Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గిరిజనుల కోసం..హరీశ్‌నాయక్‌నవుతా..!

-కాంగ్రెస్ నాయకులది కలక్షన్ విధానం -కారు గెలుపు… అభివృద్ధికి మలుపు -ఇక నుంచి ఖేడ్‌లో ప్రగతి పరుగులు -గ్రామ గ్రామాన టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం.. -అవినీతి చరిత్ర, అణచివేతలకు చరమగీతం పాడాలి -భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు -మీలో ఒకడిలా పనిచేస్తా : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి

Harish-Rao-Narayankhed-Elections-01

నారాయణఖేడ్ నియోజకవర్గంలో అణచివేతకు చరమగీతం పాడాలని మంత్రి హరీశ్‌రావు పిలునిచ్చారు. మంగళవారం మనూర్ మండ పరిధిలోని కారముంగి, కరస్‌గుత్తి, మావినెళ్లి, ఉట్‌పల్లి, దామరగిద్ద, ఎర్రబొగుడ, మోర్గీ, షాపూర్, గొందెగావ్, గూడూర్, నాగిల్‌గిద్ద గ్రామాలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖేడ్ ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్ పాలకులది సెలక్షన్, ఎలక్షన్, కలెక్షన్ విధానమని మిమర్శించారు. ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత పదవులను పంచుకొని డబ్బులు కలెక్షన్ చేయడమే పనిగా పెట్టుకొనేవారని మండిపడ్డారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశారు తప్ప ఏనాడూ ప్రజల క్షేమం గురించి ఆలోచించ లేదని అన్నారు. పేదలకు మంజూరైన ఇండ్లకు సంబంధించిన 20 చొప్పున బిల్లులను ఒక్కో నాయకుడు దిగమింగాడని ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాక పాలించిన పార్టీ ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేందుకు రోడ్లను వేయించలేదని, ఇక్కడి ప్రజలకు కనీసం నీటిని కూడా తాపలేదన్నారు.

నులక మంచాల మీద స్నానాలు చేసి అవే నీటిని బట్టలు ఉతుకునేందుకు వాడుకునేంత దుస్థితి ఇక్కడి ప్రజలదని ఆవేదన వెలుబుచ్చారు. దవాఖానాల్లో పందులు తిరుగుతుంటే ప్రజల ఆరోగ్యం ఎలా బాగుంటుందనే సోయి కూడా గత పాలకులకు లేకుండా పోయిందన్నారు. ఊళ్లలో మోరీలనైనా నిర్మించని నాయకులు.. ఇప్పుడు అది చేశాం.. ఇదీ చేశాం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని చెట్టుకొకరు పుట్టకొకరన్నట్లు ఇతర నియోజకవర్గాల మార్కెట్ యార్డులకు వెళ్లి అమ్ముకోవలసిన దుస్థితిని కల్పించిన ఘనత కాంగ్రెద్‌ది కాదా అని ప్రశ్నించారు. కాలేజీలు నిర్మించకపోవడంతో యువకులు కార్మికులుగా మారిన విషయం నిజం కాదా అని ధ్వజమెత్తారు. 60 ఏండ్లుగా కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేసిన పాపానికి ఆడబిడ్డలు భూజాలు కాయలు కాసేలా నీళ్లను మోయాల్సి వచ్చిందన్నారు. మన ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి నల్లాద్వారా నీళ్లిచ్చి ఆడబిడ్డల కాళ్లు కడుగుతామన్నారు.

అందినకాడికి దోచుకున్న గత పాలకులు గత పాలకులు ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పదవులను పంచుకొని అందినకాడికి దోచుకున్నారని, ప్రజలు ఇప్పటికి వారి అవినీతిని గ్రహించారని పేర్కొన్నారు. వారు ఆస్తులు పెంచుకొని.. తమను అంధకారంలో నెట్టిన విషయం అందరికీ అర్థమైందన్నారు. ఓట్లు మనవైతే అభివృద్ధి నాయకులదైందని ఇంకా పురోగతిపై వాళ్లు మాట్లాడడం కేవలం మభ్యపెట్టడం మాత్రమేనన్నారు. తాము గ్రామాలకు వెళ్తుంటే ఊరికి పోతున్నమా? లేక అడవికి పోతున్నమా అన్నట్లున్న పల్లెలు, తండాల పాపం కాంగ్రెసోళ్లదేనని విమర్శించారు. పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించుకున్నది ఎవ్వరనేది ఏ పిలగాడిని అడిగినా చెబుతున్నారని, ఇంకా ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.

Harish-Rao-Narayankhed-Elections-02

కారు గెలుపు.. అభివృద్ధికి మలుపు ఈ ఎన్నికల్లో కారుకు ఓటు వేసి ఆదరిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిని చేస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల రూపు రేఖలను మార్చేందుకు ఆరవై రోజుల నుండే కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖేడ్ వెనుకబడిందన్న బాధతో దత్తత తీసుకున్నానని, ఇక నుంచి నియోజకవర్గం ప్రగతి పథంలో పరుగులు పెట్టనున్నదని తెలిపారు. అన్ని అవసరాలను గుర్తించామని, నిధులిచ్చేందుకు సీఎం కేసీఆర్ సంసిద్ధతతో ఉన్నారని ప్రకటించారు. సిద్దపేట తనకు ఒక కన్నైతే ఖేడ్ మరో కన్నని.. మీ కష్టాలు తొలగించడమే ధ్యేయమన్నారు.

గాడిదకు గడ్డేసి బర్రెకు పాలుపిండుతే ఇస్తదా? గాడిదకు గడ్డేసి బర్రెను పాలివ్వమంటే ఇవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఖేడ్ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి ప్రజల కళ్లకు కనిపిస్తుందని, అందుకే జనం టీఆర్‌ఎస్‌కు గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పింఛన్లు, ఆరుకిలోల బియ్యం, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంటును అందిస్తూ సంక్షేమం అంటే ఇదీ అని ప్రభుత్వానికి పేరురావడం.. ప్రతిపక్షాలకు గిట్టడం లేదని ఎద్దేవా చేశారు.

చక్కటి పాలనకు మద్దతివ్వండి ఇన్నేండ్లుగా కొనసాగుతున్న అణచివేతలకు చరమగీతం పాడాలని మంత్రి అన్నారు. అది ఓటు రూపంలో ప్రజల చేతుల్లోనే ఉన్నదని, చక్కటి పాలనకు మద్దతునిచ్చి.. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని హితవు పలికారు. మనూర్ మండలంలో బ్యాంకులతో పాటు మరిన్ని రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేసుల సంస్కృతిని వీడి మనమంతా కలసి ప్రేమతో, ఆలోచనతో పనిచేయాలనేది తమ పార్టీ ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చే క్వార్టర్ సీసాలకు, డబ్బులకు తలొగ్గకుండా మీ బాగును ఆశించి ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. అన్ని విధాలుగా ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థి భూపాల్‌రెడ్డికి గెలిపించాలని అభ్యర్థించారు.

ప్రతిపక్షాలను నమ్మకండి: ఎంపీ బీబీ పాటిల్ ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నమ్మవద్దని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఈ ఉప ఎన్నిక ప్రజలు పూర్తిస్థాయిలో బాగు పడేందుకు మంచి అవకాశమని.. చక్కగా వినియోగించుకోవాలని కోరారు. చెప్పిన ప్రతి పనిని ఆచరణలో పెట్టే సీఎం కేసీఆర్ ఉండగా ఖేడ్ ప్రజలు ఇతర పార్టీలను నమ్మవలసిన అవసరం ఏముందన్నారు. ఇక ముందు ఇంతటి సువర్ణావకాశం ప్రజలకు రాదని ఓటు అనే అస్త్రంతో దీటుగా జవాబు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీరెడ్డి  నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి ప్రతీ ఒక్కరూ టీఆర్‌ఎస్ పార్టీని బలపర్చి భూపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్, బండ్రాన్‌పల్లి, పైడిపల్లి గ్రామాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ఖేడ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుతావనికి మద్దతివ్వాలని కోరారు. ఆమె వెంట మెదక్ జడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు వనజ, క్రిష్ణాపూర్ ఎంపీటీసీ శ్యామలశ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ వనజపండరి, అనంతసాగర్ సర్పంచ్ ఈశ్వరమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు చెన్‌బసప్ప, సప్తగిరి, సారయ్య, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సిద్దు, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల కోసం హరీశ్‌నాయక్‌ను అవుతా.. గిరిజనుల బాధలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి బతుకులను బాగు చేసేందుకు తాను హరీశ్‌నాయక్‌ను అవుతానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మనూర్ మండలం లోని కారముంగి, కరస్‌గుత్తి, ఉట్‌పల్లి, దామరగిద్ద తదితర గ్రామాల్లో ఆయన ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలకు పెద్ద సంఖ్యలో హాజరైన గిరిజనులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఇక్కడి తండాలలో నీళ్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో గిరిజనులు చాలా బాధలు పడుతున్నారని తెలిపారు. ఒక దశలో తండాలకు పిల్లను ఇవ్వడానికి జంకుతున్నారని చెప్పారు. అదే విధంగా రోడ్డు సరిగ్గా లేక నానా తంటాలు పడుతూ తమ బతుకులను వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండాల పరిధిలో అన్ని రకాల వసతులను కల్పించడంతో పాటు వచ్చే ఎన్నికల సమయానికి తండాలు పంచాయతీలుగా మారబోతున్నాయని చెప్పారు. ఇక నుంచి గిరిజనుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారికి నాయకుడిగా.. హరీశ్‌నాయక్‌గా కొనసాగుతానని మంత్రి వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.