Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇది విప్లవాల యుగం

-రాష్ట్రంలో హరిత, శ్వేత, నీలి, గులాబీ విప్లవాలు -పాడి పంటలను ప్రోత్సహిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం -కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అడుగులు -కలేజా ఉన్న సీఎం కేసీఆర్ -కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టుకు 50 ఏండ్లు పట్టింది -తెలంగాణలో మూడేండ్లలోనే పలు ప్రాజెక్టులు కట్టాం -యాదవులు దేశంలోనే అత్యంత ధనవంతులు కావాలి -మంత్రి కేటీఆర్ -సిరిసిల్లలో మంత్రి తలసానితో కలిసి రెండో విడుత గొర్రెల పంపిణీకి శ్రీకారం -గొల్ల కురుమల దేవుడు కేసీఆర్: మంత్రి శ్రీనివాస్‌యాదవ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి, హరిత, గులాబీ (గొర్రెల మాంసం), శ్వేత విప్లవాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా రానున్నాయని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పంటను, పాడిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలో ముఖ్యమంత్రులు మొదలుకొని ప్రధాని వరకూ మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం పెరుగాలంటున్నారనీ, కానీ 60 ఏండ్ల నుంచి నైపుణ్యం పెంపొందించుకొన్న వర్గాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుపోతున్నదని పునరుద్ఘాటించారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్.. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కల్యాణలక్ష్మి గార్డెన్స్‌లో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, దేశంలోనే యాదవులు అత్యంత ధనవంతులు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. గొల్ల, కురుమల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం ఓట్లు, నోట్ల కోసం కాదని స్పష్టంచేశారు రూ.వెయ్యి కోట్లతో మత్స్యకారులు, ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం నీలి విప్లవం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం పాడి, పంట, రైతు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం హరితవిప్లవం, చేపల పెంపకంలో భాగంగా నీలి విప్లవం, పాడిపంటలను పోషించేందుకు శ్వేత విప్లవం, గొర్రెల మాంసం ఎగుమతులను ప్రోత్సహించేలా గులాబీ విప్లవాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నదని ఉద్ఘాటించారు. గొర్రెల పథకం అమలు చేస్తామంటే కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలు అవాకులు, చవాకులు పేలాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్సీడీసీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడి, గొర్రెలకు సంబంధించి పూర్తి విషయాలపై లోతుగా చర్చించారని పేర్కొన్నారు. గొర్రెల్ని ఇవ్వడమే కాకుండా, వాటి సంరక్షణ, వైద్య బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకొన్నదని వెల్లడించారు. రూ.5 వేల కోట్లతో 60 లక్షల గొర్రెలు పంపిణీచేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. గత 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒకే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కొనసాగితే.. నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ వంటి అద్భుత ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపారు. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన, ప్రపంచంలోనే కలేజా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. గడిచిన 65 ఏండ్లలో రాష్ట్రంలో 22 గురుకులాలు ఉంటే సీఎం కేసీఆర్ పాలనలో 119 గురుకులాలు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు.

ప్రతి నియోజకవర్గానికీ మహాత్మ జ్యోతిరావ్ ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. ఒకప్పుడు ధనికుల పిల్లలే విదేశాల్లో చదువుకునేవారని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.20 లక్షలు రుణసౌకర్యం కల్పించి అమెరికా లాంటి దేశాల్లో పేద విద్యార్థులకు చదువుకునే అదృష్టం లభించిందన్నారు. పట్టుదల, ప్రణాళిక, సంకల్పం ఉంటే సాధించలేనిదేది ఉండదనడానికి కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని, రీసైక్లింగ్‌కు పాల్పడకుండా కేసీఆర్ కన్న కలలను సార్థకం చేయాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉన్నదని కేటీఆర్ అన్నారు.

గొల్ల కురుమలకు ఆరాధ్యుడు కేసీఆర్: మంత్రి తలసాని ఇన్ని రోజులు తమ కుల దైవమైన మల్లన్న బీరప్పలను కొలిచేవారమనీ, ఇప్పుడు రాష్ట్రంలోని గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ దేవుడయ్యారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. గొర్రెల పంపిణీ పథకం మొదటి విడుతలో 60 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. మనుషులకు వైద్యం చేయడానికే డాక్టర్లు లేని ఈ రోజుల్లో.. మూగజీవాలకు వైద్యం అందించే గొప్ప అద్భుత పథకం 1962 ను అమలుచేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెసోళ్లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని ఎద్దేవాచేశారు. వాళ్లు.. వాళ్ల నియోజకవర్గంలో గెలుస్తారో, లేదో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. సిరిసిల్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని, ఇది కేటీఆర్ వల్లే సాధ్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. మాంసం ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలువాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అడ్డాకుల

మాంసం ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లిలో 37, కన్మనూరులో 18 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను సోమవారం లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సబ్సిడీ గొర్రెల ద్వారా రాష్ట్రంలోని కురుమ, యాదవులు ఆర్థికంగా ఎదుగాలని కోరారు. మాంసం ఎగుమతిని పెంచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేస్తున్నారని, రాష్ట్రంలో గొల్ల, కురుమలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, రైతు సమన్వయ సమితి వనపర్తి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సారు దయతో సబ్సిడీ గొర్రెలు అచ్చినయి.. నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి సర్కారు నుంచి సాయం ఎరుగలేదు. కేసీఆర్ సారు దయతో ఇపుడు సబ్సిడీ గొర్రెలు అచ్చినయి. మొదటి నుంచి నేను గొర్లు కాసుకుంటనే బతుకుతున్నా. ఇచ్చిన గొర్రెలను మంచిగ సాదుకుని, నాలుగు పైసలు సంపాయించుకుంట. గొర్రెలు, దాణా, గడ్డి కోసం విత్తులు ఇచ్చి సారు ఎంతో పుణ్యం గట్టుకున్నడు. సారు ఎప్పుడూ సల్లంగుండాలె. – మానుక బాలరాజు, తిప్పాపూర్, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా (రెండో విడుతలో తొలి లబ్ధిదారుడు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.