Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హార్టికల్చర్‌ వర్సిటీ మరింత బలోపేతం

-300 ఎకరాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌
-హార్టికల్చర్‌ వర్సిటీ మరింత బలోపేతం
-ఉద్యాన రైతుకు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి
-పట్టణాల చుట్టూ కూరగాయల సాగు పెరగాలి
-సీఎం కేసీఆర్‌ ఆదేశం
-ఉద్యానశాఖపై సమీక్ష

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మూస పద్ధతిలో సాగింది. వరికే ప్రాధాన్యమివ్వడంతో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో సాగు బాగా వెనకబడిపోయింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యానసాగు విస్మరణకు గురైంది. వ్యవసాయంలో అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణలో నేలల స్వభావం, పంటలకు అనుగుణంగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఉద్యానపంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి.

మనకు అద్భుతమైన భూములున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ఇప్పుడన్నా మన నీళ్లను, మన భూములను సాగుకు సరిగా వినియోగించుకుందాం. ఆ దిశగా అధికారులు దృష్టి కేంద్రీకరించాలి.
– సీఎం కేసీఆర్‌

వ్యవసాయశాఖ పనితీరు భేష్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతుసాగు ఖర్చు తగ్గించుకునేలా వ్యవసాయశాఖ విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయశాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పనిచేస్తున్నారని, ఏయే పంటలు పండిస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేసి, రైతుల సెల్‌ఫోన్లకు కూడా మెసేజీల ద్వారా పంపిస్తున్నారని, ఈ విధానం దేశంలో మరెక్కడాలేదని సీఎం అభినందించారు.

రాష్ట్రంలో ఉద్యానసాగును వీలైనంత ఎక్కువగా విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయంలో మూస పద్ధతిని విడనాడాలని, ఉద్యాన పంటలపై పరిశోధనలు పెరగాలని తెలిపారు. ఇందుకోసం హార్టికల్చర్‌ యూనివర్శిటీని బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో వీలైనంత త్వరగా గజ్వేల్‌ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతంచేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఏర్పాటుచేయాలని, ఇందుకోసం 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యానపంటల సాగును పెంచడంపై పలుసూచనలు చేశారు.

ఉద్యాన రైతుకు ఊతం
‘ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మూసపద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీటితో సాగైన వరిపంటకే నాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిచ్చాయి. దీంతో సాగునీటి కొరత తీవ్రంగాఉన్న తెలంగాణలో వ్యవసాయం వెనుకబడిపోయింది. ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని అంచనావేయడంలో గత పాలకులు వైఫల్యం చెందారు. సమగ్ర విధానమంటూ రూపొందించకపోవడంతో తెలంగాణలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యానపంటల సాగు చాలావరకు విస్మరించబడింది. ఇప్పుడు సేద్యరంగంలో తెలంగాణ అగ్రగామిగా సాగుతున్నది. మన నేలల స్వభావం, పంటల విధానం అర్థమవుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీరు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ, తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేలా రైతాంగాన్ని ఉద్యానపంటల సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. ప్రభుత్వ ఉద్దేశాలను అర్థంచేసుకుని ఉద్యాన నర్సరీలను నెలకొల్పే.. పంటలసాగుకు ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు రైతుబంధుతోపాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖలు కార్యాచరణ రూపొందించాలి. పండ్లు, కూరగాయలు, పూలసాగులో ఉద్యానశాఖ ఇప్పుడెలా ఉన్నది? భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనేదానిపై ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

300 ఎకరాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌
ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఏర్పాటుచేయాలని, ఇందుకోసం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉద్యాన వర్సిటీ మౌలిక సౌకర్యాల రూపకల్పన అభివృద్ధికోసం వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయిస్తామన్నారు. వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదేస్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, ముఖ్యపట్టణాల్లో గజ్వేల్‌ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యానశాఖ వికేంద్రీకరణ
ఉద్యానశాఖలో పని విధానాన్ని వికేంద్రీకరణ చేసుకోవాలని, ఇందుకు పని విభజన జరగాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉద్యానశాఖకు ప్రస్తుతం ఒకే కమిషనర్‌ ఉన్నారని, ఇకనుంచి పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, పామాయిల్‌ సాగు కోసం నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని సూచించారు. ఈ దిశగా క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు పని విభజన జరగాలని ఆదేశించారు. ఉద్యానశాఖలో తక్షణమే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని, తగినంతగా సిబ్బంది ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించాలని, హార్టికల్చరిస్టులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. రైతుకు లాభం చేకూర్చేలా దేశవ్యాప్తంగా సాగవుతున్న వివిధరకాల ఉద్యాన పంటలసాగుపై సీఎం కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు. కేంద్రం అమలుచేస్తున్న నూతన సాగుచట్టాలకు సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, హార్టికల్చర్‌ యూనివర్శిటీ వీసీ నీరజ, హార్టికల్చర్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

కూరగాయల దిగుమతులు ఉండొద్దు
‘తెలంగాణలో మొత్తం 129 మున్సిపాలిటీలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్‌ నగరాలు, పట్టణాలున్నాయి. వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసరాలను అందించాల్సి ఉంది. ఆయా పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపికచేసి.. కూరగాయలు తదితర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. తద్వారా తెలంగాణలోని పట్టణాలకు ఇతర రాష్ర్టాలు నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదు. కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేసే దిశగా ఉద్యానశాఖ చర్యలు చేపట్టాలి’ అని సీఎం సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.