ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. 2018వ సంవత్సరంలో హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్లు సంయుక్తంగా అంతర్జాతీయ ఐటీ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఐటీపై నిర్దిష్టమైన ఆలోచన, స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో 2018వ సంవత్సరంలో నిర్వహించనున్న ప్రపంచ ఐటీ సదస్సుపై సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఐటీ మంత్రి కేటీఆర్‌తో నాస్కామ్ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు.

-దేశంలోనే తొలిసారిగా నగరంలో ప్రపంచస్థాయి సదస్సు -సీఎం కేసీఆర్‌తో చర్చించిన నాస్కామ్ ప్రతినిధులు -ఐటీ సదస్సు-2018 నిర్వహణకు నిధుల కొరత లేదు -మీడియాతో ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో నాస్కామ్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ 2018లో రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ ఐటీ సదస్సుపై చర్చించారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రెండేండ్లకు ఒకసారి ప్రపంచంలోని సాఫ్ట్వేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించే ఈ అంతర్జాతీయ ఐటీ సదస్సు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ర్టానికి గర్వకారణం అన్నారు. ఈ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు నాస్కామ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే ఐటీ పరిశ్రమకు కేంద్రమైన హైదరాబాద్ ఈ సదస్సు అనంతరం మరింతగా విస్తరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే ఐటీ సదస్సుకు ప్రపంచంలోని 80 దేశాలకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ఐటీ దిగ్గజాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ వివిధ దేశాల్లో పర్యటించే సందర్భంలో షెడ్యూల్ ఆధారంగా ఆయా దేశాల్లోని ఐటీ దిగ్గజాలను స్వయంగా ఆహ్వానిస్తారని కేటీఆర్ తెలిపారు.
2018లో ప్రపంచ ఐటీ సదస్సును సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా 2016లో బ్రెజిల్లో నిర్వహించే సదస్సును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని పంపనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సదస్సు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతామని, ఒకవేళ కేంద్రం సహకరించకపోయినా నిధుల కొరత లేదని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడబోమని కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్ర ఐటీ పారిశ్రామిక పాలసీపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనున్నట్లు చెప్పారు. మంత్రివర్గ ఆమోదం తర్వాత పాలసీ వివరాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. అనంతరం ప్రపంచ ఐటీ సదస్సు నిర్వహణ వివరాలను నాస్కామ్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి మీడియాకు వివరించారు.
తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సు-2018 నిర్వహించడానికి సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లు చేసిన కృషికి అభినందనలు తెలిపారు. నాస్కామ్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో సంభవించే మార్పులపై ఈ అంతర్జాతీయ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ఆసియా ఖండంలోనే రెండోసారి నిర్వహించడం.. అదీ హైదరాబాద్‌లో జరుగనుండటం గొప్ప విషయం అన్నారు.]
రాష్ట్ర ఉజ్యల భవిష్యత్‌కు సీఎం ఎక్కడికైనా వెళ్తారు.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికైనా వెళ్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అమెరికా పర్యటన వివరాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి అమెరికా.. గల్ఫ్‌కు వెళ్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని రకాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా చేస్తారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని, చికిత్సకు వెళ్తున్నారని.. రకరకాల ప్రచారం జరుగుతున్నది. అనారోగ్యంతో ఉంటే నాలుగు రోజులు వరంగల్‌లో ఎలా పర్యటిస్తారు. మంత్రులందరి కంటే కేసీఆర్ ఫిట్‌గా ఉన్నారు అని తెలిపారు. విదేశీ పర్యటన షెడ్యూల్‌ను ముందుగా మీడియాకు వెల్లడిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.