Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇది తెలంగాణ విజయోత్సవం

-అపోహలు పటాపంచలు చేసి స్థిరత్వం సాధించాం.. -ప్రతిపక్షాల కాకిగోలను పట్టించుకోం.. -కాంగ్రెస్- టీడీపీ దోస్తీ.. మా బలానికి నిదర్శనం -మాకు ఎన్నికల రంది లేదు.. -మేం ప్రతిపక్షాలకు కాదు.. ప్రజలకు జవాబుదారీ! -పార్టీలో నంబర్లు లేవు.. ఇది ఫుట్‌బాల్ మ్యాచ్ కాదు -మియాపూర్ అవినీతిని బయటపెట్టింది ప్రభుత్వమే -రెండున్నర లక్షల ఇండ్లు కట్టి తీరుతాం.. -మమ్మల్ని మేము మెరుగుపరుచుకునేందుకే సర్వేలు -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి కే తారకరామారావు.

అనేక అంశాల్లో దేశంలో ప్రథమస్థానంలో ఉన్నాం.. ప్రతిపక్షాల కాకిగోలను పట్టించుకోం అనుమానాలు, అపోహల నేపథ్యంలో నడక ప్రారంభించి అనేక అంశాల్లో దేశంలోనే ముందువరుసలో నిలబడే విజయాలు సాధించిన తరుణంలో జరుపుకుంటున్న మూడో రాష్ర్టావతరణ ఉత్సవం తెలంగాణకు విజయోత్సవమేనని అభివర్ణించారు.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు. ప్రజలు ఎంతో విశ్వాసంతో అధికారాన్ని తమ భుజస్కంధాలపై మోపారని, ఆ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి అహోరాత్రులు శ్రమించామని చెప్పారు. ఉద్యమకారులు పాలనలో విజయం సాధించలేరన్న అపప్రథను పటాపంచలు చేసి మూడేండ్లలో అద్భుతమైన స్థిరత్వం సాధించామన్నారు. వినూత్న పథకాలు అమలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించామని, సులభ వాణిజ్యం, ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్‌లో మొదటి స్థానానికి చేరుకున్నామని, మన సీఎం నంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో దేశంలో అందరికన్నా ముందువరుసలో నిలిపి తెలంగాణను విజయవంతమైన రాష్ట్రంగా ప్రపంచం ముందు నిలబెట్టామన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ నుంచి సాగునీటి ప్రాజెక్టులదాకా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందించి వారి మన్ననలు పొందామని ఆయన చెప్పారు. తెలంగాణ మూడో రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు.

ఉద్యమకాలం నాటి ఫైర్‌ను పరిపాలనలో కూడా బలంగా చూపుతున్న నాయకుడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు. మేఘ విచ్ఛిత్తి వంటి ప్రకృతి బీభత్స సమయంలో నిద్రాహారాలు మాని వరదనీటిలో నగరమంతా పర్యటించిన కమిట్‌మెంట్ ఆయనది. ఐటీ దిగ్గజాలను సైతం తన ప్రసంగాలతో మంత్రముగ్ధులను చేసే చాతుర్యం, ఒక్క పిలుపుతో నాయకులు, అధికారులతో వారానికి ఒకరోజు చేనేతను అలవాటుగా మార్చే నాయకత్వం ఆయన సొంతం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తృతి, ఖనిజశాఖలో పెనుమార్పులు, నగరపాలనలో నవశకానికి నాంది పలికి తన సత్తాను చాటిచెప్పిన మంత్రి కే తారకరామారావు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేండ్లయిన సందర్భంగా నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు.

ఒక్కసారి వెనుకకు చూస్తే.. గత మూడేండ్ల పయనం ఎలా సాగిందో చెబుతారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అన్నివర్గాల ప్రజలు కీలక పాత్ర పోషించారు. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేం ఏనాడూ అధికారం కోసం తాపత్రయపడలేదు. కేసీఆర్ గారు సీఎం అవుతారని.. నేను మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిన నాయకుడే అధికారం చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుకున్నారు. అధికారాన్ని అప్పగించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఎక్కడ చూసినా ప్రతికూల వాతావరణమే. అనేక అనుమానాలు, అపోహలు, ఆటుపోట్లు. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మూడేండ్లలో స్థిరత్వం వచ్చింది. 2001లో ఏర్పడిన మూడు రాష్ట్రాలు ఇంకా స్థిరపడుతున్న దశలోనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జార్ఖండ్‌లో కొత్త కార్యాలయాలను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడాన్ని చూశాం. కానీ మనం 24 నుంచి 26 నెలల వ్యవధిలోనే పొరుగు రాష్ట్రాలు మనల్ని చూసి అడుగులేసే స్థాయికి చేరుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనమే నెంబర్ వన్‌గా నిలిచాం. ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ మొదటి స్థానానికి చేరుకున్నాం. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా మన సీఎం నిలిచారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలిసినప్పుడు ఉద్యమకారులు పరిపాలనలో ఫెయిల్ అవడాన్ని చూశాను.. కానీ మీ సీఎం ఆ మచ్చను తొలగించారు అని చెప్పారు.

తక్కువ కాలంలోనే అభివృద్ధికి పెద్దపీట వేసిన మీపై ప్రతిపక్షాలు విమర్శలెందుకు గుప్పిస్తున్నాయంటారు? ఒక విషయం గమనించండి. కాంగ్రెస్‌పై పూర్తిస్థాయి వ్యతిరేకత కారణంగానే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. అలాంటి చరిత్ర గల పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు వెంపర్లాడుతున్నది. అంటే ఆ రెండు పార్టీలు ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. అది మా బలానికి నిదర్శనం. వారి బలహీనతకు ప్రతీక. ప్రతిపక్షాలు కాకి గోల చేసినా.. మమ్మల్ని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నించినా.. మా నాయకుడు వాటన్నింటినీ అధిగమించి కార్యదక్షుడుగా, పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు ప్రతిఒక్క విషయాన్ని నిత్యం గమనిస్తుంటారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకముంది. అందుకే ఆయన మీద ఏకోన్ముఖమైన ఆదరణ చూపెడుతున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయాన్ని ఇచ్చారు. నారాయణఖేడ్‌లో అద్భుతమైన మెజార్టీని కట్టబెట్టారు. పాలేరులో 2014లో మాకు డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఉప ఎన్నికలో పాలేరులో విజయదుందుభిని మోగించాం. ఒక్క సీటు కూడా లేని హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సంపాదించాం. గ్రేటర్ వరంగల్‌లో పదిహేను లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించాం. ఇవన్నీ ప్రజలు మాపై చూపెట్టిన ఆదరణకు నిదర్శనం.

ప్రజలకు మీరు చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా.. ? ప్రజలే చూస్తున్నారు. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ప్రజల ముందు ఆవిష్కరించాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలు చేశాం. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేశాం. దేశం మెచ్చుకునేపాలనను కేసీఆర్ అందిస్తున్నారు. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు ఆరుగురు మంత్రులం రాత్రీపగలు ఎంతో కమిట్‌మెంట్‌తో కష్టపడ్డాం. కాబట్టే.. మాతో పాటు ప్రజలున్నారు. అయినా మేం ప్రజలకు జవాబుదారి తప్ప ప్రతిపక్షాలకు కానే కాదు. తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కావేరి జల వివాదాలు ఏర్పడితే రాజకీయాలను పక్కనపెట్టి ఒక్కటవుతాయి. కానీ, ఇక్కడ ప్రతిపక్షాలు చనిపోయిన వారి పేరుతో ప్రాజెక్టులు అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నాయి. ఈ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీని ప్రతిపక్షాలు సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. వారి బుద్ధిమారుతుందని అనుకోవడం లేదు.

సీఎంని కలువడం అసాధ్యమని కొందరు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ అభిప్రాయం కొంతమంది వ్యక్తులకు ఉండొచ్చు. ఈ భావదారిద్య్రం ఏమిటో అర్థంకాదు. సీఎంను కలిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావనే భావన గత ప్రభుత్వాల పుణ్యం. నిజానికి, సామాన్యుడి అవసరాలు ఎక్కడ తీరాలి? క్షేత్రస్థాయిలోనే కదా! అందుకే మేం అధికార వికేంద్రీకరణ చేశాం. ప్రజలకు ప్రభుత్వం చేరువగా ఉండాలని 31 జిల్లాలు ఏర్పాటు చేశాం. యువ కలెక్టర్లు సమర్థంగా పని చేస్తున్నారు. అయినా కొందరు తమ స్వీయ మానసిక ఆందోళనను ప్రజల ఆందోళనగా చూపుతున్నారు. ప్రతిపక్ష రాజకీయ నిరుద్యోగుల్లో పాపం ఎక్కడా లేని అసంతృప్తి నెలకొని ఉంది. అందుకే మాకు రాజకీయ మకిలిని అంటించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకోవడం మానేశారు.

మీరు తరుచూ సర్వేలను నిర్వహించడానికి ప్రధాన కారణమేమిటి? ఇప్పటివరకూ మూడు సర్వేలను నిర్వహించాం. ఏ రాజకీయ పార్టీ అయినా తన పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? లేవా? నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మా పనితీరును మేము బేరీజు వేసుకోవడానికి సర్వే నిర్వహించుకుంటే దానిని భూతద్దంలో చూడడం సరికాదు.

వచ్చే ఎన్నికల్లో మీ పరిస్థితి? ప్రజలు అవకాశమిస్తే గెలుస్తాం. అంతేగాని మా వరకు ఎన్నికలనేవి జీవన్మరణ సమస్య కాదు. రాహుల్ గాంధీలు, అమిత్‌షాలు వస్తారు. ఇదంతా ప్రజాస్వామ్యంలో భాగం. మాకైతే ప్రజల మీద విశ్వాసముంది. పదిహేనేండ్ల క్రితం మా నాయకుడు తెలంగాణ కోసం బయల్దేరితే అంతా సాధ్యం కాదన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. మూడేండ్లుగా స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం. మాకు అధికారం మీద రంది లేదు. గెలుపు విషయం ప్రజలు నిర్ణయిస్తారు.

రాష్ట్రంలో ఓడీఎఫ్ పరిస్థితి ఏమిటి? రెరా చట్టాన్ని ఎప్పటిలోపు అమల్లోకి తెస్తారు? ఈ ఏడాది జూన్ 30లోపు ఓడీఎఫ్ పనులను 73 పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. డీమానిటైజేషన్ దెబ్బకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెరా వచ్చింది కాబట్టి.. కొనుగోలుదారుల ప్రయోజనాలను పరరక్షిస్తూనే నిర్మాణ సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. రెరా తుది నిబంధనల ఫైల్ నా వద్దకొచ్చింది. కేంద్ర చట్టాన్ని పక్కదోవ పట్టించకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.

ఐటీలో ఉద్యోగాలు పోతాయన్న ప్రచారం కరెక్టేనా? అమెరికా అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ అధిరోహించాక మన ఐటీ ఉద్యోగాలు పోతాయన్న విషప్రచారం జరుగుతున్నది. కానీ ఇదే సమయంలో మన దేశంలో ఐటీ రంగం పది శాతం వృద్ధి చెందింది. మన దగ్గర 13 శాతం వృద్ధి ఉంది. అసలు ఐటీ సంస్థల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకోవడం, పాత ఉద్యోగుల్ని తీసివేయడం సర్వసాధారణం. ఎవరే ప్రచారాలు చేసినా వచ్చే దశాబ్దంలో ప్రపంచంలో భారత్‌దే హవా అని కచ్చితంగా చెప్పగలను. ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు మేధస్సుకి పదును పెట్టి సరికొత్త స్టార్టప్‌లను ఆవిష్కరిస్తున్నారు. వచ్చే పదేండ్లలో ప్రపంచానికి అద్భుతమైన ఆవిష్కరణలను మన దేశం అందించనుంది. అందులో సింహభాగం మన నుంచి ఉండాలన్నదే నా ప్రయత్నం. హైదరాబాద్‌లో కొత్తగా 25వేల ఉద్యోగాలొచ్చాయి. టీహబ్ సెకండ్ ఫేజులో 2000 స్టార్టప్ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశముంది.

జీఎస్టీ ప్రభావం మన రాష్ట్రంపై ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? జీఎస్టీలో గ్రానైట్ పరిశ్రమ, సినీ పరిశ్రమ వంటివాటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. బాహుబలి సినిమా 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చింది. సినీ నిర్మాతలు సురేశ్‌బాబు, దిల్‌రాజు అరుణ్‌జైట్లీని కలిశారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీపై మరింత స్పష్టత రావాల్సిఉంది.

చివరగా, వచ్చే రెండేండ్లలో ఎలాంటి లక్ష్యాల్ని నిర్దేశించుకున్నారు? ఇపుడు రెండున్నర లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించే పనిలో నిమగ్నమయ్యాం. ఇప్పటికే 50 వేల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మిషన్ భగీరథను ఈ ఏడాది పూర్తి చేస్తాం. నగరంలో కార్యక్రమాల అమలుపై అసంతృప్తిగా ఉన్నాను. నగర ప్రజలు మాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అందుకే మున్సిపల్ మంత్రిగా సవాల్‌గా తీసుకుంటున్నా. వచ్చే రెండేండ్లలో హైదరాబాద్‌ను అభివృద్ధిని చేసి చూపెడుతాం. ఈ సంవత్సరం చివరికల్లా 55 కిలోమీటర్ల మేర మెట్రో పరుగుపెడుతుంది. హైదరాబాద్ రోడ్లను సమీకృతంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయానికొచ్చాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో వెయ్యి కోట్లను సేకరిస్తాం.ఈమధ్య కార్పొరేటర్లపై మీడియాలో కథనాలొచ్చాయి. విచారణ జరిపించి నిజమని తేలితే క్రమశిక్షణ చర్యల్ని చేపడుతాం.

-పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లను సవరించడం, అవినీతిని అరికట్టడం ఒక నిరంతర ప్రక్రియ. జీహెచ్‌ఎంసీ నాలా పూడికతీతలో అవినీతిని నేను స్వయంగా గుర్తించి 12 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేశాను. నిన్న మియాపూర్ భూభాగోతం విషయంలో కఠిన చర్యల్ని చేపట్టాం. ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే ఈ విషయాలను గుర్తించి బయటిపెట్టింది ప్రభుత్వమే తప్ప.. ప్రతిపక్షాలు లేక మీడియా కాదు. స్వచ్ఛ పాలనను అందించే రాష్ట్ర ముఖ్యమంత్రియే మా బ్రాండ్ అంబాసిడర్. ఇతర రాష్ట్రాలకూ ఆయనే రోల్ మోడల్.

-ఖనిజాభివృద్ధి మంత్రిగా వచ్చినప్పుడు ఆదాయం రూ.10 కోట్లు ఉండేది. అది ఇప్పుడు రూ.470 కోట్లకు చేరింది. గత ప్రభుత్వాల హయాంలో ఇసుకపై వచ్చే మొత్తం ఆదాయం రూ.10.84 కోట్లు ఉంటే.. మా హయాంలో కేవలం అక్రమ ఇసుక రవాణాపైనే రూ.15 కోట్ల జరిమానాను వసూలు చేశాం.

-ఆనాడు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేశాం తప్ప పదవుల కోసం కాదు. అనుకోకుండా అవకాశం వచ్చింది. రాత్రింబవళ్లు కష్టిస్తున్నాం. పార్టీలో నేను ఏ నంబర్ అన్నది అప్రస్తుతం. మేమంతా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాం. అయినా, నెంబర్ల గురించి మాట్లాడటానికి మేం ఫుట్‌బాట్ మ్యాచులను ఆడటం లేదు కదా!

-రాష్ట్రపతి ఎన్నికకు గడువు ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు. అసలు రాష్ట్రపతి ఎన్నికలో పోటీ ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేం కదా. ఎన్నికలు ఉంటే మద్దతు గురించి మా నాయకుడు తుది నిర్ణయం తీసుకుంటారు.

-కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా 3,300 ఎకరాల స్థలాన్ని దేశవ్యాప్తంగా గుర్తించింది. అందులో 900 ఎకరాలు మన వద్ద ఉండటం గమనార్హం. ఇప్పటికే, ఐదు మొబైల్ యూనిట్లు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఈ జాబితాలోకి మరికొన్ని సంస్థలొస్తాయి.

-2014లో కూడా రాహుల్ గాంధీ ఇక్కడికొచ్చారు.. అపుడు 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. తర్వాత ఏమైంది? అందరికీ తెలిసిందే కదా!

-ఈవోడీబీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్, నెంబర్ వన్ ముఖ్యమంత్రి.. అతితక్కువ కాలంలో పిన్న రాష్ట్రమైన తెలంగాణ సాధించిన ఘనతలివి..

-పాలమూరు అంటే గుర్తుకొచ్చేది వలసలే. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ఉమ్మడి రాష్ట్రంలో నిత్యకృత్యమైంది. అలా వెళ్లినవారంతా గత కొంతకాలంగా మళ్లీ పాలమూరుకు వస్తున్నారు. మా ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని చెప్పడానికిదే నిదర్శనం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.