-త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్ ఇన్
-నగరాభివృద్ధి ప్రణాళికలపై ప్రజలతో చర్చ
-సమస్యలు, సలహాల స్వీకరణ

హలో..: మన మహానగరం ఎలా ఉండాలనుకుంటున్నారు..?ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహా చెప్పండి. ప్రభుత్వం ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి చర్యలు తీసుకుంటోంది. నగరాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. విశ్వనగరం కోసం మీరింకేమైనా సూచనలు ఇస్తారా..!సిటీలోని పేదలకు ప్రభుత్వం ఇంకేమైనా పథకాలు తేవాలా..!ఇప్పుడున్న వాటిలో ఏమైనా సమస్యలున్నాయా..?
ఈ ప్రశ్నలన్నీ త్వరలో మీ సీఎం మిమ్మల్ని నేరుగా అడగబోతున్నారు. నగరాభివృద్ధికి మీ సూచనలు తీసుకోనున్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేసి.. మహాప్రణాళికల రూపకల్పన చేస్తున్నారు. వాటిని ఇప్పుడు ఆయన ప్రజల ముందు ఆవిష్కరించి.. సమస్యలు, సలహాలు స్వయంగా స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు సీఎం త్వరలోనే టీవీ ద్వారా ఫోన్ ఇన్ కార్యక్రమంతో ప్రజల ముందుకురాబోతున్నారు. దీనికోసం ప్రణాళికలు కూడా పూర్తయినట్లు సమాచారం.
కనీవినీ ఎరుగనిరీతిలో నగరంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు నగరానికి కొత్త లుక్ ఇచ్చేందుకు పక్కా స్కెచ్ గీశారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసి తగిన ప్రణాళికలకు రూపకల్పన చేశారు. అంతేకాదు, ఈ ప్రణాళికలను ప్రజలముందు ఆవిష్కరింపజేసి సమస్యలపై వారితో ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా నేరు గా మాట్లాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకాలం పారాయిపాలనలో మసకబారిన నగర ప్రతిష్ఠకు పూర్వవైభవాన్ని తెచ్చే విధివిధానాలను ప్రజలముందు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరవాసులు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ అనేది అందరికీ తెలిసిందే. ఏళ్లుగా ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నా దీన్ని పరిష్కరించేందుకు గత సీమాంధ్ర పాలకులు చేసింది శూన్యం. మాస్టర్‌ప్లాన్ అమలు పేరుతో వీలైనచోట రోడ్లను విస్తరిస్తూ వీలుకానిచోట అలాగే వదిలేస్తూ సమస్యలను యథాతథంగా కొనసాగించారు. సమస్య శాస్వత పరిష్కారానికి కనీసం ఆలోచన కూడా చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టిందే తడవుగా నగర సమస్యలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు, నగరానికి పూర్వవైభవం తెస్తూ ప్రపంచస్థాయి నగరాల సరసన నిలిపేందుకు అన్ని అంశాలపైనా తనదైన శైలిలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
పలుమార్లు అధికారులతో జరిపిన సమీక్షల అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆయా రంగాల్లో అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రాఫిక్‌తోపాటు పలు ఇతర సమస్యల పరిష్కారానికి సుమారు 18.5వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల సమస్య లేకుండా నేరుగా నగరం ఇటు చివరి నుంచి అటు చివరి వరకు నాలుగువైపులా సుమారు 70కిలోమీటర్లమేర ఎనిమిది రోడ్లను ఎక్స్‌ప్రెస్‌వేలుగా, అంతేకాకుండా ఎనిమిది ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలవకుండా ైఫ్లెఓవర్లు నిర్మించాలని నిశ్చయించారు. మొదటి దశలో చేపట్టే ఈ పనులకు రూ. ఐదువేల కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు.
అయితే ఈ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో ఎక్కడా ప్రజల ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలని నిర్ణయించడంతో అధికారులు ప్రస్తుత రోడ్ల వెడల్పుపై ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే, నాలాల విస్తరణ, స్లమ్ ఫ్రీ సిటీ పథకం, శ్మశానాల అభివృద్ధి, హరితహారం తదితర పథకాలపై కూడా బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు చిన్న డాక్యుమెంటరీల తరహాలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా రూపొందించి సీఎం ముందు ప్రదర్శించగా, వీటిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నగర అభివృద్ధి పథకాలను ప్రజలకు నేరుగా వివరించడంతోపాటు వారి సమస్యలను స్వ యంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు త్వరలో టీవీ ద్వారా ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం కావడంతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన నిశ్చయించారు. ము ఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి సంబంధించి బల్దియా చేపట్టిన సర్వే వచ్చే ఒకటి రెండు రోజుల్లో పూర్తికానుంది.
దీంతో వీటి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లలో స్పష్టత వచ్చే వీలుంది. సీఎం ఫోన్ ఇన్ సందర్భంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోబోయే చర్యలతోపాటు నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని సీఎం కేరళ, ఢిల్లీ పర్యటనల తరువాత ఏర్పాటుచేసే అవకాశముందని వారు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరాభివృద్ధి, నగర సమస్యలపై ప్రజలతో నేరుగా సీఎం మాట్లాడడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. నగరానికి పూర్వవైభవం తేవడంతోపాటు నగరవాసుల కష్టాలు తీర్చేందుకు ఈ తరహా కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తుండడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది.