Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హైకోర్టును విభజించాలి

-శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం -మండలిలో ప్రతిపాదించిన మంత్రి అల్లోల -ఏకగీవ్రంగా ఆమోదించిన ఉభయసభలు -సవరణలతో ప్రతిపక్షాల మద్దతు -నేడు కేంద్ర న్యాయ శాఖ మంత్రికి లేఖ -ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్తున్న న్యాయశాఖ కార్యదర్శి -శాసనసభలో సీఎం కేసీఆర్ వెల్లడి -హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం భేటీ -విభజన.. ప్రత్యేక భవనంపై చర్చ!

KCR addressing in assembly

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తక్షణమే ఉమ్మడి హైకోర్టును విభజించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానించాయి. బుధవారం ఉదయం టీ విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో హైకోర్టు విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అటు మండలిలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించారు. ఈ రెండు తీర్మానాలు ఏకగీవ్రంగా ఆమోదం పొందాయి. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా, అనంతరం లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ్ ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకు హైకోర్టు విభజనపై తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పిన సీఎం కేసీఆర్.. తీర్మానంలోని అంశాలను శాసనసభ్యులకు చదివి వినిపించారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం బలపర్చాయి. ప్రతిపక్ష నేత కే జానారెడ్డి మాట్లాడుతూ.. సీఎం ప్రవేశపెట్టిన హైకోర్టు విభజన తీర్మానానికి సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. హైకోర్టు విభజనతో పాటు, హైదరాబాద్‌లో అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించే అంశాన్ని కూడా తీర్మానం కాపీలో చేర్చాలని సూచించారు. హైకోర్టు విభజన తీర్మానానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జ్యుడిషియల్‌లో కొత్త పోస్టుల నియామకానికి జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, హైకోర్టు విభజన పూర్తయ్యేవరకు ఎలాంటి జ్యుడిషియల్ పోస్టుల భర్తీ చేయరాదని సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జానారెడ్డి, కిషన్‌రెడ్డి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే విపక్షాలు ఇచ్చిన సూచనలను తీర్మానంలో చేర్చడం సాంకేతికంగా సాధ్యం కాదని వెల్లడించారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకు హైకోర్టు విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసే ఉత్తరంలో స్పష్టంగా ఈ అంశాలను పొందుపరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైకోర్టు విభజనపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయశాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళ్లి, కేంద్ర మంత్రి సదానంద గౌడను కలిసి హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.

హైకోర్టు ఏర్పాటుపై పూర్తి వివరాలతో కూడిన లేఖను కేంద్రానికి అందజేస్తామని సీఎం తేల్చిచెప్పారు. హైకోర్టును విభజించాలని ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి, న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు. సీఎం సమాధానం అనంతరం తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. హైకోర్టు విభజనపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచిన విపక్ష పార్టీల నేతలకు, సభలోని సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం కేసీఆర్ భేటీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తాతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. సాయంత్రం ఆరు గంటలనుంచి రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో రెండు రాష్ర్టాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ఉభయ సభలు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన విషయాన్ని ప్రధాన న్యాయమూర్తికి కేసీఆర్ తెలియచేశారు. ప్రత్యేక హైకోర్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. విభజన విషయంలో సహకరించాలని చీఫ్ జస్టిస్‌కు కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. హైకోర్టుకు కొత్త భననం కేటాయించడంతోపాటు.. ప్రస్తుత ప్రాంగణంలోనే రెండు రాష్ర్టాల హైకోర్టులు కొనసాగించేందుకు ఉన్న వెసులుబాటుపైసైతం చర్చించినట్లు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.