Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హైకోర్టును తక్షణం విభజించండి

-లోక్‌సభలో జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం -తిరస్కరించిన స్పీకర్.. మాట్లాడేందుకు అనుమతి -ఉమ్మడి హైకోర్టుపై స్పందించకపోవడం దురదృష్టకరం: వినోద్ -హామీలన్నీ నెరవేరుస్తాం: వెంకయ్యనాయుడు

Jithender Reddy

ఉమ్మడి హైకోర్టును తక్షణం విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో మంగళవారం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించినా, దీనిపై మాట్లాడడానికి మాత్రం జితేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చినా ఇంకా హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభమే కాలేదని, తొమ్మిది నెలలు దాటినా ఎక్కడి పరిస్థితి అక్కడే ఉందని, న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎంపీ వినోద్, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా జితేందర్‌రెడ్డి లేవనెత్తిన అంశానికి మద్దతు పలికారు. చివరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. సెంటిమెంట్లను అర్థం చేసుకున్నామని అన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని, వెంటనే విభజన ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా న్యాయశాఖ మంత్రికి తెలియజేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

మంగళవారం ఉదయం సభ మొదలవగానే టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి హైకోర్టు విభజన అంశంపై వాయిదా తీర్మానానికి అనుమతించి, చర్చను చేపట్టాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దుకు నిరాకరించిన స్పీకర్.. ఈ అంశంపై మాట్లాడడానికి జితేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు ఉండేలా ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలని గత తొమ్మిదిన్నర నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నామన్నారు.

సీఎం కే చంద్రశేఖరరావు ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసి హైకోర్టు విభజనపై వివరంగా చర్చించారని, విజ్ఞాపన పత్రాలను అందజేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఢిల్లీలోనే స్వయంగా కలిసి ఉమ్మడి హైకోర్టు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను వివరించి, ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటుపై చర్చించారని తెలిపారు. హైకోర్టు విభజన ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందని కేంద్రం స్పష్టం చేయడంతో చివరికి హైదరాబాద్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం కేసీఆర్ కలిసి చర్చించారని వివరించారు.

ఏపీ బార్ కౌన్సిల్ ప్రతినిధులు సైతం ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కలిసి స్వయంగా వివరించారన్నారు. హైకోర్టు విభజన జరగక న్యాయవాదులు ఆందోళన చేపట్టి, విధులను బహిష్కరిస్తున్నారని, దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళారని జితేందర్‌రెడ్డి గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై ఎలాంటి కదలికా లేకపోగా, ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసిందని, జూనియర్ సివిల్ జడ్జీ (జేసీజే)ల నియామక ప్రక్రియను చేపట్టిందన్నారు.

దీనివల్ల తెలంగాణ న్యాయవాదులకు అవకాశం పోతుందని, పలు రకాల కొత్త ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అందువల్లే జేసీజేల నియామక ప్రక్రియ వద్దని తాము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నారు. విభజన తర్వాతే నియామక ప్రక్రియను చేపట్టాలని పదేపదే కోరినా ఉమ్మడి హైకోర్టు మాత్రం నోటిఫికేషన్ ప్రకారం వ్యవహరిస్తున్నదని సభ దృష్టికి తెచ్చారు. కేంద్రం ఈ సమస్య స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణం హైకోర్టు విభజన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఏపీ నుంచి ఎలాంటి స్పందనా లేదు : ఎంపీ వినోద్ జితేందర్‌రెడ్డి లేవనెత్తిన అంశానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ అనుబంధ ప్రశ్నకు అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ ఒక్కటే ప్రశ్నకు అనుమతించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మాత్రం ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచిగానీ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచిగానీ సమాధానం రాలేదని చెప్పారని, ఇది దురదృష్టకరమన్నారు. పైగా తాను ఇంకేమీ చేయలేనంటూ కేంద్ర మంత్రి స్వయంగా వ్యాఖ్యానించి చేతులెత్తేశారని, ఇప్పుడు దీనిపై కేంద్రమే చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.