Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇది చేతల బడ్జెట్

-అన్ని పక్షాల మద్దతు.. ద్రవ్యవినిమయబిల్లుకు అసెంబ్లీ ఆమోదం -అభివృద్ధి పథాన.. కదిలింది తెలంగాణ -వచ్చే ఏడాది క్లియర్ బడ్జెట్ -రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు..ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం -విద్యుత్‌లో మనవాటా కోసం కొట్లాడాలి -మూడేండ్ల తర్వాత విద్యుత్ కష్టాలుండవ్ -అమరుల సంఖ్యకు సీలింగ్ ఏమీ లేదు -మిషన్ తెలంగాణ సాధించాం..మిషన్ కాకతీయ నెరవేర్చుతాం -క్రమశిక్షణతో ఖజానా నిర్వహణ: సీఎం కేసీఆర్ రోడ్ల కోసం 5వేల కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎం నిధులు రెడీ 25-30 వేల కోట్లతో 45వేల చెరువుల పునరుద్ధరణ రుణమాఫీకి తొలి విడత :రూ.4250 కోట్లు గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు :రూ.250 కోట్లు వాటర్‌గ్రిడ్‌కు ఈ ఏడాది :రూ.2వేల కోట్లు ఫామ్ మెకనైజేషన్‌కోసం : రూ.100కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు :రూ.15వేల కోట్లు మద్దతు ధరకోసం :రూ.400కోట్లు రాష్ట్ర సొంత పన్ను ఆదాయం :రూ.15101.97 కోట్లు రాష్ట్ర సొంత ఆదాయం:రూ.1274కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా :రూ.3969కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ :రూ.2514కోట్లు అప్పులద్వారా :రూ.2800కోట్లు ఇతర ఆదాయాలు :రూ.288కోట్లు ఆరు నెలల్లో మొత్తం ఆదాయం :రూ.25,947 కోట్లు

KCR-in-Assembly

రూ.1,00,643 కోట్ల బడ్జెటరీ అంచనాలతో ప్రవేశపెట్టిన రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసనమండలి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సమగ్రంగా చర్చించిన వివిధ పార్టీల సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో తొలుత కాంగ్రెస్ ఓటింగ్ కోరినప్పటికీ.. సీఎం చేసిన సూచనతో విప్‌ను ఉపసంహరించుకుని ప్రభుత్వానికి బాసటగా నిలిచింది. తమ సభ్యుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ నిరసన తెలిపిన టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. మిగిలిన అన్ని పక్షాలు ద్రవ్య వినిమయ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ సందర్భంగా వివిధ పక్షాల నేతలు ప్రస్తావించిన పలు అంశాలను, సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బిల్లు ఏకగీవ్రంగా ఆమోదం పొందేందుకు సహకరించిన విపక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిల్లు ఆమోదం పొందిందని, సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష నేత జానారెడ్డి, కాంగ్రెస్ సభ్యులు గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత కే లక్ష్మణ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఎం పక్ష నేత సున్నం రాజయ్య, వైఎస్సార్సీపీ నేత తాటి వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లిన కేసీఆర్.. వారితో కరచాలనం చేసి.. ధన్యవాదాలు తెలిపారు. అటు మండలిలో బిల్లు ఆమోదం అనంతరం చైర్మన్ స్వామిగౌడ్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ సభ్యులందరినీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రిని అధికార, ప్రతిపక్ష సభ్యులు అభినందించారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బిల్లును వ్యతిరేకించినప్పటికీ సీఎం ప్రసంగం తదుపరి విపక్షనేత కే జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు విప్‌ను పక్కనబెట్టి బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని మార్చనున్న క్రమాన్ని విశదీకరించారు. చేపట్టబోయే ప్రాజెక్టులు, వాటి కేటాయింపులు.. ఉన్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు చేస్తున్న కృషిని సమగ్రంగా వివరించారు. ప్రగతిపథంలో తెలంగాణ ప్రయాణం మొదలైందని చెప్పారు. బడ్జెట్‌పై గురువారం అర్ధరాత్రి వరకు సమగ్రంగా చర్చ జరిగింది. తెలంగాణ సమాజం అంతా మనవైపు చూస్తున్నది. కొత్త రాష్ట్రంలో గౌరవం వచ్చే విధంగా మాట్లాడుకున్నాం. సహనంతో, సమన్వయంతో ముందుకు పోదాం అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ.25,947 కోట్లు ఆదాయం వచ్చిందని శాసనసభకు తెలిపారు.

ఇందులో రాష్ట్ర సొంత పన్ను ఆదాయంకింద రూ.15101.97కోట్లు, రాష్ట్ర సొంత ఆదాయంకింద రూ.1274కోట్లు, కేంద్ర పన్నుల ఆదాయంకింద రూ.3969కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కింద రూ.2514కోట్లు, అప్పులద్వారా రూ.2800కోట్లు, ఇతర ఆదాయాలకింద రూ.288కోట్లు వచ్చినట్లు వివరించారు. ఈ లెక్కల ఆధారంగానే బడ్జెట్‌ను అంచనా వేసినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు పెండింగ్‌లో ఉండటం, ఆదాయాల పంపకం జరుగకపోవడంవల్ల లెక్కల్లో కొంత స్పష్టత లోపించిందని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో వివరాలు ఇస్తామన్నారు.

ఇన్ని డబ్బులు ఎక్కడినుంచి తెస్తారని నన్ను అడిగారు. మేం ఏదీ దాచిపెట్టడం లేదు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్స్ పాత రాష్ట్రంలోని తెలంగాణ జనాభా ఆధారంగానే వస్తున్నాయి. ఈ ఏడాది ఆదాయం లెక్కలు ఇంకా తేలలేదు. వచ్చే సంవత్సరంనుంచి పూర్తి లెక్కలతో వస్తాం. రాబోయే పంచవర్ష ప్రణాళికనుంచి ప్లానింగ్ కమిషన్ తెలంగాణలోని వాస్తవ జనాభా ఆధారంగా గ్రాంట్స్ ఇస్తుంది. ఎఫ్‌ఆర్‌బీఎం కూడా దీని ఆధారంగానే నిర్ధారిస్తారు అని సీఎం వివరణ ఇచ్చారు. ఈ సంవత్సరం రూ.1,00,643 కోట్ల బడ్జెట్‌ను పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఆనాడున్న జనాభా లెక్కల ఆధారంగా మనకు రూ.2545 కోట్లు వచ్చాయి.

మొత్తం రెవెన్యూ రాబడులు రూ.80,933కోట్లు అని అంచనా వేశాం. కేంద్రం నుంచి వచ్చే ట్యాక్స్‌ల ద్వారా రూ.9749.36కోట్లు, స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ కింద రూ.35,378.24కోట్లు, స్టేట్ ఓన్ రెవెన్యూకింద రూ.13242.02కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.21720కోట్లు, క్యాపిటర్ రెవెన్యూ కింద రూ.18837కోట్లు, ఇతర ఆదాయాలు రూ.5380కోట్లు వస్తాయని అంచనా వేశాం. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద రిజర్వు బ్యాంకు ద్వారా 3% అప్పులు మాత్రమే ఇస్తారు. మనకు ఇంకా రూ. 5వేల కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎం కింద నిల్వ ఉంది.

వీటిని ఏ సమయంలోనైనా తేవొచ్చు అని సీఎం వివరించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్షాల నాయకులు కొందరు సూచనలు చేశారు. కొందరు విమర్శలు చేశారు. నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. కొత్త రాష్ట్రం. అధికారులు లేని రాష్ట్రం. అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఇప్పటి వరకు లేదు. ఒక్కొక్క అధికారి 7,8శాఖలను నెట్టుకొస్తున్నారు. కాలం ఎవరికోసమూ ఆగదని తెలుసు. అందుకే ఇబ్బందులున్నా పనులు చేస్తున్నాం అన్నారు. రోడ్లు, చెరువుల పనులు, వాటర్‌గ్రిడ్‌కు వేలకోట్లు కేటాయించినం. ఫైనాన్స్ కమిషన్ రాష్ర్టానికి రావాల్సిన లెక్క తేల్చితే దాని లెక్కన కేంద్రం నుంచి నిధులు వస్తాయి.

ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేస్తామని కేంద్రం అంటున్నది. ఈ మార్పులపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారు. స్మార్ట్‌సిటీపై ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని ప్రధాని చేసిన విజ్ఞప్తి మేరకు ఈ మధ్యనే ప్రతిపాదనలు పంపినం అని తెలిపారు. అసెంబ్లీలో ఆర్థిక సర్వే పెట్టకపోవడంపై అక్బరుద్దీన్ స్పందిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కవలల్లా వ్యవహరిస్తున్నాయని అనడాన్ని ప్రస్తావించిన సీఎం.. అవును కవలలే. ఎందుకంటే రెండూ కొత్త రాష్ర్టాలే. త్వరలోనే ఢిల్లీకి వెళ్తున్నా. ప్రధానిని, కేంద్రమంత్రులను కలుస్తా. వచ్చే సంవత్సరం బడ్జెట్‌ను క్లారిటీతో పెడతాం. ఎఫ్‌ఆర్‌బీఎంను పెంచాలని అడిగాం.

తెలంగాణ ఇప్పుడే జీవితాన్ని ప్రారంభించింది. బాలారిష్టాలు తప్పవు అని సీఎం అన్నారు. ఎస్‌వోటీఆర్, ఎస్‌వోఆర్ కలిపి రూ.48వేల కోట్లుగా అంచనా వేశాం. దీని మీద 90% రుణం తీసుకోవచ్చు. అప్పులు రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద డైరెక్టుగా ప్రభుత్వమే అప్పులు తీసుకుంటుంది. రెండోది రాష్ట్ర కార్పొరేషన్లు, సొసైటీలు, సంస్థలు ఫైనాన్స్ సంస్థలతో అగ్రిమెంట్ కుదుర్చుకుని అప్పులు తీసుకుంటాయి. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కావాల్సిన నిధులను అప్పుగా తీసుకుంటే తిరిగి ప్రభుత్వమే వాటిని చెల్లిస్తుంది. కానీ ముందుగా ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. కార్పొరేషన్లే డైరెక్టుగా అప్పులుచెల్లించే పద్ధతి ఎక్కడా లేదు అని చెప్పారు.

ప్రపంచబ్యాంకు షరతులు తిరస్కరించాం చెరువుల పునరుద్ధరణకు ప్రపంచ బ్యాంకు సహాయాన్ని కోరితే వారు కొన్ని షరతులు పెట్టారని, వాటిని తిరస్కరించామని సీఎం తెలిపారు. అయితే ఆ తర్వాత షరతులను సవరించారని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కింద 45వేల చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించాం. దీనికి రూ.25-30వేల కోట్లు కావాలి. మొదటి విడతలో 9వేల చెరువులను పునరుద్ధరిస్తున్నాం. వాటి లెక్క ఆధారంగా వచ్చే ఏడాది బడ్జెట్ కేటాయిస్తాం. కేంద్రంనుంచి వచ్చే ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు స్టేట్ ప్లాన్, ప్రపంచబ్యాంక్ నుంచి నిధులు తెస్తున్నాం.

ప్రపంచబ్యాంక్ కొన్ని కండీషన్లు పెడితే తిరస్కరించాం. దీంతో షరతులు సడలిస్తాం అన్నారు. ఆ తరువాత జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉంది. నేను సీఎం అయినంక 27 దేశాల మంది ప్రతినిధులు నన్ను కలిశారు. సోలార్‌రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. మనం ఖజానాను క్రమశిక్షణతో వినియోగిస్తే రుణాలు వేగంగా వస్తాయి. లేకుంటే ఆలస్యం జరుగుతుంది. మనదగ్గర ఎఫ్‌ఆర్‌బీఎం కింద రావాల్సిన రూ.5వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రోడ్ల కోసం అట్లనే పెట్టినం అని అన్నారు.

తెలంగాణ మీద కొన్ని పీడలు పడ్డాయి తెలంగాణమీద కొన్ని పీడలుకూడా పడ్డయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద నాలుగేండ్లుగా రూ.1500కోట్లు పెండింగ్ ఉన్నాయి. కోర్టు కేసులు, విద్యార్థుల ఆందోళనలు చూసి.. బకాయిలు మనమే చెల్లిద్దామని చెప్పిన. తొలి విడతలో రూ.500కోట్లు ఇచ్చినం. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.480కోట్లు బకాయిలు చెల్లించినం. ఎర్రజొన్న రైతులు బకాయిలు చెల్లించాలని కోరితే కాల్పులు జరిపారు. వారికి మేం ఇస్తామని అన్నం. రూ.11కోట్లు ఇచ్చినం. మొత్తంగా రూ.1600కోట్లు బకాయిలకు ఇచ్చినం అని చెప్పారు.

రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసినం రుణమాఫీకింద రూ.17వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని రద్దు చేసినం. మొదటి విడతగా బ్యాంక్‌లకు రూ.4250కోట్లు విడుదలచేసి మాట నిలబెట్టుకున్నం. మిగిలిన రూ.12000కోట్లు మూడు విడతల్లో ఇస్తామని చెప్పినం. ఈ మాఫీ రుణాల వడ్డీ కూడా ప్రభుత్వంపై పడ్డది. కొందరు అపోహలు సృష్టించారు. మేం ఎవరినీ నిర్లక్ష్యం చేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకోసం ఖర్చు చేస్తున్నాం. మనవద్ద 4 రకాల నేలలున్నాయి. ఇక్రిశాట్ ఇక్కడికి రావడానికి అదే కారణం. లేకుంటే ఏ గుంటూరుకో, విజయవాడకో పోయేది. డ్రిప్ ఇరిగేషన్‌కు పరిమితిలేకుండా ఎందరడిగినా ఇస్తామన్నాం. ఎస్సీ, ఎస్టీలకు 100%, బీసీలకు 85%, ఇతర రైతులకు 75%సబ్సిడీ ఇస్తాం. ఇది మేం రైతులకు ఇచ్చే కానుక అని అన్నారు.

గతంలో గ్రీన్‌హౌజ్‌కు రూపాయి సబ్సిడీ ఇవ్వలేదు నా ఫాంలో ఎకరాకు కోటి రూపాయల పంట పండిస్తున్నా అని అనలేదు. నేనేమీ తిమ్మిని బమ్మి చేయడం లేదు. తెలివిగల్ల ప్రభుత్వాలు గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌ను ప్రోత్సహించాలి. గుజరాత్‌లో గ్రీన్‌హౌజ్ కింద రెండుమూడు రకాల పంటలే పండిస్తారు. ఇందుల పండించే పంటల క్వాలిటీ ఎక్కువ. అక్కడి రైతులు ఎకరాకు కోటీ 20లక్షల వరకు సంపాదిస్తున్నారు. క్యాప్సికమ్ ఎకరాకు 80-90టన్నులు పండిస్తారు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, గుజరాత్‌లో గ్రీన్‌హౌజ్‌కోసం 75-80% సబ్సిడీ ఇస్తున్నారు.

ఇక్కడి ప్రభుత్వాలు నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా వచ్చే నిధులతో వెయ్యి మీటర్లకే సబ్సిడీ ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా ఇవ్వలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ చేపడుతున్నాం. శాంగ్లీ, రాయ్‌ఫూర్, బెంగళూరు నుంచి మన హైదరాబాద్‌కు 90% కూరగాయలు వస్తున్నాయంటే వ్యవసాయశాఖ, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ లోటును పూడ్చడానికి రూ.250కోట్లు గ్రీన్‌హౌజ్‌కోసం పెట్టాం. దీనివల్ల రైతులు బాగుపడతారు అని చెప్పారు.

మద్దతు ధరకోసం రూ.400కోట్లు రైతులకు మద్దతు ధర లభించాలి. దళారులున్నచోట రైతులకు గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వమే కొనుగోలుచేస్తుంది. ఇందుకు రూ.400కోట్లు పెట్టినం. పాడి పరిశ్రమను ఆదుకునేందుకు, ప్రభుత్వరంగం విజయ డెయిరీని బలోపేతంచేసేందుకు రైతులకు లీటర్‌పాలకు రూ.4 ఇన్సెంటివ్‌కోసం రూ.16.37 కోట్లు పెట్టినం. దేశంలో మూడోవంతు పౌల్ట్రీ పరిశ్రమ ఇక్కడే ఉంది. గత ప్రభుత్వాలు వారి బాగుకు చర్యలుతీసుకోలేదు. మేం వారికి రూ.20కోట్లు పెట్టి కరెంటు బిల్లుల్లో 50%రాయితీ ఇస్తున్నాం. ఫామ్ మెకనైజేషన్‌కు రూ.100కోట్లు పెట్టినం.

12నెలల పెన్షన్లకు రూ.4వేల కోట్లు పెన్షన్లకు ఎలాంటి సమస్య లేదు. గతం సంఖ్యకంటే లక్ష ఎక్కువే ఇస్తాంకానీ తగ్గించం. దీనికి రూ.1900కోట్లు పెట్టినం. వాస్తవానికి 12నెలలకు రూ.3800-4000కోట్లు కావాలి. ఇందులో ఎవరికీ అయోమయం అవసరం లేదు.

రోడ్లకు రూ.15వేల కోట్లు రోడ్లకు గత పదేండ్లలో తట్టెడు మట్టిపొయ్యలేదని దయాకర్ అన్నారు. మేం రోడ్ల బాగుకు రూ.15000కోట్లు అంచనా వేసినం. రూ.700 కోట్లు బకాయి ఉండటంతో పంచాయతీరాజ్‌ద్వారా రోడ్ల టెండర్లు పిలిస్తే ఎవరూ రావడంలేదు. మేం బకాయిలు చెల్లిస్తున్నాం. 14500 కి.మీ. పంచాయతీరాజ్ బీటీ రోడ్లు బాగు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదు. ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్నింటినీ బాగుచేస్తాం. 20వేల కి.మీ. మట్టిరోడ్లను కి.మీ.కు రూ.3లక్షల చొప్పున ఖర్చుచేస్తూ నాణ్యంగా తయారుచేస్తున్నారు.

ప్రతినియోజకవర్గానికి 200 కి.మీ. రోడ్లు వేయొచ్చు. మండల కేంద్రాలకు కనెక్టివిటీ కోసం ఆర్‌అండ్‌బీ ద్వారా రోడ్లు వేస్తున్నాం. 14476 కిలోమీటర్లు రెన్యూవల్స్, 4వేల కిలోమీటర్లు కొత్తవి వేస్తున్నాం. జగిత్యాలకు, ముథోల్‌కు రెండు బ్రిడ్జిలు మంజూరు చేసినం.

పచ్చని తెలంగాణే లక్ష్యం తెలంగాణలో వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. కేంద్రంనుంచి రూ.1,100కోట్ల కంపా నిధులు వస్తాయి. దశలవారీగా ఇవ్వాలని కోరాం. ఈ ఏడాది రూ.300కోట్లు రానున్నాయి. దీంతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. మొత్తం 2.40కోట్ల మొక్కలను పెంచి, తెలంగాణ పచ్చదనంతో కళకళలాడాలన్నదే మా లక్ష్యం అని సీఎం వివరించారు.

పేదలకు సర్కారు అండ అక్రమాలను చూస్తూ ఊరుకునేది లేదు. నగరం చుట్టూ వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అయ్యప్ప సొసైటీ కానీ, ఇంకే అప్ప సొసైటీ అయినా ఊరుకోబోం. అదే సమయంలో జంటనగరాల్లో పేదల ఇండ్లను కూల్చబోము. అర్హుల ఇండ్లకు పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్లు చేస్తాం అని తెలిపారు.

తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవిస్తున్నాం తెలంగాణ సంస్కృతి మీద దాడి జరిగింది. కాంగ్రెస్ చేయకున్నా తెలంగాణ బిడ్డ, దేశానికి ప్రధానిగా పనిచేసిన పీవీ వర్ధంతిని అధికారికంగా జరిపాం. ఒక వర్సిటీకి పీవీ పేరు పెట్టాం. జల్, జంగిల్, జమీన్ నినాదంతో పోరాటం చేసిన కొమురంభీమ్ వర్ధంతి జరిపాం. జోడే ఘాట్‌లో రూ.25కోట్లతో స్మారక కేంద్రం నిర్మిస్తున్నాం. వరంగల్ నగరంలో రూ.15కోట్లతో కాళోజీ కళా క్షేత్రాన్ని ఏర్పాటుచేస్తున్నాం. ప్రపంచం నివ్వెరపోయేలా రూ.100 కోట్లతో గోదావరి పుష్కరాలను నిర్వహించుకోబోతున్నాం. యాదగిరిగుట్టను ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయబోతున్నాం. అక్కడ అటవీశాఖ పరిధిలోని 400 ఎకరాల్లో యాదగిరి అభయారణ్యం ఏర్పాటుచేస్తాం అని సీఎం తెలిపారు.

కొత్త రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలి. బడ్జెట్‌కు అడ్డుపడ్డారనే అపవాదు రాకూడదని బిల్లుకు మద్దతిస్తున్నాం. -కే జానారెడ్డి, ప్రతిపక్ష నాయకుడు

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయడం, కోట్ల వ్యయంతో రోడ్లు అభివృద్ధి చేయడం సంతోషకరం – టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు

సీఎం కేసీఆర్ వెల్లడించిన అంశాలు, వాటిని అమలుచేస్తానన్న సాహసం, ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నా -కే లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్షనేత

మురికివాడల్లోని గృహాలకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తామన్న సీఎం ప్రకటన చరిత్రాత్మక నిర్ణయం. -అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పక్షనేత

ప్రజలకు అనుకూలంగా ఉన్నంతకాలం ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటాం – సున్నం రాజయ్య, సీపీఎం

గిరిజన యూనివర్సిటీపై గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలి – తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం వాటర్‌గ్రిడ్ ద్వారా నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తాం. బిందెలు పట్టుకుని ఆడపడుచులు బజార్లలో కనిపించొద్దు. సిద్దిపేటలో 145గ్రామాలకు 20ఏండ్లక్రితమే ఈ విధానం అమలుచేశాం. ఈ స్కీం గురించి ప్రధానికి చెప్పిన. ఆయన ఫైనల్ చేసుకుని రమ్మన్నారు. దీనికి ఈ సంవత్సరం రూ.2వేల కోట్లు పెట్టినం. దాదాపు రూ.35వేల కోట్లు కావాలి. వాటర్ గ్రిడ్ నిర్వహణకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినం. నాలుగేండ్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తాం. ప్రభుత్వం ఇవాళ ధైర్యంగా చెబుతున్నది. మేం నీళ్లు నల్లా కనెక్షన్ ద్వారా ఇవ్వకుంటే టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగదు.

ఇలా చెప్పడానికి సాహసం కావాలి. దేనికైనా ఆత్మవిశ్వాసం, ధైర్యం అవసరం. మా చిత్తశుద్ధిపై మాకు నమ్మకం ఉంది. కష్టపడి పనిచేస్తం. సవాళ్లు కేసీఆర్‌కు కొత్త కాదు. 2001లో చిన్న లాంతరుతో బయలుదేరితే.. ఎక్కడి తెలంగాణ? అని ఎక్కిరించిండ్రు. కొత్త దుకాణం అన్నరు. మా దుకాణం చిత్తశుద్ధితోనే తెలంగాణ మిషన్ సాధించినం. ఆంధ్రప్రదేశ్‌నుంచి వెళ్లి తెలంగాణతో వస్తానని చెప్పి.. సాధించుకున్నాం. వాటర్‌గ్రిడ్‌కూడా సాధించి తీరుతం. భగవంతుని దయ, కేంద్రంసహకారంతో పూర్తిచేస్తాం. కాకతీయ రెడ్డిరాజులు ఆనాడే వాటర్‌షెడ్‌లు నిర్మించి ప్రపంచానికి మార్గదర్శకంచేశారు. ఇవాళ చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నాం అని సీఎం తెలిపారు.

బక్రీద్, రంజాన్, క్రిస్‌మస్‌లకు రెండు రోజుల సెలవు రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్ పండుగలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హిందువుల పండుగలకు ఎక్కువ సెలవు దినాలు వస్తున్నాయి.. ముస్లిం, క్రైస్తవ ఉద్యోగులు రంజాన్, క్రిస్‌మస్ పండుగలకోసం కుటుంబాలతో ప్రయాణాలు చేసి మరుసటి రోజే తిరిగి విధుల్లోకి రావడం ఇబ్బందిగా ఉందని నా దృష్టికి వచ్చింది అని చెప్పిన కేసీఆర్.. వారికి పండుగ తదుపరి రోజు కూడా సెలవును ఇస్తున్నట్లు తెలిపారు. ఇంతలో మజ్లిస్ సభ్యులు బక్రీద్ కూడా ఉందని గుర్తుచేయగా, బక్రీద్‌కు కూడా రెండు రోజులు ఇస్తామని తెలిపారు.

అయితే రెండవ శనివారం మైనారిటీ ఉద్యోగులు పనిదినంగా పాటించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనను ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ హర్షించారు. గిరిజనుల ఆరాధ్య దైవాల మేడారం జాతర, గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ వర్ధంతి రోజులను సెలవు దినాలుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అమరుల సంఖ్యకు సీలింగ్ లేదు తెలంగాణ ఉద్యమంలో అశువులుబాసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. వెయ్యి మందికిపైగా తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని నేనే స్వయంగా అనేక సభలు, సమావేశాల్లో చెప్పాను. అమరుల సంఖ్యను తగ్గించినట్లుగా కొందరు పేర్కొన్నారు. అమరుల త్యాగాలను విస్మరించే కుసంస్కారం మాకు లేదు అని కేసీఆర్ అన్నారు.

దవాఖానల వారీగా నిధుల కేటాయింపు వైద్య, ఆరోగ్యరంగం పూర్తిగా దెబ్బతిన్నది. వైఎస్ 108 అంబులెన్స్‌లను తెచ్చిండు. అద్భుతంగా పనిచేస్తున్నాయి. మంచిని మంచి అనడం మా సంస్కారం. 104 వాహనాలద్వారా పేదలకు ఉచితంగా మందులను సరఫరా చేశారు.

ప్రస్తుతం 516 అంబులెన్స్‌లు ఉన్నాయి. వాటి ప్రాధాన్యం నాకు తెలుసు. అందుకే నిధులు కేటాయించి కొత్తగా 927 అంబులెన్స్‌లు రప్పిస్తున్నాం. రెండు నెల్లలో కొత్త 108 అంబులెన్స్‌లు వస్తాయి. మేం చేసే కార్యక్రమాల వల్ల పేదల దీవెన వస్తుంది. గతంలో ఎన్నడూ హాస్పిటళ్ల వారీగా బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పుడే ఉస్మానియా ఆస్పత్రికి రూ.100కోట్లు, గాంధీకి రూ.100కోట్లు, పేట్లబుర్జ్, సుల్తాన్‌బజార్ ఆస్పత్రులకు రూ.25కోట్ల చొప్పున, నీలోఫర్‌కు రూ.30కోట్లు, ఏరియా ఆస్పత్రులకు కోటి చొప్పున కేటాయించినం. ఇతర దవాఖానలకు రూ.72కోట్లు కేటాయించినం. ఆరోగ్యశ్రీకి రూ.322కోట్లు పెట్టినం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.