Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇది రాజకీయశక్తుల పునరేకీకరణ

ఇప్పుడు ధర్మారెడ్డి చేరినా… ఇంతకుముందు ఇతర పార్టీల నుంచి ఎందరో చేరినా… ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, స్వార్థానికి అతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరు. ఇవి చేరికలు కావు.. రాజకీయ శక్తుల పునరేకీకరణ. తెలంగాణ శక్తులన్నీ ఏకోన్ముఖులై.. ఉద్యమ రూపంలో ముందుకు పోవాల్సిన అవసరముంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

-తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఏకమవుదాం -ఉద్యమ రూపంలో ముందుకు సాగుదాం -సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపు -టీఆర్‌ఎస్‌లో చేరిన పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఇతర నేతలు

KCR వరంగల్ జిల్లా పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు భారీఎత్తున ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ, మండల బాధ్యులు ఆదివారం సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరం ఐక్యంగా ముందుకు పోవాలని తాను పదేపదే చెబుతున్నానని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని గుర్తించి… ఈ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని వస్తున్నరు.

ఈ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నది. నిన్న పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నం. గత ప్రభుత్వాలు ఇచ్చే తక్కువ మొత్తం కాకుండా రూ. వెయ్యి, రూ.1500 పింఛన్లు ఇస్తున్నం. టీడీపీ హయాంలో పింఛన్లకు ఏటా రూ.67 కోట్లు కేటాయిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం 738 కోట్లు కేటాయించేది. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షం ఉండాలని ఏటా రూ.4వేల కోట్లను కేటాయిస్తున్నది. ఇంకా మంచి కార్యక్రమాలతో మనం ముందుకుపోతున్నం… అని అన్నారు. అంతకుముందు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డితోపాటు టీడీపీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల పార్టీ నాయకులను కండువా కప్పి టీఆర్‌ఎస్ పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు.

టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, పరకాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సహోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మారెడ్డి చేరికను పురస్కరించుకొని పరకాల నియోజకవర్గం నుంచి భారీఎత్తున జనం తరలివచ్చారు. దీంతో తెలంగాణభవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

బాబు వైఖరితో విసిగే…: డిప్యూటీ సీఎం రాజయ్య తెలంగాణపై చంద్రబాబు మొసలికన్నీటి వైఖరికి విసిగి వేసారి టీడీపీలో నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ రాజయ్య అన్నారు. ధర్మారెడ్డి చేరిక సందర్భంగా తెలంగాణభవన్‌కు వచ్చిన ఆయన పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు.

ఎన్నో,ఎందరో త్యాగాల పునాదులపై ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 60ఏండ్ల ఆకాంక్ష, 14ఏండ్ల ఉద్యమంతో కేంద్రం మెడలు వంచి సాధించుకున్నం. ఆ తర్వాత పాలించుకుంటున్నం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్నెల్ల పసిగుడ్డు. మొదటి రోజు నుంచీ ప్రజల పక్షాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా ఆసరా పథకం కింద 4వేల కోట్లు కేటాయించి… వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు… ఇలా ఎంతోమందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్నివర్గాల వారికీ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది అని వివరించారు.

తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ… బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసి రావాలని కోరారు. వరంగల్ జిల్లాకు రాజకీయంగా పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్… ఐటీఐఆర్‌తో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకోసం రెండు లక్షల ఎకరాలను కూడా గుర్తించారని ఆయన చెప్పారు. వరంగల్ చుట్టూ ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి త్వరలో నిధులు కూడా కేటాయిస్తారని, టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు, కాళోజీ సాంస్కృతిక కేంద్రం… ఇలా జిల్లాకు ఎన్నో వరాలు ఇస్తున్నారని వివరించారు.

పున్నర్నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలనే..: ధర్మారెడ్డి చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నా… ఆయన మోచేతినీళ్లు తాగి, ఆయన చుట్టూ తిరుగుతున్నారే తప్ప తెలంగాణ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకుంటలేరు. ఒక పార్టీని తిట్టేందుకు ప్యాకేజీలు మాట్లాడుకొని విమర్శలు చేస్తున్నారేగానీ తెలంగాణ అభివృద్ధి దృక్పథం వారిలో ఏమాత్రం లేదు… అని టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. ఎన్నో అవమానాలు, అష్టకష్టాలు పడి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉండాలని మాత్రమే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పది జిల్లాలకు పది నెలల్లో రూ.1.06 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కృతజ్ఙతలు తెలిపారు. కరెంటు సమస్యతో తెలంగాణ రాష్ట్రం అల్లాడుతుంటే… ఏపీలో మిగులు కరెంటు ఉన్నా ఈ టీడీపీ నాయకులు ఎందుకు కరెంటు తీసుకురావడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీకే ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి టీడీపీ నాయకులు తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలని ధర్మారెడ్డి సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.