-కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుపై మంత్రి పోచారం -సీఎం తరఫున అందుకోవడం తన అదృష్టమని వ్యాఖ్య -వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడి -అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిన తెలంగాణ: ఐసీఎఫ్ఏ చైర్మన్ ఎంజే ఖాన్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్-2017 అవార్డు రావడం తెలంగాణకు లభించిన గౌరవమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం తన అదృష్టమని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ప్రకటించిన గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు-2017 రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరపున రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో అందుకున్నారు. మంగళవారం ఐసీఎఫ్ఏ ఆధ్వర్యంలో ఢిల్లీలో పదో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ సమ్మిట్-2017 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హర్యానా గవర్నర్ కేఎస్ సోలంకి చేతులమీదుగా మంత్రి పోచారం, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత జితేందర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) డాక్టర్ రమేశ్‌చంద్, ఇక్ఫా చైర్మన్ ఎంజే ఖాన్, ప్రపంచ ఆహార సంస్థ-ఐవోహెచ్ఏ అధ్యక్షుడు డాక్టర్ కెన్నెథ్ క్విన్ కూడా అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్ఫా చైర్మన్ ఎంజే ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిందని తెలిపారు. ఒక విజనరీ లీడర్షిప్ కింద అభివృద్ధి ఫలాలను రైతులు అందుకుంటున్నారని అన్నారు. అంతకుముందు మంత్రి పోచారం మీడియాతో మాట్లాడుతూ నైరాశ్యంలో ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
దానిని గుర్తించిన ఇండియన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఈ అవార్డును ప్రకటించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉండటం తనకు గర్వకారణమన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవార్డుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలే వారి ఓర్వలేనితనానికి నిదర్శనమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలు అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులకు అప్పులు వారసత్వంగా వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేని రైతులను చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ పథకం కింద సుమారు రూ.17వేల కోట్లకు పైగా చెల్లించినట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.8వేల పెట్టుబడి ఇచ్చే పథకాన్ని అమలుచేయబోతున్నదని తెలిపారు. 2017-18లో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. రైతులను సంఘటిత పరుచాలని సీఎం కేసీఆర్ గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయసమితులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారన్నారు. ఈ సమితుల ఏర్పాటును ఈ నెల 9 వరకు పూర్తిచేసి.. ఈనెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపడుతామని వెల్లడించారు. రైతువారీ సర్వే చేపట్టేందుకు ప్రతి గ్రామంలో 10 రోజులపాటు అధికారులు పర్యటిస్తారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా రైతులు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, ఓయూ ప్రొఫెసర్ జగదీశ్వర్‌రావు పాల్గొన్నారు.
రైతు పక్షపాతి తెలంగాణ సర్కారు రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు, సంస్కరణలకుగాను ఐసీఎఫ్ఏ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డును బహూకరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పథకాలను అధ్యయనం చేసిన ఐసీఎఫ్ఏ.. అద్భుతమైన పథకాలతో రైతుల పక్షపాతిగా నిలుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇందుకు ఎంపిక చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేండ్లే అయినా నిరంతర కరెంటు సరఫరా, సకాలంలో ఎరువుల పంపిణీ, రూ.17వేల కోట్లకు పైగా రైతుల రుణాలమాఫీ, నీటిపారుదలరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. దీంతోపాటు ఎకరాకు రూ.8వేల పెట్టుబడిని అందించనున్నట్లు ప్రకటించింది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని అధ్యయనం చేసిన ఐసీఎఫ్ఏ.. సీఎం కేసీఆర్‌ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. 2008లో ఈ అవార్డును ప్రారంభించగా.. తొలి ఏడాది ప్రొఫెసర్ ఎమ్మెస్ స్వామినాథన్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది రతన్ టాటా ఈ అవార్డును అందుకున్నారు.