-కాలేజీలను సాఫ్ట్వేర్సంస్థలు దత్తత తీసుకోవాలి -మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ -4జీ సేవలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి : కేటీఆర్ -హైటెక్స్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పో-2014 ప్రారంభం

హర్డ్‌వేర్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పో-2014ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలను సాఫ్ట్వేర్కంపెనీలు దత్తత తీసుకోవాలని సూచించారు. భారతదేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను రాబోయే ఎనిమిది నెలల్లో ఏర్పాటు చేయనున్నామని, దీని ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించనున్నామన్నారు.
రాష్ట్రంలో నూతనంగా పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఓ పాలసీని తీసుకురానుందన్నారు. ఫిక్కీ, ఫ్యాప్సీ, సీఐఐల భాగస్వామ్యాలతో హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టనుందని వివరించారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను మహేశ్వరంలో గుర్తించడం జరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని వివిధ సంస్థలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 4జీ సేవలతో సమాచార విప్లవం రాబోతుందని దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అద్భుత ఫలితాలు రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎక్స్పో స్టీరింగ్ కౌన్సిల్ చైర్మన్ జేఏ చౌదరి, రాజీవ్ మఖానీ, సంజీవ్‌కుమార్, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.