ఏడు దశాబ్దాలుగా మురికికూపాలుగా మగ్గుతున్న గ్రామాలను కనీసం ఇప్పటికైనా బాగు చేసుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించబోవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.డెబ్బై ఏండ్ల నిర్లక్ష్యం చాలు.. ఇకనైనా మేల్కొందాం.. సంఘటితంగా కదిలి, ప్రతి గ్రామాన్ని బంగారు గ్రామంగా మార్చుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షించి చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఎవరిదో కొందరి బాధ్యత అనుకోకుండా ప్రజలంతా కలిసి రావాలని ఉద్బోధించారు. ఏ స్థాయిలో ఉన్నా ప్రజాప్రతినిధులంతా ఈ వ్యవస్థలో భాగస్వాములే కాబట్టి శషబిషలు వదిలిపెట్టి చేయి కలపాలని పిలుపునిచ్చారు.

-సంఘటిత శక్తితో పల్లెల రూపురేఖలు మారాలి – ఏడు దశాబ్దాల నిర్లక్ష్యం చాలు.. -ఇప్పటికీ మేల్కొనకుంటే భావితరాలు క్షమించవు – ఏ స్థాయిలో ఉన్నా ప్రజాప్రతినిధులంతా ఒకటే – శషబిషలు, విభేదాలు వదిలి కలిసిరండి – అందరం పనిచేస్తేనే బంగారు తెలంగాణ – చిన్న ముల్కనూరు గ్రామసభలో సీఎం – గ్రామజ్యోతిలో 7 గంటలు ఏకధాటిగా పాల్గొన్న కేసీఆర్ – రాత్రి కరీంనగర్‌లో బస.. నేడు హైదరాబాద్‌కు పయనం గ్రామజ్యోతి ఒకటి రెండు రోజుల కార్యక్రమం కాదన్న కేసీఆర్, ఈ జ్యోతి నిరంతరం వెలిగేలా అందరూ సహకరించాలని కోరారు. చిల్లర రాజకీయాలకు స్వస్తిపలికి సంపూర్ణ గ్రామాభివృద్ధిలో సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే బంగారు తెలంగాణకు బాటలు పడుతాయన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తాను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరులో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోమవారం పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి 7.40వరకు గ్రామంలోనే ఉన్నారు. సాయంత్రం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గ్రామం పై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే…
అందరూ ఒక్కటే… ముల్కనూరు వేదికద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలకు జడ్పీటీసీలకు, జడ్పీ చైర్మన్లకు, ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తిచేస్తున్నా.. అందరికీ నా ప్రార్థన ఒక్కటే. 70 సంవత్సరాలైనా మన గ్రామాలు మురికి కూపాలుగానే ఉన్నాయి. మీరు ఎంపీటీసీ కావచ్చు.. ఎంపీపీకావచ్చు.. జడ్పీటీసీ కావచ్చు.. జిల్లాపరిషత్ చైర్మన్ కావచ్చు.. ఎవరైనా మీరంతా ఈ వ్యవస్థకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారే. నేను మళ్లీమళ్లీ చెప్తున్నా. ప్రజాప్రతినిధులందరూ సమాన బాధ్యులే. ఎక్కువ తక్కువ లేదు. కాబట్టి మీమీ గ్రామాల్లోకి వెళ్లండి.. గ్రామ సభలు పెట్టండి.. ప్రజలతో మాట్లాడి గ్రామ ప్రణాళికలు తయారు చేయండి.. వాటన్నింటినీ సమిష్టిగా అమలు చేయండని మనవి చేస్తున్నా.

ఈ సమయంలో ఏవో పనికిరాని భేదాభిప్రాయాలు, పిచ్చి అలోచనలు, గ్రూపు తగాదాలు, పెత్తనాలు, పంచాయితీలు వద్దు. ఇంకా గ్రామాలను నిర్లక్ష్యం చేస్తే భావితరం మనను క్షమించదు. ఇది మనకు శ్రేయస్కరం కాదు. గ్రామాలను చూడండి. మొత్తానికి మొత్తం దెబ్బతిని ఉన్నాయి. ఈ వేదికనుంచి మన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లకు, రాష్టప్రభుత్వ అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నా. అన్ని జిల్లాలు మనవే. అన్ని గ్రామాలు మనవే. నేను కొన్ని దత్తత తీసుకొని పనిచేస్తే ఆ జిల్లాలకు వెలుతురు వస్తుందని మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నా.
జ్యోతిని ఆరనివ్వకండి.. ఈ ఒక్కరోజుతో గ్రామజ్యోతి అయిపోలే. మనం గ్రామజ్యోతిని వెలిగించాం. వెలిగిన ఈ జ్యోతి ఆరిపోకుండా కొనసాగించే బాధ్యత అందరిపై ఉంది. ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు. మనం అలసిపోయినా కాదు. అది గుర్తుంచుకోవాలి. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా భాగస్వాములు కావాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు మెదక్ జిల్లా ఎర్రవల్లి, కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరులో నేను ఏ విధంగా అయితే పనిచేస్తున్నానో.. ప్రతి అధికారి, ప్రతి ప్రజాప్రతినిధి అదేవిధంగా ఎవరున్న చోట వారు శ్రమిస్తే అద్భుతంగా బంగారు తెలంగాణ తయారు అవుతుంది. పదవిలో ఉన్నవారు కచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాలి.
రెండేండ్లలో దశ మారాలి.. చిన్న ముల్కనూరు దశ రెండేండ్లలో మారాలి. గంగదేవిపల్లి అదర్శంగా మారడానికి 22ఏండ్లు పట్టింది. ఎందుకంటే వాళ్లకు ఎవరూ బాసటగా లేకుండే. వాళ్లకు వాళ్లే అన్నీ చేసుకున్నరు. కానీ ఇపుడు చిన్న ముల్కనూరుకు నేను ఉన్నా. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులంతా మీ వెంట ఉన్నరు. రెండు సంవత్సరాల్లో గ్రామం రూపురేఖలు మార్చి చూపిద్దాం.
గ్రామస్థులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఇగ ఈ ఊరిలో కాళ్లుమొక్కుడు, దండం పెట్టుడు, ఏడుసుడువంటివి బంద్ చేయాలె. నేనే మీ దగ్గరున్నా.. మీరు బాధపడే పనిలేదు. మన పోరాటమంతా గ్రామంలో దారిద్య్రం పోవాలనే. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధిచేయడం ఒకేసారి సాధ్యంకాకపోవచ్చు. ఒక్కటి ఒక్కటి చేసుకుందాం. ముందుగా గ్రామాన్ని పరిశుభ్రం చేసుకుందాం. అట్లనే ఆ కూలిపోయే ఇండ్లను తీసేద్దాం. ఒక ప్రణాళికాబద్ధంగా ఇండ్లు నిర్మాణం చేసుకుందాం. ఇందుకోసం రెండు మూడు రోజుల్లో ఇంజినీర్లు వచ్చి ప్లాన్స్ తయారు చేస్తరు. అలాగే ఇండ్లు కట్టుకునేందుకు జాగలు లేని వాళ్లకు గ్రామపంచాయితీ పరిధిలో రెండు మూడు ఎకరాల స్థలం కొనుగోలుచేయాలని కలెక్టర్‌కు చెప్తున్నా. ఎవరైనా దాతలు భూమి ఇచ్చేందుకు వస్తే మరీ మంచిది. స్థలం కొనుగోలు చేస్తే లేఅవుట్ చేయించి ఇండ్లు నిర్మించుకుందాం. అన్నీ పూర్తిచేస్తే ఇండ్ల శంకుస్థాపనకు పది పన్నెండు రోజుల్లో వస్తా.
నాలుగైదు నెలల్లోనే పూర్తిచేసుకుందాం. ఆ రోజు అంతా కలిసి దావత్ చేసుకుందాం. గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం. అదికూడ పిల్లర్లు వేసి కడితే భవిష్యత్తులో వాళ్లు పైఅంతస్థు వేసుకునేలాగా ఉంటది. ఇక్కడ ఐబీ అతిథి గృహం శిథిలావస్థకు చేరింది. దాన్ని తీసేసి ఎకరం స్థలంలో ఫంక్షన్ హాలు కట్టుకుందాం. దళితవాడలో కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం. ఇపుడు ఉన్న హాలును మహిళా సంఘానికి ఇద్దాం. అలాగే ఆరేడు నెలల్లో గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు ఇప్పిస్తా. గ్రామంలో ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని మంచినీళ్లకోసం బయటకు వెళ్లకుండా చూసే పూచీ నాది. గ్రామాన్ని ఒక ప్రణాళికబద్దంగా తయారు చేసుకోవాలి. ముందు ఆ పాడుబడిన బావులను పూడ్చివేయాలని అధికారులకు చెప్తున్నా. గ్రామంలో చాలామంది జీవనోపాధి లేదని చెప్పుకున్నరు. వాళ్లకు ఉపాధి చూపిద్దాం. గ్రామంలో 2500మంది ఉన్నరు. కొన్ని కుటుంబాలకు కుట్టు మిషన్లు కొనిద్దాం. గ్రామస్తులంతా ఇక్కడనే బట్టలు కుట్టించుకోవాలని తీర్మానం చేసుకుంటే కొందరికి ఉపాధి దొరుకుతది. అలాగే ఎరువులు, కూరగాయలు, గేదెలు ఇతర వ్యాపారాలు పెట్టిద్దాం.
అంకాపూర్ చూసి రండి… చిన్నముల్కనూరు గ్రామస్థులంతా నిజమాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి, అలాగే హైదరాబాద్‌లోని ప్రగతి రిసార్ట్స్‌కు వెళ్లిరండి. కలెక్టర్‌గారు బస్సులు పెడతరు. ప్రగతి రిసార్ట్స్‌లో ఒక్క దోమలేకుండా చేశారు. అదే విధానాన్ని గ్రామంలో అమలు చేసి దోమరహిత గ్రామంగా మారుతది. గ్రామాభివృద్ధికోసం డబ్బులకు కొదువలేదు. వచ్చే నాలుగేండ్లలో గ్రామజ్యోతి కింద రూ.1.80 కోట్లు వస్తాయి. రెండు సంవత్సరాల్లో గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేసుకుందాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుంది.
కరీంనగర్‌లో బస.. షెడ్యూల్ ప్రకారం చిన్న ముల్కనూరు సభ తర్వాత హైదరాబాద్ వెళ్లాల్సిన కేసీఆర్, సభ ఆలస్యం కావడంతో రాత్రి కరీంనగర్‌లోని కేసీఆర్‌భవన్‌లో బస చేశారు. చిన్నముల్కనూరు సభకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌బాబు అధ్యక్షత వహించగా సమావేశంలో అర్థికమంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ పాల్గొన్నారు.
9 గంటలు ఏకధాటిగా.. చిన్నముల్కనూరు గ్రామంలో ముఖ్యమంత్రి సుమారు తొమ్మిది గంటల పాటు ఏకధాటిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం పదకొండు గంటలకు హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా కొబ్బరికాయ కొట్టి శ్రమదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా మట్టి ఎత్తారు. తర్వాత గ్రామమంతా కలియ తిరిగారు. ఊర చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. చెరువు పనులకు అంకురార్పణ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సుమారు నాలుగు గంటలపాటు గ్రామాభివృద్ధికోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సాయత్రం నాలుగుగంటలనుంచి పాదయాత్ర నిర్వహించారు.
వాడవాడలా గ్రామస్థులతో ముచ్చటించారు. వారిచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఒక దళిత మహిళ తన కూతురు పెళ్లి చేయడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రజలు అడుగడుగునా సీఎంకు బ్రహ్మరథం పట్టారు. గ్రామజ్యోతి సభలో ముందుగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ రాజమౌళితో మాట్లాడించారు. ఆయన తమ గ్రామాభివృద్ధి తీరుతెన్నులను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గ్రామానికి రూ.10 కోట్లు ఇచ్చారని, వారికి రుణ పడి ఉంటామన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చిన్న ముల్కనూరు గ్రామాన్ని దత్తతీసుకోవడం ఈ గ్రామ ప్రజల అదృష్టమన్నారు.