-కరోనా సంక్షోభకాలంలోనూ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ -పరిశ్రమల ఏర్పాటుకు బడా కంపెనీల ఆసక్తి -పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తున్న -రాష్ట్ర పారిశ్రామిక అనుకూల విధానాలు -హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద కార్యాలయాలు
కరోనా సంక్షోభంలోనూ బడాకంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి.రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలతో పారిశ్రామికవేత్తలు భారీపెట్టుబడులకు ముందుకొస్తున్నారు. 5 నెలల్లోనే రూ.4,550 కోట్ల పెట్టుబడులను ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.
కరోనా ప్రపంచాన్నే కబలిస్తున్నది. అన్నిదేశాల్లో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్యరంగాలను తలకిందులు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపరిశ్రమలే కాకుండా భారీ పరిశ్రమలుసైతం మూతపడుతున్నాయి. కంపెనీలు విస్తరణ ప్రణాళికలను రద్దు చేసుకుంటుండగా మరికొన్ని వాయిదా వేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ఆశాకిరణంలా మారింది. రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నది. ఇక్కడికి బడా కంపెనీలు క్యూ కట్టాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్‌ఐపాస్), సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో రాష్ట్రం దేశంలోనే ఆగ్రస్థానంలో నిలవడం, మానవవనరుల లభ్యతవంటి అనేకఅంశాలు దోహదంచేస్తున్నాయి. ఇటీవలే రెండు ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో రూ.2,500 కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతామని ప్రకటించారు. మరో రెండు కంపెనీలు ఇప్పటికే రూ. 2050కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి. మరికొన్ని చర్చలు జరుపుతున్నాయి.గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు విస్తరణను కొనసాగిస్తున్నాయి.
రెండో అతిపెద్ద కార్యాలయాలు ఇక్కడే అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు రెండో అతిపెద్ద క్యాంపస్‌ల ఏర్పాటుకోసం హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకున్నాయి. గూగుల్, క్వాల్‌కమ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నొవార్టిస్, మెడ్‌ట్రానిక్స్ తదితర సంస్థలు ఇక్కడ తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటుచేశాయి. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, స్థిరమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు తమ యూనిట్లను స్థాపించడానికి కారణాలని ఆ సంస్థల ప్రతినిధులే స్వయంగా ప్రకటించారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నొవార్టిస్ దాదాపు ఆరువేల మందితో హైదరాబాద్‌లో యూనిట్‌ను స్థాపించింది. విస్తరించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గాంబుల్, ఐకియా, వాల్‌మార్ట్ లాంటి ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి.
15 రోజుల్లోనే అనుమతులు.. టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. దీనిద్వారా 12,994 పరిశ్రమలు అనుమతి పొం దాయి. 10,338 పరిశ్రమలు 80% ఉత్పత్తులను ప్రారంభించాయి.14.36 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానుండగా.. ఇప్పటికే 7.31 లక్షల మందికి పని కల్పించాయి. రాష్ర్టానికి వచ్చే భారీ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా సీఎంవోలో చేజింగ్ సెల్‌ను ఏర్పాటుచేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు అత్యధిక పరిశ్రమలు రాగా, పెట్టుబడులుపరంగా, ఉద్యోగావకాశాల పరంగా రంగారెడ్డి తొలిస్థానంలో నిలిచింది.
ఏస్టర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్‌సంస్థ ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటుచేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. రూ.1350 కోట్ల పెట్టుబడితో కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ అరవింద్‌సింఘనియా స్వయంగా ప్రకటించారు. చందన్‌వెల్లి పారిశ్రామికవాడలో త్వరలో ఉత్పత్తికేంద్రాన్ని ప్రారంభించనున్నది. తొలిదశ కంపెనీ నిర్మాణం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయనుండగా.. 2022 సెప్టెంబర్ నాటికి పనులు పూర్తికానున్నాయి. దీనిద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
వైద్య పరికరాల తయారీలో ప్రపంచప్రఖ్యాతసంస్థ మెడ్‌ట్రానిక్స్ తన పెట్టుబడులకు స్థావరంగా తెలంగాణను ఎంచుకున్నది. అమెరికా అవతల తన రెండో అతిపెద్ద డెవలప్‌మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు రూ.1200కోట్లు వెచ్చిస్తున్నది. సంస్థ ప్రస్తుత పరిశోధన, అభివృద్ధికేంద్రాన్ని మరింత విస్తరించనున్నది.
శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో రూ.1100 కోట్ల పెట్టుబడితో మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ పనులకు గతవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రైవేటురంగంలో అతిపెద్ద రైల్వేకోచ్‌ఫ్యాక్టరీ ఇదే. దీనిద్వారా 2200మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. లోకోమోటివ్స్, కోచ్‌లు ఇక్కడ తయారుచేస్తారు. దీనిద్వారా భవిష్యత్‌లో రైల్వేకోచ్‌లు, ఇతరపరికరాల కంపెనీలు వచ్చే అవకాశామున్నది.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ఇండియా (ఎన్‌పీసీఐ) రూ.500 కోట్లతో తమ డాటాను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి నిర్ణయించింది.
జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో ప్రపంచస్థాయి సంస్థ సాయి లైఫ్‌సైన్సెస్ పరిశోధన, టెక్నాలజీ యూనిట్‌ను ప్రారంభించింది. పరిశోధన అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సెంటర్ ఇప్పటికే జీనోమ్‌వ్యాలీలో ఉన్నది. దానికి అనుబంధంగా 83వేల చదరపు అడుగుల్లో పరిశోధన, టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఈ సెంటర్‌లో ఇంటెలిజెంట్ ల్యాబ్ డిజైన్, శాటిలైట్ అనటికల్ టెస్టింగ్, ప్రాసెస్ సేఫ్టీల్యాబ్ తదితర ముఖ్యమైన పరిశోధన ల్యాబ్‌లు ఉన్నాయి. సాయిలైఫ్ సైన్సెస్ ప్రపంచంలోని పది అతిపెద్ద ఫార్మాకంపెనీల్లో ఏడింటితో కలిసి పనిచేస్తున్నది. ఈ కంపెనీకి అమెరికా, యూకేల్లో పరిశోధన, అభివృద్ధి కార్యాలయాలు ఉండగా తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. 2025 నాటికి ప్రపంచంలోని ప్రముఖకంపెనీలకు 25కొత్త ఔషధాలను కనుగొనడానికి ఈ కంపెనీ తోడ్పాటునివ్వనున్నది.