-నాడు నేతన్నల ఆత్మహత్యలు చూసి చలించి.. కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
-యార్న్‌పై ఇక్కడే 40 శాతం సబ్సిడీ
-70 కోట్లున్న బడ్జెట్ స్వరాష్ట్రంలో 1200 కోట్లకు పెంచినం
-చేనేత రుణ మాఫీపై మళ్లీ పరిశీలన
-ప్రతి చేనేత కార్మికుడికి సొంతిల్లు
-త్వరలో పద్మశాలీ భవన భూమిపూజ
-మోదీ విధానాలతో చేనేతకు ఉరి
-పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో చేనేత, జౌళి మంత్రి కేటీఆర్

ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఇదే ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారు? తెలంగాణలో చేనేత కార్మికులకు ముడి సరుకుపై 40 శాతం సబ్సిడీ ఇస్తుంటే, మోదీ మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. 5 శాతం జీఎస్టీ రద్దు చేయాల్సిందే. అప్పటివరకూ ఉద్యమం ఆపేది లేదు. ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు రాసి ప్రధానికి తమ నిరసన తెలియజేయాలి. సభా వేదికపై నుంచి నేనే తొలి కార్డు రాస్తున్న. అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి.
-కేటీఆర్
తెలంగాణలో చేతల ప్రభుత్వం- చేనేతల ప్రభుత్వం అధికారంలో ఉన్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం చేనేతల పాలిట శాపంగా మారిందని, మోదీ విధానాలు చేనేత కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, పవర్‌లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌ను సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే చట్టాల్లో మార్పులు తెస్తామన్నారు.
బతుకమ్మ చీరలతో చేనేత కార్మికుల ఆదాయ మార్గాలను పెంచామని గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం టెక్స్‌టైల్స్ రంగమని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత, జౌళి పరిశ్రమపై సీఎం కేసీఆర్‌కు చిన్నప్పటి నుంచే అవగాహన ఉన్నదని చెప్పారు. దుబ్బాకలో హైస్కూల్ చదువుకొనేటప్పుడు కేసీఆర్ పద్మశాలీల ఇంట్లోనే ఉండేవారని గుర్తుచేసుకొన్నారు. చిన్నప్పటి నుంచే మగ్గం చప్పుళ్లు, వాళ్ల కన్నీటి వ్యథలు తెలుసునని చెప్పారు. అందుకే.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. 2002లో భూదాన్ పోచంపల్లిలో 8 మంది చేనేత కార్మికులు చనిపోతే.. మనసున్న మనిషిగా జోలె పట్టి విరాళాలు సేకరించారని, ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున అందించారని గుర్తుచేశారు. కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లలో వారంరోజుల్లో 9 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. కోరుట్ల, వేములవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తుంటే, సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి సీఎం కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు.
70 కోట్ల బడ్జెట్ 1200 కోట్లకు పెరిగింది
2014లో కేసీఆర్ సీఎం అయిన వెంటనే 70 కోట్లుగా ఉన్న టెక్స్‌టైల్ బడ్జెట్‌ను రూ.1200 కోట్లకు పెంచారని కేటీఆర్ తెలిపారు. ఏటా కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నామన్నారు. చేనేత, జౌళిశాఖకు ఇప్పటివరకూ రూ. 5,752 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతన్నలతోపాటు అధికారులను కూడా పిలిచి సీఎం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చిన ఒక పెద్దమనిషిని.. మగ్గం నడిపితే నెలకు ఎంత వస్తుందని అడిగితే.. రూ.7 వేలకంటే ఎక్కువ రాదని ఆయన చెప్పడంతో కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చేనేతకు ఎవరూ ఊహించని వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నో కొత్తకొత్త పథకాలు తీసుకొస్తున్నారు’ అని తెలిపారు.
మోదీ విధానాలు.. చేనేతకు ఉరితాళ్లు
కేంద్రంలోని మోదీ విధానాలు చేనేత కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ‘మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలిండియా హ్లాండ్లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, జాతీయ పవర్‌లూమ్ బోర్డు, థ్రిఫ్ట్ పథకం, మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన, హౌస్ కమ్ వర్క్‌షెడ్ పథకం, నేతన్నల పొదుపు పథకం.. నేతన్నల బీమా పథకం.. ఇలా అన్నింటిని రద్దు చేస్తున్నారు. యార్న్‌పై సబ్సిడీని 40 నుంచి 15 శాతానికి తగ్గించారు. మహాత్ముడు ఖాదీ ఉత్పత్తులతో జాతీయ ఉద్యమంలో పాల్గొంటే.. మోదీ దాన్ని చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారి చేనేతలపై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధాని మోదీ’ అని ధ్వజమెత్తారు.
నేతన్న బీమాతో ధీమా
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ తొలిప్రాధాన్యం ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజమైన కార్మికుడికి లబ్ధి జరగాలన్న ఏకైక లక్ష్యంతోనే మగ్గాల జియో ట్యాగింగ్ చేపట్టామన్నారు. నేతన్నకు బీమా కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు లక్షల బీమా కల్పించామని, రూ.200 ఉన్న నేతన్నల ఆసరా పింఛన్.. రూ.2016కు పెంచామని గుర్తుచేశారు. 10,500 మందికి రూ.లక్ష వరకూ చేనేత రుణమాఫీ చేశామని, భవిష్యత్తులోనూ ఆ దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు. నారాయణపేటలో ఒక చేనేత సమీకృత అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, గద్వాలలో చేనేత పార్కుకు శంకుస్థాపన చేశామని.. త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. పోచంపల్లి, కొయ్యలగూడెం, పుట్టపాక, చౌటుప్పల్, చండూరు, నారాయణపురం, లింగోటం తదితర ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అవుతున్న పట్టు, కాటన్ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు. అందుకే.. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొయ్యలగూడెంలో ప్రత్యేక మారెటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పోచంపల్లికి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అవార్డు రావడం తెలంగాణ నేతన్నకు దక్కిన గౌరవమన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి అరుదైన గుర్తింపు
పద్మశాలీలు ఆరాధ్యంగా కొలుచుకొనే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సర్కారు విశిష్ట గుర్తింపు ఇస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఆయన పేరుమీద చేనేత కార్మికులను గుర్తించి అవార్డుతోపాటు రూ.20 వేల నగదు పురస్కారం అందిస్తున్నామని గుర్తుచేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరు పెట్టామన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఖరీదైన స్థలాన్ని పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఇచ్చామని, త్వరలోనే నిర్మాణాన్ని పూర్తిచేసి అప్పగిస్తామని తెలిపారు.
శ్రామికులు.. పారిశ్రామికులుగా రాక
తెలంగాణ రాకముందు కొడకండ్ల నేతన్నలు సూరత్, సిరిసిల్ల నేతన్నలు షోలాపూర్‌లో పనిచేసేవాళ్లని, స్వరాష్ట్రంలో నేతన్నల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. వలస వెళ్లిన వాళ్లందరూ తిరిగి వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ నుంచి శ్రామికులుగా పోయినవాళ్లు మళ్లీ పరిశ్రమల స్థాపనకు తెలంగాణకే వస్తున్నారని గుర్తుచేశారు. ఇటీవల ఒడిశా జౌళిశాఖ మంత్రి రీటాకు తెలంగాణలో పథకాలను వివరిస్తే ఆశ్చర్యపోయారని, ఒడిశాలోనూ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు. మనం కొత్త పథకాలు తీసుకొస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఉన్నవన్నీ రద్దు చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు
నేతన్నల సంక్షేమానికి తెలంగాణ పంపిన అనేక ప్రతిపాదనలను కేంద్రం బుట్టదాఖలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకి కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌టైల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలంటే స్పందించలేదని, హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే ఒప్పుకోలేదని మండిపడ్డారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కోరితే ఉలుకూపలుకూ లేదన్నారు. నారాయణపేటలో స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హ్యాండ్లూమ్ పార్ పెడతామని చెప్పి నాలుగేండ్లయినా దికులేదన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, చెరుపల్లి సీతారాములు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆలిండియా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు చింతకింది మల్లేశం, గజం గోవర్దన్, గజం అంజన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రతి చేనేత కార్మికుడికి సొంతిల్లు
ప్రతి చేనేత కార్మికుడి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత నాదే. సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ఇస్తాం. ఆసు పరికరాలు, దాబిలు, మగ్గాలు, జకార్డులు, కండెల మిషన్లు, మగ్గం పాకలను నేతన్నలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నం. అనేక పథకాలతో అండగా నిలిచి, కరోనా కష్టకాలంలో చేనేత కార్మికుల వెంట నిలబడ్డ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తప్పుడు ప్రచారాలను నమ్మితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైక్స్‌టైల్ రంగం కుదేలవుతుంది. చేనేత కార్మికులు మళ్లీ తిండికి అవస్థలు పడే రోజులు వచ్చే ప్రమాదమున్నది.
యార్న్‌కు 40% సబ్సిడీ తెలంగాణలో మాత్రమే
చేనేతకు చేయూతనిచ్చేందుకే కేసీఆర్ చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలో తెలంగాణలోనే 40% యార్న్ సబ్సిడీ ఇస్తున్నాం. ఆ సబ్సిడీ కూడా ముందే ఇస్తే బాగుంటుందని చేనేత కళాకారులు కోరుతున్నారు. అది కూడా తప్పకుండా చేస్తాం. సంపాదించిన సొమ్ములో ఎంతోకొంత ఆదా చేయాలనే సదుద్దేశంతో నేతన్నకు చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కరోనా కాలంలో దాదాపు రూ. 100 కోట్ల నిధులను ముందే విడుదల చేశాం. 26 వేల మంది కార్మికులకు లాభం చేకూరింది. ఏమైనా మార్పులుంటే చెప్పండి చేస్తాం. ఇది మీ ప్రభుత్వం.. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. మీరిస్తేనే మాకీ పదవులు. అందుకే.. నేతన్నకు చేయూతలో మార్పులుంటే సూచించండి. చేసే బాధ్యత నాదే.