Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇది నిత్యం.. ఇదేసత్యం

దాదాపు 20 ఏండ్ల కిందటి మాట. తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్, తనతో కలసి వచ్చేవారిని గుర్తించే పనిలో పడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇల్లు కేంద్రంగా జరిగిన ఈ మాటామంతికి, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో దాదాపు 14-15 మందిదాకా వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కూడా… ‘కేసీఆర్ మీరు నిరంధిగా ముందుకుపోండి. పార్టీ పెట్టండి. మేం తప్పకుండా వచ్చి చేరతాం’ అని గట్టిగా, చేతిలో చేయివేసి, మాటిచ్చినవారే! ‘వీళ్లలో ఎవరూ మనతో రారు. మనం పెట్టే పార్టీలో చేరరు. ఇది పక్కా’ అని కేసీఆర్ అప్పుడే తన సన్నిహితులతో అన్నారు. ఆయన అన్నట్టే 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ ప్రారంభిస్తే, అప్పుడు పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్ చేరలేదు! అయినా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఏర్పడిన 13 ఏండ్లలో తెలంగాణను తేగలిగింది కూడా!

తెలంగాణతో కేసీఆర్… కేసీఆర్ తో తెలంగాణ..
ఎవరూ వెంట రాకున్నా ఇదెలా సాధ్యమైంది? ఎందుకంటే ఒక పనిని మొదలుపెట్టేముందు కేసీఆర్ ప్రధానంగా స్వశక్తినే నమ్ముకుంటారు. ఇతరుల బలాన్ని కాదు. అందువల్లే కేసీఆర్ మీద, తలపండిన రాజకీయవేత్తల అంచనాలు కూడా తారుమారవుతుంటాయి. సరిగ్గా అందువల్లే, సాధారణ దృష్టితో చూసేవారికి, అప్పుడప్పుడు కేసీఆర్ లెక్కలు కూడా తప్పినట్టు కనిపిస్తుంటాయి. ఒక ఎదురుదెబ్బ తాకగానే, ఇంకేముంది; ‘టీఆర్ఎస్‌ పని ఇక అయిపోయింది’ అనే విశ్లేషణలు వినిపిస్తాయి. ఈ ప్రచారం ఈ కొస నుంచి ఆ కొసకు వెళ్లేలోపే, కేసీఆర్ మరో విజయంతో వారి ముందు నిలబడతారు. టీఆర్ఎస్ పెట్టి, తెలంగాణ తెస్తానన్నప్పుడు, నాయకులు, ప్రజలే కాదు; రాష్ట్రం రావాలని ప్రగాఢంగా కోరుకున్న కొందరు తెలంగాణవాదులు కూడా నమ్మలేదు. అయ్యేదా పొయ్యేదా అనుకున్నారు. ఆనాటి నుంచి నేటిదాకా, 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో, 20 ఏండ్ల ఉద్యమ ప్రయాణంలో, అనేకమంది మాటల్ల్లో, కాకుంటే మనసుల్లో, అనేకానేకసార్లు ‘టీఆర్ఎస్ పని అయిపోయింది’ అనుకున్నారు.

ఆరేండ్ల క్రితం దాకా,ఎండిన చెరువు కట్ట మీద, సర్కారు తుమ్మల మధ్యలోంచి, సైకిళ్ల మీద మంచి నీళ్ల క్యాన్లు పెట్టుకుని వచ్చినమా లేదా మనం? కరంటు కోసం అంగలార్చిన మనం, విత్తనాల కోసం క్యూలు కట్టిన మనం, పాడుబడ్డ ఊర్లలో పొర్లాడిన మనం, కల్తీ విత్తనాలకు చితైన మనం, కార్బైడ్ పండ్ల విషానికి బలైన మనం, గల్ఫ్ మోసాలకు గోసపడ్డ మనం, బాకీల రైతు బాధలు చూసిన మనం, చేనేతన్నల ఆత్మహత్యల ఏడుపు అనుభవించిన మనం, ఇప్పుడెలాంటి తెలంగాణలో ఉన్నామో ఆలోచించుకోవాలి. ఈ మంచి మార్పు ఎలా సాధ్యమైందో చర్చించుకోవాలి.

2005లో టీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు, ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. 2006లో తెలంగాణపై కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చకుండా నానుస్తూ ఉంటే, ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. 2008లో 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్తే… ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచినప్పుడు ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. 2010లో ఒక నాయకురాలు అలకబూనినప్పుడు, ఆమెను కేసీఆర్ సరిసమానం చేస్తూ, ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. విప్లవం నుంచి విరామం తీసుకున్న నాయకుడొకరు 2010లో కొత్తగజ్జె కట్టినప్పుడు… ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. 2009లో తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని 45 సీట్లలో పోటీచేసి, 10 సీట్లు మాత్రమే గెల్చుకున్నప్పుడు… ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. 2011లో శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే… ‘టీఆర్ఎస్ ఉద్యమం పని’ అయిపోయిందన్నారు. నేను చెప్పినవి కొన్ని మాత్రమే! 13 ఏండ్ల ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్న వార్తో, విశ్లేషణో రాని రోజు లేదేమో! కేసీఆర్ ఫెయిల్యూర్ చూపించాలని కొందరి మనసుల్లో నిగూఢంగా, ప్రగాఢంగా ఉన్న కోరిక, తపన ఇందుకు కారణం కావచ్చు! అందుకే ప్రతి సందర్భంలోనూ అలాంటి ప్రయత్నం ఒకటి ప్రబలంగా జరుగుతూ ఉంటుంది. రాష్ట్రం వచ్చాక.. ఇచ్చింది కాంగ్రెస్ కనుక, ఇక టీఆర్ఎస్ పని అయిపోయినట్టే అన్నారు. రెండోసారి ముందస్తుకు వెళ్లి, సిట్టింగులందరినీ మళ్లీ బరిలోకి దించినపుడూ టీఆర్ఎస్ పని అయిపోయినట్టే అన్నారు. లోక్ ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ టీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. దుబ్బాకలో వెంట్రుక వాసిలో ఓడిపోతే అదే మాట. జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రకు అనుగుణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా అదే మాట. కానీ ఆత్మబలమో, దైవికశక్తో, మరొకటో తెలియదుగానీ, ఆయన ఫెయిల్ కావాలని కోరుకున్న ప్రతిసారీ, కేసీఆర్ అలా కోరుకున్నవారినే ఫెయిల్ చేస్తుంటారు!

మన పొలాలు, చెరువులు, గురుకులాలు, దవాఖానలు, రోడ్లు, జిల్లాలు, పట్టణాలు, పల్లెలు ఆరేండ్ల కిందట ఉన్నట్టే ఉన్నాయా?ప్రగతి ప్రయాణంలో తెలంగాణ ఇప్పుడు కూడలిలో ఉంది. తన ప్రాధాన్యాలను ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. మార్పు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. సంస్కరణ ఎప్పుడూ సమస్యగానే కనిపిస్తుంది. పీవీ నరసింహారావు భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తెచ్చినప్పుడు ఆయన్ను తిట్టనివారు లేరు. కానీ ఇప్పుడు రాష్ట్రం, దేశం వాటి ఫలితాలను చవిచూస్తున్నది. ఫలాలను అనుభవిస్తున్నది. కాల్వ కోసం భూమి ఇస్తేనే కదా పొలంలోకి నీళ్లు పారేది. కాలం తెచ్చే సంస్కరణను- సమస్యలను అంగీకరిస్తేనే కదా ఫలాలను ఆస్వాదించేది?

ఒక పనిని చేపట్టే ముందు కేసీఆర్, ‘అది ధర్మబద్ధమైనదా? కాదా?’ అని ఆలోచిస్తారు తప్ప, దానివల్ల ‘తనకు రాజకీయంగా ప్రయోజనం లభిస్తుందా? లేదా?’ అని కాదు. రైతుబంధునే తీసుకుందాం. ఈ పథకం కింద ఎకరానికి ఏడాదికిచ్చే పదివేల రూపాయల్ని, ప్రతి గ్రామంలో యాసంగికోసారి, వానకాలానికోసారి జాతరలా చేసి, ఎమ్మెల్యేలతో పంపిణీ చేయవచ్చు. దానివల్ల పార్టీకి లాభం కూడా కలుగుతుంది. కానీ కేసీఆర్, ఆ విధానంలో జరిగే అక్రమాలు, వేధింపులతో రైతు ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో, తన రాజకీయ ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి, నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అలాగే ఉప సర్పంచులకు చెక్ గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టకుండా చెక్ చేసేందుకు ఉప సర్పంచులకు చెక్ ఇచ్చారు. “చెక్ పంచామని సర్పంచులూ మన పట్ల సంతోషంగా లేరు. అటు ఉప సర్పంచులు మరో పవర్ మారుతున్నారు. చివరికి ప్రత్యర్థి పార్టీలకు మనమే గ్రామాల్లో నాయకులను తయారుచేసి ఇస్తున్నాం. రాజకీయంగా రెండిటికి చెడ్డ రేవడి అవుతున్నాం” అని వాపోతున్నారు టీఆర్ఎస్ నేతలు. అయినా సీఎం రాజకీయ ప్రయోజనం కన్నా, గ్రామాల్లో అవినీతిని అరికట్టడమే ముఖ్యమనుకున్నారు. రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నది వాస్తవం. దీన్ని చక్కదిద్దడానికి దీర్ఘకాలిక ప్రయత్నం అవసరం. ఒక పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు చిన్నచిన్న సమస్యలు సహజం. విపక్షాలు, విమర్శకులు సమస్యలనే ప్రధానంగా చూపిస్తారు. మనం కూడా మున్ముందు జరిగే మార్పును గమనించకుండా, తక్షణ సమస్యలనే చూస్తూ, సందేహంలో పడిపోతున్నాం. కాళేశ్వరంపై జరిగినంత రగడ దేశంలో మరే ప్రాజెక్టుపైనా జరిగి ఉండదు. అయినా దేశంలోనే అతి పెద్దదైన ఈ ప్రాజెక్టును కేసీఆర్ రికార్డు సమయంలో పూర్తి చేశారా? లేదా? దాని ఫలితాలు అందుతున్నాయా? లేదా? శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టుకు కూడా పుష్కలంగా నీళ్లిచ్చిన చరిత్ర ఎన్నడైనా ఉన్నదా? పాలమూరు నుంచి వలసపోయేవారే తప్ప, పాలమూరుకు వాపస్ వచ్చిన రైతులను మనం ఇదివరకెప్పుడైనా చూశామా? అవినీతి లేని ఉద్యోగాల భర్తీ ఇంతకుముందు జరిగిందా? శాపగ్రస్తంగా ఉండే వ్యవసాయం వరంగా మారిన వైనం ఉందా? గుండెమీద చెయ్యివేసుకుని, నిశ్చింతగా నిద్రపోయే, ఇంత ప్రశాంత తెలంగాణ ఇంతకు ముందుందా? ఇవన్నీ ఊరికే జరగలేదు కదా! ఎవరివల్ల తెలంగాణ పరిస్థితి మెరుగుపడిందో మనం ఆలోచించుకోవాలి. అంతలోనే ఆవేశపడిపోతే ఎట్లా? ఉడికే దాకా ఆగి ఉమ్మగిల్లేదాకా ఆగలేకపోతే ఎట్లా?!

ఊహ నుంచి ప్రజా ఉద్యమాన్ని, ఉద్యమం నుంచి ఉద్యమ పార్టీని, పార్టీతో ఉద్యమ తెలంగాణ రాష్ర్టాన్ని, ఉద్యమ రాష్ట్రంలో అభివృద్ధి పథాన్ని నిర్వచించిన ప్రజానేతకు ఆటుపోట్లూ కొత్త కాదు. అసాధారణ విజయాలూ కొత్తకాదు

సమాజంలో రెండు వర్గాలుంటాయి. పీడిత వర్గాలు, ప్రాబల్య వర్గాలు. నోరులేని పీడిత వర్గాలు నాయకత్వం కోసం ఎదురుచూస్తుంటే, గాయి గత్తర చేసే ప్రాబల్యవర్గాలు (ఆర్గనైజ్డ్ సెక్టార్) నాయకత్వాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇక్కడే ప్రాబల్యవర్గాలకు, ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలాంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రాబల్యవర్గాలే పైచేయి సాధించాయి. తెలంగాణ ఏర్పడ్డాక, వాటిని కొంత కట్టడి చేసి, పీడిత వర్గాలకు ఎంతోకొంత మేలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. రైతులు, పేదలు, మహిళలను ఆదుకోవడం ఇందులో భాగమే. తమ ప్రయోజనాలపై రాజీ పడలేని ప్రాబల్య వర్గాలు, ప్రభుత్వం పనితీరు బాగా లేదనే ప్రచారానికి దిగుతాయి. మిగతా వారిని ప్రభావితం చేసి, వ్యతిరేకంగా ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తాయి. ఆ మాయలో పడాలా? ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నది? అని తేల్చుకోవాల్సింది మనమే! ఆరేండ్లలో అంతా అద్భుతంగా మారిపోయిందని, అన్ని సమస్యలూ పరిష్కారమయ్యాయనీ అనడం లేదు. కానీ ప్రయత్నం జరుగుతున్నదా లేదా? పక్కదారి పట్టిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరికి కష్టం- నష్టం కలగకపోవు. గోదావరీ జలాలను బీడు భూముల్లో పారించాలంటే, కొన్ని గ్రామాల ప్రజలు తమ భూములు, ఆస్తులు త్యాగం చేయక తప్పలేదు. ఎంత పరిహారమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. గతంలో పిల్లల చదువుల కోసం ప్రైవేట్లో లక్షల రూపాయలను ఖర్చుచేసేవాళ్లం. దీనికి విరుగుడుగా గురుకులాలను బలోపేతం చేసినప్పుడు, ప్రైవేటు విద్యాసంస్థలకు నష్టం, కష్టం కలగక తప్పదు. ప్రభుత్వ దవాఖానాలను బాగుచేసినప్పుడు, ప్రైవేటు హాస్పిటళ్లకు నష్టంరాక తప్పదు. అట్టడుగువర్గాలకు పదో పరకో ఇవ్వాలనుకున్నపుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత సర్దుకోక తప్పదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదాన్ని బట్టే, మన భవిష్యత్తును మనం ఎలా నిర్మించుకుంటామన్నది ఉంటుంది.

మనకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఉమ్మడి నుంచి ఉంటున్న అధికార యంత్రాంగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశమంతా జరుగుతున్నట్టే ఇక్కడ కూడా రాజకీయ వ్యవస్థ అవలక్షణాల్లో కూరుకుంది. తెలంగాణ వచ్చినంత మాత్రాన రాత్రికి రాత్రి ఇవన్నీ అమాంతం మారిపోవు కదా! ఉన్నవాటితోనే పని చేయించుకోవాలి. అవి చక్కబడటానికి కొంత సమయం పడుతుంది.

పని ఎంతమాత్రం అయిపోలేదు. తెలంగాణ పని ఇంకా అయిపోలేదు. తెలంగాణపై ప్రేమ ఉన్నవారికి, ఆ ప్రేమను వ్యక్తపరిచే పని ఎన్నటికీ అయిపోదు కూడా! చనిపోయేదాకా కాళోజీ తెలంగాణ కోసమే కలవరించారు. మరణశయ్యపై కూడా జయశంకర్ తెలంగాణకు జరగాల్సిన న్యాయం కోసమే తపించారు. తన చివరి దశలో కూడా విద్యాసాగర్ తెలంగాణ బీడు భూములకు సాగునీరు అందించే ప్రణాళికలపైనే పలవరించారు. ఎందరో అమరులు అగ్నిజ్వాలల్లో కూడా తెలంగాణనే నినదించారు. దేశ విదేశాల్లో ఉన్న అనేకమంది తెలంగాణవాదులకు తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ. కేసీఆర్ అంతే! ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా కనిపించవచ్చు. రాజకీయ నాయకుడిలా అనిపించవచ్చు. కానీ అన్నింటికంటే ముందు ఆయన తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న ఉద్యమకారుడు, ఈ భూమిపుత్రుడు! 13 ఏళ్ల సుదీర్థ ఉద్యమంలో పలు ఎన్నికల్లో కేసీఆర్ ఆశించిన మేరకు ఓట్లు, సీట్లు రాలేదు. అయినా ఆయన ఎన్నడూ తెలంగాణ ఎజెండా వీడలేదు. కారణం తెలంగాణపై ప్రేమ. రైతు చనిపోతే కుటుంబానికి 5 లక్షల బీమా ఇప్పించడం ఓట్ల కోసమా? తెలంగాణ రైతు కుటుంబం అనాథ కావద్దన్న ప్రేమతోనా?! ఆడబిడ్డకు కల్యాణ లక్ష్మి ఇవ్వడం ఆమె వేస్తుందో లేదో తెలియని ఓటు కోసమా? పెండ్లి అప్పుల పాల్జేయొద్దనే ప్రేమతోనా?! తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్ ఇవ్వడం ఓటు కోసమా? మన అమ్మలు కడుపుకోతకు గురికావద్దనే ప్రేమతోనా?! హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారంటే ఓట్ల కోసమా? వారికి ఓటు హక్కే ఉండదు కదా! అది కేవలం తెలంగాణ బిడ్డలపై ప్రేమతో! ఈ పనులు, ఇలాంటి పనులు ఇంకెన్నో జరుగుతూనే ఉన్నాయి. జరుగుతాయి కూడా! రాజకీయం అంటే నమ్మించడం కాదు; నయ వంచన అసలే కాదు. రాజకీయాల తక్షణ లక్ష్యం అధికారం కావచ్చు. కానీ దాని అంతిమ పరమార్థం ప్రజలకు మేలు చేయడమే! ఎన్నికలకేం.. వస్తుంటాయి. పోతుంటాయి! తెలంగాణ చరిత్రలో ఎన్ని ఎన్నికలు రాలేదు! టీఆర్ఎస్ ఎన్ని ఎన్నికలను ఎదుర్కొనలేదు! అనేకం గెలవొచ్చు. కొన్ని ఓడిపోనూ వచ్చు! కానీ ప్రయోజనం నెరవేరిందా? లేదా? అన్నదే లెక్క. 2009లో టీఆర్ తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో దెబ్బతిన్నది. టీడీపీతో పొత్తువల్లే టీఆర్ రాజకీయంగా దెబ్బతిన్నదనీ, దాని పని ఇక అయిపోయిందనీ ఆనాడు అనేకమంది విశ్లేషించారు.

నిజానికి ఆనాడు టీఆర్ఎస్ సీట్ల కంటే కూడా, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా టీడీపీతో తీర్మానం చేయించడం ముఖ్యం. ఆ లక్ష్యం నూటికి నూరుశాతం నెరవేరింది. అందువల్ల కేసీఆర్ ‘రాజకీయం- ఎన్నికల’ పరమావధి గెలుపే కాదు. తెలంగాణకు మేలు! కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నా, శాఖను వద్దన్నా.. జుట్టు పట్టుకున్నా, పొత్తు పెట్టుకున్నా.. జెండా ఎత్తినా, కత్తిగట్టినా.. ఎవరినైనా దించినా, ఎదురుపడి దంచినా.. సాగిలపడినా, సవాలు విసిరినా.. అది తెలంగాణ కోసమే! చేసేవారికి పని ఎప్పటికీ అయిపోదు!! ఊహ నుంచి ప్రజా ఉద్యమాన్ని, ఉద్యమం నుంచి ఉద్యమ పార్టీని, పార్టీతో ఉద్యమ తెలంగాణ రాష్ర్టాన్ని, ఉద్యమ రాష్ట్రంలో అభివృద్ధి పథాన్ని నిర్వచించిన ప్రజా నేతకు ఆటుపోట్లూ కొత్త కాదు.. అసాధారణ విజయాలూ కొత్త కాదు. తెలంగాణ విఫల ప్రయోగం కాదని నిరూపించిన నేతకు కాలం పరీక్షలు పెడుతూనే ఉన్నది. ఆ నాయకుడితో పాటు నడుస్తూ తెలంగాణ కూడా వరుసగా వాటిలో గెలుస్తూనే ఉన్నది. ఈ విజయ పరంపర ఇకముందూ కొనసాగుతుంది. నిరాశ అక్కరలేదు. నీరుగారిపోయే పని అంతకంటే లేదు. కెరటం పడి లేస్తూనే గమ్యాన్ని ముద్దాడుతుంది. అధర్మం కొన్నా ళ్లు హడావుడి చేయవచ్చు. కానీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. కాల ప్రవాహంలో నాయకులు వచ్చారు. పోయారు.. నినాదాలు వినిపించాయి. మూగబోయాయి.. ఉద్యమాలు మొదలయ్యాయి. ఆగిపోయాయి.. సమస్యలు కనిపించాయి. కనుమరుగయ్యాయి.. కానీ తెలంగాణ కేసీఆర్ ఉంది.. కేసీఆర్ తెలంగాణతోనే ఉన్నాడు.. ఇదొక విడదీయలేని బంధం. తోడూ నీడ సంబంధం.. ఇది ఇక ముందూ ఇలాగే కొనసాగుతుంది.

సోయి లేకుండా మాయమాటలు నమ్మడం వల్లే 60 ఏండ్ల కిందటే మనకొచ్చిన తెలంగాణను పొగొట్టుకున్నాం. మంది మాటలు నమ్మడం వల్లే మనం చేతగాని వాళ్లమని, ఎవరి మోచేతినీళ్లో తాగక తప్పదని ఇన్నేండ్లూ ఊడిగం చేశాం. మంది మాటలు విని, అచ్చులో వచ్చిందే అసలు భాషని నమ్మడం వల్లే, మన యాసను మనం మరిచిపోయాం. ఇప్పుడు సోషల్ ముసుగులో వస్తున్న అబద్ధాలను నమ్మి, తెలంగాణ సామాజిక సంఘటితత్వాన్ని కోల్పోతున్నాం. మనపై మనం నమ్మకాన్ని పోగొట్టుకోవడం అత్యంత ప్రమాదకరం. ‘కండ్లముందు కనిపించే వాస్తవాలనా? చెప్పుడు మాటల్నా? దేన్ని నమ్మాలో తేల్చుకోవాలి’

ఇది తథ్యం.. ఇది నిత్యం.. ఇదే సత్యం..
– తిగుళ్ల కృష్ణమూర్తి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.