Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హోరెత్తిన లష్కర్ బాబుకు బుద్ధిచెబుదాం

-హైదరాబాద్ అందరిది.. అందరం కలిసి బతుకుదాం: కేసీఆర్
-శాంతియుతంగా, కలిసిమెలిసి బతుకుతున్నం
-ఆంధ్రా, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలి
-13 సీట్లతో ఆయన ఆరుస్తడా.. తీరుస్తడా!
-ఆంధ్రావాళ్లమనే భావన అందరూ వీడండి
-ప్రౌడ్ టు బీ హైదరాబాదీస్.. కేసీఆర్ విల్ బీ విత్ యూ
-అద్భుతమైన నగరాన్ని పౌరులే కాపాడుకోవాలి
-నాలుగేండ్లలో నగరంలో ఒక్క మతకల్లోలం లేదు
-వంద నియోజకవర్గాల ప్రజలను టచ్‌చేసి చెప్తున్న..వందసీట్లు పక్కాగా గెలుస్తాం.. ఇది కేసీఆర్ సర్వే
-జంటనగరాల్లో రిపీట్‌కానున్న జీహెచ్‌ఎంసీ తీర్పు
-టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు రేపోమాపో డూప్లికేట్ సర్వే కుట్ర
-గ్రేటర్ హైదరాబాద్ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్

స్వార్థ రాజకీయాలతో తెలుగుప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శాంతియుతంగా, కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతమైన భాగ్యనగర వాతావరణాన్ని చెడగొట్టేందుకు వస్తున్న చంద్రబాబుకు నగరపౌరులు గట్టిగా బుద్ధిచెబుదామని పిలుపునిచ్చారు. తనతోసహా మరెందరో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారన్న సీఎం.. ఇక్కడివారంతా తాము హైదరాబాదీలమని గర్వంగా చెప్పుకోవాలని కోరారు. మీ వెంట నేనుంటానని భరోసానిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభావేదికపై టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను విడుదలచేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

చంద్రబాబుది కుటిల రాజకీయం
మీరందరూ తెలంగాణ బిడ్డలే. అందరం ఆనందంగా ఉందామని చెప్పినం. చెప్పడమేకాదు.. డైలాగులు వల్లెవేయడం కాదు. ఉద్యమ నాయకుడిగా ఉన్న నేనే రాష్ట్రం వచ్చిన తదుపరి ముఖ్యమంత్రిని అయ్యాక ఏ విధంగా ఆచరించి చూపామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ అందరం సంతోషంగా జీవిస్తున్నం. చాలామంది ఆంధ్రాప్రాంత మిత్రులు నాకు వ్యక్తిగతంగా చెప్పారు. అనవసరంగా ఈ చంద్రబాబు వచ్చి మాకొక మసిబూసి, మాకొక ట్రేడ్‌పెట్టి, మానెత్తికి, మానొసటికి బోర్డుకట్టి మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు.. బద్నాం చేస్తున్నాడు అన్నరు. హైదరాబాద్‌లోని తెలుగు ప్రజల మధ్య నేడు స్వార్థ, కుటిల, కుళ్లు రాజకీయంకోసం విభేదాలు సృష్టిస్తున్నది చంద్రబాబు కాదా? దయచేసి అందరూ ఆలోచించాలి. ఆయనకు జంటనగరాల ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలి.

టీఆర్‌ఎస్‌కు ప్రాంతీయ భేదాలు లేవు
మనది మంచి నగరం. బాగా కాపాడుకుంటున్నాం. బాగా బతుకుతున్నాం. ముందుకు పోతున్నాం. హైదరాబాద్‌కు ఎంతోమంది తాతలు, తండ్రులకాలంలో వచ్చి నివసిస్తున్నారు. వాళ్లు ఏ ప్రాంతంవారనే తేడాలేకుండా టీఆర్‌ఎస్ తరఫున జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాం. వాళ్లందరూ గెలిచారు. ఈరోజు ఎమ్మెల్యేలుగా కూడా నిలబడ్డ మిత్రులున్నారు. వాళ్లు రేపు గెలువబోతున్నరు. ఏ ప్రాంతం అనే భేదాలు టీఆర్‌ఎస్‌కు లేవు. చిల్లర రాజకీయాలు లేవు. ప్రజలను ప్రజలుగ చూస్తూ, అన్నివర్గాలు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నం.

హైదరాబాదీలమని గర్వంగా చెప్పుకోండి
అన్ని ప్రాంతాలనుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్నవారికి, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినవారికి కూడా నేను విజ్ఞప్తిచేస్తున్న. మేము వేరే, మేము ఆంధ్రావాళ్లం అనే భావన వీడండి. ప్రౌడ్ టు బీ హైదరాబాదీస్.. బీ ప్రౌడ్ హైదరాబాదీస్.. అండ్ కేసీఆర్ విల్ బీ విత్ యు.. మేం హైదరాబాదీలమని గర్వంగా చెప్పండి. హైదరాబాద్‌కు నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో ఓ బ్రాండ్ ఉంది. నేను కూడా హైదరాబాద్‌కు చెందినవాడిని కాదు. పాత మెదక్ జిల్లా నుంచి వచ్చాను. కేశవరావుగారు కూడా హైదరాబాద్‌కు చెందినవారు కాదు. మరెందరో ఇక్కడ నివసించేవారు హైదరాబాద్‌కు సంబంధం లేనివారు. మనమందరం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. అందరం శాంతియుతంగా, సంతోషంగా జీవిస్తున్నం. సిటీ బ్రాండ్ ఇమేజ్‌ని గర్వంగా చెప్పుకోగలుగుతున్నం. స్వార్థ రాజకీయాలను, వివాదాస్పద అంశాలను ఏనాడూ పట్టించుకోకుండా ముందుకుపోతున్నం. దురదృష్టవశాత్తు చంద్రబాబువంటి నాయకులు స్వార్థ రాజకీయాలకోసం ఇక్కడికి వచ్చి ఏవేవో చేస్తావున్నారు.

చిచ్చుపెట్టేందుకే చంద్రబాబు వచ్చాడు
ఏమవసరముంది చంద్రబాబుకు? ఇంత కుట్రచేయాల్నా? ఆయన పనిచేసుకోవాలంటే 175 నియోజకవర్గాలు గల రాష్ట్రం ఉంది. ఇక్కడకు వచ్చి ఈయన పోటీచేసే స్థానాలు ఎన్నండి? 13 స్థానాలు! ప్రభుత్వం స్థాపిస్తడా? ఆరుస్తడా.. తీరుస్తడా.. ఏం చేస్తడు? ఈ మకిలివెకిలి చిల్లర రాజకీయాలు ఎందుకండీ? నగరంలో ఉండే విజ్ఞులు.. ముఖ్యంగా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలి. ఏ కుటిలం కాకపోతే, కుళ్లు కాకపోతే ఏం ఆశించి ఆయన ఇక్కడికి వస్తున్నడు? తెలుగు ప్రజలు అంటూ ఇక్కడికి వచ్చి చిచ్చుపెట్టాల్నా.. శాంతంగా బతికే ప్రజలను విడదీయాల్నా.. సంతోషంగా ఉన్నవాళ్ల మధ్య పంచాయితీ పెట్టాల్నా.. ఏమవసరం? దేనికోసం వస్తావున్నారు? తెలంగాణలో ఫెయిర్ పాలిటిక్స్ ఉంటాయి. కులం, మతం చూడరు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయి.

రేపో మాపో డూప్లికేట్ సర్వే కుట్ర
ఈరోజు నేను చెప్తున్నా.. రేపోమాపో ఒక డూప్లికేట్ సర్వే వెల్లడిస్తారు. దాన్లో టీఆర్‌ఎస్‌కు సంఖ్య రానట్టు, ఏదో మ్యానిప్యులేట్ చేయబోతున్నట్టు నా దగ్గర పూర్తిసమాచారం ఉంది. ఒక మీడియాసంస్థ, చంద్రబాబు, కొందరు కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్రచేస్తావున్నరు. నేను ఇయ్యాళ కేసీఆర్‌గా డిక్లేర్‌చేస్తున్నా! నిన్నా, ఇయ్యాల సర్వేలు చూశాను. అన్నిరకాల సర్వేలు వచ్చాయి. సభలద్వారా వంద నియోజకవర్గాల ప్రజలను టచ్‌చేసిన తర్వాత డిక్లేర్‌చేస్తున్నా! నేను ఆదిలో చెప్పిన విధంగానే కచ్చితంగా వంద పైచిలుకు సీట్లలో టీఆర్‌ఎస్ గెలువబోతున్నది. జంటనగరాల్లో జీహెచ్‌ఎంసీ తీర్పు రిపీట్ కాబోతున్నది. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు.

జంటనగరాలవాసులు పరిణతితో ఓటెయ్యాలి
ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుని, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించాలి. సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకుని ఓటింగ్‌లో పాల్గొనాలని రాష్ట్రప్రజానీకానికి, మేధావులైన జంటనగర ప్రజానీకానికి విజ్ఞప్తిచేస్తున్నా. ప్రజాస్వామ్య పరిణతి ఉన్న దేశంలో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు. ప్రజలు గెలువాలి.. ప్రజల అభీష్టం గెలువాలి. అది చాలా ముఖ్యం. అప్పుడు ఫలితాలు కూడా బాగుంటాయి. ఫలితాల తర్వాత ఐదేండ్లపాటు ప్రజల అజెండా అమలు జరిగి, ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంటుంది.

సమైక్యపాలనలో నగరాన్ని దెబ్బతీశారు
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ నగరం ఎంతో విధ్వంసమైంది. దీన్ని ప్రజలు నివసించే ప్రాంతంగా కాకుండా కమర్షియల్ దృక్పథంతో చూసి చాలా ఇబ్బందులకు గురిచేశారు. నేను సీఎం అయిన కొత్తలో జీహెచ్‌ఎంసీ అధికారులను పిలిచి సమావేశం పెట్టాను. రోడ్లమీద వరదనీళ్లు ఆగుతున్నయి. కార్లన్నీ బోట్లు అయ్యే పరిస్థితి ఉంది. రాజ్‌భవన్, అసెంబ్లీ దగ్గర కూడా నీళ్లు ఆగుతున్నయి. దీన్ని దూరంచేయలేమా? అని అడిగిన. అప్పుడు అధికారులు వర్షం నీళ్లను తీసుకెళ్లే డ్రెయిన్లన్నింటినీ దారుణంగా ధ్వంసంచేశారు. ఆక్రమణలు చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల మనకు కంట్రోల్ లేదు. దాన్ని సరిచేయాలంటే రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లు ఖర్చవుతాయి. మూడువేల నుంచి ఐదువేల ఇండ్లు కూడా కూలగొట్టాలి అని చెప్పారు. చాలా సంక్లిష్టమైన పరిస్థితి. అట్లా అనేకరంగాల్లో నగరాన్ని దెబ్బతీశారు. కోటిపైచిలుకు జనాభా ఉండే ఈ నగరంలో కూరగాయల మార్కెట్లు, నాన్‌వెజ్ మార్కెట్లు లక్షమందికి ఒకటి చొప్పున కనీసం వంద ఉండాలి. కానీ అధికారిక మార్కెట్లు కేవలం ఏడే. కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మేవాళ్లు కాలనీలకు వచ్చి బజార్‌డేలు పెడితే ప్రజలు అక్కడ కొనుక్కుంటున్నరు. ఇంతపెద్ద సిటీలో కనీసం ఉండాల్సినన్ని పబ్లిక్ టాయిలెట్లు కూడా లేవు. చాలా అధ్వాన్నమైన పరిస్థితి. దూరంనుంచి తెచ్చే నీళ్లను నగర సమీపంలో నిల్వచేసేందుకు రిజర్వాయర్లు లేవు. బాధ్యతారహితంగా జీహెచ్‌ఎంసీని విస్తరించి, 12 మున్సిపాలిటీలను కలిపేశారు. కనీసం మంచినీటి సదుపాయంలేదు. ఇట్లా అనేక విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు. వాటిని చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం.

స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు
మేం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రయాణం మొదలుపెట్టినం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట జీవో 58, 59 ద్వారా 1.25 లక్షలమంది పేదలకు ఇండ్లపట్టాలు ఇప్పించినం. ఆ విషయం పట్టాలు పొందిన పేదలకు తెలుసు. పేదలకు నల్లా, కరంటు బిల్లుల బకాయిలు మాఫీచేసినం. పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చే పథకాన్ని చేపట్టినం.

గతంలో ఎక్కడికిపోయినా డీజిల్ కంపు కొట్టేది
గత ప్రభుత్వాల హయాంలో విపరీతమైన కరంటు కోతలుండేవి. చాలా అపార్ట్‌మెంట్లల్లో లక్షల రూపాయలు డీజిల్‌కోసం ఖర్చుపెట్టేవాళ్లు. నేను మా బంధువులు, స్నేహితుల ఇండ్లళ్లకు పోయినప్పుడు సెల్లార్లలో జనరేటర్ల మోత వినబడేది. ఎక్కడికిపోయినా డీజిల్ కంపుకొట్టేది. బట్టల దుకాణాలకు పోయినా భయంకరమైన వాసనలు! ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కొనేందుకు ప్రజలు ఇబ్బందిపడేవాళ్లు. ఇప్పుడు ఆ బాధ లేదు. నాలుగేండ్ల క్రితం ఘోరంగా విద్యుత్ సంక్షోభం ఉండె. అలాంటి రాష్ట్రం ఇప్పుడు పవర్ సర్‌ప్లస్ రాష్ట్రంగా ఎదిగిందని మీ బిడ్డగా గర్వంగా చెప్తున్నా. నేను చెప్పటం కాదు.. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. జాతీయ సగటు కంటే కూడా మనమే ఎక్కువ. గతంలో నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలకు పవర్‌హాలిడే ఉండేది. కరంటు ఇయ్యండి బాబూ.. అంటూ ఫిక్కి ఆధ్వర్యంలో లోయర్‌ట్యాంక్‌బండ్ దగ్గర ధర్నాలు జరిగినయి. పరిశ్రమలు మూతపడుతున్నాయని పారిశ్రామికవేత్తలు ధర్నాలుచేసిన సందర్భాలున్నాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పరిశ్రమలకు కూడా 24 గంటల క్వాలిటీ పవర్ సైప్లె చేస్తున్నం. కార్మికులంతా బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నరు. ఔత్సాహికులైన కార్మికులు ఓటీలు కూడా చేసుకుని అదనంగా సంపాదించుకునే మార్గం వచ్చింది. కార్మికులకు చేతినిండా పని లభిస్తున్నది. లక్షల ఎల్‌ఈడీ లైట్లతో ఈ నగరం జిగేలుమని మెరుస్తున్నది. ఎల్‌ఈడీ వెలుగుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీగా హైదరాబాద్ ఖ్యాతిగాంచింది. జంటనగరాల్లో పరిస్థితులు ఏవిధంగా చక్కబడ్డాయో మీరే చూస్తున్నరు.

ఇప్పుడు తాగునీటి కటకట లేదు
శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి కష్టాల గురించి ఎమ్మెల్యేలు.. ఎంపీలు చెప్పినారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్ప ల్, ఎల్బీనగర్, మేడ్చల్ అన్ని ప్రాంతాల్లో నీటికి చాలా కటకట ఉండేది. పేదలు కూడా వాటర్ ట్యాంకర్లు కొనుక్కు నే పరిస్థితిఉండే. ఇప్పుడా పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీళ్లు సరఫరా అవుతున్నయ్.

తాగునీటికోసం 20 టీఎంసీలతో రెండు రిజర్వాయర్లు
హైదరాబాద్ మహానగర మంచినీటి వ్యవస్థలో ఏ ఇబ్బందిలేకుండా కేశవాపూర్‌లో ఒకటి.. రాచకొండ గుట్టల్లో ఒకటి.. 20 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మిస్తున్నం. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నిర్మాణపనులు ప్రారంభదశలో ఉన్నయి.

వెయ్యి కోట్లతో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫండ్
స్వచ్ఛమైన మూసీని గత పాలకులు మురికి మూసీగా మార్చినారు. దానినుంచి బయటపడటానికి తీవ్ర ప్రయత్నాలు చేసి, రూ.1000 కోట్ల ప్రాజెక్టుతో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫండ్ పెట్టినం. త్వరలోనే అందమైన.. సుందరమైన నదిగా, బ్రహ్మాండమైన ప్రదేశంగా మూసీ తయారవుతుంది. ఇరువైపులా అద్భుతమైన రోడ్లుకూడా వేస్తున్నం. అన్నపూర్ణ భోజనం పథకంతో రోజూ 50 వేలమందికి రూ.5లకే భోజనం లభిస్తున్నది. దీనిపై చాలామంది పేదలు సంతోషంగా ఉన్నారు.

మళ్లీ గెలిపిస్తే 500 పైగా బస్తీ దవాఖానలు
ఇప్పటికే 33 బస్తీ దవాఖానలు ప్రారంభమైనయి. 500 పైచిలుకు బస్తీ దవాఖానలు ఏర్పాటుచేసే ఆలోచన ఉంది. మీరు ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే ప్రతి బస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటుచేస్తం. హైదరాబాద్‌లో సుమారు 109 స్థలాల్లో లక్ష ఇండ్లు అతివేగంగా నిర్మాణం అవుతున్నయి. కొల్లూరులో 125 ఎకరాల్లో ఒకేచోట రూ.1300 కోట్లతోని 15,600 ఇండ్లతో అద్భుతమైన అపార్ట్‌మెంట్ పేదలకోసం వస్తున్నది. హైదరాబాద్ మన నగరం.. మనం సాధించుకున్న నగరం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి ఈ నగరం ఏనాటికైనా ఆర్థికంగా వెన్నెముక కాబట్టి.. మనం గర్వంగా చెప్పుకొనే చారిత్రక నగరం కాబట్టి.. ఇక్కడుండేవాళ్లందరం ముందుకుపోవాలె.

హైదరాబాద్ ఎవరి సొత్తూ కాదు.. అందరికీ ఆలవాలం
హైదరాబాద్ విశ్వనగరం. ఇది ఏ ఒక్కరి సొత్తుకాదు. ఈ నగరం కులీకుతుబ్‌షాలు, నిజాంల కాలంనుంచే సర్వమతాలకు, సర్వకులాలకు, సర్వప్రజలకు ఆలవాలం. ఇండియాలో బెస్ట్ అడాప్టబిలిటీ ఉన్న సిటీ. ట్రూత్‌ఫుల్ కాస్మోపాలిటిన్ సిటీ హైదరాబాద్. చార్మినార్‌లో ఉన్న గుల్జార్‌హౌజ్ ఎంతో ప్రసిద్ధి. వందల ఏండ్లక్రితం నిజాంలకాలంలో ఉత్తరాది ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. గుల్జారాల చరిత్ర హైదరాబాదీలకు బాగా తెలుసు. మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, మహారాష్ట్రవారు, బెంగాలీలు, ఒడియాలు, మలయాళీలు, తమిళులు కావచ్చు.. ప్రతి రాష్ర్టానికి చెందినవారు హైదరాబాద్‌లో ఉన్నారు. వారందరికీ కమ్యూనిటీ హాల్స్‌కు స్థలాలు ఇచ్చాం. చాలామంది భవనాలుకూడా కట్టారు. ఒడియా సోదరులైతే కళింగభవన్ కట్టారు. బెంగాలీ సోదరులు దసరాకు అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తారు. కళింగభవన్ పక్కన్నే పూరీ జగన్నాథ ఆలయం కూడా నిర్మాణం అయింది.

అద్భుతంగా ఉన్న నగరాన్ని కాపాడుకోవాల్సింది పౌరులే
అద్భుతంగా ఉన్న నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నగరంలో ఉండే ప్రతి వ్యక్తి, పౌరుడి మీద ఉంది. అందుకే జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ క్రియాశీలకంగా పనిచేయరు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. ఆనాడు బూర్గుల రామకృష్ణారావునుంచి నేటివరకు అదేరకమైన వ్యవహారం. వీళ్లకు వెన్నుపూస లేదు. ఈ ఎన్నికల్లో గెలవడమే కాదు.. పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించి, కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ తేవడానికి కూడా మనం కృషిచేయాలి. మతసామరస్యంతో, శాంతిభద్రతలతో, అద్భుతమైన ఆర్థిక పురోగతితో ముందుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరొక్కసారి దీవించాలని జంటనగరాల మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, విద్యార్థులకు, యువకులకు యావన్మంది ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్న. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, అద్భుతమైన బంగారు తెలంగాణ దిశగా, హైదరాబాద్‌ను విశ్వనగరం చేసేదిశగా పురోగమిస్తామని మనవి చేస్తున్నా.

నాలుగున్నరేండ్లలో ఒక్క మతకల్లోలం లేదు
మహిళల భద్రతకోసం తెచ్చిన షీటీమ్స్ మీ కండ్లముందే ఉన్నయి. శాంతిభద్రతలకోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం మీకు తెలుసు. ప్రపంచంలో అత్యుత్తమ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 24 అంతస్తులతో బంజరాహిల్స్‌లో నిర్మాణం జరుగుతున్నది. అదొస్తే ఇంకా బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించి నేరాలు బాగా అదుపు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మనందరి అనుభవంలో ఉంది. ఎప్పుడూ మత కల్లోలాలు.. మాటిమాటికీ కర్ఫ్యూలు.. 24 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పర్మినెంట్‌గా కర్ఫ్యూ పెట్టేవారు. గత నాలుగున్నరేండ్లుగా హైదరాబాద్‌లో ప్రజలు శాంతియుతంగా బతుకుతున్నారు. కర్ఫ్యూలు లేవు.. మత కల్లోలాలు లేవు.. గుడుంబా అమ్మకాలు లేవు.. పేకాట క్లబ్బులు లేవు.. గూండాలు లేరు. పీడీ యాక్ట్‌తో అందరినీ లోపలేసినం. భూ కబ్జాలు లేవు. కొన్ని కొత్త యాప్స్ కూడా అభివృద్ధిచేశారు. అవన్నీ మీ కండ్లముందున్నయి. నేనేదో డబ్బా కొట్టి చెప్పుడు అవసరం లేదు.

హైదరాబాద్‌లో ఉన్నోళ్లంతా తెలంగాణ బిడ్డలే
అన్నిరాష్ర్టాల, అన్ని వర్గాల ప్రజలకు ఆలవాలంగా ఉండే నగరమిది. ఆంధ్ర, రాయలసీమ నుంచి ఉన్న సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నరు. తెలంగాణ ఏర్పడే సమయంలో చాలా అపోహలు సృష్టించినారు. చాలారకాలుగా అనవసర భయాలు సృష్టించినారు. కానీ ఆచరణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అటువంటిదేమీలేదని రుజువుచేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తెలుగుజాతి అని మాట్లాడుతడు. అయ్యా చంద్రబాబు నీకో నమస్కారం! తెలుగుజాతి అని నువ్వేదైతే మాట్లాడున్నవో.. హైదరాబాద్ చాలా సంతోషంగా ఉంది. 58 ఏండ్లు సమైక్యరాష్ర్టానికి హైదరాబాద్ రాజధాని కాబట్టి చాలామంది ఇక్కడ బతుకడానికి వచ్చారు. నేను ఉద్యమం జరిగేటప్పుడు వందలసార్లు చెప్పినాను. స్పష్టత ఇవ్వడానికి ఈ రోజు మళ్లీ చెప్తున్న.. మీరందరూ తెలంగాణ బిడ్డలే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.