ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ బుధవారం పట్టాలెక్కింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య తొలి హెల్త్‌కార్డును ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్‌కు అందజేశారు. సచివాలయంలోని డీబ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య రాజయ్య హెల్త్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
-టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌కు తొలికార్డు అందజేత -మొత్తం 59 మందికి కార్డులు జారీ -నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో ప్రక్రియ -సీఎం కేసీఆర్ కలలను సాకారం చేయాలి: డిప్యూటీ సీఎం రాజయ్య -ఉద్యోగుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది: దేవీప్రసాద్ -కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు: శ్రీనివాస్‌గౌడ్
తొలిరోజు మొత్తం 59 మంది ఉద్యోగులకు కార్డులు పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ.. ఎటువంటి ఆంక్షలు లేకుండా హెల్త్‌కార్డుల జారీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ప్రీమియం చెల్లిస్తామని ఉద్యోగులు ముందుకొచ్చినా.. సున్నితంగా తిరస్కరించి, మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారని గుర్తుచేశారు. ఉద్యోగులకు ఇది దీపావళి కానుక అని ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఉద్యోగులందరూ బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సాకారానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగులు మరింత ఎక్కువ పనిచేసి ప్రభుత్వ ఖజానాను పెంచాలని సూచించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ హెల్త్‌కార్డుల విషయంలో తెలంగాణ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించిందన్నారు. ఉద్యోగులు ఎవ్వరూ ఊహించని రీతిలో ఆంక్షలు, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా హెల్త్‌కార్డులు వస్తున్నాయన్నారు.
గత ప్రభుత్వాలు కార్డులు ఇవ్వడంలో విఫలమయ్యాయని, కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన 15 నిమిషాల్లో అంగీకరించారని సభికుల హర్షధ్వనాల మధ్య చెప్పారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం అంత సులువు కాదని, కానీ కేసీఆర్ మాత్రం ఉద్యోగులు ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా, ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం సంతోషకరమన్నారు. టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు హెల్త్‌కార్డుల విషయంలో 42 సమావేశాలు జరిగాయని గుర్తుచేశారు.
2008లో అప్పటి సీఎం వైఎస్ హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఒక్కోసారి ఒక్కోరకంగా మాటలు మార్చి, చివరికి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, దీనికి ఆమోదం లభించిందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చారని అభినందించారు.
ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి, రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, వివిధ ఉద్యోగసంఘాల నేతలు విఠల్, మమత, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హరిబాబు, కే వెంకటేశ్వర్లు, బీ రేచల్, విజయలక్ష్మి, ముజీబ్, మన్నెబోయిన కృష్ణయాదవ్, సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీ వెంకటరెడ్డి, మునగాల మణిపాల్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, భుజంగరావు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.