-బీజేపీ, కాంగ్రెస్‌లతో దేశం విసిగిపోయింది
-ఇంక వేచిచూసేది లేదు.. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం
-40 కోట్ల ఎకరాలకు సాగునీరు.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర
-హైదరాబాద్ కేంద్రంగానే దేశరాజకీయాలను ప్రభావితం చేస్తాం
-నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది..
-ఎన్నికల ప్రణాళికను నూరుశాతం అమలుచేశాం
-టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-తెలంగాణ బిడ్డగా మీ గౌరవాన్ని పెంచుతా
-రాష్ర్టాలను మున్సిపాలిటీలకంటే హీనంచేశారు రాష్ర్టాలపై కేంద్రం పెత్తనమేంది?
-కాంగ్రెస్, బీజేపీలవి అబద్ధాల పాలనలు డిఫాల్ట్ రాజకీయాల నుంచి దేశం బయటపడాలి
-నీటి యుద్ధాలు ఆ రెండు పార్టీల పుణ్యమే ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు
-దేశానికి మేలు చేయాలన్నదే తపన దేశ ప్రజలకు మంచి దారి చూపుదాం
-టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
ఏడు దశాబ్దాల బీజేపీ, కాంగ్రెస్‌ల అసమర్థ పాలన, నిష్క్రియాపరత్వంతో దేశం విసిగిపోయిందని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ రెండు పార్టీల పరిపాలన వల్ల భారతదేశం డెబ్భై ఏండ్ల విలువైన సమయాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఈ రెండు పార్టీలపై మొహం మొత్తిపోయారని, ఒక ప్రత్యామ్నాయంకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాల్లో నూటికినూరుశాతం క్రియాశీల పాత్రను పోషిస్తామని స్పష్టంచేశారు. కేవలం ఆరేండ్ల నిర్ణీత కాల వ్యవధిలో దేశంలో 40 కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చే పథకాన్ని ఫెడరల్ ఫ్రంట్ ప్రకటిస్తుందంటూ పేర్కొని రెండు జాతీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టించారు. తాను తెలంగాణను వదిలిపెట్టి పోనని, హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తానని, దేశరాజకీయాలను ప్రభావితం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్రసమితి 17వ ప్లీనరీ సమావేశంలో ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరాన్ని తేల్చిచెప్పారు.
వనరులుండీ, వసతులుండీ, డబ్బులుండీ, మానవ శక్తిసంపద ఉన్నప్పటికీ.. ఏమీ సాధించలేని కాంగ్రెస్, బీజేపీల అసమర్థతను ఎండగట్టారు. కొట్లాడి సాధించుకొన్న స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం.. గత నాలుగేండ్లలో చేసిన ప్రగతిని ప్రజ ల ముందుంచారు. ఎన్నికల ప్రణాళికను నూటికి నూరుశాతం అమలుచేసింది దేశంలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని వెల్లడించారు. దేశంలో నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమాంతరంగా జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. రాజకీయ పక్షపాతం లేకుండా..అధికార, విపక్ష ఎమ్మెల్యేలని చూడకుండా ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధిచేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ అని.. కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీల నేతలు, అధికారులు ప్రశంసిస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షపదవి వచ్చిందంటే అది గులాబీ జెండా తెచ్చిన తెలంగాణ వల్లనేనని చెప్పారు. ఇష్టంవచ్చినట్టుగా అబద్ధాలు ప్రచారంచేస్తున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ వజ్రాల్లాంటివారని, రానున్న ఎన్నికల్లో అందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు