-సింగపూర్, కౌలాలంపూర్‌లో ఐదు రోజుల పర్యటన పూర్తి -ఫలించిన బ్రాండ్ తెలంగాణ ప్రచారం బ్రాండ్ తెలంగాణ నినాదంతో రాష్ర్టానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సింగపూర్, కౌలాలంపూర్‌లో జరిపిన ఐదు రోజుల పర్యటన పూర్తయింది. ఆదివారం రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

బ్రాండ్ తెలంగాణ నినాదంతో తెలంగాణ రాష్ర్టానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సింగపూర్, కౌలాలంపూర్‌లో జరిపిన ఐదు రోజుల పర్యటన పూర్తయింది. ఆదివారం రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్ పారిశ్రామిక వేత్తల సదస్సు, ఐఐఎం విద్యార్థుల అలుమ్ని- ఇంపాక్ట్ సదస్సు , సింగపూర్ నగర శాంతిభద్రతలు,పారిశ్రామిక విధానాలపై అధ్యయనం, అర్బన్ రీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులతో సమావేశం, కౌలాలంపూర్‌లో శాటిలైట్ నగరాల తీరుతెన్నుల పరిశీలన, మోనోరైల్ వ్యవస్థపై అధ్యయనం, మలేసియా ప్రధానితో సమావేశం ఆయన పర్యటనలో చోటు చేసుకున్నాయి.
మొదటి రోజు సింగపూర్‌లో అక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి అధ్యయనం చేశారు. రెండవ రోజు సింగపూర్‌లోని ఐఐఎం విద్యార్థుల అలుమ్ని కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. మరుసటిరోజు కారులో ప్రయాణించి మలేషియాలోని కౌలాలంపూర్ చేరుకున్నారు. ఒకరోజు పూర్తిగా అక్కడి రవాణా వ్యవస్థ, శాటిలైట్ నగరాల నిర్మాణాలపై అధ్యయనం చేశారు. అదివారం మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌ను ఆయన నివాసంలో కలిశారు. తర్వాత మలేషియా మోనో రైల్‌లో ప్రయాణించారు. కౌలాలంపూర్‌లోని కేఎల్ సెంటర్‌లో మోనోరైల్ రవాణా వ్యవస్థపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రాత్రి మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో బయలుదేరి అర్ధరాత్రి 11:55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఉపముఖ్యమంత్రులు రాజయ్య, మహ మూద్‌అలీ, మంత్రులు నాయిని, కేటీఆర్ తదితరులు స్వాగతం పలికారు. విదేశీ పర్యటనలో సీఎం వెంట ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గణేష్ బిగాల, జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.