Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మహోజ్వల ఘట్టం

మరోసారి తెలంగాణ రాష్ట్రం సాధించినంత సంబురంగా ఉంది. శంభుని శిరస్సు నుంచి గంగను నేలకు దించిన భగీరథుని విజయోజ్వల ఘట్టం చూసినంత ఆనందంగా ఉంది. ఆరు దశాబ్దాల వివక్షను, కుట్రలను బద్దలుకొట్టి.. గోదావరిని ఇలాతలంపైకి మళ్లించిన అపురూప చారిత్రక సన్నివేశం ఇది. గోదావరి జలరాశులను తెలంగాణ మాగాణాలకు మళ్లించడానికి జరిగిన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సరికొత్త అధ్యాయం

గోదావరి నీటిని తెలంగాణ నేలలకు మళ్లించాలన్న స్వప్నం ఎన్నేళ్లది? ఎన్నాళ్లది? ఎప్పటి ఇచ్చంపల్లి? అనేక దశాబ్దాలుగా గోదావరి జల తరంగాలు గలగలా కదలిపోతుంటే తెలంగాణ ఆకలి దప్పులు.. నిట్టూర్పులతో అలమటించిందే తప్ప గుక్కెడు నీటిని తోడుకోలేకపోయింది. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు ముగింపు పలికిన దీక్షా దక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసిన కార్యదక్షుడు ఆయన. మొన్న స్వరాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు, నేడు అభివృద్ధి పథికుడు, చోదకుడూ ఆయనే. అసాధ్యాలను సుసాధ్యాలు చేయడంలో ఆయన సంకల్పం, సాధన గొప్పవి. ఆయన ఎప్పుడూ ఘర్షణను నమ్మలేదు. చిత్తశుద్ధి, ఆచరణశుద్ధి, సంప్రదింపుల ద్వారా ఆమోదం పొందడం ఆదినుంచీ ఆయన సాధన చేసిన ఆయుధం. దిగువ గోదావరిపై ప్రాజెక్టులు రాకుండా చూడడం, ఒక వేళ ప్రాజెక్టులు తలపెట్టినా పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకుని ఆమోదం లభించకుండా చూడడం, పైగా ప్రాజెక్టులకోసం పక్కరాష్ట్రాలతో నిరంతర పోరాటమేదో చేస్తున్నట్టుగా నటిస్తూ ప్రజలను మోసం చేయడం, వివాదాలను ఏండ్లు.. దశాబ్దాలు సాగదీయడం ఇప్పటిదాకా నడిచిన సంప్రదాయం. తెలంగాణ ముఖ్యమంత్రి తొలి నాళ్లలోనే ఆ దుస్సంప్రదాయానికి పాతరవేసి, ద్వైపాక్షిక ఒప్పందాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మొత్తం దేశానికే ఒక కొత్త ఆదర్శాన్ని పరిచయం చేశారు.

విదర్భ నుంచి తొలిసారి మహారాష్ట్ర సీఎం అయిన ఫడ్నవిస్ కూడా తెలంగాణ తపనను, కేసీఆర్ తాపత్రయాన్ని అర్థం చేసుకుని నదీ జలాల వినియోగానికి మార్గం సుగమం చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు ఉభయకుశలోపరిగా ఐదు బరాజ్‌లపై ఒకేసారి అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. రాజుపేట, పింప్రాడ్ రిజర్వాయర్లు మహారాష్ట్ర పొలాలను సాగుచేస్తాయి. చనాకా-కొరాటా, తుమ్మిడిహట్టి, కాళేశ్వరం (మేడిగడ్డ) తెలంగాణ భూముల గొంతు తడుపుతాయి. తుమ్మిడిహట్టి ఆదిలాబాద్ జిల్లాలో మునుపటికంటే ఎక్కువ విస్తీర్ణం భూములకు నీరిస్తుంది. ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా కేవలం 58వేల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పిస్తే ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు నీరందివ్వనున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలను జలోపేతం చేసే మహాయజ్ఞానికి తుమ్మిడిహట్టి, కాళేశ్వరం (మేడిగడ్డ), అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి రిజర్వాయర్లు జీవధార కానున్నాయి. కాళేశ్వరం నుంచి మధ్యమానేరు నుంచి కొమురెల్లి మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా, అక్కడి నుంచి కుడివైపున హల్దీ నదిద్వారా నిజాంసాగర్ దాకా, ఎడమ వైపున యాదగిరీశుని సన్నిధిలోని బస్వాపూర్‌దాకా, దిగువన షామీర్‌పేట దాకా అనేక చిన్నా పెద్ద రిజర్వాయర్లు, చెరువులు జలసిరులతో అలరారనున్నాయి.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆరు జిల్లాల్లో లక్షల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. హల్దీ, మంజీరా నదులు తిరిగి పునర్జీవం పొందనున్నాయి. నిజాంసాగర్ జలకళతో కళకళలాడనున్నది. ఎగువ గోదావరి నుంచి నీరురాక వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జాలు జల సంపద లభించనున్నది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భూగర్భ జలాలు పెరగడానికి కూడా ఈ ప్రాజెక్టుల పరిపూర్తి ఎంతగానో దోహదం చేయనున్నది. హైదరాబాద్‌కు తాగునీరు అందించడంకోసం 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న కేశవాపూర్ రిజర్వాయరుకు కూడా ఈ ప్రాజెక్టుల ద్వారానే నీరు అందనున్నది. ఇటు గోదావరి ప్రాజెక్టులు, అటు పాలమూరు-రంగారెడ్డి, ఎస్సెల్బీసీ వంటి కృష్ణా ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ పచ్చపచ్చని పంటపొలాలతో వర్థిల్లనున్నది. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయనున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.