-ఎన్టీఆర్ బతికుంటే ఉరేసుకునేవారు -ప్రాజెక్టులను అడ్డుకుంటున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ, దాంతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డితో, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ముఖ్యమం త్రి కేసీఆర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు రాష్ట్రంలోని కోటి ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సీడబ్ల్యూసీకి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇన్ని వర్షాలు కురిసినా తెలంగాణ ప్రాజెక్టులు, చెరువులు ఇంకా పూర్తిగా నిండని పరిస్థితులు ఉన్నాయన్నారు. మరోవైపు గోదావరి వరద నీరు ఐదు లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలిశాయన్నారు.

మన నీళ్లు మనం వాడుకోలేకపోవడం బాధాకరమన్నారు. ఇలా వృథా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో రిజర్వాయర్లు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా పొలాలకు నీళ్లు మళ్లించేందుకు నిధులు వెచ్చిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ విధానాలను అడ్డుకునేలా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో కేంద్రానికి ఫిర్యాదులు చేయడం ఎంత దారుణమో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు చర్యలను అడ్డుకోలేని టీటీడీపీ నేతలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. అర్థం లేని ఆందోళనలకు దిగిన టీడీపీకి కాంగ్రెస్ మద్దతు పలికిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీ ఇవాళ కాంగ్రెస్ మద్దతును తీసుకోవడం దారుణమన్నారు. ఎన్టీఆర్ బతికుంటే ఈ ఘోరాన్ని చూసి ఆత్మహత్యకు పాల్పడేవారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. టీటీడీపీ నేతలు తెలంగాణ ప్రజల పక్షమో, చంద్రబాబు పక్షమో తేల్చుకున్న తర్వాతే ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలన్నారు. బాబు మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కాదన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ బాధ నుంచి విముక్తి కలిగించే డిండి ప్రాజెక్టును అడ్డుకునే విధానాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నిం చారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రజలకు ఏమి చేశామో నెమరువేసుకోకుండా ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయం దండుగని, ఉచిత విద్యుత్ వైర్లపై బట్టలు ఆరేసుకోవడానికి పని చేస్తుందని విమర్శలు చేసి, రైతులపై కాల్పులు జరిపించిన టీడీపీ నేతలు ఇప్పడు మొసలీ కన్నీరు కారుస్తున్నారన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని కాంగ్రెస్ నేతలు అన్నదాతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే నేడు రైతుల ఆత్మహత్యలకు కారణమన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి అడుగు రైతుల కోసం వేస్తున్నారని, ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను రైతులు కూడా గ్రహించాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నదన్నారు. అంతకుముందు దుబ్బాక నియోజకవర్గంలో నక్సల్స్ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఆపద్బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, విద్యుత్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెక్కులను అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీ లు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.