Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హెరిటేజ్‌లో డిటర్జెంట్

-కల్తీపాలపై సభలో దుమారం -నాణ్యత పరీక్షల్లో బట్టబయలు.. గత సంవత్సరమే కేసు నమోదు -వైద్యారోగ్యశాఖ మంత్రి రాజయ్య వెల్లడి -కల్తీపాలపై ప్రశ్నించిన టీడీపీ.. హెరిటేజ్ ప్రస్తావన రావడంతో రివర్స్‌గేర్ -మంత్రి సమాధానం అడ్డుకునే యత్నం.. టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యుల వాగ్యుద్ధం -కేరళలో హెరిటేజ్ పాలు నిషేధిస్తే ఇక్కడ మీకెందుకు ఉలుకు? -నిషేధించమంటారా? కల్తీ పాలు తాగమంటారా?: టీడీపీ సభ్యులపై కేటీఆర్ ఆగ్రహం -ఏపీ నామినేట్ చేసిన తొత్తులంటూ ఆగ్రహం.. గందరగోళంతో సభ రెండుసార్లు వాయిదా

KTR

రాష్ట్రంలో కల్తీ పాల వ్యవహారం బుధవారం అసెంబ్లీలో దుమారం రేపింది. కల్తీపాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని భావించిన టీడీపీ సభ్యులు.. అది కాస్తా తమకే ఎదురు తిరిగేసరికి దిక్కుతోచని స్థితిలోపడిపోయారు.

కల్తీపాలపై టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య మంత్రి టీ రాజయ్య సమాధానం చెప్పే క్రమంలో నగరంలో హెరిటేజ్ పాలలో జరిగిన కల్తీ, కేరళలో ఆ సంస్థ సరఫరా చేసే పాలను నిషేధించిన అంశాలు ప్రస్తావనకు రావడంతో సభలో రభస మొదలైంది. కల్తీపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, సదరు కల్తీదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీడీపీ సభ్యులు.. మంత్రి సమాధానంలో హెరిటేజ్ ప్రస్తావన రావడంతో సభలో గందరగోళం సృష్టించి, అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఒక దశలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ అంశంపై సభ రెండుసార్లు వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయం అంతా కేవలం ఒకే ప్రశ్నతోనే ముగించాల్సి వచ్చింది. గందరగోళం మధ్యే సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాజయ్య.. గతేడాది జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద అధికారులు 32 పాల నమూనాలు సేకరించి, వాటికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనాణ్యత పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇందులో 11 నమూనాల్లో కల్తీ జరిగిందని నిర్ధారించినట్లు చెప్పారు. సేకరించిన నమూనాల్లో నగరంలోని పంజాగుట్ట వద్ద ఒక పాల సెంటర్‌లో సేకరించిన హెరిటేజ్ టోల్డ్ మిల్క్ పాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇందులో ప్రధానంగా డిటర్జెంట్ వాడినట్లుగా తేలిందని చెప్పారు. ఈ అంశంపై ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు. బుధవారం ఉదయం పది గంటలకు శాసనసభ మొదలైన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 374వ ప్రశ్నకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్యను కోరారు. రాజయ్య సమాధానమిస్తూ.. గతంలో పాల నమూనాల సేకరణలో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగాలేని పాలు లభించాయని, ఆ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.

అనంతరం టీడీపీ సభ్యులు ఎస్ రాజేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు గీతారెడ్డి, చిన్నారెడ్డితో పాటు టీఆర్‌ఎస్ సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, రెడ్యానాయక్, వైఎస్సార్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో కల్తీ పాలు రాజ్యమేలుతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కల్తీ పాలతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నదని టీడీపీ సభ్యులు అన్నారు.

వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో సరిపోను వైద్యులు, సిబ్బందిలేరని సభలో ప్రస్తావించారు. అయితే గతంలో కల్తీ పాలుగా నిర్ధారించిన నమూనాలు ఏ సంస్థలకు చెందినవో, వాటిని ఎక్కడ సేకరించారో వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ రాజయ్యను కోరారు. దీనితోపాటు కేరళలో హెరిటేజ్ పాలు కల్తీవంటూ తేల్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిషేధించిందని, ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ హెరిటేజ్ పాల నాణ్యత పరిశీలించారా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో గతేడాది హైదరాబాద్‌లో నాణ్యత ప్రమాణాలులేని నమూనాలుగా నిర్థారించిన వాటిల్లో హెరిటేజ్ సంస్థ పాలు కూడా ఉన్నాయని ముందుగానే గుర్తించిన టీడీపీ సభ్యులు వైద్యారోగ్య శాఖ మంత్రి రాజయ్య సమాధానం చెప్పకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, నినాదాలు చేశారు. ఒకవైపు వారి నినాదాలు కొనసాగుతుండగానే.. మంత్రి రాజయ్య వివరాలను సభ ముందుంచే ప్రయత్నం చేయడంతో టీడీపీ సభ్యులు మరింత హడావుడి చేశారు. దీంతో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చర్చను ప్రారంభించిన టీడీపీ సభ్యులు తీరా మంత్రి సమాధానం చెబుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

హెరిటేజ్ సంస్థ పాలను కేరళలో నిషేధించారనే విషయాన్ని ప్రస్తావిస్తే టీడీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో తనకు అర్థం కావడంలేదని అన్నారు. టీడీపీ సభ్యులు అడిగిన కల్తీ పాలు (సింథటిక్ మిల్క్) అంశంపై చర్చను ప్రారంభించింది వాళ్లే. అందులో భాగంగా కొందరు సభ్యులు హెరిటేజ్ పాలను కేరళలో నిషేధించిన విషయాన్ని ప్రస్తావించారు.

మరి అది నిజం కాదా? ఇదిగో (ఆ ఉత్తర్వులను చూపుతూ) కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్ పాలను నిషేధిస్తూ విడుదల చేసిన ఉత్తర్వు. ఆ నిర్ణయాన్ని ప్రస్తావిస్తే ఇక్కడ టీపీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఆశ్చర్యం కలుగుతున్నది. ఈ ఉత్తర్వుల కాపీని కూడా సభకు సమర్పిస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్లు.. చట్టబద్ధంగా మనకు నామినేట్ అయిన ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉంటే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన తొత్తులు ఈ టీడీపీ ఎమ్మెల్యేలు. వీళ్లు తెలంగాణ ప్రజల తరఫున ఎప్పుడూ మాట్లాడరు.

వీళ్లలో ఎవరూ హెరిటేజ్ ప్రతినిధులు, డైరెక్టర్లు లేరు. వీళ్లెందుకు ఉలిక్కిపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ అధినేత తొత్తులు వీళ్లు. తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడకపోవడం దురదృష్టకరం. హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్లు సభ వెలుపల తమ వివరణ ఇచ్చుకోవాలి. కానీ ఆ సంస్థ ప్రతినిధులు, డైరెక్టర్ల మాదిరిగా వీళ్లు వ్యవహరించడం భావ్యం కాదు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా అధికారపక్షం సభ్యులు టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్తీ పాలను అమ్మే సంస్థ అమ్మకాలను నిషేధించాలా? లేక ప్రజలకు కల్తీపాలనే సరఫరా చేయాలంటారా? చెప్పండంటూ టీడీపీ సభ్యులను ఇరకాటంలోకి నెట్టారు. అనంతరం వైద్య, ఆరోగ్య మంత్రి తన సమాధానాన్ని కొనసాగిస్తూ.. ఆహార కల్తీకి ఎలాంటి శిక్షలున్నాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అనే అంశాలు వివరించారు.

గందరగోళం మధ్యే చిట్టా విప్పిన మంత్రి టీడీపీ సభ్యులు గలాటా సృష్టిస్తున్నప్పటికీ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం పూర్తిచేశారు. గతంలో నాణ్యతా ప్రమాణాలులేని పాలు ఏ సంస్థలకు చెందినవో వివరించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ చట్టం ప్రకారం.. మిల్క్ లూజ్, హెరిటేజ్ టోల్డ్ మిల్క్, డబుల్ టోల్డ్ మిల్క్, నెస్టిల్ ఎట్ టోల్డ్ మిల్క్, టెట్రాపెన్ టోల్డ్ మిల్క్ (విజయ సుప్రభాత్), కౌ మిల్క్ నందిన్ గుడ్‌లైఫ్, గుడ్‌లైఫ్ స్లిమ్మ్‌డ్ మిల్క్, బఫెలో మిల్క్, తిరునల పెస్టిరైజ్‌డ్ టోన్డ్ మిల్క్, పెస్టిరైజ్‌డ్ ఫుల్ క్రీం మిల్క్, తిరుమతి పెస్టిరైజ్‌డ్‌పై ప్రస్తుతం కేసులు పెండింగులో ఉన్నట్లు చెప్పారు.

టీడీపీ సభ్యులు పోడియంను వీడకపోవడంతో స్పీకర్ మరోసారి సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశం మొదలుకాగానే టీ ప్రకాశ్‌గౌడ్ (టీడీపీ), కే లక్ష్మణ్ (బీజేపీ), తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ), రవీంద్రకుమార్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం) ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చను మొదలుపెట్టారు.

కల్తీ పాలపై సభ్యుల ఆవేదన… అంతకు ముందు పలువురు సభ్యులు కల్తీపాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, రెడ్యానాయక్, మల్లు భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, అరెకపూడి గాంధీ హైదరాబాద్‌లో కల్తీ పాలపై ప్రశ్న నెంబరు 374 కింద వివరాలు అడిగారు. ఈ క్రమంలో సభలో ఎవరేమన్నారంటే..

పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం: ఎస్ రాజేందర్‌రెడ్డి పాలను ఎక్కువగా ఇవ్వాలని కొందరు గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. దాంతో ఆ పాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మార్కెట్లో ఈ ఇంజక్షన్లు 25 పైసలకుకూడా దొరుకుతున్నాయి. ఈ పాలను తాగడంవల్ల కొంత కాలానికి చిన్నారుల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. దీనిని ప్రభుత్వం అరికట్టాలి.

పాల కొరత వల్లనే కల్తీ: చిన్నారెడ్డి జంట నగరాల్లో పాల డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఉండటంవల్ల పాలను కల్తీచేస్తున్నారు. గతేడాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లోని బోయిగూడలో కూడా కల్తీ పాల ముఠాను పట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు వారిపై చర్యలు లేవు.

పాల ప్యాకెట్‌పై బార్‌కోడ్, హాలోగ్రాం ఉండాలి: రేవంత్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆక్సిటోసిన్ పాలను గుర్తించే మెకానిజంగానీ, ల్యాబరేటరీగానీ లేదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ల్యాబరేటరీని ఏర్పాటు చేయాలి. పాల ప్యాకెట్లపై బార్‌కోడ్, హాలోగ్రామ్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో గోపాల మిత్రల జీతాన్ని రూ.5వేలకు పెంచాలి.

మన రాష్ట్రంలో ఆ సంస్థ పాల మాటేమిటి?: ఏనుగు రవీందర్‌రెడ్డి కల్తీ పాలు చిన్న పిల్లల కిడ్నీ, కాలేయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. హెరిటేజ్ పాలల్లో కల్తీ ఉందని కేరళలో అక్కడి ప్రభుత్వం హెరిటేజ్ పాలను నిషేధించింది. మరి మన రాష్ట్రంలో ఆ హెరిటేజ్ పరిస్థితి ఏమిటి? హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ సంస్థ ఎంతమొత్తంలో పాలు విక్రయిస్తున్నది? వాటి నమూనాలు సేకరించారా? అందులో ఏమైనా కల్తీ ఉందని తేలిందా?

మా మనవరాలికి పాలు తాపాలంటే భయం: గీతారెడ్డి నల్లగొండవంటి జిల్లాల్లో పాలల్లో ఇష్టానుసారంగా నీళ్లు కలుపుతున్నారు. అక్కడ ఫ్లోరైడ్ ప్రభావం పాలల్లోకి చేరుతున్నది. ఆక్సిటోసిన్ సహా అనేక రకాలుగా కల్తీ చేస్తున్నారు. మా మనవరాలికి పాలు తాపాలంటే నాకు భయమేస్తుంది. కల్తీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

ఆ కల్తీ పాలెవరివి?: రెడ్యానాయక్ మారుమూల ప్రాంతాల్లోనూ పాల కల్తీ జరుగుతున్నది. ప్రభుత్వం గతంలో 32 నమూనాలకుగాను 11 నమూనాల్లో కల్తీ ఉందని తేలినట్లు చెప్పింది. ఆ పదకొండు నమూనాలోని పాలు ఏయే సంస్థలకు చెందినవి? ఆ ఉత్పత్తిదారులెవరు? హెరిటేజ్ పాలను కేరళలో నిషేధించారు. ఈ రాష్ట్రంలో ఆ పాల విక్రయం ఎలా ఉంది?

108 తరహాలో మొబైల్ పశు వైద్యశాల గత ప్రభుత్వాలు వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌ను నిర్లక్ష్యం చేయడం వాస్తవమేనని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాసనసభలో బుధవారం పాల కల్తీ అంశంపై చర్చ నేపథ్యంలో వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో వైద్యులు, సిబ్బంది కొరత అంశంకూడా ప్రస్తావనకు వచ్చింది. ఇందుకు స్పందించిన మంత్రి పోచారం.. ఆవులు, గేదెల ఈనిన తర్వాత ఐదు నెలల వరకు పాలు మంచిగా వస్తాయని, అందుకే ఇందులో నాలుగు నెలలపాటు ప్రభుత్వమే సబ్సిడీ మీద దాణా ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. డిపార్ట్‌మెంటులో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ముఖ్యంగా మనుషులకు తక్షణం వైద్య సేవలు అందించి, దవాఖానకు తరలించేందుకు 108 వాహనం ఎలా ఉందో.. పశువులకు అలాంటి ఒక వ్యాన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అందులో ఒక డాక్టర్, తగిన సిబ్బందితోపాటు, మందులు కూడా ఉంటాయన్నారు. హెరిటేజ్‌పై గతేడాదే కేసు -ఆ కంపెనీ పాలల్లో డిటర్జెంట్ ఉన్నట్లు తేలింది -పది ఇతర నమూనాల్లోనూ నాణ్యతకు నీళ్లు -హెరిటేజ్ పాలను కేరళలో నిషేధించినట్లు తెలిసింది -అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాం -ఆహార, పాల కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం -అసెంబ్లీలో వైద్యారోగ్య మంత్రి రాజయ్య ప్రకటన హైదరాబాద్, నవంబర్ 12 (టీ మీడియా):గత సంవత్సరం నగరంలోని ఒక పాలకేంద్రంలో హెరిటేజ్ పాల నమూనాను సేకరించినప్పుడు అందులో డిటర్జెంట్ వాడినట్లు తేలిందని వైద్యారోగ్య మంత్రి తాటికొండ రాజయ్య అసెంబ్లీకి తెలిపారు. నగరంతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాలల్లో కల్తీ జరుగుతున్నదన్న అంశంపై టీడీపీ, టీఆర్‌ఎస్ సహా వివిధ పక్షాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. ఆక్సిటోసిన్, డిటర్జెంట్లు, సోయాబీన్ నూనె, పాలపొడి.. లాంటివి వీటిని కలిపి అనేక రకాలుగా పాలను కల్తీచేస్తున్నారు. గతేడాది జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేకప్రాంతాల్లో ఆహారభద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద అధికారులు 32 పాల నమూనాలు సేకరించి, వాటికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఇందులో 11 నమూనాల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పాలు లేవని, కల్తీ జరిగిందని నిర్థారించారు.

వీటిలో పంజాగుట్టవద్ద ఒక పాల కేంద్రంలో సేకరించిన హెరిటేజ్ టోల్డ్ మిల్క్ పాలుకూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డిటర్జెంట్ వాడినట్లుగా తేలింది. ఈ మేరకు కేసు కూడా నమోదై, ప్రస్తుతం చౌడీబజార్ కోర్టులో పెండింగులో ఉంది అని రాజయ్య వివరించారు.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా ఆ పార్టీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన పలువురు సభ్యులు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో కల్తీ పాల సరఫరా అంశంపై పలు రకాల ప్రశ్నలు వేయగా, మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. నార్త్ జోన్‌లో లూజ్‌గా విక్రయిస్తున్న పాలల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్లుగా కూడా తేలిందన్నారు. హెరిటేజ్ పాలను కేరళలో నిషేధించిన అంశంపై బదులిస్తూ.. హెరిటేజ్ పాలను కేరళలో నిషేధించినట్లు మా దృష్టికి వచ్చింది.

అందుకు సంబంధించిన వివరాలు తెప్పించి, ఆహారభద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి చెప్పారు. ఈ పదకొండుచోట్ల నాణ్యతకు అనుగుణంగా పాలు లేనందున అప్పట్లోనే కేసులు నమోదు చేసి, రెండు మందుల దుకాణాలు, నాలుగు దాణా దుకాణాల్లో లభించిన వంద మి.లీ. 1328 అక్సిటోసిన్ ఇంజక్షన్ వాయిళ్లు కూడా సీజ్ చేసి, కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీకి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో కమిషనరేట్, జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారితోపాటు మండలస్థాయిల్లో ఆహారభద్రత అధికారుల వ్యవస్థనుకూడా ఏర్పాటుచేశామన్నారు.

ఎప్పటికప్పుడు పాల నమూనాలు సేకరించి, నాణ్యత పరీక్షలను నిర్వహించేందుకుగాను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)ను రెఫరల్ ల్యాబరేటరీగా నియమించినట్లు చెప్పారు. పాలల్లో కల్తీ చేసినట్లు నిర్థారణ జరిగితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏకింద ఏడాదినుంచి ఆరేండ్లవరకు జైలు శిక్ష, లక్షనుంచి రూ.10లక్షలవరకు జరిమానా పడుతుందన్నారు. కల్తీద్వారా మరణం సంభవిస్తే జీవిత ఖైదు విధించే అవకాశముందన్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని సవరించి, కఠినచర్యల్లో భాగంగా మరణంతో నిమిత్తం లేకుండా ఆహార కల్తీ జరిగితే జీవిత ఖైదు విధించాలని సూచన కూడా చేసిందన్నారు. గత కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పిన మంత్రి, వారికి కచ్చితంగా శిక్ష పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.