Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇది రైతు రాజ్యం

-తెలంగాణ అందుకు నిలువెత్తు సాక్ష్యం
-ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయాం
-కష్టాలు బాసేందుకే రాష్ట్రం తెచ్చుకున్నం
-తెలంగాణపై ఇష్టంతోనే ఇంత అభివృద్ధి
-ఒక్కొక్క పథకం వెనుక ఎంతో ప్రయాస
-మాటలు మాత్రమే చెప్తే అయ్యేది కాదిది
-మనసు పెట్టి మథన పడి చేస్తేనే సాధ్యమైంది
-ఏడేండ్ల కింద తెలంగాణ ఎలా ఉండింది?
-ఇప్పుడు మన తెలంగాణ ఎట్లా ఉన్నది?
-చెప్పినా.. విననివారిపై చర్యలు తప్పవు
-ప్రజాప్రతినిధులపై పెద్ద బాధ్యత ఉన్నది
-సిద్దిపేట, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌
-పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలి
-అప్పుడే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది
-నా జీవితం తెలంగాణ కోసం
-చెడ్డపని చేసే అధికారం నాకు లేదు
-ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం

ఎవ్వరు ఏమన్నా, అనుకున్నా తెలంగాణ కోసం పనిచేయడాన్ని నేను ఆపను. బతికున్నంత వరకూ చిత్తశుద్ధితో పని చేస్తూనే ఉంటా. చాతగాకపోతే ఇంట్లో పండుకోవాలె. కానీ చెడ్డపని చేసే అధికారం నాకు లేదు. ఎందుకంటే ఒక తప్పటడుగు వేస్తే వచ్చే కొన్ని తరాలకు దెబ్బపడ్తది. చరిత్రలో అది నిలిచిపోతది. చారిత్రక తప్పిదమవుతది. మా వాళ్లకు కూడా అదే చెప్తుంటా. ఏం చేసినా సరే, ప్రజలకు మేలు జరగాలె. పేదలకు ఉండే ఆయాసం పోవాలె. నా ఆలోచన ఇదే. తెలంగాణకు దెబ్బతగిలే పని, తప్పు పని నేను ఎన్నటికీ చేయను. –ముఖ్యమంత్రి కేసీఆర్‌

భారీభారీ పథకాలు ఎలాగూ మన కండ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. వాటి సంగతి పక్కనబెడదాం. ‘2601 రైతు వేదికలు రాష్ట్రంలో కట్టలేదని ఎవరన్నా చూపిస్తే, అదే నిముషంలో పదవికి రాజీనామా చేస్తా’ అని సవాల్‌ చేయడం కేసీఆర్‌కే చెల్లింది. ‘ఇప్పుడు తెలంగాణలో ఆర్తనాదాల్లేవ్‌, ఆకలి చావుల్లేవ్‌, రైతుల ఆత్మహత్యల్లేవ్‌’ అని కేసీఆర్‌ చెప్తుంటే.. తెలంగాణపై, తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ఆర్తి కనిపించింది. సామెతలు, సందర్భాలు, చరిత్ర, ఛలోక్తులతో 90 నిముషాల పాటు ఏకధాటిగా ఆయన చెప్పిన మాట ముచ్చట, నాటి తెలంగాణ, నేటి తెలంగాణ మధ్య తేడాను కండ్లకు కట్టింది. పనిమంతుడికి, మాటల రాయుళ్లకు మధ్య తేడాను పట్టి చూపెట్టింది.

తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం?
తెచ్చుకుని ఏం చేశాం? తెలుసుకోవాలంటే ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిల్లో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం చదవాలి, వినాలి.వలస పాలన చేసిన నష్టం ఏమిటి? ఏ కష్టం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఆలోచన వచ్చింది? ఏ ఇష్టంతో ఒక్కొక్క పథకం పుట్టింది? అనేది కేసీఆర్‌ చెప్తూ ఉంటే, సభలో ఉన్నవారే కాదు; టీవీల్లో విన్నవారంతా ఒక్కసారి గతంలోకి జారిపోయారు.

‘ఏడేండ్లలో ఎంత చేసుకున్నాం! ఆలోచిస్తే నమ్మబుద్ధి కావడం లేదు. రాష్ట్రం రాకుంటే ఏమైపోయే వాళ్లమో తలచుకుంటేనే భయంగా ఉంది. కేసీఆర్‌ చెప్పింది అక్షర సత్యం’ అని సీఎం ప్రసంగం తర్వాత ఒక మహిళా టీచర్‌ నమస్తే తెలంగాణ ఆఫీసుకు ఫోన్‌ చేసి చెప్పారంటే, నాటి గోస ఏమిటో, అప్పటి మోటు మోసం ఎంత బాధపెట్టిందో అర్థమవుతున్నది. తెలంగాణ నడిగడ్డ సిద్దిపేటకు ఎమ్మెల్యేగా, అక్కడ చూసిన ప్రతి సమస్యా యావత్‌ తెలంగాణ సమస్య అనుకుని, పరిష్కారాన్ని కూడా అక్కడి నుంచే, అప్పటి నుంచే ఆలోచించి, తెలంగాణ సాధించి, రాష్ట్రమంతా పథకాలు అమలు చేసిన కేసీఆర్‌… పుట్టిన గడ్డ అంటే తనకు పిచ్చి ప్రేమ అని చాటుకున్నారు.

తెలంగాణ రైతు రాజ్యమని, ఇక్కడ రైతు కేంద్రంగా అమలవుతున్న పథకాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయామన్న సీఎం.. ఆనాడు పడిన కష్టాలను రూపుమాపేందుకే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, దానిని ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అనేక పథకాల వెనుక ఎంతో ప్రయాస, మేధో మథనం ఉన్నదని చెప్పారు. రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పటానికి ఏండేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉన్నదో.. ఇప్పుడు ఎలా ఉన్నదో గమనిస్తే చాలని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలను, కామారెడ్డి జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, ప్రగతి అద్భుతంగా పరుగు తీయాలని, అభివృద్ధి ఫలాలు ప్రతి గడపను తాకాలనే ఉద్దేశంతోనే సంస్కరణలు చేపట్టామని తెలిపారు. రాజధానికి ఉత్తరంలో సిద్దిపేట, తూర్పున వరంగల్‌, దక్షిణాన నల్లగొండ, పశ్చిమాన నిజామాబాద్‌లో నాలుగు వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

అందరికీ అన్నీ చేశాం
గురుకులాలు పెట్టాలని ఎవ్వరూ దరఖాస్తుచేయలె. మిషన్‌ భగీరథ పెట్టాలే. ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని ఎవ్వరూ చెప్పలేదు. ప్రపంచంలోనే అద్భుతమైన పథకమది. చిన్న పథకం కాదు అది. చెప్పడానికి సాహసం కావాలి. ఇప్పుడు ప్రాబ్లం లేదు. కరెంట్‌ సమస్య గిట్లా అయితదని అనుకోలేదు. కరెంట్‌ బాధ అస్సలే లేదు. 24 గంటలు అతి నాణ్యమైన విద్యుత్‌ అందుతున్నది. తెలంగాణ కథ సన్నాసులకు అర్థం కాదు. అడ్డం పొడుగు మాట్లాడుతరు. దుఖం గుండెల్లో ఉన్నోళ్లకు. ఉద్యమం చేసినోళ్లకు. శత్రువులతో వాదోపవాదాలు చేసినోళ్లకు అర్థమవుతది. ఇప్పుడు ధర్నాలు చేస్తుండ్రు. సిగ్గుండాలె కదా. కరెంట్‌ లేక అంధకారమవుతుందని ఆంధ్రోళ్లు చెప్పిండ్రు కదా! ఇప్పుడేమైంది? ఈ బక్కవ్యక్తి ఏం చేస్తే కరెంటొచ్చింది? ఊర్లలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలడంతోనే మనిషికి వంద రూపాయలు జమచేసి చేయించుకునేది. ఇప్పుడా పరిస్థితి ఉన్నదా? పక్క రాష్ర్టానికి సైప్లెచేసే విధంగా తెలంగాణ మారబోతున్నది.

ఇది రైతు రాజ్యం
తెలంగాణకు నడిగడ్డ సిద్దిపేట
సిద్దిపేట తెలంగాణకు నడిగడ్డ కాబట్టి, ఈ గడ్డకు ఆ గౌరవముంటుంది. ఇక్కడ అన్నీ జరిగాయి. ఇంకా చాలా జరుగుతయి. సిద్దిపేటలో ఎండకాలం వస్తే మా బతుకులు యుద్ధంలా ఉండేవి. పొన్నాల కాడ బాయిలు కొనుడు, ఇర్కోడు కాడా బాయిలు కొనుడు. ట్యాంకర్లు పెట్టి తీసుకపోవడం, మంచినీళ్ల కోసమే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ విషయం నాతో కలిసి పనిచేసిన మిత్రులందరికీ తెలుసు. మిత్రుడు కమలాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, పెద్ది సుధాకర్‌ వీళ్లందరూ ఉన్నరు. అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డమో జ్ఞాపకం చేసుకొంటే చాలా బాధేస్తుంది. మిత్రుడు మందపల్లి తిరుపతి గ్రామంలో ఉన్న బోర్లన్నీ ఎండిపోయినయి. ఒకటి ఉంటే చివరకు అది కూడా ఎండిపోయింది. పొద్దున్న 5.30 గంటలకే నేను బయలుదేరిన. ఇంద్రసేనారెడ్డి అనే గొప్ప వ్యక్తి పంచాయతీరాజ్‌ డిప్యూటీగా ఉండె. ఆ కాలంలో ఆర్‌డబ్ల్యూఎస్‌.. వేరే లేకుండా రెండూ కలిసి ఒకటిగానే ఉండేవి. ఏం చేద్దాం ఇంద్రసేనారెడ్డి? అని అడిగిన. ఇద్దరం కలిసి జియాలజిస్టును తీసుకొని అక్కడికి వెళ్లినం. ఆ రోజు జ్ఞాపకం చేసుకొంటేనే భయమేస్తుంటది. ఒక నీటి చుక్క కోసం సాగునీళ్లకు, తాగునీళ్లకు, చివరకు మనిషి చనిపోతే అంత్యక్రియలు చేసి స్నానం చేయడానికి కూడా ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి ఒక అరగంట కరెంట్‌ ఇప్పియ్యాలని అడిగే పరిస్థితులు. అప్పుడు మందపల్లికి పోయాక ఐదారు బోర్లు వేస్తే మొత్తం దుమ్మే ఎల్లింది తప్ప నీటిచుక్క రాలేదు. అప్పటికి మధ్యాహ్నం 2.30 గంటలు దాటుతున్నది. తిరిగి వస్తున్న క్రమంలో ఓ కుంట చెరువు కనిపించింది. అక్కడే ఉన్న వాళ్లను ఇదేమి కుంట? అని అడిగిన. ఇది మామిడి కుంట సార్‌ అని చెప్పారు. అప్పుడే ఓ బోరు బండాయనను పిలిచిన. జియాలజిస్టు లేడు, ఏం లేదు.. ఆ నడిమధ్యన బోరువేయాలని చెప్పగానే అదృష్టం కొద్దీ మూడించుల నీళ్లు వచ్చిపడ్డాయి. నరసింహారెడ్డి అనే మిత్రుడు ఉండే. ‘2.30 అవుతుంది. బుక్కడంత అన్నం తినాలె కదా..’ అనగానే.. ‘నర్సన్నా.. మన ఇంటికాన్నే చేపించుపో.. అక్కడికే వచ్చి బుక్కడంత తినిపోత’ అని చెప్పిన. ‘కోడిగుడ్డు అట్టు చేయిస్త అన్నా’ అని చెప్పాడు. ఇప్పుడు అందంగా ఆమ్లేట్‌ అని పిలుచుకొంటాం. ఇగ అప్పుడే ఆ ఊర్లో ఉన్న దాంట్లకేయి ఓ బోరు మోటర్‌ తీసి.. దీంట్లో వేసి అప్పటికప్పుడే కనెక్షన్‌ ఇచ్చినం. 3.30 గంటలకు నరసింహారెడ్డి ఇంటికి భోజనానికి పోయినం. వాళ్ల ఇంటినుంచి తిరిగి వస్తున్న క్రమంలో మందపల్లి దగ్గర అప్పుడు బ్రిడ్జి లేకుండె. నేను ఎమ్మెల్యే అయ్యాకనే తిప్పలు పడి బ్రిడ్జి ఏర్పాటుచేసిన. ఆ బ్రిడ్జి కాడికి రాగానే నా కారు డ్రైవర్‌ బాలయ్యను బండి ఆపమని ఇంద్రసేనారెడ్డి ఆపించిండు. ‘ఇక్కడ మందపల్లి వాగుమీద ఒక చెక్‌డ్యాం వేస్తే వీళ్ల బాధలు తీరుతయి సార్‌’ అని చెప్పారు. మంచిదని చెప్పి ఎస్ట్‌మేట్‌ వేయించి తీసుకొని.. అప్పుడు రామకృష్ణారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఉండే. ఆయనకు దగ్గరకు పోయి కూసొని మంజూరుచేయించుకొని మందపల్లి వాగుపై బ్రిడ్జి కట్టించాం. తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి నీటి ఊటలు పెరిగి గొప్ప గొప్ప పంటలు పండినయ్‌. మందపల్లి అప్పుడు లడాయిలతో ఉండే గ్రామం. ఈ చెక్‌డ్యాంతోనే ఊరంతా ఒకటైపోయిన్రు. ఇంకో చెక్‌డ్యాం కూడా కావాలని కోరిన్రు.

సముద్రంలాంటి రంగనాయకసాగర్‌
ఇవాళ మన సిద్దిపేటలో భగవంతుని దయ, మీ అందరి సహకారంతో సముద్రంలాంటి రంగనాయకసాగర్‌. నేనొస్తుంటే చూశాను. చెరువులన్నీ నిండి ఉన్నాయి. ఇక్కడే మాణిక్యరెడ్డి కూర్చొని ఉన్నారు. గోనెపల్లి కాడా గోసగోస ఉండే. ఎన్ని చెక్‌డ్యాంలు కట్టుకొన్నమో అవన్నీ నిండాయి. డాక్టర్‌ యాదవరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి ఉన్నారు. దుమ్ము లేచిపోయింది. హల్దీవాగు, కూడెల్లి వాగులు ఏప్రిల్‌లో మొదలుపెట్టి మే వరకు అలుగు పారుతున్నాయి. ఇప్పుడు చిన్న జల్లు పడితే గోనెపల్లి వాగు దుంకుతనే ఉంటుంది. చిన్న జల్లు పడితే కూడెల్లి వాగు పొంగి పొర్లతనే ఉంటది. చిన్న వర్షం.. అది గజ్వేల్‌ కాడ పడ్డా, మిరుదొడ్డి, అల్వాల్ల పడ్డా.. ఏడ పడ్డా అన్ని అలుగులు దుంకుకుంటూ పోతూనే ఉంటాయి. అద్భుతమైన సుందర దృశ్యం. వీటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకొన్నం.

తప్పటడుగు వేస్తే తరాలు దెబ్బతింటయి.
చాత గాకపోతే ఇంట్లో పండుకోవాలే కానీ చెడ్డపని చేసే అధికారం లేదు. తప్పుచేసే అధికారం నాకు లేదు. ఒక తప్పటడుగు వేస్తే వచ్చే కొన్ని తరాలకు దెబ్బపడ్తది. చరిత్రలో చాలా పెద్ద తప్పు అవుతుంది. ఏం జేసిన సరే.. ప్రజలకు మేలు జరగాలే.. పేద వర్గాల ప్రజలు ఏదైతే ఆయసం ఉంటదో అదంతా పోవాలె. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొద్దాక చెప్తుంటా. రాష్ట్రం తెచ్చినం సంతోషం మనకున్నది. అతి జాగ్రత్తగా పాలన నడపాలే. అట్లా మనం చేసుకుంటున్నం. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ధీమాతో ఉండాలని కార్యక్రమాలు తీసుకున్నం. రాజకీయాల్లో ఎడ్డెమంటే తెడ్డెం అనేటోడు ఉండే ఉంటాడు. నెగెటివ్‌ శక్తులు కొన్ని ఎప్పటికీ ఉండే ఉంటాయి. అన్ని చోట్ల ఉంటారు.. ఎవరేం మాట్లాడుతున్నా సరే గమ్యం, లక్ష్యం.. ఒక పద్ధతి పెట్టుకున్నం.’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు మహామూద్‌అలీ, టీ హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సతీశ్‌కుమార్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, హన్మంత్‌ షిండే, జాజాల సురేందర్‌, రఘునందన్‌రావు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, ఫారుఖ్‌ హుస్సేన్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ట్రశర్మ, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఐజీ శివశంకర్‌రెడ్డి, రవి గుప్తా, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వంటేరు ప్రతాపరెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సీఎంవో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగనాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రాజనర్సు, సుడా ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి, దుద్దెడ సర్పంచ్‌ అరెపల్లి మహదేవ్‌ పాల్గొన్నారు.

సంస్కరణలకు కేరాఫ్‌ తెలంగాణ
పరిపాలన సంస్కరణ జరగాలే అని 33 జిల్లాలు చేసుకొన్నాం. కామారెడ్డిలో చూస్తున్న కలెక్టరేట్‌, పోలీస్‌ బిల్డింగ్‌లాంటివి రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వస్తయి. ఇంత అద్భుతమైన పరిపాలన భవనాలు దేశంలో ఎక్కడాలేవు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఎట్లున్నది? పోలికైనా ఉన్నదా! తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉంటది అనేందుకు ఇదో సింబల్‌. ఇంకోమాట గర్వంగా చెప్తున్నా. దేశంలో వరి అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం పంజాబ్‌. అక్కడ 2 కోట్ల 2 లక్షల టన్నులు ఉత్పత్తి వస్తున్నది. నా తెలంగాణలో 3 కోట్ల టన్నులు ధాన్యం పండుతున్నది. ఇప్పుడు మనమే నంబర్‌ వన్‌ ఇన్‌ ఇండియా. విద్యుత్‌ తలసరి వినియోగంలోనూ నంబర్‌వన్‌. 11 వందల యూనిట్ల నుంచి 2,170 యూనిట్లు తలసరి విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఇండియాలో సమీపంలో మనకెవ్వరూ పోటీలో లేరు. దేశంలో వేరే పార్టీలున్నాయి. ప్రభుత్వాలున్నాయి. ముఖ్యమంత్రులున్నారు. అక్కడెందుకు ఇవన్నీ అయితలేదు? నేను చెప్పేది అబద్ధమా! గాయి గత్తర కావొద్దు. మంది మాటలు నమ్మి మారుగాలం పోతే మల్లొచ్చేసరికి ఇల్లు కాలిందట. ఇయ్యాల తెలంగాణ ప్రభుత్వం పుట్టిన వ్యక్తి నుంచి చనిపోయేవరకు సేవ చేస్తున్నది. కేసీఆర్‌ కిట్‌తో సర్కారు దవాఖానలు ఫుల్‌ అవుతున్నయి. అమ్మఒడి లాంటి పథకం ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? గీన్నే ఉన్న మహారాష్ట్రలో జరుగుతున్నదా? ఒక్కొక్క పని జరగాలంటే సంవత్సరం జరిగింది. అహోరాత్రులు కష్టపడితే సాధ్యమవుతున్నాయి.

వచ్చే ఏడాది మరో 4 మెడికల్‌ కాలేజీలు
ప్రజలకు మేలుచేయాలంటే హృదయం కావాలి. చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి, కార్యసిద్ధి కావాలి. అల్లాటప్పాగా జరుగుతాయా? సంస్కరణ చేసుకుంటూ రాష్ట్రాన్నిముందుకు తీసుకుపోతున్నం. ఎవరెవర్ని ఆదుకోవాల్నో మననం చేసుకొంటూ ఒక్కో రంగాన్ని చేసుకొంటూ పోతున్నం. మరొక 7 మెడికల్‌ కాలేజీలు ఇప్పుడు చేసుకున్నం. వచ్చే ఏడాది మరో నాలుగైదు మెడికల్‌ కాలేజీలు చేసుకుంటం. దాంట్లో ఫస్ట్‌ కాలేజీ కామారెడ్డి ఉంటది. మల్లా మూడో, నాలుగో మెడికల్‌ కాలేజీలు తప్పక వస్తాయి. విడతలవారీగా అన్ని జిల్లాలకు మెడికల్‌ కాలేజీలు తేవాలని ఉన్నది. మెడికల్‌ కాలేజీ పెడితే 500 పడకల దవాఖాన వస్తది. సౌకర్యం ఏర్పడుతుంది. కామారెడ్డిలో మెడికల్‌ కాలేజీ పెడితే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. మారుమూల గ్రామాలకు పోవాలంటే వైద్యులు వెనుకాముందు ఆలోచిస్తరు. ఇక్కడికి తప్పకుండా వస్తరు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి డీజీపీ మహేందర్‌రెడ్డి. సంస్కరణ అభిలాషి ఆయన. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా 24 గంటల్లో దొరుకపట్టే వ్యవస్థ తయారైంది. సిద్దిపేటలో అన్ని మున్సిపాలిటీలు పోలీస్‌ కార్యాలయంలో చూపించారు. కామారెడ్డిలో కూడా ఉన్నది. ఎస్పీ ఆఫీస్‌లో చౌరస్తాలో ఎవరు పోతున్రు.. ఏం చేస్తుండ్రు.. మొత్తం అక్కడ కనిపిస్తాంది. అద్భుతమైన ల్యాబొరేటరీ పెట్టిండ్రు. నైట్‌లో పోయే వెహికిల్‌ నంబర్‌ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. షీ టీమ్‌లు పెట్టాం. మహిళలకు రక్షణ దొరికింది. ఒక్క డిపార్ట్‌మెంట్‌ గురించి చెప్తలేను. అనేకంచేశాం. మీ కండ్ల ముందున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.