కోట్ల ఖర్చుచేశామని లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని.. అది నిజాయతీగా ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయి ఓట్లు వేశారని ఆరోపణలు చేస్తున్న వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. ఒక క్రమశిక్షణ ప్రకారం బతికినోళ్లమని, ఈ ఎన్నికల్లో ప్రచారంకూడా చేయలేదని, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏ ఒక్క అధికారితో మాట్లాడలేదని చెప్పారు. అలాంటపుడు అధికార దుర్వినియోగం చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీరు గెలిస్తే న్యాయం.. మేము గెలిస్తే డబ్బు పంచామని అనడం సరికాదన్నారు. వేల కోట్లు ఖర్చుచేశామని ఆరోపిస్తున్నవారు ఆధారాలు చూపించగలరా? అని నిలదీశారు. స్థాయిని, స్థితిని, హోదాను మించి మాట్లాడితే ఏమవుతుందో ప్రజలు అనేకసార్లు చెప్పినా, తిర్రేసి మర్రేసి తొక్కిపడేసినా విపక్షాలకు బుద్ధి రావటంలేదని విమర్శించారు.

ఇతర పార్టీలకు గేమ్.. మాకు టాస్క్ తెలంగాణలో రాజకీయ వ్యవస్థ నడపడం ఇతర రాజకీయ పార్టీలకు గేమ్ అని, టీఆర్ఎస్కు మాత్రం టాస్క్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక లక్ష్యం ఏర్పర్చుకొని రాక్షసుల్లాగా పనిచేసే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉండటం వల్లే గొప్ప ఫలితం వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ పక్షాన అన్ని నియోజకవర్గాలకు 80 లక్షల విలువచేసే మెటీరియల్ పంపించినట్లు చెప్పారు. ఇది కాకుండా ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. దీన్నిచూసి కూడా ప్రజలు అమ్ముడుపోయారు అనడం పద్ధతి కాదన్నారు. ప్రజాతీర్పుతో 115 నుంచి 120 వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు.
దూసుకుపోతున్న పట్టణీకరణ రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నదని, హైదరాబాద్ నగరానికి ఏటా ఐదారు లక్షలమంది వలస వస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ పుట్టేవాళ్లు కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి ప్రజలు హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. ఇటీవల మంత్రి కేటీఆర్ దావోస్ పోయి మంచిగా ప్రచారంచేసి వచ్చారని, దీంతో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఈ పరిణామంతో మంత్రులు సంతోషించినా తాను మాత్రం భయపడుతున్నానని సీఎం చమత్కరించారు. ఏటా వలస వస్తున్న ఇన్ని లక్షల మందికి మంచినీళ్లు ఎక్కడి నుంచి తేవాలి? అన్నారు. పైపుల సైజులు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, పౌర సరఫరాలను పెంచాలని పేర్కొన్నారు. ఎల్బీనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్వంటి నియోజకవర్గాల్లో జనాభా.. పాపం పెరిగినట్లు పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ సమయంలో మూడు లక్షల ఓటర్లకు కుదించితే మళ్లీ ఇప్పుడు ఏడెనిమిది లక్షలకు పెరిగిపోయిందని.. ఇట్లా పెరుగుతూపోతే మౌలికవసతులు కూడా వెంటనే కల్పించడం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారు.
పట్టణ ప్రజాప్రతినిధులకు శిక్షణ మున్సిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, మేయర్లకు ప్రభుత్వపరంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టణీకరణ 50శాతం దాటిపోతుండటంతో సవాళ్లుకూడా ఎదురవుతాయని.. వాటిని పరిగణనలోకి తీసుకొంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో మంచి పురోగతి సాధించడం, పారిశ్రామిక విధానం కూడా మంచిగా ఉన్నందున మరిన్ని పెట్టుబడులు వస్తాయని.. దానివల్ల పట్టణీకరణ వేగం పుంజుకుంటుందని చెప్పారు. పురోగతి సంతోషకరమైనా.. సవాళ్లను అధిగమించే బాధ్యత అర్బన్ ఫిలాసఫర్లు, అర్బన్ మేనేజర్లపై ఉంటుందని చెప్పారు.
పురపాలకశాఖ మంత్రితోపాటు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధుల్లో ఉండే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులే పట్టణ మేనేజర్లని సీఎం చెప్పారు. వీళ్లు ఎప్పటికప్పుడు ప్రపంచంతోపాటు అప్డేట్ అవుతుండాలని.. లేకుంటే పట్టణాలు భయంకరమైన కాలుష్యంలో చిక్కుకుపోయే ప్రమాదమున్నదని సీఎం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఖానామెట్‌లో అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు 20 ఎకరాల స్థలం ఇప్పటికే కేటాయించామని, త్వరలో దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆస్కితోపాటు దేశ, విదేశాలకు చెందిన పట్టణరంగ నిపుణులను పిలిపించి, పురపాలకశాఖ ఆధ్వర్యంలో నిరంతర అధ్యయన, పరిశోధన తరగతులతోపాటు.. ప్రజాప్రతినిధులకు శిక్షణ చేపడుతామని చెప్పారు. ప్రజాప్రతినిధులను విదేశాల్లోని నగరాలకు పంపి అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుతామని వెల్లడించారు.
కేంద్రం బండారం బయటపడతది మన రాష్ర్టానికి జీఎస్టీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. తానే మొన్న పార్లమెంటు సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలకు చెప్పి నామా నాగేశ్వరరావు, కేశవరావు ఆధ్వర్యంలో గాంధీబొమ్మ దగ్గర, సభ లోపల, రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించామని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీలను చూసి వేరే రాష్ర్టాలవాళ్లు అందుకొన్నారని చెప్పారు. ఆ తర్వాతనే కేంద్రం దేశవ్యాప్తంగా రూ.34 వేల కోట్లు విడుదలచేయగా అందులో రూ.వెయ్యి కోట్లు తెలంగాణకు వచ్చాయని గుర్తుచేశారు. అయినా ఇంకా రూ.1,131 కోట్లు రావాల్సి ఉన్నదని తెలిపారు. రేపో, ఎల్లుండో ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రికితానే స్వయంగా లేఖ రాస్తానన్నారు.
ఇందుకోసం ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు బృందాన్ని కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు రావాలని, అవి ఇస్తరో, ఎగపెడతరో తెల్వదని చెప్పారు. బీజేపీ నాయకుల వ్యవహారం మాటలు కోటలు దాటుతయి.. కాళ్లు తంగేడు దాటవన్నట్లుగా ఉన్నదని ఎద్దేవాచేశారు. కేంద్ర ప్రభుత్వ పరిస్థితి గమ్మత్తుగా ఉన్నదని, వాళ్లు బయట చెప్పకున్నా పార్లమెంటుకు లెక్కలు ఇవ్వాల్సి ఉంటుదని.. అక్కడ వారి బండారం బయటపడుతుందని సీఎం అన్నారు. జీడీపీ మూడు, నాలుగు, ఐదు శాతం అంటూ రకరకాలుగా చెప్తున్నారే కానీ, మరి వాస్తవంగా ఎంత శాతమో చెప్పటంలేదని.. అది కూడా బయటపడుతుందని చెప్పారు. మొత్తంగా మునిగిపోయే కార్యక్రమం ఉన్నదనే వార్తలు కూడా వస్తున్నాయని, వచ్చే సంవత్సరం జీరో అయ్యే పరిస్థితి ఉన్నదని చెప్తున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, పీఆర్సీ మీద ఉద్యోగులను పిలిచి మాట్లాడతానని తెలిపారు. వాళ్లు కూడా ప్రభుత్వంలోనే ఉన్నందున అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉద్యోగులకు ఇచ్చిన మాట కచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పారు.

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం గత ఐదేండ్లు తెలంగాణ రాష్ట్రం చాలా ఎంజాయ్ చేసిందని.. ఇండియాలో నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇదేదో రాజకీయ ప్రకటన కాదని.. కాగ్ చెప్పిన లెక్క అని పేర్కొన్నారు. గత ఐదేండ్లు ఆర్థికవృద్ధి ప్రతి సంవత్సరం 21% పెరుగుదల ఉండేదని, ఈ క్రమంలో రూ.200 కోట్లు మంజూరు చెయ్యాలంటే ఆలోచించేవాడిని కాదని తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కావాలంటే వెంటనే ఇచ్చామని, ఆ నిధి ద్వారా జర్నలిస్టులకు మంచి సహాయం జరుగుతున్నదని చెప్పారు. అలాంటిది ఇప్పుడు పది రూపాయలంటేనే భయమైతున్నదన్నారు. పరిస్థితి ముందుముందు ఇంకా దిగజారుతుందని అంటున్నారని పేర్కొన్నారు.
వాస్తవంగా తెలంగాణకు ఈ పరిస్థితి ఉండొద్దని, మొత్తం లెక్కలు తీస్తే మన వృద్ధి 21శాతం నుంచి మొన్న 1.73 శాతానికి పడిపోయిందని.. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి కారణంగా 9.5 శాతం ఉన్నదని.. అయినప్పటికీ.. ఇది చాలా తక్కువ కిందనే లెక్క అని సీఎం అన్నారు. అందుకే మంత్రులు, కార్యదర్శులను అలర్ట్‌చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పినట్లు వివరించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కూడా చెప్తున్నాయని తెలిపారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రతిరోజు, ప్రతివారం ఆర్థికపరిస్థితి గురించి వివరిస్తున్నారని చెప్పారు. కేంద్రం తప్పుడు విధానాల వల్ల పన్నుల వృద్ధి 29 శాతం నుంచి 9 శాతానికి తగ్గిందని.. దీని ప్రభావం ప్రతి రాష్ట్రం, ప్రతి రంగం మీద ఉన్నదని తెలిపారు. లక్షలకొద్దీ ఉద్యోగాలు పోతున్నాయన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ చాలా వేగంగా వృద్ధి సాధించినప్పటికీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.
పక్కాగా హెల్త్ ప్రొఫైల్ త్వరలోనే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు శ్రీకారం చుడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో చేపట్టిన కంటివెలుగు సూపర్ సక్సెస్ అయిందని, అది ప్రపంచంలోనే అతి గొప్ప స్క్రీనింగ్ టెస్ట్ అని ఎల్వీ ప్రసాద్ అధిపతి డాక్టర్ జీఎన్ రావు ప్రశంసించారని తెలిపారు. అదే పద్ధతిలో చెవి, ముక్కు, గొంతుతోపాటు బీపీ, ఇతర వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ చేపట్టడంద్వారా తెలంగాణ ఆరోగ్య సూచిక రూపొందిస్తామని చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఇది నెమ్మదిగా జరిగే కార్యక్రమమని అన్నారు.
పన్నులు కొంత పెంచాలి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయాలంటే ప్రభుత్వానికి కొంత ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం మున్సిపల్, గ్రామపంచాయతీల పన్నులు కొంత మేర పెంచాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులు, గిరిజనుల పన్నులు రద్దు చేస్తామని, పేద ప్రజలపై భారం లేకుండా, డబ్బులు చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి, సంపాదించే సంస్థలకు పన్నులు కొంతమేర పెంచుతామని తెలిపారు. పన్నులు, చార్జీల పెంపు విషయాలపై వార్తల విషయంలోనూ కొన్ని పత్రికలు బాదుడు వంటి పదాలు వాడుతున్నాయని, అది బాధ్యతగల జర్నలిజం కాదని, అలాంటివి మానుకోవాలని సీఎం హితవు పలికారు. నిజాయితీగా చెప్పే విషయాలను ప్రజలు నమ్ముతారని, పెంచిన పన్నుల సొమ్ము కూడా వాళ్ల అభివృద్ధికే వెళ్తుంది కాబట్టి వాళ్లు అంగీకరిస్తారని చెప్పారు. ఏండ్ల తరబడి పన్నుల పెంపు పెండింగ్‌లో ఉన్నదని, దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. పన్నుల పెంపు ఏదైనా మార్చి 31 తర్వాత నుంచి అమలులోకి వచ్చేలా చేస్తామన్నారు.
శాసనసభలో విస్తృత చర్చ తర్వాతే సమంజసమైన రీతిలో పెంపు ఉంటుందన్నారు. రైతుల పాలిట బ్రహ్మాస్త్రంగా రైతు సమన్వయ సమితి పార్టీ జనరల్ సెక్రెటరీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డిని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించామని.. రైతు సమన్వయ సమితులన్నింటినీ క్రియాశీలకం చేయబోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఒకటి చొప్పున రూ.300 కోట్ల పైచిలుకు వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలు నిర్మిస్తామన్నారు. రైతులను ఆర్గనైజ్డ్ ఫార్మాట్లోకి తెచ్చి.. వారే మార్కెట్ ధరలు నిర్ణయించేలా పూర్తి రైతురాజ్యాన్ని తెస్తామన్నారు. తమ ధాన్యానికి తామే ధరను నిర్ణయించుకొనే బ్రహ్మాస్త్రంగా రైతు సమన్వయ సమితిని మారుస్తామన్నారు. పదిహేను రోజుల్లోనే రైతు సమన్వయ సమితులను క్రియాశీలకం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతానని చెప్పారు.
ఐకేపీ మహిళలను భరోసా ఐకేపీ ఉద్యోగులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. వీటి ద్వారా వ్యాల్యూ ఎడిషన్ చేసే పనులు చేపడుతామని, ఐకేపీ సభ్యులు గ్రామాల్లోని మహిళాసంఘాలను సమన్వయంచేస్తూ అటు రైతులకు లాభం వచ్చేలా, ఇటు మహిళా సంఘాలకు డబ్బు వచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఐకేపీ వర్కర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసేందుకు ఏయే చర్యలు తీసుకోవాలి, వారి విధులు అన్ని అంశాలపై త్వరలోనే వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీని వేయనున్నట్టు తెలిపారు.
మహారాష్ట్రలో ఓబీసీ మహిళా సంఘం లిజ్జత్ పాపడ్‌ను ప్రారంభించగా దాని టర్నోవర్ రూ.680 కోట్లకు చేరుకున్నదని వెల్లడించారు. అదే పద్ధతిలో తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నా 99.9 శాతం తిరిగి చెల్లిస్తున్నారని తెలిపారు. వారికి ధాన్యం కొనుగోలు బాధ్యతలను అప్పచెప్తే అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి, రైతు సమన్వయ సమితి, వ్యవసాయశాఖ మంత్రి కలిసి దీన్ని సమన్వయం చేయాల్సి అక్కర ఉంటుందన్నారు. దీనికో సబ్‌కమిటీ వేసి వందశాతం దీన్ని సూపర్‌హిట్ కార్యక్రమంగా చేస్తామని చెప్పారు.
నేను చేసిన యాగాలు ఎవరూ చేయలేదు ‘నేను చేసిన యాగాలు ఎవరైనా చేశారా? నేను భయంకరమైన హిందువును’ అని సీఎం కేసీఆర్ అన్నారు. కొంతమంది ఇంటిలోపల చేస్తారని, తాము అలా భయపడబోమని.. చేస్తే దిల్దార్గా చేస్తామని చెప్పారు. తాను యాగంచేస్తే లక్షలమందికి అన్నం పెట్టి మరీ చేశానని, తాను హిందువును కాదా? అని ప్రశ్నించారు. పొద్దున్నే దేవుడికి పూజలుచేస్తూ మంత్రాలు చదువుతామని, బీజేపీ వాళ్లు చెప్తేనే చేస్తున్నామా? అని నిలదీశారు. శృంగేరికి వెళ్లి శంకరాచార్యకు నమస్కరిస్తామని, జీయర్‌స్వామికి పొర్లుదండాలు పెడుతానని గుర్తుచేశారు. మతాల పేరిట విడదీసిన చరిత్ర భారతదేశానికి లేదన్న సీఎం.. నలందా విశ్వవిద్యాలయానికి చైనా నుంచి వచ్చి చదువుకున్నారని పేర్కొన్నారు.
ఫెడరల్ విధానమే రక్ష ఈ దేశానికి ఎనాటికైనా ఫెడరల్ విధానమే రక్ష అని సీఎం కేసీఆర్ తెలిపారు. కర్ర పెత్తనాలు, ఏకస్వామ్యం పనికిరాదని అన్నారు. భారతదేశం రాష్ర్టాల కూటమి అని.. రాజ్యాంగం చెప్పింది కూడా ఇదేనని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ బాడీలు కాదని, రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలని అన్నారు. వాటికి రాజ్యాంగ పరమైన హక్కులుంటాయని, వాటిని తగ్గిస్తామంటే కుదరదని స్పష్టంచేశారు. భవిష్యత్తులో జాతీయస్ఫూర్తితో పనిచేసే పార్టీలకే మనుగడ ఉంటుందన్నారు. తమ పార్టీకి వరుస విజయాలు వచ్చాయని, అయినా అహంభావం వద్దని కార్యకర్తలకు చెప్పామని అన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి వారికే ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూశామని తెలిపారు. కొన్నిచోట్ల కలిసి పనిచేసిన కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పారని, వారికి సింగిల్ డిజిట్ సీట్లే వచ్చాయన్నారు.

దేశంలో రాబోయేది ముమ్మాటికీ ఫెడరల్ ప్రభుత్వమేనని, దీన్ని ఎవరూ ఆపలేరని సీఎం స్పష్టంచేశారు. తనకున్న అనుభవంతోనే చెప్తున్నానని, దేశానికి ఫెడరల్ స్ఫూర్తి ఉన్న పార్టీల అవసరం ఉన్నదని తెలిపారు. ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సరైన విధానాలతో దేశాన్ని నడిపించలేదని, డంబాచారాలు చెప్పాయని.. దేశ ప్రజలు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేని దుస్థితి కల్పించాయన్నారు. ఆ రెండు పార్టీలు అన్ని రంగాల్లో పెడమార్గంలోనే వెళ్లాయన్నారు. అధికారం ఉన్నది కదా అని పొగరు తలకెక్కవద్దని.. ప్రజలు తమకిష్టమైతే ఉంచుకొంటరు.. లేకుంటే తీసేస్తరు.. మనమంతా వారి సేవకులమని సీఎం అన్నారు.
అన్ని కులాలు.. మతాలు ఓటేస్తేనే ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్క కులం, మతం వాళ్లు ఓట్లు వేస్తేనే తాము ఇక్కడ ఉన్నామని.. ఏ ఒక్క కులం, మతం ఓట్ల వేస్తే పార్టీ గెలువదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈరకమైన వైఖరి మంచిది కాదని, అలా గెలువాలనుకోవడం కూడా తప్పేనన్నారు. అట్లయితే.. మఠాలు పెట్టుకుంటే పెట్టుకోవాలన్నారు. ‘విజయేంద్రస్వాములు, శంకరాచార్యులు పెట్టుకున్నారన్నారు. వాళ్ల దగ్గరకు పోయేవాళ్లు పోవడం లేదా? ఆ పని పెట్టుకోవాలే కాని, ఇదేం దందానో నాకు అర్థం కావడం లేదు’ అని అన్నారు. ప్రజాస్వామ్యం పేరు మీద.. రాజకీయం అని చెప్పి, ప్రజా సంక్షేమం అని చెప్పి.. గీపని చేస్తే గిదెక్కడి దందా అవుతదని ప్రశ్నించారు.
కుండలో లేదు.. ఇదే దేశంలోని ఆర్థిక సూత్రం నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్ గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘సూత్రం ఏందంటే.. కుండలో లేదు’ అని అన్నారు. మంచి ప్రభుత్వం అందరినీ పరిగణనలోకి తీసుకొంటూ ముందుకు పోవాలని హితవుచెప్పారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలు రాకపోతే ఊరుకోబోమని, గడబిడ అవుతదని స్పష్టంచేశారు. అదేవిధంగా పరోక్ష పద్ధతిలో పన్నుల వాటా తగ్గించాలన్నారు. అది తగ్గించాలి.. ఇది తగ్గించాలంటూ.. ఎవరూ ఏమీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చారని చెప్పారు. తాత్కాలిక వాయిదా ద్వారా ఎన్ని రోజులు దాచి పెడతారని ప్రశ్నించారు. మిడ్‌కోర్స్ సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వట్టిగా గోల్మాల్.. డాండూం.. అంటే నడువదన్నారు.
ఇయాల రేపు అందరూ అన్ని తెలుసుకొంటున్నారని, అందరూ అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. మీడియా వాస్తవాలు ప్రజలకు తెలియచేస్తుందని అన్నారు. తాత్కాలిక నివేదికలంటూ ఏవేవో.. లీకులంటూ.. రకరకాలుగా చెప్తున్నారని, మొత్తం మీద పైసలు లేనితనాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరకు తామే గాంధీ బొమ్మ దగ్గర కూర్చొనే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. తమకేమీ వ్యక్తిగత విమర్శలు లేవన్నారు. తమకే బువ్వలేని, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వస్తే.. ఎలా? అని ప్రశ్నించారు. కేంద్రం అవలంబిస్తున్న పలు విధానాల వల్ల చాలామంది పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఈ విషయంలో చాలామంది తనతో మాట్లాడినట్లు తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ మాట్లాడుతూ ‘మీ ప్రభుత్వం ముందు మాట్లాడాలంటే భయమవుతుందని, మీ విధానాలు బాగా లేవని’ ఆయన కేంద్ర ప్రభుత్వం గురించి ఓపెన్‌గా చెప్పారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దానిని వాళ్లు ఒప్పుకోవడం లేదన్నారు. మంచిగా ఐదేండ్లు ఎంజాయ్ చేశామని, ఇయాలా మనం వెల్లకిలా పడ్డామన్నారు. దేశం వెనక్కిపోతే.. మనం వెనక్కి పోతామని, ఆ ప్రభావం మనపైనా పడుతుందన్నారు. చట్టం ఏదొచ్చినా దేశం మొత్తానికి దెబ్బపడుతుందన్నారు. అలాగే సిటిజన్ షిప్ బిల్లు వల్ల కచ్చితంగా మనకూ దెబ్బపడుతుందన్నారు. మంచిగా ఉన్న దేశంలో.. అల్లకల్లోలం లేకుండా, హ్యాపీగా ఉన్న దేశం సంతోషంగా ముందుకుపోతుంటే.. ఎందుకిలా అనవసరంగా నాశనం చేస్తారని ప్రశ్నించారు. పేదరికం, దరిద్య్రం వంటి సమస్యలే అనేకం ఉన్నాయని, గిరిజన, దళితుల సమస్యలు కూడా ఉన్నాయన్నారు. అవన్నీ పక్కనపెట్టి, లేని సమస్యలు ముందుకు తేవడం ఎందుకని సీఎం కేసీఆర్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా తాను జాతీయ రాజకీయాల్లోకి వందశాతం వెళ్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘నేను చాతగానితనంతో ఉంటే వందశాతం తెలంగాణ రాకపోవు. ఎవరో ఏదో మాట్లడుతరు. నేను బయల్దేరిన్నాడు ఒక్క మనిషిని. భగవంతుడు ఉన్నడని బయల్దేరాను. అప్పుడు చంద్రబాబు ఎంత శక్తిమంతుడు.. ఎంత ఎత్తులో ఉండె.. అందరికీ తెలుసు. లక్షల అవమానాలు, నిందలు ఎదుర్కొన్నా. నేడు తెలంగాణ వచ్చింది. ఇటీవల మిడ్‌మానేరు చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషం కలిగింది. పుష్కరాలకు నీళ్లు లేకపోతే మహారాష్ట్రకు దండం పెట్టినం. ఒక్క టీఎంసీ నీళ్లు కూడా గతిలేకుండా ఉండేపరిస్థితి ఉండేది. ప్రస్తుతం పది టీఎంసీ నీళ్లు గోదావరిలో స్టాక్ ఉన్నయి. వంద రోజుల నుంచి నిరంతరంగా సూర్యాపేట జిల్లాకు నీళ్లు పోతున్నాయి. ప్రజలు నన్ను అడిగితే మార్చి 31 దాకా వస్తాయని చెప్పాను. ప్రస్తుతం 100 టీఎంసీ నీళ్లు మన కంట్రోల్లో ఉన్నాయి. ఈ తెలంగాణనే మేం కోరుకున్నది’ అని సీఎం అన్నారు.
ఈ టర్మ్‌కు నేనే సీఎం ముఖ్యమంత్రి మార్పు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారా అని ప్రశ్నించిన విలేకరులకు సమాధానం ఇస్తూ.. ఈ టర్మ్ మొత్తం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పానని వెల్లడించారు. ‘నన్ను పంపించాలని మీకేమైనా ఉన్నదా? అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ‘మంచిగా అనిపియ్యకపోతే చెప్పు.. ఊకోమంటే ఊకుంటా. నన్ను పంపించే ఉపాయం ఏమైనా ఉన్నదా. ప్రజలే నన్ను ఉండుమంటున్నరు. నేనేం చేయాలి? ఎవరు ఉండాలి.. ఎవరు ఉండొద్దు అనేదానికి సందర్భం ఉంటుంది. ఎవరో కోరుకుంటే కారు. మొన్న కొద్దిగా జబ్బు పడ్డా. హాస్పిటల్‌కి రావాలంటే పోయిన. 30, 40 టెస్టులుచేశారు. దుక్కలా ఉన్నావని డాక్టర్లు అన్నారు. జలుబు ఎక్కువగా ఉంది. కొద్దిగా నీరసంగా ఉంటది తప్ప ఏమీ కాదన్నారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా’ అని సీఎం చెప్పారు.
ఇక్కడ ఉపాధి ఉండగా.. గల్ఫ్ సావులెందుకు? తన ఇంట్లో పనిచేసే సిరిసిల్లకు చెందిన రాములు అన్న రూ.2 లక్షల అప్పుచేసి దుబాయ్ పోయి వచ్చారని.. అప్పయినందున ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడని సీఎం కేసీఆర్ చెప్పారు. అసలు ఎందుకు పోయినవంటే అందరూ పోయినందున తానూ పోయినట్లు చెప్తున్నాడని తెలిపారు. అసలు గల్ఫ్‌కు ఎందుకు పోతున్నరో కూడా తెలవడం లేదని, అప్పుచేసి వీళ్లంతా అక్కడికి పోయి నెలకు కేవలం రూ.10-15 వేలు మాత్రమే సంపాదిస్తున్నారని చెప్పారు. ఇక్కడ మార్బుల్స్ వేసే జార్ఖండ్వాళ్లు నెలకు రూ.25 వేల వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ గృహ నిర్మాణ రంగం చాలా పెద్దదని, ఇందులో ఏకంగా 17 లక్షల మంది పనిచేస్తున్నారని సీఎం ప్రస్తావించారు.
ఇందులో ఎక్కువగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని తెలిపారు. ఫాంహౌస్‌లో తన ఇల్లు మార్చి కట్టుకుంటున్న క్రమంలో.. ఇటీవల అక్కడికి పోయి చూస్తే అక్కడ ఎవరూ తెలుగు వాళ్లు లేరని చెప్పారు. మార్బుల్స్, రంగులు వేసే వాళ్లంతా ఇతర రాష్ర్టాలకు చెందినవారేనని, రోజుకు రూ.500- 600 సంపాదిస్తున్నారని తెలిపారు. ఉన్న ఊరు, కన్నవారిని వదిలి అక్కడికిపోయి సచ్చేదెందుకు? ఇదంతా అయోమయంగా ఉన్నదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. మన పౌల్ట్రీ చాలా పెద్ద పరిశ్రమ అని, చివరకు డెయిరీ ఫామ్‌లలో కూడా అందరూ బీహారీలే పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. అందుకే న్యాక్ కింద ప్రతి నియోజకవర్గంలో నిర్మాణరంగంతోపాటు ఇతర రంగాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటుచేయాలని రోడ్లు భవనాలశాఖ మంత్రికి చెప్పానన్నారు.
త్వరలో ఎన్నారై పాలసీ కొన్ని రాష్ర్టాల్లో ఎన్నారై పాలసీ ఉన్నదని, తెలంగాణ ఎన్నారై పాలసీ కావాలని.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండేవాళ్లు కోరుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై ఈ మధ్యనే సీఎస్, సలహాదారు రాజీవ్‌శర్మ కేరళ వెళ్లి అధ్యయనంచేసి వచ్చి నివేదిక ఇచ్చారని చెప్పారు. గల్ఫ్‌లో దురదృష్టవశాత్తూ చనిపోయిన వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు మంత్రి కేటీఆర్, ఎంపీలు పైరవీలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో గల్ఫ్‌కు పోయినవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నదని.. దీంతోపాటు మరో మూడు నుంచి ఐదుగురు మంత్రులు, 16-17 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో వీళ్లందరినీ అక్కడికి పంపి.. తర్వాత తాను కూడా స్వయంగా అధికారులను వెంటబెట్టుకొని గల్ఫ్‌కు వెళ్లి అక్కడి తెలంగాణ ప్రజలతో మాట్లాడుతానని చెప్పారు. అసలు ఎందుకు వచ్చిన్రు? కంపెనీ వాళ్లు ఏమంటున్నరు? తదితర వివరాలు కనుక్కొంటానని, రాయబారితో మాట్లాడి వారి సమస్యలకు ఒక పరిష్కారం తీసుకొస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందో.. తర్వాతో తాను గల్ఫ్ పర్యటనకు వెళ్తానని చెప్పారు.
57 ఏండ్లు దాటినవారికి వృద్ధాప్య పింఛన్ సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కచ్చితంగా అమలుచేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. 57 ఏండ్ల వయసు దాటిన వారికి మార్చి 31 తర్వాతనుంచి రూ.2016 పింఛన్ పంపిణీచేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని చెప్పారు. అర్హత వయస్సు 57 చేయడం వల్ల ఎంతమందికి పింఛన్ ఇవ్వాలన్న సంఖ్య కూడా ఇదమిత్థంగా ఖరారైందని.. అవసరమైతే సంక్షేమశాఖ మంత్రి, ఇతర మంత్రులతో కలిపి ఒక సబ్‌కమిటీ కూడా వేస్తామని సీఎం పేర్కొన్నారు.
ఏడాదిలో నిరక్షరాస్యత రూపుమాపుతాం ‘అంతా ఇన్నేండ్లు మేమే చేసినం అని కాంగ్రెస్‌వాళ్లు జబ్బలు చర్చుకున్నరు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల 50 ఏండ్ల పరిపాలన పుణ్యమే నిరక్షరాస్యత. అందుకే రాష్ర్టాన్ని వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా మార్చాలనుకొంటున్నాం. ఏ ఊరుకా ఊరు పెద్దలు, విద్యావంతులు నిర్ణయం తీసుకొంటే నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయొచ్చు. ఇందుకోసమే ఈచ్‌వన్ టీచ్‌వన్ కార్యక్రమాన్ని తీసుకున్నాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణపై ఉన్న నిరక్షరాస్య మచ్చను ఏడాదిలోనే రూపుమాపుతామన్నారు. మనుషులు మృగాలుగా మారుతున్న పరిస్థితి పోవాలంటే మనుషుల్లో మానవత్వ విలువలు పెంచాల్సి ఉన్నదని, ఇందుకోసం నైతిక విలువలను ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇందుకోసం మాజీ డీజీపీలు, పీఠాధిపతుల సహకారం తీసుకొంటామని చెప్పారు.
రిటైర్మెంట్ వయసు పెంచుతాం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామన్న హామీని తప్పకుండా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. పీఆర్సీ కూడా ఎంతోకొంత పెంచుతామని ఉద్యోగులు ఆశిస్తారని, కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సక్కగ పనిచేస్తలేదని.. ఎందుకు పనిచేస్తలేదో అర్థం కావడంలేదన్నారు. అసలు వాళ్ల ఆలోచనా సరళికూడా సరిగ్గాలేదని విమర్శించారు. పీఆర్సీ, జీతాలు పెంచాలంటే.. కేంద్రం కథ ఇట్ల ఉన్నదని.. ఉద్యోగస్థులను తానే పిలిచి స్వయంగా మాట్లాడుతానని తెలిపారు. తాము కష్టపడుతున్నందున తృణమో పణమో పెంచాలని ఉద్యోగులు ఆశిస్తారని, పరిమితిని బట్టి ఇస్తామని చెప్పారు.
హైదరాబాద్ చుట్టూ హరితాన్ని కాపాడాలి సముద్రతీర ప్రాంతంలో ఉన్న మెల్బోర్న్, సిడ్నీ, లండన్‌తోపాటు మన దేశంలోని ముంబై, చెన్నై వంటి నగరాలు ఎక్కువగా కాలుష్యానికి గురికావడం లేదని సీఎం అన్నారు. కానీ చైనాలోని బీజింగ్ వంటి ల్యాండ్లాక్డ్ పట్టణాలు భయంకరమైన కాలుష్యంలో చిక్కుకొంటున్నాయని, అందుకే అక్కడ కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారని చెప్పారు. బీజింగ్ తర్వాత మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 1.50 లక్షల ఎకరాల అటవీభూమి ఉన్నదని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని చెప్పారు. వీటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా జర్నలిస్టులు మంచి వార్తలు రాయాలని సీఎం కోరారు.
త్వరలోనే పట్టణ ప్రగతి రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్చట్టాన్ని, నూతన మున్సిపల్‌చట్టాన్ని కఠినంగా అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కొత్త మున్సిపల్చట్టం అమలు విషయంలో టీఆర్ఎస్ వాళ్లను సైతం ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల్లో పోటీచేసే ముందే కొత్తచట్టాన్ని స్పష్టంగా చదువుకోవాలని అందరు అభ్యర్థులకు చెప్పామని గుర్తుచేశారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. ప్రతినెలా రూ.339కోట్ల గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని, అదేరీతిలో పట్టణాలకు సైతం నెలకు రూ.2 వేల కోట్ల వరకు నిధులు ఇస్తామన్నారు. ఈ నిధులను ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దని అధికారులకు చెప్పానన్నారు. మార్చి 31 తర్వాత బడ్జెట్లో ప్రతి నెలా ఇందుకోసం నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
సీఏఏ వందకు వందశాతం తప్పుడు నిర్ణయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసినప్పుడు సీఏఏకు మద్దతిచ్చేదిలేదని స్పష్టంచేశాను. దీనిమీద చాలామంది సీఎంలతో, ఇతర పార్టీ నేతలతో మాట్లాడిన. రాబోయే నెల రోజుల్లో హైదరాబాద్‌లో ప్రాంతీయ పార్టీలు, పలువురు ముఖ్యమంత్రుల కాన్క్లేవ్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇది దేశ భవిష్యత్తు విషయం. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో హండ్రెడ్ పర్సంట్ తీర్మానం చేస్తాం.