Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హస్తినలో సీఎం కేసీఆర్

-ఐదు రోజులపాటు రాజధానిలో మకాం -ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ -నీతి ఆయోగ్ తొలి సమావేశానికి హాజరు

KCR-in-Delhi-01

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఆయన నివాసంలో జరిగే నీతి ఆయోగ్ తొలి పూర్తిస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించనున్న నేపథ్యంలో ఆయా రాష్ర్టాల ప్రణాళికలు, వాటికి బడ్జెట్ కేటాయింపులపై అవగాహన కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా కేసీఆర్ భేటీ అయ్యి రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇనుము-ఉక్కు శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో ఉద్యోగ్‌భవన్‌లో భేటీ కానున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై ఆయనతో చర్చించనున్నారు. నిర్మాణపు పనులు, ఇతర అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేయాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌తో పర్యావరణ భవన్‌లో మధ్యాహ్నం 2.15 గంటలకు భేటీ కానున్నారు. ప్రాణహిత-చేవెళ్ళ, దేవాదుల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన కాంపా ఫండ్స్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన హరితహారం ప్రాజెక్టు గురించి కూడా జవదేకర్‌కు సీఎం వివరించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మతో నిర్వాచన్ సదన్‌లో భేటీ కానున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్ర అంశాలపై ప్రధాన దృష్టి : వేణుగోపాలచారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన గురించి ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి మీడియాకు వివరిస్తూ, ఐదు రోజుల పాటు ఢిల్లీలో గడిపే కేసీఆర్.. రాష్ర్టానికి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపైన ప్రధాని సహా సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చిస్తారని తెలిపారు. ముఖ్యంగా రానున్న వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నందున జూన్ వరకు కేంద్ర కోటా నుంచి తూర్పు గ్రిడ్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ను ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారానే సరఫరా చేయాల్సిందిగా కోరుతారని, అనంతరం ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగే సమావేశంలో కూడా విద్యుత్ అంశాలపై చర్చిస్తారని తెలిపారు. దీనికి తోడు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే 4000 మెగావాట్ల ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించినందున సింగరేణి బొగ్గు గనుల్లో 49% బొగ్గు కోటాను తెలంగాణకు కేటాయించాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తారని వేణుగోపాలచారి తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో శనివారం భేటీ కానున్నారని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక వనరులను వెచ్చించినందున ఆ మేరకు మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాల్సిందిగా కూడా కోరుతారని తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులు సంతోష్ గాంగ్వర్, వెంకయ్యనాయుడు, ఉమాభారతి (అందుబాటులో ఉంటే), రాంవిలాస్ పాశ్వాన్, బీరేంద్రసింగ్, సదానందగౌడ తదితర మొత్తం 11 మంది కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. సోమవారం ఉదయం జరిగే నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొననున్నారు. వామపక్ష తీవ్రవాదం అంశంపై తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సీఎంలు, సీఎస్‌లు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.