Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక హైవే

-రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్.. -నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డు -ఈరోడ్ తరహా టెక్స్‌టైల్ పార్కు -ప్రపంచం మెచ్చే పారిశ్రామిక విధానం -ఆటంకాలు లేకుండా అనుమతులు -సింగపూర్ తరహా సింగిల్ విండో -దరఖాస్తులకు15 రోజుల్లో అనుమతులు -గంపగుత్త పారిశ్రామికవాడలకు చెల్లుచీటీ – ఫార్మా, టెక్స్‌టైల్, ఫౌండ్రీలకు వేర్వేరు కారిడార్లు -సాగునీటి ప్రాజెక్టుల్లో పది శాతం పరిశ్రమలకు.. -సర్కారు భూముల్లో స్థలం కోసం సర్వే.. -దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం -పారిశ్రామిక విధాన రూపకల్పనపై సమీక్షలో సీఎం కేసీఆర్

KCR

అతిత్వరలో ప్రపంచంలోనే ఉత్తమమైన తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటిస్తున్నాం. సింగిల్ విండో విధానం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు శంషాబాద్‌లో దిగగానే రాష్ట్ర ప్రొటోకాల్ ఆఫీసర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికి నేరుగా సీఎం కార్యాలయానికి తీసుకువస్తారు. పరిశ్రమ ప్రతిపాదనలిచ్చి పారిశ్రామిక వేత్తలు వెళ్లిపోవచ్చు. రెండునుంచి మూడున్నర వారాల్లో వారిని మేమే పిలిచి అన్ని అనుమతులతో కూడిన ప్యాకేజీ ఫైలు అందజేస్తాం. పరిశ్రమ ప్రారంభించాల్సిందిగా కోరుతాం. – ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు తీయించేలా ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిశ్రమల శాఖ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిశ్రమలు స్థాపించే వాతావరణం రావాలని ఆయన అన్నారు. ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులంతా హైదరాబాద్‌కు పరుగెత్తుకు వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే 17 ప్రభుత్వ శాఖలనుంచి 22 రకాల అనుమతులను పారిశ్రామికవేత్తలే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఎత్తి చూపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అడ్డంకులు, చీకాకులకు తావుండరాదని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ పరిశ్రమలు, టీఎస్‌ఐఐసీ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నూతన పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై దృష్టి సారించారు.

తన ప్రాధాన్యతలు, విధానాలను వివరించిన కేసీఆర్ తెలంగాణ అస్తిత్వంతో కూడిన పారిశ్రామికాభివృద్ధికి బీజాలు పడాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక విధాన రూపకల్పన కోసం ఇప్పటి వరకు ఉత్తమ విధానం అనుసరిస్తున్నట్టు ప్రచారంలో ఉన్న సింగపూర్ డెవలప్‌మెంట్ బోర్డు సిస్టంను అధ్యయనం చేయాలని, అలాగే గుజరాత్ వంటి రాష్ర్టాల్లో పరిశ్రమల అనుమతులకు అనుసరిస్తున్న విధి విధానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ అధ్యయనాలు పూర్తి చేసి పది రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం చిత్తుప్రతిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రెండో పెద్ద నగరంగా వరంగల్..: రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్‌ను పారిశ్రామికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇందుకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తామని, విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. రైలు మార్గం, హైదరాబాద్ నుంచి గంట 10 నిమిషాల్లో రోడ్డు మార్గాన చేరుకునేలా రవాణా మెరుగుపరుస్తామని చెప్పారు.

అలాగే నగరానికి సంపూర్ణంగా నీటి వసతి అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఉన్న ప్రాంతమంతా ఇండస్ట్రీయల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమిళనాడులోని ఈరోడ్ తరహాలో వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ అధికారులకు చెప్పారు. ఆజాంజాహి మిల్లుకు సంబంధించిన భూమి కొంత అందుబాటులో ఉందని, మరికొంత సేకరించి రెండు వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని చెప్పారు.

పారదర్శకంగా సింగిల్ విండో..: తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా ఉండే సింగిల్‌విండో విధానం ఉండాలని సీఎం చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేనంత సులువుగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా ఆ సింగిల్‌విండో విధానాన్ని అమలు చేయాలని అన్నారు. దానికి తగిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు వచ్చే పెట్టుబడిదారులు దరఖాస్తు ఇచ్చిన15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా నూతన విధానం ఉండాలన్నారు.

అనుమతులు తెచ్చుకునే విధానం ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉందని 22 రకాల అనుమతులు తెచ్చుకోవడం ఇబ్బందికరంగా ఉన్నట్లు సీఎం అభిప్రాయపడ్డారు. దీనికి బదులు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ అందుబాటులో ఉన్న భూమిని ఇండస్ట్రీయల్ పార్కులుగా మార్చి, అన్ని అనుమతులు తానే తీసుకుని అందులో పారిశ్రామికవేత్తలు నేరుగా పరిశ్రమలు ప్రారంభించుకునేలా సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. అలాగే తెలంగాణలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రాజెక్టుల్లో 10 శాతం పరిశ్రమలకు..: అనేక పరిశ్రమలకు నీటి కేటాయింపు పెద్ద సమస్యగా మారుతుందని గుర్తించామని అందువల్ల ఇకపై ప్రతి ప్రాజెక్టులో పదిశాతం నీరు పరిశ్రమలకు కేటాయించే విధానం అమలులోకి తెస్తామన్నారు. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలోనే ఇది అంతర్భాగంగా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టుల్లో కనీసం పది శాతం నీటిని పరిశ్రమలకు కేటాయించే విధంగా చట్టం చేస్తామని ప్రకటించారు. నూతన పాలసీని రూపొందించే ముందు పారిశ్రామికవేత్తల సంఘాలైన అసోచాం, సీఐఐ, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య, ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల ప్రతినిధులతో మాట్లాడతామని చెప్పారు. ఇందుకోసం మూడు, నాలుగు రోజుల్లోనే సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. వారిచ్చే సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు.

పారిశ్రామీకరణ ఇక రాష్ట్రవ్యాప్తం..: పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ జరిపిన సమీక్షలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతవరకూ ఒక్క ప్రాంతానికే పరిమితమైన పారిశ్రామీకరణ ఇక రాష్ట్రవ్యాప్తం చేయాలన్నది అందులో ఒకటి. అలాగే ఇప్పుడున్న పారిశ్రామిక వాడల్లో వివిధ రకాల పరిశ్రమలు ఒకే చోట కుక్కారని, దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు. అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలికి ఇకనుంచి ఏ రంగానికి ఆ రంగంగా వేర్వేరు ఇండస్ట్రీయల్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఫార్మా, ఫౌండ్రీ, టెక్స్‌టైల్ అండ్ గార్మెంట్, పెయింటింగ్, ఇంజినీరింగ్ ఇలా కంపెనీల స్థాపనకు వేర్వేరు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ఎక్కువ మందికి ఒకే చోట ఉపాధి దొరుకుతుంది. ప్రాంతాల వారీగా పరిశ్రమలను నెలకొల్పాలన్నది మరో నిర్ణయం. ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలను సంపూర్ణంగా వినియోగించుకునే కార్యాచరణ ఉండాలన్నది సీఎం ఆలోచన. వరంగల్, ఖమ్మం సరిహద్దుల్లో బయ్యారం, మహబూబాబాద్ మండలాల్లో విస్తరించిన ఇనుప ఖనిజ నిక్షేపాలను సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం వచ్చిన విషయం ప్రస్తావనకు వచ్చింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.30 వేల కోట్లతో పరిశ్రమను నెలకొల్పేందుకు సంప్రదింపులు జరుపుతుందని సీఎం చెప్పారు.

త్వరలో స్పెషల్ ఛేజింగ్ సెల్..: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సింగిల్‌విండో విధానంలోనే అనుమతులు ఇచ్చేందుకు స్పెషల్ ఛేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.250 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టులను ఈ సెల్ నేరుగా పర్యవేక్షిస్తుంది. ముందుగానే సీఎం పేషీకి అందే ప్రాజెక్టుల ప్రతిపాదనలను సెల్ అధ్యయనం చేస్తుంది. ఆ తర్వాత పారిశ్రామికవేత్తకు విమానాశ్రయంలోనే సాదర స్వాగతం పలికి సచివాలయానికి తీసుకొస్తుంది.

అన్ని రకాల అనుమతులను ఇప్పించేందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. రూ.250 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ కమిషనర్ పర్యవేక్షిస్తారు. వాటికి కూడా సింగిల్ విండో విధానం ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. స్పెషల్ ఛేజింగ్ సెల్‌లో రెవెన్యూ, పరిశ్రమలు, హెచ్‌ఎండీఏ, పీసీబీ, కార్మిక తదితర శాఖల అధికారులు ఉంటారు. వచ్చిన ప్రాజెక్టులను పరిశీలించడంనుంచి భూ కేటాయింపు వరకు అన్నింటికీ సెల్ ద్వారానే గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. పరిశ్రమల శాఖ మానిటరింగ్ చేసే ప్రాజెక్టులపై కూడా ఈ సెల్ సూపర్‌విజన్ చేస్తుందని ఓ అధికారి టీ మీడియాకు తెలిపారు. స్పెషల్ ఛేజింగ్ సెల్, సింగిల్ విండో విధానాల వంటి అన్ని అంశాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో తెలంగాణ మార్క్ ఇండస్ట్రియల్ పాలసీకి ప్రత్యేకత ఉండాలని సీఎం అభిలషిస్తున్నట్లు చెప్పారు.

2 లక్షల ఎకరాల్లో పరిశ్రమలకెంత? తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే గుర్తించిన 2 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి వివరాలను పరిశ్రమలు, టీఎస్‌ఐఐసీ అధికారులకు ముఖ్యమంత్రి అందించారు. వాటిలో సాగుకు అనుకూలం కాని భూముల వివరాలను తొలుత సేకరించి అందులో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనదెంతో లెక్క తేల్చాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించినట్లు తెలిసింది. టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్లు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు కలిసి ఈ సర్వేను వెంటనే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మళ్లీ గుర్తించే భూములపై సర్వే చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్, ప్రభుత్వ సలహాదారులు బీవీ పాపారావు, సీఎం కార్యాలయ చీఫ్ సెక్రటరీ నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్ మల్లేశ్, డిప్యూటీ డైరెక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.