-ప్రగతి భవన్, తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీసు ముట్టడికి పన్నాగం -లాఠీచార్జీ జరిగేలా చేయాలని,వీలైతే ఫైరింగ్‌కు రెచ్చగొట్టాలని కార్యకర్తలకు సంజయ్ సూచనలు -రక్తం చిందించడమే వారి లక్ష్యం -దుబ్బాకలో సానుభూతికి యోచన -మా వద్ద విశ్వసనీయ సమాచారం -బీజేపీ కుట్రలపై సీఈసీకి ఫిర్యాదు -రాష్ట్రస్థాయిలో డీజీపీ, ఎస్ఈసీకి -రాజకీయానికి కార్యకర్తల్ని బలిస్తారా? -టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -బీజేపీ నాయకుల కుతంత్రాలపై ఫైర్

దుబ్బాక ఉప ఎన్నికలో లబ్ధి కోసం బీజేపీ దొంగదారుల్లో వెళ్తున్నది. సొంత పార్టీ కార్యకర్తల రక్తం చిందించడమే అంతిమలక్ష్యంగా భారీ ప్రణాళిక రచించారు. ఇది ఎవరో ఇచ్చిన సమాచారం కాదు.. స్వయంగా ఆ పార్టీ ప్రముఖ నాయకుల నుంచే అత్యంత విశ్వసనీయంగా నాకు సమాచారం అందింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆదివారం ఓ కార్యకర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీని ఆధారంగా హైదరాబాద్‌లో అల్లర్లకు ఆ పార్టీ పన్నాగం పన్నినట్టు మాకు సమాచారం చేరింది. – మీడియా సమావేశంలో కేటీఆర్
దుబ్బాక ఎన్నికల్లో సానుభూతి పొందే యోచనతో హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ప్రగతిభవన్, డీజీపీ ఆఫీసు, తెలంగాణ భవన్‌ను ముట్టడించాలనే దుష్ట పన్నాగానికి తెరలేపిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ముట్టడి సందర్భంగా భారీస్థాయిలో కార్యకర్తలను సమీకరించి లాఠీచార్జీ జరిగేలా, అవసరమైతే ఫైరింగ్ వరకు వెళ్లేలా రెచ్చగొట్టాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారి పార్టీ కార్యకర్తలకు సమాచారమిస్తున్నారని తెలిపారు.
శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. ఉప ఎన్నికలో లబ్ధి కోసం బీజేపీ దొంగదారుల్లో వెళ్తున్నదని మండిపడ్డారు. కార్యకర్తల రక్తం చిందించడమే అంతిమలక్ష్యంగా భారీ ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. ఇది ఎవరో ఇచ్చిన సమాచారం కాదని, స్వయంగా ఆ పార్టీ ప్రముఖ నాయకుల నుంచే అత్యంత విశ్వసనీయంగా తనకు సమాచారం అందిందని వెల్లడించారు. బీజేపీ కుట్రలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేంద్ర ఎన్నికల సంఘానికి శనివారమే లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. బీజేపీ కుట్రలను భగ్నం చేయాలని, అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని డీజీపీ, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బీజేపీ కుట్రలపై దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు.
శాంతిభద్రతల విఘాతానికి యత్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆదివారం ఓ కార్యకర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయని, దీని ఆధారంగా హైదరాబాద్‌లో అల్లర్లకు ఆ పార్టీ పన్నాగం పన్నినట్టు తమకు సమాచారం అందిందని కేటీఆర్ తెలిపారు. ఆరేండ్లుగా హైదరాబాద్ నగరం శాంతియుతంగా ఉన్నదని, ఇప్పుడు నీచ రాజకీయాల కోసం నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని నిరోధించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని చెప్పారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికలు వస్తూ.. పోతుంటాయని, కానీ రాజకీయాల కోసం సొంత పార్టీ కార్యకర్తలను బలి చేయడం దుర్మార్గమని అన్నారు.
గత 15-20 రోజులుగా దుబ్బాకలో బీజేపీ చేయని కుట్రలు, కుతంత్రాలు లేవని కేటీఆర్ మండిపడ్డారు. ఓసారి రూ.40 లక్షలు, మరోసారి రూ.18 లక్షలు, శనివారం హైదరాబాద్‌లో ఏకంగా రూ.కోటి పట్టుబడ్డాయని గుర్తుచేశారు. బీజేపీ డబ్బుల డ్రామాలు ఫెయిల్ కావడంతో.. కొత్తగా అభ్యర్థికి చెయ్యి విరిగిందని, అధ్యక్షుడిపై దాడి చేశారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. అవికూడా బెడిసికొట్టడంతో ఇప్పుడు ఏకంగా అల్లర్లకే కుట్రచేశారని అన్నారు. మొన్న సిద్దిపేటలో ఇద్దరు బీజేపీ నేతల ఇండ్లలో, ఇద్దరు టీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలు జరిగితే.. బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలు జరుగలేదని, ఎనిమిది మంది బీజేపీ నేతల ఇండ్లలోనే సోదాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.
నేరుగా డబ్బులు దొరికినా.. అవి తమవి కాదని బుకాయించారని అన్నారు. ఆ డ్రామా విఫలమై.. తర్వాతి రోజు పోలీసులే వీడియోను బయటపెట్టడంతో బండారం బట్టబయలైందని కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం జనగామలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంతో వారి నోళ్లు మూతపడ్డాయని, డ్రామాలకు తెరపడిందని అన్నారు. బీజేపీ నేతలు గెబెల్స్కే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారని ఎద్దేవాచేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. ఇష్టారీతిన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పన్నాగాలన్నీ బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఏకంగా అల్లర్లకు కుట్ర చేశారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దుర్మార్గపు పార్టీలను నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు.

శాంతిభద్రతలు కాపాడండి -బీజేపీ కుయుక్తులను అడ్డుకోండి -ఈసీ, డీజీపీకి టీఆర్ఎస్ ఫిర్యాదు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో సోమవారం అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ కేంద్రం ఎన్నికల సంఘానికి, డీజీపీకి ఆదివారం ఫిర్యాదు చేసింది. అప్రమత్తంగా ఉండి, వాటిని అరికట్టాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు బుద్దభవన్‌లోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఫిర్యాదు లేఖను అందించారు. మరోవైపు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, దీనిపై తమకు స్పష్టమైన సమాచారం ఉన్నదని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినవారిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, శానంపూడి సైదిరెడ్డి, ఆనంద్, కాలేరు వెంకటేశ్ ఉన్నారు.
బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మాలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అక్కడే ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు అప్రమత్తమై అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. బాధితుడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.